స్పందన
నిజం చెప్పొద్దూ, నాకు మొదటినించీ మూఢనమ్మకాలంటే పడదు. రకరకాల మూఢనమ్మకాలు అన్ని మతాల్లోనూ, దేశాల్లోనూ కుసింత విరివిగానే వున్నాయి. అవన్నీ ‘భయం’ అనే ఇంధనంతో ముడిపెట్టి, ఎవరికి వారు తమ ప్రయోజనాల కోసం మనల్ని భయపెట్టటానికి కనిపెట్టారనిపించేది నాకు. ‘భయాన్ని చూసి మనం భయపడితే అది మనల్ని ఇంకా భయపెడుతుంది’ అని నేను ఒకటి రెండు కథల్లోనూ, వ్యాసాల్లోనూ వ్రాశాను కూడా. ఆరోజుల్లో నేను ఎన్నో మూఢనమ్మకాల మీద కథలు వ్రాసి పాఠకుల అభినందనలూ అందుకున్నాను, అంతకన్నా ఎక్కువగా ఇంటా బయటా నానా చివాట్లూ తిన్నాను కూడాను. నేను చూసిన అలాంటి ఒక మూఢ సంఘటన ఆధారంగా వ్రాసిన కథ ఇది.
(ఈ కథ ‘యువ’ మాసపత్రిక జూన్, 1978 సంచికలో ప్రచురింపబడింది)
“మనవాడిది గొప్ప యోగం అని చెప్పారు” అన్నది వసంత శ్రీరాంతో.
“ఆ యోగం కోసం ఒక యజ్ఙం చేయాలని కూడా అన్నారా?” నవ్వుతూ అడిగాడు శ్రీరాం.
“నీకు బొత్తిగా భయమూ, భక్తీ లేవురా. పెద్దవాడివి నువ్వే అలా మాట్లాడితే, నీ చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ కూడా నీలాగే తయారవుతారు” అన్నది జానకమ్మ.
“అన్నయ్య సెలవులకు వచ్చింది నువ్వు పెట్టే చివాట్లు తినటానికి కాదమ్మా. నువ్వు పెట్టే మంచి భోజనం తినటానికి, సరదాగా గడపటానికి” అంది వసంత నవ్వుతూ.
“తెలుసులేవే! మొన్నేం జరిగిందో తెలుసా నాయనా..“ జానకమ్మ చెప్పబోయింది.
“నే చెబుతానుండవే అమ్మా! మరే అన్నయ్యా, మొన్న రాజాకి పెద్ద గండం తప్పింది” ఆనాడు జరిగిందంతా గుర్తుకు వచ్చిందేమో, వసంత ముఖంలో భయం స్పష్టంగా కనపడింది.
మూడేళ్ళ రాజాను ఒడిలోకి తీసుకుంటూ, “ఏం జరిగిందో త్వరగా చెప్పు, నన్ను చంపకు నీ సస్పెన్సుతో” అన్నాడు శ్రీరాం.
“మొన్న మధ్యాహ్నం నాన్నేమో పొలానికి వెళ్ళాడు. అమ్మేమో అన్నాలు తిన్న తర్వాత మధ్య గదిలో నడుం వాల్చింది. నేనూ రాధా ముందు గదిలో కారమ్స్ ఆడుకుంటున్నాం. మధ్యాహ్నం రెండు గంటలయింది అనుకుంటాను టైమ్. రాధ మంచి నీళ్ళు కావాలంటే లోపలకు వచ్చి వరండాలోకి తొంగి చూసేసరికీ గుండెలదిరిపోయాయి. రాజా వరండా వెనకాల వున్న సన్నజాజి పందిరి క్రింద కూర్చుని వున్నాడు. వాడి చేతిలో పొడుగాటి నల్లని త్రాచుపాము. నవ్వుతూ దానితో ఆడుకుంటున్నాడు. అది చూడగానే నాకు భయం వేసింది. నోట మాట రాలేదు. ఇంతలో తేరుకుని గబగబా వెళ్ళి అమ్మని, రాధని పిలుచుకు వచ్చాను. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? చూస్తూ నుంచున్నారు. రాధ తన అన్నయ్యను కేకేస్తానని పరుగెత్తుకు వెళ్ళింది. అప్పుడేం జరిగిందో తెలుసా?” చక్రాల్లాంటి కళ్ళని తిప్పుతూ చెబుతున్నది వసంత.
