దేవుడే దిగివస్తే 'పరమాచార్య' అవుతారేమో!
అవును, ఈ కలికాలంలో మోసాలు, అన్యాయాలు, అధర్మాలు కట్టలుతెంచుకు పారుతుంటే, ఫరవా లేదనుకుని కళ్ళుమూసుకుని పోయేవారి వారికి సరైన దారి చూపి, మంచిని చేసి చూపి సన్మార్గంవైపు మళ్లించే ప్రయత్నించిన 'పెరియవ' వంటి గురువే దిగిరావాలి.
కలియుగం యొక్క రూపం, ప్రకృతి పై దాని ప్రభావం, మానవాళి, పశుపక్ష్యాదుల రోగ, భోగావస్థల అనుభవ నిమ్నోన్నతాలు అన్నీ మనకి స్వానుభవం కాకపోయినా తెలుస్తున్నవే. తమ రూపధారణతో, మాటల మంత్రీకరణంతో మనల్ని మభ్యపెట్టి, సులభమైన ధనార్జన సాధ్యమేనంటూ లోభపెట్టి, అల్లరితో అగాధంలో తోసేసి, లాభాలని కూర్చుకుని గల్లంతయ్యే కొందరు మాయ గాళ్ళ ఉదాహరణలు కోకోల్లలైతే, వారు పేపర్లద్వారా, టీవీ ద్వారా కనిపిస్తూ, రేడియో ద్వారా వినిపిస్తూ ఆశ్చర్యానికి లోనుచేస్తూ మనలో నిగూఢముగా నిలిచిన జుగుప్సని వెలికి తీస్తున్నారు. దానిని కలిప్రభావం అనుకుంటూ సరిపెట్టుకుంటూ ఉంటాము. అదే దృష్టాంతంలో మరి కొందరు నిరాడంబరులైన పుణ్య పురుషులు ఉన్నత శిఖరాలని చూపిస్తూ వాటివైపు మనకి శ్రమ తెలియకుండానే నడిపించి ఎటువంటి ప్రచారము లేకుండానే మనచే కృతజ్ఞతతో నమస్కరింపజేసి మనకి మానసిక స్థైర్యం కలిగించి పురోగతిని చూపుతారు. ఆ కోవకు చెంది, అటువంటి అనుభూతి అనేకమంది పండితులకి, విద్యాధికులకి, శిష్యులకి, సామాన్యులకి కూడా అందించిన ఉన్నతులు, దార్శనికులు, ఆచార్యులు, 'నడిచే దైవం' గా ప్రశంసల నందుకున్న లేక 'నడయాడు బ్రహ్మపదార్ధం' గా కొనియాడ బడిన 68 దవ కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్యులు, మహా పెరియవ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి.
1894 మే 21 అనగా జయ నామసంవత్సరం, వైశాఖ బహుళ పాడ్యమి, భానువారం మధ్యాహ్నం గం 1.16 నిముషాలకు సింహలగ్నంలో హొయస కన్నడ బ్రాహ్మణ శాఖకి చెంది, తమిళనాడు విల్లుపురంలో స్థిరపడిన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి, మహాలక్ష్మమ్మ లకు ద్వితీయ పుత్రునిగా జన్మించారు. అప్పుడు తల్లితండ్రులు పెట్టిన పేరు స్వామినాథ శాస్త్రి. సుబ్రహ్మణ్య శాస్త్రి,'ఇన్స్పెక్టర్ అఫ్ స్కూల్స్' గా పని చేస్తున్న రోజుల్లో విద్యాబుద్ధులలో అసమాన ఔన్నత్యాన్ని సాధిస్తున్న కొడుకు జాతకం ఒక జ్యోతిషం తెలిసిన మిత్రుడైన న్యాయవాదికి చూపించగా, ఆయన పరిశీలనగా చూసి, వెంటనే ఎదురుగా ఉన్న మహాలక్ష్మమ్మను ఒక చెంబుడు నీరుతెమ్మని కోరగా, ఆ తెచ్చిన నీరుతో ఆ పిల్లవాని పాదాలు కడిగి ఆ నీళ్ళు తన తలపై జల్లుకున్నాడట. దానిని చూసి వారివురు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై ఉండగా, 'మీ అబ్బాయి అసామాన్యుడు, ప్రపంచమే అతడి కాళ్లకు ఒకనాడు మొక్కుతుంది. కానీ ఆసమయాన్ని చూడడానికి నేను బ్రతికి ఉండను గనుక ఇప్పుడే మ్రొక్కుతున్నాను' అని ఆయన చెప్పారట. ఆయన జ్యోతిషం అక్షరాలా నిజమైంది. ఆ కుర్రాడే ఒకనాడు కంచి మహాస్వామి అయి ప్రపంచంలో అనేకుల మొక్కులు అందుకున్నారు.
