Menu Close
Page Title
అంతర్ముఖత చూపించే వేదాంతమే కాదు, బాహ్యవలోక కళలు కూడా బహుశా మోక్ష సాధనాలే

వేద, వేదాంత ఉద్గ్రంధాలు, జ్ఞానమార్గాన్ని ఆలంబనము గా ఆత్మశోధనకు, తన్మూలముగా మోక్షప్రాప్తికి అంతర్ముఖ పరిశీలన ప్రధాన మార్గం అంటున్నాయి. ఆ మార్గాన్న పయనించిన ఎందరో ఋషి పుంగవులు, ముముక్షువులు దానిని సాధించగలిగారని వింటున్నాము. బహుశా వారు సద్గతిని పొందడం ఇతర ఋషి పుంగవులు దివ్యదృష్టితో అనుకున్నది సాధించడం దర్శించి ఇతరులకు తెలియ చెప్పి ఉండవచ్చు.  వారు ఆ పరమేశ్వరుని అత్యంత శ్రద్ధతో

'సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమోనమః|
భవే భవే నాతిభావే భవస్వమాం భవోద్భవాయ నమః||'

"ఓ సద్యోజాతా, ఆది దేవా, నిన్ను నమస్కరిస్తూ శరణు వెడుతున్నాను. నాకు పునర్జన్మ లేకుండా అనుగ్రహించు, ఓ జన్మ కారకుడైన దేవా, పునర్జన్మ లేని మార్గాన్ని నాకు చూపించు.” అని ప్రార్థించి మోక్షాన్ని  సాధించారని అప్పటి గ్రంధాలు తెలియచెబుతున్నాయి. ఇటీవలి కాలంలో అది శంకర, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, పరమహంస యోగానంద, స్వామి శివానంద మున్నగువారు కూడా కైవల్య ప్రాప్తి చెందినట్లు వారి సన్నిహిత శిష్య బృందం వక్కాణించారు. కాని, అది మన లాంటి సామాన్యులకు అంత సులభసాధ్యం కాదు.

తరువాతి కాలంలో కొందరు కొన్ని లలిత కళలు - సాహిత్య సంగీతాలని నమ్ముకుని భక్తి మార్గాన్న తపస్సాధన చేసినవారిని కూడా మోక్ష పథాన్న అవి నడిపించాయని ఆనాటి చరిత్ర వివరిస్తోంది. మనస్సును, ఇంద్రియాలను ఏయే కళలలో ఏకాగ్రత, తన్మయత్వంతో సాధన చేసి - ఉదాహరణకి సాహిత్య, సంగీత గాత్ర, వాద్యాలతో సహా, నాట్య, శిల్ప, చిత్రలేఖనాల -లో దైవకృప పొంది దానిద్వారా మోక్షము సాధించ గలిగారట.

సంగీతానికి (గాత్ర, వాద్య) ఉన్న అమోఘ శక్తి మనః పొరలలో దాగి మానవుణ్ణి దొలుస్తూన్న చింతలని కొంత సేపైనా మరుగున పడేసి, ఆహ్లాదాన్ని కలిగించి, దానిద్వారా మనిషి మానసిక ప్రశాంతతని పెంచగలదటుంటారు అనుభవజ్ఞులైన పెద్దలు. అందుకే మనసు బాగుండనప్పుడు మన కిష్టమైన సంగీతం వింటుంటే మనస్సు కుదుటబడి ప్రశాంతత దక్కుతుందని వారి యోచన. సంగీతానికి వ్యాధుల్ని నయం చేసే గుణం ఉందని అనేకులు నమ్ముతూ ఉంటారు. వారిలో సఫల ప్రయోగాలు చేసినవారిలో అవధూత గణపతి సచ్చిదానంద ఒకరు. జంతువులు, చెట్లు, పక్షులు ఒకటేమిటి సమస్త జగత్తులో సంగీతానికి స్పందిస్తూ తలఊపని ప్రాణి లేదు, అంటారు వృక్ష, జీవ జంతు శాస్త్రజ్ఞులు.

సంగీతమంటే ఏమిటి? లయతోకూడిన రాగబద్ధమైన స్వరఝరి. దాని మాధుర్యం ఇంద్రజాలమై పిల్లల ఏడుపునాపి నవ్వింపచేస్తుంది, పక్షులు మన పిలుపులకి జవాబుగా కూస్తూ సమాధాన మిప్పింప చేస్తుంది, ఆవులు పాలు వర్షిస్తాయి, చెట్లు పూవులని వికసింపచేస్తాయి, పంటలు సమృద్ధిగా పండుతాయి. ఒక అనుభవ గాయకుని మధుర సంగీతము లో ఇమిడిన భావ పూరిత సాహిత్యపు సొబగులు పూవికి తావి అబ్బినట్టయి వినేవారి మనస్సు ఊహమేఘాలపై ఉయ్యాలలూగిస్తుంది. అది ఒకవిధంగా మనస్సుని ద్రవీభూతం చేసి నిర్వాణ స్థితికి సోపానమవుతుందని కూడా అంటారు అనుభవజ్ఞులు. గాన మాధుర్యం మనస్సుని తాక గలిగితే, అది కరడు కట్టిన హృదయాల్ని కూడా కదిలించి, సంగీత అనుభవాన్ని రుచి చూపి తన్మయత్వాన్ని కలిగించ గలుగుతుంది. సంగీత ప్రపంచంలో పేరున్న వాగ్గేయకారులు, సంగీత విద్వాసులు, అనేక గాయకులూ, సాహిత్య ఆలంబన లేకుండా భావుకులని మెప్పించడము సాధ్యం కాదు. వారు తమ సంగీతానికి అలరించిన సాహిత్యపు భావ మెరుపుల వల్లనే పండిత పామరులని ఆకట్టుకోకలిగారు. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, బాలమురళీకృష్ణుల సాహిత్య సౌరభం వారి సంగీత విభవాన్ని పెంచి జనబాహుళ్యానికి అందించి వారిని ముగ్ధులని చేయగలిగారు,. వారి ఏకాగ్రత, తన్మయత్వం మోక్షసాధనకు సోపాన మయిందని కూడా అంటారు విజ్ఞులు.

అల్లాగే  రచయిత సాహితీ ప్రకర్ష, ఆరాధన కూడా సాధకునికి మనోల్లాసాన్ని కలిగించడమే కాక కొన్ని ఉన్నత రచనాంగాలు పాఠకుని మనస్సుని నిర్వాణ స్థితికి విశేష భావానుభూతికి లోను చేసి దైవత్వాన్ని ఆపాదిస్తాయి. వాటిని చదువుతున్న పాఠకుణ్ణి కూడా సుమారు అదే ఉన్నత మానసిక స్థితికి కొనిపోతాయి. ఉదాహరణకు పోతనామాత్యుని భాగవత కథ లోని గజేంద్రమోక్షంలో ఆ పరమాత్ముడు అక్కడి పరిస్థితి సర్వము మరచి భక్తుని రక్షించుటకై పడ్డ ఆతురత, అచ్చట గల స్థితి శ్రీమద్భాగవత గ్రంధములో వర్ణించడంలో పోతన పడ్డ తపన నిస్సహాయత, విష్ణువు స్వయంగా పోతన రూపంలో వచ్చి ఆఅంశాన్నిఅతడు వ్రాస్తున్న భాగవతం లో 'అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల' అంటూ పూరించేలా చేసి అతడిని మెచ్చి దీవించిన పద్దతి చూస్తే అతడికి అక్కడే అప్పుడే మోక్షాన్ని ప్రసాదించినట్లు తోస్తుంది. దేహత్యాగం పిమ్మట వారి మోక్ష గతి మానవ మాత్రులు తమ ఐహిక బహిరంగ సాధనాలతో వీక్షించడం అసాధ్యం గనుక అది సందర్భానుసారం నమ్మవలసినదే. ఆ ఘట్టాన్ని చదువుతున్న పాఠకుడు కూడా దానిని అనుభవించిన రచయిత అంత కాకపొయినా కొంతైనా భావోద్రేకానికి లోను అయి ఆతదు పొందిన అదృష్టాన్ని మోక్షాన్ని ఉహించుకోగలడు.

అన్నమయ్య అనేక వేల కీర్తనలతో ఆ ఏడుకొండలవాణ్ణి అర్తితో కీర్తించి పూజించి, మెప్పించి "దొరకునా ఇటువంటి సేవా" అంటూను, "కలిగినదె నాకు కైవల్యము, తొలుతెవ్వరికి దొరకనిది" అంటూ తను పొందిన దైవానుగ్రహానుభవాన్ని పాటలో వ్యక్తీకరించి, "అంతర్యామి అలసితి సొలసితి, ఇంతట నీ శరణే జొచ్చితిని, మదిలొ చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక" అంటూ మొరబెట్టుకుని ఇహ బంధనాలని తెంచుకో గలిగాడు, ముందు తరాలకు తన అనుభవాలను కీర్తనలద్వారా విశదీకరించ గలిగాడు అన్నమయ్య.

రాజాస్థానంలో సంగీత ఆస్థాన విద్వాంసునిగా చేరమని రాజు గారి దగ్గరనుండి సకల మర్యాదలతో ఆహ్వానం వచ్చినప్పుడు త్యాగయ్య - "నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా' అంటూ తర్కించుకుని తుదకు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన తరుణంలో అతడి అన్న ప్రాపంచిక సుఖాల దృష్ట్యా ధనవంతుడయ్యే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంటున్నాడనే దిగులుతో త్యాగయ్యని దూషించి, కోపంతో అతడు నిద్రిస్తున్న సమయంలో ఆతడు అత్యంత భక్తితో అరాధించే రామ పరివార మూర్తులని తీసుకెళ్ళి కావేరి నదిలో పడవేస్తే, ఆ రాముణ్ణి ఫ్రార్ధించి, వేడుకుని వాటిని తిరిగి ఆనదిలోనే పొందగలిగినప్పుడే, "ననుపాలింపగ నడచి వచ్చితివో, నాప్రాణనాధా" అంటూ కృతజ్ఞతతో మ్రొక్కుతూ కీర్తించినప్పుడే ఆతడికి అరాముని కృప, మొక్షమూ లభించాయనిపిస్తుంది.

అల్లాగే కంచర్ల గోపన్న తాను శిస్తుకై సేకరించిన సొమ్మును ఖజానాలో జమ చెయ్యకుండా భద్రాచల రామాలయ నిర్మణానికై ఖర్చు పెట్టినందుకు బందిఖానాలో తానీషా విధించిన శిక్ష ననుభవిస్తూ- "ఎవరబ్బసొమ్మని కులుకుతూ తిరిగేవు ఓ రామచంద్రా" అని నిందిస్తూ మొరపెట్టుకోగా, తమ్ముడు లక్ష్మణునితో వచ్చి లక్ష వరహాలు తానీషాకి చెల్లించి అతడిని బంధ విముక్తుణ్ణి చేసిన వైనం విన్నవారందరికి మనస్సు ద్రవించక మానదు. వారందరికి రామదాసుకి ఆ రాముడు అప్పుడే మోక్షన్ని కటాక్షించి ఉంటాడని కూడా అనిపించక మానదు.

ఈనాటి మహాత్ములు గా గుర్తింపబడ్డవారు కంచి పీఠాధిపతి శ్రీ పరమాచార్య, జగర్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహా స్వామి, శ్రీ అరబిందో, శ్రీ సత్యసాయిబాబా, చిన్మయానంద, బహుశా మోక్షప్రాప్తి పొందేఉంటారు. కానీ వాటిని మానవుడు కాంచిన దాఖలేవీ లేవు.

లలిత కళలలో ఒకటైన పాకకళ కూడా పురాణ కాలము నుంచి నల, భీములు ఖ్యాతి నార్జించిపెట్టినప్పటికీ, అది జిహ్వని తాత్కాలికంగా తృప్తిపరచి, ఇహలోకంలో స్వర్గానికి బెత్తెడు దూరం తీసుకుని వెళ్లడం అందరికి అనుభవమే అయినా, అది దాని రసాస్వాదనా సుడిగుండంలోకి తోసివేయడం తప్ప భవబంధ విముక్తికి సోపానమైనట్లు ఎక్కడా దాఖలాలు లేవు.

-o0o-

Posted in December 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!