చెద పట్టని సంపద
వేసవిలో వేపచెట్టు కింద ఆడే బచ్చలాటకు
అమ్మ మెడలో దొంగిలించిన
రెండు పిన్నీసులని పందెం కాసి
గెలిచిన గుప్పెడు పిన్నీసులని
పాత ముగ్గుబుట్టలో
రహస్యంగా దాచిన సంపదతో
వెర్రవీగే ఆ పదేళ్ల వయసు
ఆ రోజుకు ఆ వీధికి రారాజు చేసింది.
చిరకాలం పాటు చెరగని జ్ఞాపకాలు
కాలం చెదలు పట్టని బంగారు నగలే
మనసుకు గొప్ప ఆభరణాలు
మనిషికి బాల్యమొసగిన సంపదలు.
ఈ జ్ఞాపకాలు ఎప్పుడైనా పలకరించినా
ఆ తలపులు ఏనాడైనా ఎదురైనా
సకలసౌకర్యాల్ని అనుభవిస్తున్న
నేటి దర్జాతనం కొంచం పక్కకు తొలిగి
దారినిచ్చి మాట్లాడుతుంది గౌరవంగా....
సమయం దొరికినప్పుడల్లా
తరగని సంతోషాన్ని పంచే శ్రీమంతుడు....
ఎంతో ఆనందాన్ని అనుభవించే
అదృష్టవంతుడు.
పదేళ్ల వయస్సులో ఆ పేదరికం
ఇచ్చిన సౌభాగ్యాలివి.
నూరేళ్ళు మనసులో ఉండిపోయే
నాణ్యమైన రోజులవి.