స్వామినాథ శాస్త్రి 'దిండివనం' లోని ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో నాలుగవ ఫారం చదువుతున్న రోజుల్లో షేక్స్పియర్ 'కింగ్ జాన్' నాటకంలో 'ప్రిన్స్ ఆర్థర్' పాత్ర రమ్యంగా, అతి సమర్ధవంతం గా ప్రదర్శించి ప్రేక్షకుల మెప్పుని పొందాడట. 66 వ పీఠాధిపతి (ఏడ అదే సన్యాసాశ్రమ నామము తో ఆరవ వారైన) శ్రీ చంద్రశేఖర సరస్వతి సంచార యాత్రకై వెళ్ళినప్పుడు అనేక పర్యాయములు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయనతో వెళుతూ తనతో కుమారుడు సోమనాథుని కూడా వెంట తీసుకెళ్లేవారట. ఆ సమయాలలో పీఠాధిపతి స్వామినాథుని తేజస్సు, సమయస్ఫూర్తి, తెలివితేటలు చూసి ముచ్చటపడి ఈతడు పీఠాదిపతికి అర్హుడని నిశ్చయించుకుని తన తదనంతరం అతడే పీఠాధిపతి కావాలని నిశ్చయించుకున్నట్లు పీఠంలో ముఖ్యులందరికి తెలియజేశారట. ఆ పర్యటన అనంతరం 1908 లో 66 వ పీఠాధిపతికి నలభై ఏళ్లకే అకస్మాత్తుగా సిద్ధి పొందే సమయమాసన్నమైనదని తెలుసుకుని, స్వామినాధశాస్త్రి జాడ తెలియక దగ్గరలోనే ఉన్న మహాదేవుని పీఠాధిపతిగా ప్రతిష్టించి శివైక్యం చెందారు. కానీ దురదృష్ట వశాత్తు ఏడు రోజులు తరువాత మసూచి వ్యాధి సోకి ఆ నూతన పీఠాధిపతి మహాదేవుడు కూడా శివైక్యం చెందారు. అది తెలియని బంధువైన సుబ్రహ్మణ్య శాస్త్రి మహాలక్ష్మమ్మ తన బంధువైన నూతన పీఠాధిపతి చూద్దామని రావడం, పీఠంలో వారందరు స్వామినాథ శాస్తి చూసి వెంటనే గుర్తించి ఉత్తర పీఠాధిపతికి ఇవ్వవలసిన మర్యాదలతో పల్లకిలో మఠానికి తీసురావడం, (వస్తూ దారిలో అతడికి యింక తలిదండ్రుల వద్దకు పోవఁవీలుండదని, తన వారితో సంబంధబాంధవ్యాలు ఉండవని మఠం యొక్క తాపీ మేస్త్రి చెప్పగా) అదంతా ఒక దుఃఖ పూరిత స్వప్నంలాగ జరిగి అతడిని సంభ్రమాశ్చర్య విచారాలకు గురిచేసింది. తలిదండ్రులు కూడా అయోమయస్థితిలో జరుగుతున్నది విధిలీలగా భావించి తలఒగ్గారు. వింత ఏమిటంటే, పాఠశాలలో ఒక సామాన్య విద్యార్థిగా బాధ్యతా రహిత జీవితం గడుపుతూ అనుకోనివిధంగా అనూహ్య బాధ్యతలనెత్తుకుని, వైదిక విద్యా, ఆచారాంబుధిలో తలమునకలై ఈదుకుంటూ కానరాని గమ్యాన్ని చేరే ప్రయత్నం ఒక పెద్ద సవాలు. ఆ నూతన పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతికి ఆ పీఠం యొక్క