స్పందన
ఇంజనీరింగులో నా మాస్టర్స్ డిగ్రీ పూర్తయాక, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో చేరేలోపల, వూరికే కూర్చుంటే ఊరా పేరా అని పీ.డబ్ల్యూ.డీలో కొన్నాళ్ళు జూనియర్ ఇంజనీరుగా ఉద్యోగం వెలగబెట్టాను. అక్కడ చూసిన కుల పిచ్చి, కుంచాలతో లంచాలు, పదవి అహంకారం, ఆఫీసర్ల అడుగులకి మడుగులొత్తే బానిసత్వం, భూతద్దంలో వెతికినా కనపడని వ్యక్తి మర్యాద చూసి తల తిరిగిపోయింది. అక్కడవున్నప్పుడూ ఆ తర్వాతా అక్కడే జరిగిన విషయాల మీద కొన్ని కథలు కూడా వ్రాశాను. ఆ వుద్యోగం ఇక వెలగ’బెట్టలేని పరిస్థితిలో, ఇస్రో రమ్మనగానే తుర్రున తిరువనంతపురం వెళ్ళిపోయాను. అదన్నమాట ఈ నా గవర్నమెంటాలిటీ కథ వెనుక కథ.
(ఈ కథ ‘’ఆంధ్ర సచిత్ర వారపత్రిక’, జులై 21, 1972 సంచికలో ప్రచురింపబడింది)
‘ఇదే మా ఆడిటోరియం’ అన్నాడు జయరాం, తమ ఆఫీసు కల్చరల్ అసోషియేషన్ వారి ఆడిటోరియం తన కొత్త పెళ్ళాం ఇందిరకు చూపిస్తూ.
‘సింపుల్గా వున్నా బాగుంది’ అన్నది ఇందిర పరికించి చూస్తూ.
జయరాం దారి చూపిస్తూ ముందుకు నడిచాడు.
‘నమస్కారం సార్. రండి’ ఎవరో ఆహ్వానించారు జయరాంని.
జయరాం నమస్కారం అందుకుంటూ ఠీవిగా లోపలకు నడిచాడు, ఇందిరతో పాటు.
‘ఈ చుట్టుపక్కల వున్న గవర్నమెంటు ఆఫీసులలోని వాళ్ళంతా కలసి స్థాపించారీ కల్చరల్ అసోషియేషన్ని. నెలకోసారి ఏ మ్యూజిక్ ప్రోగ్రామో, డాన్స్ ప్రోగ్రామో వుంటుంది. ఊళ్ళో వున్న బిగ్ షాట్సుని కూడా పిలుస్తుంటాం’ మల్లె పూలతో ఘుమఘుమలాడుతున్న ఇందిర జడను చేత్తో పక్కకు నెట్టి, చెవిలో చెప్పాడు జయరాం. దానికి సాక్ష్యంగా ఎదురుగా వస్తున్న జిల్లా కలెక్టర్ని కూడా చూపించాడు.
ఇందిర తల పంకించింది, తల్లోని మల్లెమొగ్గలు మరోమారు సర్దుకుని.
‘సుభద్రా వెంకట్రామన్ పాట కచేరీ ఇంతకుముందోమారు విన్నాను. త్యాగరాజ కీర్తనలు బాగా పాడుతుంది’ అన్నది ఇందిర, మనసులో ఆ కార్యక్రమానికి తీసుకువచ్చిన జయారాంని మెచ్చుకుంటూ.
ఇంకా తెర లేవలేదు. జనం మెల్లమెల్లగా వస్తున్నారు. వాతావరణం ఆహ్లాదకరంగా వుంది. రకరకాల వ్యక్తులు రకరకాల రంగుల దుస్తులతో మంచి శోభనిస్తున్నారు కార్యక్రమానికి.
