Menu Close
Kadambam Page Title
నలిగే క్షణాలు
గవిడి శ్రీనివాస్

గూడు విడిచిన పక్షి మాదిరి
తపనపడ్డ క్షణాలు నలిగిపోతున్నాయి.

తుఫాను వీచినట్లు
ఎడారులు ఎత్తిపోసినట్లు
ఇంటికి దూరమైన పిల్లలు
హాస్టల్ లో వేలాడుతున్నారు.

గుండెను తడిపే పలకరింపు కోసం
దూర భారాన్ని దింపుకోవటం కోసం
కన్నీటి తీగలు చెవిలో మోగుతున్నాయి.

కొన్ని చేరువ కావలసినపుడు
కన్నీటి చినుకులూ కురుస్తాయి.

ఈ కాసింత కాలాన్ని
ఓపిక మీదే ఆరేయాలి

కన్నవారి కలలు పిల్లల్లో
పిల్లల కలలు ఆప్యాయతల్లో
వాలుతుంటాయి.

రాత్రులు కన్నీటి నదుల్లో తడిపేస్తే
మీ జ్ఞాపకాలు కలవరపెడతాయి.

మళ్ళీ తెల్లవారు కోసం
రాత్రుల్ని చించుకోవాలి.

పేగుబంధమంటే ఏమని చెప్పాలి
తీగలు లేకుండానే
దూరాల్ని సైతం కుదిపేది
మనసుని సైతం కూల్చేదీ..........

అయినా చిట్టి తల్లీ
కాస్తా చదువుకో వచ్చేస్తా....

సమయాల్ని నిద్రలేపి
అనురాగపు తీరాల్ని మీ దరికే
తీసుకొచ్చేస్తా...

Posted in November 2021, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *