ఓ బేకారోడేమిటో ...
నీ లింగాన్ని ముక్కలు చేయడం ఏమిటో...
ఆ కథ నా చెవిలో పడడమేమిటో...
నా కండ్ల నిండ నీళ్ళు నిండడమేమిటో...
మనసును ఉపవాసం చేయించడం ఏమిటో...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
వాడెవడో గజినీ గాడట...
లింగం ముక్కలు చేసి మోసెనట...
నువ్వు ఉలుకు పలుకు లేక ఉంటివట
పోయాక వాడిని మోస్తివట...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నీకు దండం పెడతానయ్యా...
నీపై దాడి చేసిన దగకోరు కథలను
నా చెవులలో వేయకయ్యా...
నీయంత దయామయుడిని నేను కాదయ్యా...
నీపై అవమానాలకు నా మనసు దావాగ్ని అయితదయ్యా...
అవమానము.., అగ్ని నేనే అంటావా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
కుక్కలు నువ్వు లేవని మొరుగుతున్నవయ్యా...
గాడిదలు ఓంకారం ఒట్టిదని ఓండ్రబెడుతున్నవయ్యా...
నక్కలు నీ జాడ ఏదని కూతబెడున్నవయ్యా...
ఈ పశువులకు కూడా పశుపతివి నువ్వా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నీ ఆట పద్మవ్యూహంలో అంతా బూడిదయ్యా...
అభిమన్యుడైనా అర్జునుడైనా
నీ మాయాటలో అరటిపండేనయ్యా...
ఎవడైతేనేమి నీ వొంటికి బూది...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
మంచులో ఉంటవు
మంచిని చేస్తావు...
మసి భూదితో ఉంటవు
విభూదులనిస్తవు...
కాటిలో ఉంటవు మూడో కంటితో కాస్తవు...
కాసేది కాల్చేది నువ్వేనా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఎవడికెవడంటు స్వార్థంతో బ్రతుకుతున్నము
ఎవడెవడికో గొయ్యి తీస్తున్నము
ఎవడెవడినో తొక్కిపెడుతున్నము
ఎవడి ఎదుగుదలనో చూసి ఏడుస్తున్నము
అందరు నా కొడుకులేనంటు తాండవంతో తంతున్నవా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఆయువొక సద్ది
తనువొక బుద్ధి
అనుభవాలు ఎన్నో అద్ది
బ్రతుకు ఒడ్డుపై తండ్లాడుతున్నాడు మనిషి
ఈ మనిషి మౌడ్యాన్ని తీయవా
మూడుకన్నుల మహర్షి...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
గుడిలో ఇమిడి ఉంటావు...
గుండెలో ఇమిడి ఉంటావు...
అరచేతిలో ఇమిడి ఉంటావు...
అనంతంలో ఇమిడి ఉంటావు...
నువ్వేమిటో...నీ పరిమాణమేమిటో...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
భళా సదాశివా...
తిరుపెమెత్తి లోకాలకు తినిపిస్తవు...
తిన్నది అరగని లోకం
తిట్టుకుంటది..,కొట్టుకుంటది..,
నీకు తిక్కరేగిందో...
నీవు తిరిగే జాగలో పండుకుంటది
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...