ఆచారాలు, మర్యాదలు, పద్ధతులు, నీతినియమాలు, తెలియచెప్పే అనుభవజ్ఞుడైన గురువు లేకపోవడం ఒక దురదృష్ట స్థితి. అప్పటి నూతన మఠ ధార్మిక సమాజంలో ఎవరిమాటకు ఎంత విలువిచ్చి ఆచరించాలో నిర్ణయించగలగడం మరొక సవాలు. వాటన్నిటిని సమన్వయించుకుంటూ నెగ్గుకురావడం అతడి అలవర్చుకున్న సంసృతికి, తెలివితేటలకు, చొరవకు, నిజమైన సవాలు. ఆది శంకరుల ఆశీర్వచన బలమే ఆడుతూ పాడుతూ తిరిగే స్వామినాథశాస్త్రిని కంచి కామకోటిపీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిని చేసి సమర్ధవంతంగా ఆ పీఠాన్ని 83 ఏళ్ళు నడపగలిగేటట్లు చేసింది. బహుశా అదేకాదు ఆయన తపస్సు, స్వతహాగా మానవుని మంచితనం పైన నమ్మకం, వైదిక సూత్రాల పై గౌరవం, ఆచరణలపై ప్రగాఢవిశ్వాసం, అకుంఠిత దీక్ష ఆయనని దేవుణ్ణి చేశాయి, ఆదిశంకరులకు తనకై స్థాపించుకున్న కంచి పీఠానికి సరైన వారసుడిని చేశాయి. ఆవిధంగా 13 ఫిబ్రవరీ 1907 లో 68వ పీఠాధిపతిగా ఆరంభించి, 8 జనవరి 1994 (ఆ మహాస్వామి శివైక్యం చెందే) వరకు అనగా సుమారు 83 సంవత్సరాలు (మధ్యలో నాలుగు సంవత్సరాలు వైదిక విద్యాభ్యాసానికి వదలివేస్తే) అతి సమర్ధవంతంగా పీఠాన్ని ప్రపంచమంతా తలవంచుకుని నమస్కరించే విధంగా నడిపారు. ఈకాలంలొ ఆయన కీర్తి సామాన్యప్రజల నుంచే కాకుండా, పండితులు, విద్వాంసులు, నాయకులు, రాజకీయ ప్రముఖులందరి నుండి, మరియు చాల మంది విదేశీయులు, ఇతర మత గురువుల నుండి కూడా గౌరవ భావంతో ఔన్నత్యపతాకాన్ని ఎగురవేసింది. పదమూడవ ఏట కంచి పీఠంలో జేరిన వెంటనే తాత్కాలికంగా ఆ మఠాన్ని పరిరక్షిస్తున్న అధిపతులు, నాలుగు సంవత్సరాల పాటు వైదిక జ్ఞాన సముపార్జనకై కంచి పీఠం చంద్రశేఖరేంద్ర సరస్వతిని తిరుచిరాపల్లి జిల్లా మహేంద్రమండలంలో మహామహోపాధ్యాయ సుబ్బయ్య శాస్త్రి గారి వద్ద, విష్ణుపురం పంచపకేశ శాస్త్రి గారి వద్ద, మహామహోపాధ్యాయ కర్మగులం కృష్ణ శాస్త్రి ల వద్ద వేదాలు, శాస్త్రాలు, అనేక పండితుల వద్ద సంగీతము, సంసృత సాహిత్యాలు, తమిళ భాషా గ్రంధాలు, చరిత్ర, ఖగోళ శాస్త్రం, నేర్పించింది. ఆ గురువులు ఆ విద్యార్ధి అద్భుత గ్రాహ్యశక్తి కి ఆశ్చర్యపడి ముచ్చట పడ్డారట. తత్వ శాస్త్రం, గణిత ఖగోళ శాస్త్రాలలో ఎక్కువ ఆసక్తి కనబరచారట చంద్రశేఖర సరస్వతి. ఆయనకి 21 వ ఏడు రాగానే పీఠం పూర్తి బాధ్యతలు అప్పగించారు.
