Menu Close
Kadambam Page Title
అంతర్వీక్షణం
డా.కె.గీత

అప్పుడెప్పుడో
ఓ చోట
సాహితీ వనాన్ని వెతుక్కుంటూ
తిరుగాడుతున్న వేళ
ఎక్కడో
ఒక పావురం రెక్కలు విప్పుకుంది
నా చుట్టూ తన పొదరింటిని పేర్చి
గువ్వల్ని నాకు పరిచయం చేసింది
చెవులో కువకువమంటూ
ఎన్నో కబుర్లని చెప్పింది
అక్షరాల సువాసనలు
గుబాళించే
ఉదయారుణ కాంతుల్ని
శారద రాత్రుల్ని
ఒక్కలాగే
పరికించమంది
కాగితాల
నలుపు తెలుపులు
విక్షేపించే
ఇంద్ర ధనుస్సుల్ని
ప్రేమగా
మెళ్ళో వేసింది
యోధురాలినై
ధరించమని
ఇన్ని
కలల
కలాల్ని
బహూకరించింది
అన్నిటినీ మించి
పావురాన్నీ
పొదరింటినీ
నాతో తెచ్చుకున్న నాకు
కోటి కాంతులు
ప్రభవించే
తన ప్రపంచాన్ని
నాలో
ఆవిష్కరించింది
నాలో
ఒక కొత్త గవాక్షమై తెరుచుకుంది
దారిలో
ఎదురయ్యే
ఎడారుల్ని ఒయాసిస్సులకెత్తి
రాలిపడిన ఆకుల్ని
మొలకెత్తే విత్తనాల మొదళ్లుగా మార్చి
పడిన ప్రతిసారీ
ఉవ్వెత్తున లేచే
కెరటమై తరంగించి
పొదరింటిని మోసే భుజానికి
దాటు కర్రగా
తన వెన్ను సాచి
పదేళ్లుగా
నాలో
అంతర్భాగమై
అంతర్వీక్షణమై
నాలో రెక్కలు విప్పుకున్న పావురం
నిరంతరాయంగా
నా చుట్టూ వనమంతటినీ
ఇప్పటికీ
సాహితీ వనంగా మార్చివేస్తూనే ఉంది
నాతోబాటూ
నడుస్తున్న
అందరికీ
త్రోవ పొడవునా
పరిమళాలు పంచుతూనే ఉంది

Posted in November 2022, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!