“నే చెబుతానుండవే వసంతా! అప్పుడు నాకూ ఏం చేయాలో తెలియలేదురా. నల్లటి నాగుపాము. పడగ కూడా విప్పింది. మనవాడు దాన్ని పట్టుకుని నవ్వుతూ వున్నాడు. నేను వెంటనే దణ్ణం పెట్టుకుని, ‘సుబ్రమణ్య స్వామీ నా పిల్లవాడిని నువ్వే కాపాడు. నీ పుట్టలో పాలు పోశాకనే వాడు పుట్టాడు. అందులోనూ నాగులచవితి నాడు పుట్టాడు కనుకనే నాగరాజు అని పేరు కూడా పెట్టాము. నువ్వే వాడిని కాపాడాలి స్వామీ’ అని మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేశాను. నా ప్రార్ధన ఆలకించి మన రాజా చేతుల్లో నించీ దిగి మెల్లగా సన్నజాజి గుబురులోకి వెళ్ళిపోయాడు” అని ఇంకా చెబుతున్న జానకమ్మ మాటలకు అడ్డం వచ్చింది వసంత.
“ఆరోజు సాయంత్రం నాన్న పొలం నించీ రాగానే, అమ్మ నాన్నకి అంతా చెప్పింది. ఆరోజే నాన్న సుబ్రమణ్యం స్వామి ఆలయంలో పూజా అదీ చేయించి చలిమిడి పంచిపెట్టించాడు. అక్కడ పాముపుట్టలో ఆవుపాలు పోసి అర్చన చేయించాడు. అప్పటికిగానీ నాన్నకీ, అమ్మకీ తృప్తి తీరలేదు. గుళ్ళో పూజారిగారు, ఆ నాగరాజే స్వయంగా మన నాగరాజుని ఆశీర్వదించాడనీ, మన రాజుకి గొప్ప యోగం వుందనీ, ఆ రాజయోగాన్ని ఇక ఎవరూ ఆపలేరనీ చెప్పాడు!”
అంతా విని గాఢంగా నిట్టూర్చాడు శ్రీరాం.
“ఎంత గండం తప్పింది” అన్నాడు రాజాను దగ్గరకు తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంటూ.
“ఇది జరిగి మూడు రోజులయిందిరా” అన్నాడు రాఘవయ్య లంక పుగాకు చుట్ట చుడుతూ.
“మరి ఆ సన్నజాజి పొదలో వెతికారా? ఆ పాము బహుశా యింకా అక్కడే వుందేమో. దాన్ని పట్టుకుని చంపకపోతే, మళ్ళీ బయటికి వచ్చి ఎవర్నో ఒకరిని కాటేస్తుంది” అన్నాడు శ్రీరాం.
జానకమ్మ చెంపలు వాయించుకుంది. “అలాటి అపచారం మాటలు అనకు. సాక్షాత్తూ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆ పాము. అది మామూలు పామే అయితే, మనవాడిని ఆరోజే కరిచేది. నల్లత్రాచుని చంపితే కళ్ళు పోతాయి. దైవాంశ వున్న పాములు అవి. వాటి మీద భక్తిగా వుండి గౌరవిస్తే మన జోలికి రావు”
ప్ర్రక్కనేవున్న పాలేరు అప్పన్న అన్నాడు, “అది నిజమే బాబూ! మా యింటి కాడ సత్తిగాడు నల్లతాచుని అలాగే చంపితే వెంటనే ఆడి రెండు కళ్ళూ పోయాయి. మా గూడెంలో వాళ్ళంతా పాము శవాన్ని ఊరేగించి, మంత్రాలతో దహనం చేశాం బాబూ. అప్పుడుగానీ సత్తిగాడి పాపానికి ప్రాయశ్చిత్తం కాలే!”
“అంటే అప్పుడు అతని పాపం పరిష్కారం అయి, పోయిన కళ్ళు వచ్చాయా?” అడిగాడు శ్రీరాం.
“పోయిన కళ్ళు మళ్ళీ రాలేదు బాబూ. కానీ అతని పాపం పరిష్కారమయింది” అన్నాడు పాలేరు అప్పన్న అమాయకంగా.
“అది సరేగానీ, మధ్యాహ్నం ఖాళీగా వుంటే ఒకసారి ఇలారా. ఆ సన్నజాజి పందిరి క్రిందే లోతుగా గోతులు వున్నాయి. ఆ పాము అక్కడే వుంటున్నదేమోనని నా అనుమానం. అది తవ్వి చూద్దాం. అలాటి విషకీటకాలను పిల్లలు తిరిగే యింట్లో వుంచటం చాల ప్రమాదం”
“ఆ పాముని మాత్రం ఏమీ చేయకు నాయనా. అది మామూలు పాము కాదని చెబుతున్నానా? ఆ పడగా అదీ.. తల మీద మణి కూడా వున్నట్టుంది. దైవాంశ వున్న పాము అది..”. ఇంకా ఏదో చెబుతున్నది జానకమ్మ.
“అమ్మా, పాముల గురించి నాకు బాగా తెలుసు. మద్రాస్ యూనివర్సిటీలో నేను చేస్తున్న రీసెర్చిలో పాములు కూడా ఒక భాగం. ఆడయారులోని స్నేక్ పార్క్ డైరెక్టర్ రోములస్ విటేకర్ సహాయం కూడా నాకు వుంది. పాములు దైవాంశ కలవీ కాదు, యింకేమీ కాదు. పాముల తలల మీద మణులు వుండటం అబద్ధం అనేది నిరూపింపబడిన సత్యం. అంతేకాదు, మన సినిమాల్లో చూపించినట్టు కాటేసి విషం కక్కిన పాములు, నమస్కారం పెట్టగానే విషం వెనక్కి లాగేసుకోవటం అన్నది ఎక్కడా జరగదు. ఇంతవరకూ ఏ పామూ అలా చేయలేదు. అలాగే పుట్టలో పోసిన పాలు ఇంకి పోతాయేగానీ, పాము త్రాగదు. సర్పయాగం చేసినంత మాత్రాన పిల్లలు పుట్టరు. ఇవన్నీ మూఢ నమ్మకాలు”
“చదవేస్తే వున్న మతి పోయిందట. వీడిని పైచదువులకి పంపించవద్దంటే విన్నారు కాదు. ఇప్పుడు చూడండి భయం, భక్తీ లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో” జానకమ్మ రాఘవయ్యతో నిష్టూరంగా అన్నది.
“మీరేమైనా అనండి. మీ మూఢనమ్మకాలతో ఆలాటి విషకీటకాలను యింట్లో వుంచటం మంచిది కాదు. సాయంత్రంలోగా ఆ పందిరి క్రింద తవ్వదలుచుకున్నాను. పాము కనపడిందో చంపటమో, పట్టుకుపోవటమో చేస్తాను. లేదా పాము లేదని రూఢి చేసుకుని, ఆ గుంటలు పూడ్చివేస్తాను” అంటూ లోపలికి వెళ్ళిపోయాడు శ్రీరాం.
అప్పటి దాకా ఈ కథ చదివిన రమేష్ నిట్టూర్చి తల ఎత్తాడు.
“ఓ.కే., సూర్యం. ఈ కథ ఇప్పటిదాకా బాగానే వ్రాశావు. మరి దీన్నెలా ముగిద్దామనుకుంటున్నావు?”
కిటికీ దగ్గర రెండు జేబుల్లోనూ చేతులు పెట్టుకుని నుంచున్న సూర్యం వెనక్కి తిరిగాడు.
“రమేష్, నువ్వు కూడా రచయితవే కదా. నువ్వు చెప్పు ఈ కథని నువ్వు వ్రాస్తే ఎలా ముగిస్తావో”
రమేష్ ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు. “సూర్యం, ఏ రచయిత అయినా ఇలాంటి కథలను ఇక్కడి దాకా సులభంగానే వ్రాసుకుపోతాడు. కానీ యిలాటి కథలకు రచయిత యిచ్చే ముగింపు సమాజం మీద అంతో యింతో ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఎంత వినోదంగా వ్రాసినా, ఉబుసుపోకకు వ్రాసినా, విజ్ఙానం కోసం వ్రాసినా, రచయిత సమాజానికి న్యాయంగానీ, అన్యాయంగానీ కథల ముగింపుల్లోనే చేస్తాడు. ఈ కథనే తీసుకుందాం. రచయిత మూఢ నమ్మకాల పుట్ట అనుకుందాం. అలాటి వాడు ఈ కథని ఎలా ముగింపు చేస్తాడు? ఈ కథని మూడు రకాలుగా ఆ మూఢ రచయిత ముగించే అవకాశం వుంది. ఒకటి, శ్రీరాంకి పాము దొరకలేదు. ‘అలాటి పాపానికి ఒడికట్టిన శ్రీరాంకి దైవాంశగల ఆ పాము ఎలా కనపడుతుంది’ అన్నది జానకమ్మ. తర్వాత రాజు పెద్దవాడై ఐ.ఏ.ఎస్. పరీక్షపాసయి, కలెక్టరయాడు. ‘మంచి యోగం వుంది రాజుకి’ అన్నమాటని నిరూపించాడు. ఇది ఒక ముగింపు. లేదా శ్రీరాంకి పాము దొరికింది. కర్రతో కొట్టి చంపేశాడు. శ్రీరాంకి కళ్ళు పోయాయి. పాలేరు చెప్పినప్పుడు ఎగతాళి చేసిన శ్రీరాం తర్వాత పశ్చాత్తాప పడ్డాడు. సుబ్రహ్మణ్యస్వామికి దణ్ణం పెట్టుకుని భోరుమని ఏడ్చాడు. ఇది యింకో ముగింపు. ఇక మూడో ముగింపు. అక్కడ తవ్వుతున్నప్పుడు పాము బుసలు కొడుతూ పైకి లేచి శ్రీరాంని కాటు వేసింది. ఆలా అతని పాపానికి ప్రాయశ్చిత్తమయింది” ఆగాడు రమేష్.