1919 లో ప్రారంభమైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి 'విజయ యాత్ర' పూర్తి ఇరువది యేండ్లు సాగినది. ఆ పిమ్మట మరలా ఎన్నో తరువాత పరమాచార్య తన 86 వ ఏట ఆరేళ్లపాటు కాలినడకన దేవాలయాలు దర్శించుకుంటూ 3860 కిలోమీటర్లు తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లలో దక్షిణ భారత సంచారం చేసి అది శంకరులని తలపింపచేశారు. అయన ఆదిశంకరులవలెనే భారత దేశం నలుమూలలు కూడా పర్యటించారు. అందువల్లనే ఆయన భక్తులు ఆయనని ‘నడచే దైవమని’ కొలిచారు. దారిలో కర్నూలు జిల్లా 'రామాపురం బిలం' వద్ద అనేక వేల శివ లింగాలు వెలసి ఉన్న గుహల్ని దర్శించారు. ఆయన శ్రీశైలం వద్ద అడవిలో కప్పబడి పోయిన ఆదిశంకరుల తపస్థలాన్ని, ఆయన 'శివానంద లహరి', 'సౌందర్య లహరులు' కూర్చిన స్థలంగా తన తపోబలంతో గుర్తించి తెలియచేసారు. ఇప్పుడది గొప్ప యాత్రాస్థలంగా నిలిచింది. పరమాచార్యులు. 'పాతో రోత, కొత్తో వింతా' అన్న నానుడికి వివరణ ఇస్తూ, 'ప్రాచీనమైనదంతా అవలంబించదగినదీ కాదు, ఆధునికమైనదంతా తృణీకరించదగినది కాదు ఆరెండిటి మేలు కలయికే నేటి సమాజానికి శ్రేయస్కరం.' అంటారు.
'మూఢభక్తి తో ఆచరించినా సత్కర్మలు శుభ ఫలితాలనే యిస్తాయి.' భక్తి -కర్మల పై పరమాచార్యుల వివరణ.
ఒకసారి శ్రీ వినోబాభావే తో మాట్లాడుతూ, 'చెట్టుని పోషించాలంటే చెట్టు కుదురుకు నీరందిస్తే చాలు, ప్రతి కొమ్మకు ఆకుకూ నీళ్లు పోయక్కరలేదు. అల్లాగే మనిషి నోటికి ఆహారం అందిస్తే చాలు, కంటికి, కాలికి ఇవ్వనవసరం లేదు. ఈ సృష్టి సమస్తం ఆ పరమాత్ముని అవయవాలు మాత్రమే, పరమాత్మనలంకరిస్తే లోకాన్నంతా అలకరించినట్లే. లోకసేవ చెయ్యడానికి భగవత్సేవే సుళువైన మార్గం. అందుకే మన వాళ్ళు "సర్వే జనాః సుఖినోభవంతు" అని భగవంతుణ్ణి ప్రార్ధించమంటారు.'
మహాస్వామి 22 మార్చినెల 1954 న ఋగ్వేది అయిన జయేంద్ర (పూర్వాశ్రమ నామం సుబ్రహ్మణ్యన్) ని తన పిమ్మట పీఠాధిపతిగా ఎన్నుకుని పద్దతి ప్రకారం తంజావూర్ జిల్లా మన్నారుగుడి 'ముక్తి మండపం' లో సర్వతీర్థం చెరువు వద్ద ఆయనికి ఉపదేశం ఇచ్చారు, పిమ్మట మహాస్వామి ఆధ్వర్యంలో అనేక ప్రసిద్ధ పండితులచే తరువాతి పీఠాధిపతి కి ఆవసరమైన శిక్షణ యిప్పించారు.
మే 1984 నుంచి జనవరి 1994 వరకు- అంటే పరమాచార్య సిద్ధిపొందెవరకు- కంచి మఠాన్ని వదలకుండా ప్రతిదినం అతి నిష్ఠ తో తపస్సు, దైవానుష్టానము, పుస్తక పఠనము చేసేవారు. ఆయన చేసే ప్రతి పూజ, కార్యక్రమము అత్యంత శ్రద్దా నిష్ఠ లతో ఉండి చూసే భక్త జనావళికి పూజ 'ఇంత భక్తి శ్రద్ధలతో చెయ్యాలా' అనిపించేటట్లు ఉండేదట.
ఆయన దూరదృష్టి తో చేసిన తర్కాతీత నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపరచేవి. ఆయనను దర్శించుకునే లక్షల భక్తులలో వారి యోగక్షేమాలు, వారికి కలిగే ఆటంకాలు, క్లిష్ట సమస్యలు మనోనేత్రం ద్వారా చూసి, వారికి అవసరమైన సహాయం చెయ్యడం, ప్రాణాపాయాలనుంచి తప్పించడం, వారి కుటుంబ సంక్షేమం కోసం అనేక సలహాలు ఇవ్వడం తో వారికి ఆయనపై గల అపార భక్తి, గౌరవం మరింత ఇనుమడించేవి. ఇవన్నీ భక్తులు కృతజ్ఞతతో వేర్వేరు పద్ధతులద్వారా తెలుపుకున్న వివరాలనుంచి వ్రాసిన వేల కొద్ది సంఘటనలలో నేను ఎంచుకున్న కొన్నింటిని ఇక్కడ ఉదహరిస్తున్నాను.
1. త్వరగా బయటకు రా!
కంచి పరమాచార్యుల సేవలో తరించి, జన్మ ధన్యత పొందిన వారిలో శ్రీకంఠన్ ప్రముఖులు, ముఖ్యులు కూడా. మహాస్వామి వారు తప్ప వేరు ప్రపంచం లేదని బ్రతికిన శ్రీవారి సేవకుడు. ఒకసారి పరమాచార్య స్వామివారు మఠంలో లేరు. కొద్ది దూరంలో ఉన్నారు. సాయంత్రం శ్రీకంఠన్ అత్యంత భక్తితో, సేవా భావంతో రుబ్బురోలులో పిండి రుబ్బుతూ ఉన్నారు. చేతులు పని చేస్తూ ఉన్నాయి కాని, మనస్సంతా మహాస్వామి వారి గురించిన ఆలోచనలే. మఠం సేవకులొకరు గాభరాగా లోపలికి వచ్చి, ఆయాసంతో రొప్పుతూ, “చేస్తున్న పనిని వదిలి, వెంటనే బయటకు రమ్మని స్వామివారి ఆదేశం” అని తెలిపారు. ఎందుకు ఇలాంటి ఆదేశాన్ని ఇచ్చారు, ఏమిటి విషయం అని శ్రీకంఠన్ ఎప్పుడూ ఆలోచించరు. పరుగుపరుగున వెంటనే మహాస్వామి వారి సమక్షానికి వచ్చేశారు. శ్రీకంఠన్ బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే అతను కూర్చున్న భవనం యొక్క పైకప్పు కూలసాగింది. శ్రీకంఠన్ గనక బయటకు వచ్చి ఉండకపోయి ఉంటే పైకప్పు శిథిలాల్లో అతను చిక్కుకునిపోయేవారు. దీర్ఘ దృష్టి గల పరమాచార్యుల కారుణ్య హృదయం వల్ల శ్రీకంఠన్ ఆపద నుండి తప్పించుకున్నారు. జరగబోయేది ఏమిటో ఆ సర్వేశ్వరునికి ఎలా తెలుసని శ్రీకంఠన్ అడగగలడా? కళ్ళ నీరు కారుతుండగా తన ప్రాణాలు కాపాడిన దేవునికి సాష్టాంగ వందనం చేసి, తన జీవితాన్ని మహాస్వామి వారి పాదాల చెంతనే గడిపాడు శ్రీకంఠన్. స్వామివారి అనుగ్రహంతో ఎన్నో ఏళ్ళు సేవ చేసి, చివరికి సన్యసించి మహాస్వామి వారిలో చేరుకున్నారు.
--- రా. వెంకటసామి, ‘శక్తి వికటన్’ ప్రచురణ
2. ఒక శిష్యుని కథనం ప్రకారం “పరమాచార్య స్వామివారి గురించి నేను మొదటిసారి విన్నది 1943లో, నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు తిరుచిరాపల్లిలో ప్రముఖ వైద్యులు, శ్రీమఠంలో కూడా సాధారణ వైద్యునిగా, పంటి వైద్యునిగా పేరుగాంచిన మా నాన్నగారు డా. వి. సుబ్రమణియమ్ గారు నన్ను, మా అమ్మను, నా సోదరిని తీసుకుని స్వామి వారి దర్శనానికి వెళ్ళారు. అప్పుడు సాయం సంధ్యా సమయం. తిరువానైకోయిల్ మఠం తోట ఆవరణంలో చిన్న గుడిసెలో పరమాచార్యుల స్వామివారికి పాదపూజ చేశారు మా నాన్నగారు. మహాస్వామి వారు నవ్వుతూ, మందహాసంతో, కరుణాపూరిత మోముతో దాదాపు అరగంట పాటు సాగిన ఆ క్రతువులో అలా కూర్చుని ఉండడం నాకు ఇప్పటికి గుర్తు. అరవై ఏళ్ళ తరువాత కూడా కళ్ళు మూసుకుంటే ఇప్పటికి ఆ మనోహర దృశ్యం గోచరమవుతుంది.
నా జీవితాన్ని, జీవన గమనాన్ని ప్రభావితం చేసిన అత్యంత ముఖ్యమైన విషయం, నన్ను మహాస్వామి వారు విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం. అది 1960 ఏప్రియల్ లేదా మే అనుకుంటా. కామన్వెల్త్ స్కాలర్షిప్ లకు మొదటి విడత విద్యార్థులను జాబితా వెలువడే సమయం. కొద్ది వారాల క్రిందట శ్రీలంకలోని కొలంబోలో జరిగిన కామన్వెల్త్ దేశాల ప్రధానుల సమాఖ్యలో తీసుకున్న ముఖ్య నిర్ణయం ఈ స్కాలర్షిప్ ల విధానం.
అందుకోసం నేను ఢిల్లీలో ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్దిరోజుల తరువాత ఈడిన్ బర్గ్ లో రెండేళ్ళ పాటు న్యూరోసర్జికల్ శిక్షణకు ఎంపికయ్యానని తెలిసింది. తిరుచ్చిలో ఉన్న మా నాన్నగారికి విషయం తెలిపాను. అప్పట్లో పరమాచార్య స్వామివారు సాంప్రదాయ కుంటుంబ పిల్లలు చాలాకాలం పాటు విదేశాలకు వెళ్ళే ఆలోచనను సమ్మతించేవారు కాదు. స్వామివారు అనుమతి ఇస్తేనే నేను వెళ్ళడానికి కుదురుతుందని నాన్న గారు తెలిపారు. పరమాచార్య స్వామి అనుగ్రహం కోసం అందరమూ శ్రీ మఠానికి వెళ్ళాము.
నాన్న గారు: రామన్ కు స్కాట్ ల్యాండ్ వెళ్లి మెదడు శస్త్రచికిత్సలో శిక్షణ పొందడానికి స్కాలర్షిప్ లభించింది. వెళ్ళాలని ఆశపడుతున్నాడు.
మహాస్వామి: అందువల్ల ఏమి ప్రయోజనం?
నాన్న గారు: ఇప్పుడు జనరల్ సర్జరీలో యమ్ యస్ డిగ్రీ ఉంది. విదేశాలకు వెళ్లి, న్యూరోసర్జరీలో నిష్ణాతుడు అయితే, ఎక్కువ ధనం సంపాదించవచ్చు.
