నేలై నాలోనే ఉన్నావు
నిప్పై నాలోనే ఉన్నావు
నీరై నాలోనే ఉన్నావు
నింగై నాలోనే ఉన్నావు
నింగిచూలై నాలోనే ఉన్నావు
ఎన్ని రూపాలుగా నాలోనే ఉన్నా...
నన్ను నేను తెలుసుకోలేకపోతున్నా...!
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
నాలో ఎన్ని చక్రాలు ఉన్నయో...
నాకు తెలువదయ్యా
బ్రతుకుచక్రం చక్కర్లు కొట్టకుండా చక్కగా చూడవయ్యా
చక్కర్లు కొట్టించకపోతే నీ కడుపు చల్లబడదా...!
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
బ్రతుకే.., ఓ చక్రమయ్యా
అందులో వక్రాలు సహజమయ్యా
నువ్వు సక్రమంగా నడిపితే నా బ్రతుకెందుకు వక్రమైతదయ్యా
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
అమ్మనే శ్రీ చక్రంలో ఉంచినవ్
ఇక నన్ను విడుస్తవా...?
అందుకే..! ఆరు చక్రాలబండికి నను ఎద్దును చేస్తివా..!
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
నీ చెంతకు చేరి సీతకోకచిలుకలవ్వాల్సిన వాళ్ళమయ్యా
ఎన్ని జన్మలైనా...! గొంగళిపురుగు దశలోనే గొణుగుతున్నమయ్యా
లోపమేడుందో జర సరిచేయవా...!
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
అడ్డగీతలు పెట్టినవయ్యా
మమ్ము అజ్ఞానంలో అడ్డంగా పండబెట్టినవయ్యా
ఎన్ని అడ్డగీతలు మేము బెట్టినా...!
నీ నిలువుసారం మా మదిలో నిలువలేదయ్యా
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
సగరులను తుంగలో తొక్కితివయ్యా
భగీరథుడి బెంగకు కరిగి
గంగను తుంగకు పంపితివయ్యా
భక్తికి పక్షపాతినని నిరూపిస్తివి కదయ్యా
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
కర్ణుడికి కవచకుండాలిస్తివి
ఇంద్రుడికి వాటిని దొంగిలించు బుద్ధిస్తివి
అర్జునుడిని వీరున్ని చేస్తివి,విర్రవీగాడని
బోయగా మార్చేస్తివి
ఏ రూపమైన నీవేగదయ్యా
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
తోలు బట్టకడతవు
బట్టకట్టిన తోలు తిత్తుల తోలు తీస్తవు
మాపాలిట తోడేలై ఆడుకుంటవు గదయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
సంసారతాడుకు కట్టబడిన
పశువునేనయ్యా
సంసారమును తెంపుతవో..?
పశుసారమును తెంపుతవో..?
నీకె ఎరుకా...!
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...