ముందు వరసలో కూర్చుని వున్న సన్నగా, పొడుగ్గా, ఎర్రగా వున్న వ్యక్తి ఒకతను చటుక్కున తన కుర్చీలో నించి లేచి, ముందుకు నడచి ఒక పొడుగాటి శాల్తీని లోపలకు ఆహ్వానిస్తున్నాడు. ఆయన వెనకనే ధీమాగా వస్తున్న ఆయన భార్యగారికి నమస్కారం చేశాడు. అంతేకాదు. పక్కనే వున్న ఆయనగారి పిల్లవాడికి జేబులోనించి ఒక చాకొలెట్ తీసి అందించాడు. ఆయన మాత్రం చాల గంభీరంగా వచ్చి, ముందు సీట్లో పేము కుర్చీలో కూర్చున్నాడు.
‘ఆ సన్నగా, పొడుగ్గా, ఎర్రగా వున్నాయన ఫలానా ఆఫీసులో ఫలానా ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడతను లోపలికి తీసుకువచ్చి, తన కుర్చీని త్యాగం చేసింది వాళ్ళ మేనేజరుకి. ఆయన్నీ, ఆయన భార్యనీ. ఎంతగా కాకా పట్టేస్తున్నాడో చూశావు కదా’ అన్నాడు జయరాం నెమ్మదిగా.
‘ఛ.. మర్యాద కోసం అలా ఆహ్వానిస్తే తప్పేముందండీ!’ అన్నది ఇందిర మెల్లగా.
జయరాం నవ్వాడు. ‘మర్యాదా? ఈ ఆఫీసర్లకి మర్యాద తీసుకోవటం తెలిస్తే కదా, మేము ఇవ్వటం. అదంతా కాకాలూకీయం డార్లింగ్. చూస్తూ వుండు, నీకే తెలుస్తుంది’ అన్నాడు,
ఇందిర తన అందమైన కళ్ళు టపటపా ఆర్పి వింతగా చూసింది.
మేనేజర్ కుర్చీలో కూర్చోబోయేటప్పుడు, ఆయన జేబురుమాలు క్రింద పడిపోయింది. అది ఆయన గమనించ లేదో, గమనించీ వంగటానికి పొట్ట అడ్డం వస్తుందని ఆగాడో చెప్పటం కష్టం. అది ఆ ఫలానా ఉద్యోగి చూసి గబగబా వెళ్ళి కర్చీఫ్ తీసి, దాన్ని తన కర్చీఫుతో శుభ్రంగా తుడిచి ఆయనకు అతి వినయంతో అందించి, ఒకడగు వెనక్కి వేశాడు.
ఆయన అతన్ని ఈగని చూసినట్టు చూసి, చటుక్కున కర్చీఫ్ తీసుకుని, గబుక్కున జేబులో పెట్టేసుకున్నాడు.
ఆయన భార్య గంభీరంగా చూస్తున్నది. అతన్ని కాదు. ముందు కుర్చీలో కూర్చున్న ఇంకో పెద్ద మనిషి బట్టతల ఎందుకు అంత నిగనిగలాడుతూ మెరుస్తున్నదా అని.
అతను ఒకే నిమిషం అక్కడ నుంచుని ఏదో మాట్లాడబోయి, వద్దనుకుని మేనేజర్ చూపులకి అందకుండా వెనక్కి ఎక్కడో దూరంగా వెళ్ళి సిగరెట్ అంటించాడు.
‘ఇప్పుడేమంటావ్?’ అన్నాడు జయరాం గర్వంగా.
మూతి ముడిచి ముచ్చటగా నవ్వింది ఇందిర, చుట్టుపక్కల్ని మరచిపోయి జయరాం కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ.
జయరాం ఆమె చేతి మీద చేయి వేశాడు.
ఎదురుగా వస్తున్న ఒకాయన్ని చూపిస్తూ అన్నాడు జయరాం. ‘ఆయన ఫలానా ఆఫీసర్. ఆయన ఏంచేస్తాడో తెలుసా? సరిగ్గా ఐదు నిమిషాలు తక్కువ అయిదింటికి ఆఫీసుకి వస్తాడు రోజూ. ఇంటికి బయల్దేరదామని ఫైళ్ళు సర్దబోతున్న వాళ్ళందరూ, మళ్ళీ ఫైళ్ళు ముందేసుకు కూర్చుంటారు. అంతే, రాత్రి ఎనిమిదింటికీ, ఒక్కోరోజు తొమ్మిదీ, పదీ కూడా అవుతుంది ఆయన కుర్చీలోనించీ లేచేసరికీ. మధ్యమధ్యలో ఆయన పిలుస్తుంటాడు కాబట్టి, అప్పటిదాకా వాళ్ళలా కూర్చోవలసిందే. భార్యని డాక్టరుకి చూపించాలకున్నా, ముద్దుగా పెరుగుతున్న పిల్లలతో కాస్త సమయం గడపాలనుకున్నా, బజారు నుంచీ సామానులు తేవలన్నా.. యిక గోవిందే!’
‘మరి ఆయన మాత్రం ఇంట్లో పనులు చూసుకోడా?’
‘ఆహాఁ! ఎందుకు చూసుకోడూ.. ఐదింటి దాకా ఆఫీసు జీపులో వెళ్ళి మరీ చూసుకుంటాడు. సరిగ్గా ఐదింటికి కొంచెం ముందుగా కావాలనే అలా వస్తాడు. అదో దరిద్రపు బుద్ధి ఆయనకి. అదీకాక ఇంటినిండా ఆఫీస్ వాళ్ళు యిచ్చిన నౌకర్లూ, చాకర్లూ. ఆయన బజారుకి పోవాలా.. ఇంటి వెచ్చాలు తేవాలా?’ కసిగా అన్నాడు జయరాం.
‘అదేం బుద్ధండీ.. అందరూ యింతేనా?’ అడిగింది ఇందిర.
‘అందరూ అని అనలేం ఇందూ. కాని చాలమంది ఇంతే! పైగా అంత పని చేసినా ఎప్పుడూ ఆయన పై ఆఫీసర్ల దగ్గర్నించి కంప్లైంట్లే పని జరగటం లేదని’
‘మరి వాళ్ళు రోజూ ఎనిమిదింటి దాకా..’
నవ్వాడు జయరాం. ‘అదంతే ఇందూ. బలవంతాన కూర్చోబెట్టి పని చేయిస్తే ఏం జరుగుతుంది?’ ఆయన్ని చూసే ఆయన క్రింది ఉద్యోగులు. యథా రాజ తథా ప్రజ!’ అన్నాడు.
ఇందిర కూడా నవ్వింది. ఆ నవ్వుని అలా దోసిట్లో దాచేసుకుందామనుకున్న జయరాం ఆగిపోయాడు.
‘ఇంకా తెర తీయరేం..’ అంటున్న ఇందిర కూడా చటుక్కున ఆగిపోయింది.
కారణం మరేం లేదు. అంత గంభీరంగా కూర్చున్న మేనేజరూ ఒక్కసారిగా పిల్లిగా అయిపోయాడు. వెంటనే లేచి నుంచున్నాడు. ఆయనతోబాటు ఆయన భార్య కూడా లేచి నుంచున్నది.
విచిత్రంగా చూసింది ఇందిర.
‘నమస్తే సార్. రండి’ మేనేజర్ గబగబా ఎదురువెళ్ళి, సన్నగా పొట్టిగా నల్లగా చింతమొద్దులా వున్న ఒకాయన్ని ఆహ్వానించాడు. ఆయన వెనకనే వస్తున్న ఆయన భార్యను, మేనేజర్ గారి పెళ్ళాం రిసీవ్ చేసుకుంది. మేనేజర్ అప్పటి దాకా తనూ, తన భార్యా కూర్చున్న కుర్చీల్లో, ఆఫీసర్ గారినీ, ఆయన భార్య గారినీ కూర్చోబెట్టి, తను చేతులు కట్టుకుని నుంచున్నాడు.
‘ఆయన వాళ్ళ ఆఫీసర్. అందుకే అంత వినయ విధేయతలు చూపిస్తున్నాడు’ అన్నాడు జయరాం ఇందిర చేతిని సున్నితంగా వత్తుతూ.
‘అది ఆఫీసులో ఎలాగూ తప్పదు. ఇక్కడ కూడా ఎందుకు’ అని అడుగుదామనుకుంది కానీ, అడగలేదు.
‘ఏమయ్యా, మా అమ్మాయి కాలేజీ సీటు సంగతి కనుక్కున్నావా?’ అడిగాడు ఆఫీసర్.