“అవును రమేష్. రచయిత ఇలా వ్రాస్తే సమాజం ముందుకు పోకపోగా, రోజురోజుకీ వెనకపడుతూనే వుంటుంది. కానీ అసలు జరిగిన కథ ఏమిటో తెలుసా?” అడిగాడు సూర్యం.
“ఏమిటి, ఈ కథ నిజంగా జరిగిందా?” అడిగాడు రమేష్.
సూర్యం ఒక్క క్షణం ఆగి, చెప్పటం ప్రారంభించాడు.
“అవును రమేష్. ఈ కథ నిజంగా జరిగినదే. కథలాగానే చెబుతాను విను. ఆరోజు భోజనం చేసిన తర్వాత పందిరి దగ్గర తవ్వుదామని శ్రీరాం నిశ్చయించుకున్నాడు. స్నానం చేసి ముందుగదిలో తల దువ్వుకుంటున్న శ్రీరాంకి పెరట్లో నించీ పెద్ద గావుకేక వినపడింది. చకచకా పెరట్లోకి వచ్చిన శ్రీరాం ఆ దృశ్యం చూసి నిర్హాంతపోయాడు. నోట మాట రాలేదు. సన్నజాజి పందిరి దగ్గర ఆడుకుంటున్న మూడేళ్ళ ముద్దుల రాజు క్రింద పడివున్నాడు. గిలగిలా కొట్టుకుంటున్నాడు. కొంచెం దూరంగా సరసరా పాకుతూ వెడుతున్నది నల్లని త్రాచుపాము.
అన్నిటికన్నా శ్రీరాంని ఆకర్షించింది, ఆ పాముకి భక్తితో నమస్కారం చేస్తూ స్థాణువులా నుంచున్న జానకమ్మ!
ఆమె ప్రక్కనే చేతిలో కర్ర వున్నా పాము మీద దెబ్బ వేయటానికి భయపడి నుంచున్న పాలేరు అప్పన్న!
తర్వాత వాళ్ళు చెప్పినదాన్నిబట్టి తెలిసిందేమిటంటే, రాజా అక్కడ ఆడుకుంటున్నప్పుడు, పాము వాడి దగ్గరకు రావటం వాళ్ళు చూస్తూనే వున్నారు. రాజాని దూరంగా తీసుకుపోలేదు సరికదా, కనీసం పాము మీద ఒక్క దెబ్బ కూడా వేయలేదు. పైగా ‘నాగరాజస్వామీ’, ‘సుబ్రహ్మణ్యస్వామీ’ అంటూ దణ్ణాలు పెడుతూ నుంచున్నారు. ఆ మూఢులు అమాయకుడైన పసివాడిని పొట్టనపెట్టుకున్నారు” సూర్యం కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
“సూర్యం, ఎందుకలా ఆవేశపడతావ్. అసలిది ఎక్కడ జరిగింది?” రమేష్ సూర్యం భుజం మీద చేయి వేస్తూ అడిగాడు.
“ఎక్కడో కాదు. మా ఇంట్లోనే జరిగింది. ఆ కథలో శ్రీరాం ఎవరో కాదు, నేనే. ఆ కథలో రాజా ఎవరో తెలుసా? నేనూ, మా చెల్లెలు వసంత పుట్టిన తర్వాత ఎన్నో ఏళ్ళకు పుట్టిన.. నేను అమితంగా ప్రేమించిన నా మూడేళ్ల ముద్దుల తమ్ముడు రాజా. అమాయకపు పసివాడు. వాళ్ళ మూఢ నమ్మకాలకు అన్యాయంగా ఆహుతి అయిపోయాడు. అదే రమేష్, వాడికి పట్టిన యోగం. రాజయోగం!” విలపిస్తూ చేతుల్లో ముఖం దాచుకున్నాడు సూర్యం.