Menu Close
భావమంజరి
-- కీ.శే. శ్రీ అయ్యగారి రామచంద్రరావుగారి కవితలు --

పరిచయము

శ్రీ అయ్యగారి రామచంద్రరావుగారు గణితభౌతికశాస్త్రాలలో శ్రీపతిస్వర్ణపతకమును 1963లో ఆంధ్రవిశ్వవిద్యాలయము, విశాఖపట్టణము నుండి B.Sc,(Hons.)లో సాధించి, తదుపరి కలకత్తాలోని  Indian Statistical Institute (ISI) లో M.Stat. మరియు Ph.D. సాధించిన మేధావి. వారు విద్యార్థిదశలో గురువులందరి మన్ననలు పొందేరు. ఒక ఏడాదిపాటు USలో  Minnesota University లో Visiting Professor గా బోధించి తిరిగి వచ్చి స్వదేశాభిమానంతో కలకత్తాలోని ISI లోనే బోధకునిగా స్థిరపడ్డారు. వారు Linear Algebra లో ఒక పాఠ్యగ్రంథాన్ని రచించేరు.

రావుగారు కి.శే. శ్రీ అయ్యగారి సీతారామమూర్తిగారు, శ్రీమతి రాజ్యలక్ష్మిగార్ల పుత్రరత్నం. రావుగారి సతీమణి శ్రీమతి శ్రీసత్యవాణిగారు ఆంధ్రవిశ్వవిద్యాలయము, విశాఖపట్టణము నుండి M.Sc.(Bio-Chemistry) చేసేరు. గణితశాస్త్రంలోనే కాక ఆంధ్రసాహిత్యంలో కూడా రావుగారికి మక్కువ ఎక్కువ – ముఖ్యంగా బమ్మెర పోతనామాత్యుని శ్రీమదాంధ్రమహాభాగవతం. ఇందులోని అన్ని స్కంధాలను వారు పఠించేరు. క్రమేణా తెలుగుపద్యరచన కూడా ప్రారంభించేరు. వారి తొలిరచనలలోని కొన్ని పద్యాలు ఇక్కడ అందిస్తున్నాము.

శ్రీరావుగారు గణితశాస్త్ర, ఆంధ్రభాషా, సేవలు ఇతోధికంగా సాగించక ముందే, ఆచార్యునిగా పనిచేస్తున్న సమయంలోనే, భగవంతుడు వారిని తనదగ్గర శాశ్వతపదవిలో నియమించాడు.

కందపద్యరచన

..........కందము నీవలె వ్రాయుట
..........అందఱకును సాధ్య మౌనె? యది యె ట్లనినన్
..........మందుల నెందఱొ యిత్తురు
..........కొందఱివే సూపగలవు గుణ మెట్లయినన్

కుర్కురవేదన

చం.
ఎటులని విన్నవింతు నిది యేమఱుపాటున నున్న వేళలో
కుటిలత వెన్కనుండి యొక కుర్కుర “మార్చి”ని(1), చూచు నంతలో,
కటకట, రక్తబిందువులు కారగ కైయని బాధ నేడ్చున
ట్లట రహదారిలో కఱచె నా వెనువెంటనె యేగుదెంచితిన్
.....(1) పెంపుడుకుక్క పేరు – ఆర్చి

భాగవతపఠనము

కం.
చదివితిని భాగవతమును
చదువులగల భక్తిమార్గసాధన మగుటన్
చదువులతల్లికి అత్తయె
చదివించెను – నాదు జనని(1) – చక్కగ నెంతో
.....(1) తల్లి పేరు – రాజ్యలక్ష్మి
ఉ.
భాగవతంబునున్ జదువ పాపము లన్నియు పోకపోవునే?
రాగము తోడుగాగ మది రంజిల కుండునె యేరి కైననున్?
బాగుగ మేళవించి యల బమ్మెరపోతన పంచదారతో
మీగడ నీయడే ప్రజల మేలును కోరుచు తెన్గువారికిన్?

దానము

సీ.
రంతిదేవుని దాన మెంతటి గొప్పదో
.....తనకున్న లేకున్న తినుట కిచ్చె
శిబిచక్రవర్తి యిచ్చెను కోసి తనుభాగ
.....మాశ్రయించినవారి కచ్చెరువుగ
బలి దాన మిచ్చెను పదముల మూడింటి
.....దాన తనకు కల్గు హాని నెఱిగి
కర్ణు డిచ్చెను తన కవచకుండలములు
.....దాన తనకు ప్రాణహానియైన
తే.గీ.
అట్టి మహనీయుల చరిత్ర లాలకించి
యేదొ యొకటీయ కల్గెడు నిచ్ఛ, కాని
పుచ్చుకొనుటకు ముందుకు వచ్చు చేయి
ఇచ్చుటకు రాదు దౌర్భాగ్య మిదియె కాదె?

నెమ్మది

ఉ.
నెమ్మదిగానె చేయుదును నేనది యెయ్యది యైననున్ సరే
నమ్ముదు నా మనంబునను నా కది మంచిది యౌ నటంచు నే
వమ్ముగ వేగిరంబడి యభాసయినన్ ఫలితంబు కల్గునే?
నెమ్మదిగానె కచ్ఛపము నెగ్గదె పందెము పట్టువీడకన్?
Posted in November 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!