మహాస్వామి: అతను వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమి?
నాన్న గారు: తను ఇంగ్లాడు వెళ్లి, ఎఫ్.ఆర్.సి.యస్ డిగ్రీ తెచ్చుకుని, పరిశోధన చేస్తే పి.హెచ్.డి డిగ్రీ లభిస్తుంది.
మహాస్వామి: అది కాదు. అతను వెళ్ళడం వల్ల ప్రజలకు ఏమిటి ఉపయోగం?
అప్పుడు అర్థం అయ్యింది మా నాన్నగారికి మహాస్వామి వారి ప్రశ్నలలో ఉన్న అంతరార్థం. అప్పుడు మా నాన్న ఇలా జవాబు ఇచ్చారు-ఇప్పుడు మెదడుకు సంబంధించిన ఆపరేషన్లు డా. రామమూర్తి గారు ఒక్కరే చేస్తున్నారు. వారు ఒక్కరే అవ్వడం వల్ల ఎందఱో రోగులకు శస్త్రచికిత్స అందడం లేదు. విదేశాలకు వెళ్లి శస్త్రచికిత్సలు చేసుకునే అంత స్తోమత అందరికి ఉండదు. రామన్ విదేశాలకు వెళ్లి, న్యూరోసర్జరీలో శిక్షణ పొంది వస్తే, ఎక్కువమంది రోగులకు చికిత్స చెయ్యవచ్చు. అంతేకాక భారతదేశంలోనే ఇంకా ఎక్కువమంది డాక్టర్లకు శిక్షణ ఇచ్చి, వారు శస్త్రచికిత్సలు నిర్వహించేటట్టు చెయ్యవచ్చు. ఇది ప్రజలకు చాలా ఉపయోగకరం పెరియవ.
మహాస్వామి: అలా అయితే, వెళ్ళమని చెప్పు.
ఒక విషయాన్ని మహాస్వామి వారు నిర్ణయించే విధానం ఇది. ఒక సాంప్రదాయ బ్రాహ్మణ యువకుడు నిత్యానుష్టానం వదిలి విదేశాలకు వెళ్ళడమా, ఎక్కువ విద్యార్హతలు సంపాదించడమా, ఎక్కువ ధనం ఆర్జించడమా అన్నది ముఖ్యం కాదు. ఇక్కడ, ఈ దేశంలో ఉన్న ప్రజలకు అందువల్ల కలగబోయే సహాయం, దాని వల్ల ప్రజలకు కలిగే ఉపయోగం మాత్రమే ముఖ్యం. స్వామివారి నిర్ణయానికి కొలమానం అదే!”
--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” సౌజన్యంతో.
3. నన్ను కాపాడేవారెవరు?
ఉత్తర భారతదేశంలో ఉద్యోగం చేసుకుంటున్న పరమాచార్య స్వామివారి భక్తుడొకరికి పెద్ద దుఃఖం కలిగింది. తన చెవుల్లో ఎప్పుడూ ఏదో వినబడుతూ ఉంటుంది. ఆ స్వరం ఏవేవో విషయాలన్నిటిని చెబుతూ ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా అది వదలకుండా ఏవేవో చెబుతూ ఉండేది. ఎన్నో సార్లు ఆ బాధని భరించలేక నిద్రనుండి మేల్కొనేవాడు. అది ఎవరి గొంతు? బహుశా ఆంజనేయ స్వామివారి గొంతు అనుకుని అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. అప్పుడే అసలు కథ మొదలైంది. చాలామంది తమ కష్టాలు తీర్చమని అతని ముందు వరుసలు కట్టడం మొదలుపెట్టారు. అలాగే భవిష్యత్తు చెప్పమని కూడా అడగడం మొదలుపెట్టారు. దాని కొరకు అతడు ఒక రోజు కేటాయించవలసి వచ్చింది. అతను కూడా ఎటువంటి ధనం ఆశించకుండా చెప్పేవాడు. కనుక అలా వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరగసాగింది.
