లండన్ లో రాజ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వెళ్లి 3-4 సంవత్సరాలు అయింధి. వెళ్ళినప్పటినుంచి ఇంట్లో ఒకటే గొడవ 'పెళ్లి చేసుకోరా, మా బాధ్యత తీరిపోతుంది!' అని. వాళ్ళ తలనొప్పి భరించలేక లేక “మార్చ్ నెలలో ఒక 4 వారాలు సెలవు తీసుకుని వస్తా, మీ ఇష్టం” అన్నాడు.
ఈ లోపు అమ్మ, నాన్న ఓ అర డజన్ అమ్మాయిల ఫోటోలను మెయిల్ చెయ్యటం, వాళ్లలో నచ్చిన 'కావ్య' తో స్కైప్ పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నెట్ కనెక్షన్ దైవాదీ(ధీ)నంగా ఉండటం వలన కనపడీ కనపడక, వినపడీ వినపడక పెళ్ళిచూపులని మమ అనిపించేశారు.
రాజ్ రావటం - పెళ్లి చకచకా ఒక వారంలో జరిగిపోయాయి. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం అవడం వలన రాజ్ ఒంటరిగానే, వెంటనే లండన్ తిరిగి వచ్చేశాడు.
రోజూ తన భార్య కావ్య తో ఫోన్ చేసి మాట్లాడేవాడు, లండన్ గురించి చాలా విషయాలు చెబుతుండేవాడు. కావ్య కూడా తన పాఠశాల, కళాశాల, ఇంటిలో వాళ్ల గురించి చెబుతూ ఉండేది. ఒక రోజు ఫోన్ లో మాట్లాడుతూ, కావ్య చాలా మురిసిపోతుండగా తన చెల్లెలు భవ్య చూసి "ఏంటి అక్కా వెలిగిపోతున్నావు" అని ఆటపట్టించింది. "మీ బావ మాటల్లో నన్ను డియర్ అన్నారు" అని చెప్పి తన గది లోకి పరుగు తీసింది. అలా రాజ్ అన్నప్పుడల్లా కావ్య ఎంతో మురిసిపోయేది.
ఓ రెండు నెలల్లో రాజ్ వీసా పేపర్లు పంపాడు, కావ్య లండన్ కు వెళ్ళే రోజు రానే వచ్చింది. లండన్ కి వెళ్ళడమూ జరిగింది. రాజ్ ని కలవడం కావ్యకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. జెట్ లాగ్ తీరిన తరవాత ఒక రోజు కావ్యని తీసుకొని రాజ్ హై స్ట్రీట్ (అన్ని షాపులు ఉండే చోటు) కి బయలుదేరాడు. రెండు, మూడు షాపులు తిరిగాక, కావ్య చేతికి 10 పౌండ్లు చేతికి ఇచ్చి, తనకు నచ్చినవి కొనుక్కోమని తను బయట వేచి ఉంటానన్నాడు. కావ్య భయంతో ఒంటరిగా వెళ్ళడానికి తటపటాయించేసరికి, రాజ్ ధైర్యం చెప్పి షాప్ లోపలికి పంపించాడు.
కావ్య కాసేపు లోపల తిరిగి, వస్తువుల ధరలను రూపాయలలోకి మార్చుకొని, పుచ్చు వంకాయలు కూడా 300 రూపాయాలా అని నివ్వెరపోయి, కొనలేక కొని, బయటకు వస్తుండగా బ్యాగ్ చినిగి కూరలు కింద పడ్డాయి. పక్కనే ఉన్న తెల్లతను వచ్చి "ఓ డియర్, కెన్ ఐ హెల్ప్ యు!" అన్నాడు. వీడెవడు నన్ను డియర్ అంటున్నాడు అని కంగారు పడింది. రాజ్ ఎక్కడ ఉన్నాడో చూస్తుండగా, అకస్మాత్తుగా ఒక అమ్మాయి హడావుడిగా తనని తోసుకుంటూ వెళ్ళింది. కానీ వెంటనే వెనక్కి తిరిగి "సారీ డియర్, ఐయామ్ ఇన్ ఎ రష్!" అని బై చెబుతూ వెళ్లి పోయింధి.
కావ్యకి అప్పుడు జ్ఞానోదయం అయ్యి ఎవడిని పడితే వాడు ఏ మాత్రం సంబంధం లేకపోయినా 'డియర్' అంటారని. రాజ్ అన్న డియర్ లు అన్నీ 'ప్రియా, ప్రియతమాలు' కావు అని అర్థం అయ్యింది.
రాజ్ కావ్యని చూసి "ఏంటి డియర్ ఏమిటి ఇన్ని సామానులు కొన్నావు!" అన్నాడు.
వెంటనే కావ్య కోపంగా, బాధగా సంచులన్నీ రాజ్ చేతి లో పెట్టి విసవిసా నడవసాగింది. రాజ్, "ఆగు, నేనూ వస్తున్నా" అంటూ తనతో పాటు పరుగు పెట్టాడు.
కావ్యకు కోపం ఏమాత్రం తగ్గలేదు. రాజ్ వైపు రుసరుసలాడుతూ చూస్తూ "ఇట్స్ ఓకె డియర్! ఇంటికి నాకు దారి తెలుసు" అంటూ కోపంగా వెళ్ళిపోయింది.