‘ఆయ్.. కనుక్కున్నానండీ. పెద్ద మొత్తమే డొనేషన్ కట్టాలన్నారండి. అదీ కట్టేశాను సార్’ గుర్రుగా చూస్తున్న తన భార్యను, గమనించనట్టుగా చూస్తూ అన్నాడు మేనేజర్.
ఆఫీసర్ థాంక్స్ చెప్పలేదు. చిరునవ్వు నవ్వలేదు. కళ్ళల్లో కృతజ్ఞతను చూపలేదు. ఆఫీసర్ హోదాలో హుందాగా కూర్చున్నాడు. కాసేపాగి ‘ఊఁ!’ అని మాత్రం అన్నాడు.
తెర లేచింది. సుభద్రా వెంకట్రామన్, పక్క వాయిద్యకారుల పరిచయాలు అయాక కచేరీ మొదలయింది.
‘వెనక్కి వెళ్ళి కూర్చోవయ్యా.. ఇక్కడ నుంచుంటావేం?’ కసురుకున్నాడు ఆఫీసర్.
‘ఆయ్’ అంటూ భార్యా సమేతంగా వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు మేనేజర్.
‘ఛీ! ఇదేం డిపార్టుమెంటండీ? వాళ్ళకి స్వాభిమానాలు అంటూ వుండవా! అంత చదువూ చదివి అలా ప్రవర్తిస్తారేం? కనీసం సాటి ఉద్యోగిని ఏమండీ అని మర్యాదగా కూడా పిలవరేం? అదేం సంస్కారం? అయినా ఈయన మాత్రం ఒక్కసారిగా అలా పిల్లిలా అయిపోతాడేం?’ అన్నది ఇందిర.
‘ఇక్కడ ఇంతే ఇందూ. అలా వుండకపోతే ఈ డిపార్టుమెంటులో వుండలేరు’ అన్నాడు జయరాం.
‘ఆఁ! వుండి మాత్రం ఏం లాభం? హాయిగా యింకోచోట చేరవచ్చు. మరీ యింత బాసింగ్ అయితే ఎలా అండీ. ఆఫీసుల్లో అయితే కొంత నయం. ఇలాటి సాంస్కృతిక కార్యాక్రమాల్లో కూడా అంతేనా? బుద్ధీ జ్ఞానం వుండొద్దూ!’
జయరాంకి ఏం చెప్పాలో తెలీక, తల వూపాడు.
‘మరి మీరూ ఇంతేనా?’ అడిగింది ఇందిర.
‘ఛ ఛ! చస్తే నేనటువంటి పనులు చేయను. నాకామాత్రం మానాభిమానాలు వున్నాయి. ఇంత చదువూ చదివి అంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తానా? నా క్రింద పనిచేసే వాళ్ళని నాతో సమానంగా గౌరవిస్తున్నాను. నా పైవాళ్ళకి ఎంత మర్యాద ఇవ్వాలో అంతా ఇస్తున్నాను. ఒకళ్ళ కోసం నా ఆశయాలకి సంకెళ్ళు వేయను. వేయలేను’ ఆమె కళ్ళల్లోకి ముద్దుగా చూస్తూ ముద్దగా అన్నాడు జయరాం.
ఆమె చిన్నగా నవ్వి గర్వంగా చూసింది జయరాంని.
ఆఫీసర్ గారి పెళ్ళాం ఎప్పుడు చూసిందో ఏమో, ఇందాకటి ఫలానా వుద్యోగిని చూసింది. చూసి, అతన్ని చూపించి సదరు ఆఫీసర్ భర్తగారితో ఏదో చెప్పింది. ఆయన ఎవరికో చెప్పి అతన్ని పిలిపించాడు.
‘బాయిలర్ బొగ్గు అయిపోయి మూడు రోజులయింది..‘ ఆవిడ పూర్తిగా చెప్పకముందే సుభద్రా వెంకట్రామన్ పాడుతున్న పాట పూర్తయింది. అంతా చప్పట్లు కొడుతున్నారు. ఆవిడ కూడా చటుక్కున ముఖం మీదకు నవ్వు తెచ్చుకుని చప్పట్లు కొడుతూ, ‘చాల బాగా పాడింది కదూ!’ అన్నది భర్తతో.