అలా అడిగినవారికి అందరికీ అతని చెవుల్లో వినబడే శబ్దాలను విని వాటిని చెప్పేవాడు. చివరగా అతను మానసిక ప్రశాంతతను కోల్పోయాడు. సాలీడు గూడులో చిక్కుకున్న పురుగులాగా విలవిలలాడిపోయాడు.
“నన్ను కాపాడేవారెవరు?” అని భోరున విలపించాడు.
నా వద్దకు రా అన్నట్టుగా కనపడుతున్న మహాస్వామివారే తనను కాపాడగలరని తెలుసుకొని వారి పాదపద్మముల యందు శరణాగతిని వేడాడు. “నేనున్నాను. నావద్దకు రా” అని స్వామివారు భరోసా ఇచ్చినట్టు భావించాడు. “పెరియవ తప్ప నాకు వేరొకరు దిక్కు లేదు. నా చెవుల్లో ఎప్పుడూ ఏవో మాటలు వినబడుతున్నాయి. మొదట హనుమంతులవారే అలా మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అనుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని అంచనాలు నిజం అయ్యాయి కూడా కాని మొత్తానికి నేను మనఃశాంతిని కోల్పోయాను. నాకు ఇక ఉత్తరభారతంలో ఉండడం ఇష్టం లేదు. నాకు ఎలాగైనా బదిలీ కావాలి. దయచేసి నాపైన మీ కరుణను ప్రసారించండి పెరియవ” అని వేడుకున్నాడు.
“ఇవన్ని నాకెందుకు చెబుతున్నావు? నీకు ఆంజనేయ స్వామి వారి ఆశిస్సులు ఉన్నాయి కదా? మరి ఆంజనేయ స్వామికే ఎందుకు చెప్పుకోకూడదు?” అని స్వామివారు నవ్వుతూ అన్నారు.
అతను చాలా సిగ్గుపడ్డాడు. “పెరియవ నాకు నేనుగా ఆ గొంతు ఆంజనేయ స్వామివారిది అని అనుకున్నాను. అది ఏ దయ్యమో నాకు తెలియదు. నన్ను నిద్రపోవడానికి కూడా వదలడం లేదు. అందరూ నమ్మినా నేను మాత్రం అది నమ్మను. నేను ఏమి మాట్లాడకపోయినా ఏవో పనికిమాలిన విషయాలు నాకు వినిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను. పెరియవ రక్షించండి”
“ఎప్పుడూ రామ నామం జపిస్తూ ఉండు. కుంభకోణం దగ్గరలోని గోవిందపురంలో బోధేంద్రుల అధిష్టానం ఉంది. అక్కడకు వెళ్లి కొన్నిరోజులపాటు ఉండు” అని ఆదేశించి ప్రసాదం ఇచ్చి పంపించారు. పదిరోజుల తరువాత ఆ భక్తుడు గోవిందపురం నుండి వచ్చాడు. అతని మొహం సంతోషంతో వెలిగిపోతోంది. పరమాచార్య స్వామికి సాష్టాంగం చేశాడు.
“ఏమిటి? ఆంజనేయస్వామి వారు రామ సేవకు వెళ్లిపోయారా?” అని కొంటెగా అడిగారు. గోవిందపురం వెళ్ళగానే తన బాధ తీరిపోయింది. ఇక ఎప్పుడూ ఆ గొంతు అతనికి వినబడలేదు. భగవంతుని నామాన్ని నిరంతరమూ జపించడం వల్ల సహజమైన లేదా అసహజమైన ఆలోచనలు, మాటలు ఇక వినబడవు. పొరపాటున విన్నా అవి మన మనస్సుకి చేరి మనః శాంతిని పోగొట్టవు. ఇక్కడ ఈ దేశంలో ఉన్న ప్రజలకు అందువల్ల కలగబోయే సహాయం, దాని వల్ల ప్రజలకు కలిగే ఉపయోగం మాత్రమే ముఖ్యం. స్వామివారి నిర్ణయానికి కొలమానం అదే!