‘అవును చక్కటి కృతి పాడింది. కళ్యాణి రాగం ఈవిడ చాల బాగా పాడుతుంది కదోయ్ నరసింహం!’ అన్నాడాయన వెనక కూర్చున్న మేనేజరుతో.
‘ఎస్సార్ చాలా బాగా పాడింది.. పాడుతుంది’ అన్నాడు కునికిపాట్లు పడుతున్న మేనేజర్, రెండూ కళ్ళూ నులుముకుని అటెన్షన్లోకి వస్తూ.
మేనేజర్ భార్య మెల్లగా, ‘అది కళ్యాణి రాగం కాదండీ. కాంభోజి రాగం’ అంది తన సంగీత జ్ఞానం ఉపయోగించి.
‘నోరు మూసుకో.. అది కళ్యాణి రాగమే!’ అన్నాడు మేనేజర్ ఆవిడ చెవిలో.
ఆవిడిక మాట్లాడలేదు.
సుభద్రా వెంకట్రామన్ మరో కీర్తన అందుకుంది.
‘ఏమిటి అంటున్నాను. ఆఁ! బాయిలర్ బొగ్గు అయిపోయి మూడు రోజులయింది. రేపు ప్రొద్దున్నే తీసుకు రావాలి. తెలిసిందా.. ఎన్నాళ్ళని ఆగాలి?’ గట్టిగా అడిగిందావిడ, భర్త వేపు ఒకసారి చూసి.
‘అవును. ఎన్నాళ్ళని ఆగాలి? రేపు ప్రొద్దున్నే ఒక బస్తా వేయించు’ ఆర్డర్ వేశాడు ఆఫీసర్.
అతను మాడిపోయిన ముఖం మీద చిరునవ్వు పులుముకుని, ‘ఎస్సార్’ అని నమస్కారం చేసి, జేబులోని సిగరెట్ పెట్టె తడుముకుంటూ జనంలో డిసాల్వ్ అయిపోయాడు.
‘చూశావా. ఇదీ వరస. స్వంత పనులు చేయించుకోవటనికి వాళ్ళకి బుద్ధీ జ్ఞానం లేదనుకో, చేసే వాళ్ళకి అయినా వుండఖ్కర్లా..’ అన్నాడు జయరాం.
‘అవును. మన రక్తంలో ఇంగ్లీష్ వాళ్ళు బానిసత్వం నింపి మరీ వెళ్ళారు. వాళ్ళు దేశాన్ని వదిలి ఇన్నేళ్ళయినా అది వీళ్ళని వదలనంటున్నది. ఏం చేస్తారు పాపం!’ అదోరకంగా నవ్వింది ఇందిర.
‘వాళ్ళ గొప్పదనం నేర్చుకోలేకపోయినా, కనీసం ఇదన్నా వంటబట్టింది మనకి. థాంక్స్ టు ది ఇంగ్లీష్మన్! అన్నాడు జయరాం.
భర్త భుజం మీద తల వాల్చి అరమోడ్పు కళ్ళతో చూస్తూ, చెవులు రిక్కించి పాట వింటున్న ఇందిర, ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
జయరాం ఆమెను చటుక్కున విదిలించేసరికి, అతన్ని తేరిపార జూడబోయింది. కానీ అతను అక్కడ లేడు. పక్కనే వున్న తలుపు వేపు చూసింది. ఒక చిన్న పిల్లవాడిని చంకనెత్తుకుని, నవ్వుతూ, ఒక లావుపాటి బట్టతల ఆయనకు దారి చూపిస్తూ వస్తున్నాడు జయరాం.
ఆ లావుపాటి బట్టతల శాల్తీ అంటున్నాడు, ‘రేప్రొద్దున్న ఒక్కసారి ఇంటికి రావయ్యా. మా ఆవిడ అవుటాఫ్ డోర్స్. హోటల్నించీ కారియర్.. అదీ..’
తర్వాత ఇందిరకేమీ వినపడలేదు.
తల వూపుతున్న జయరాం కనపడ్డాడు.