Menu Close
నీలి జాకట్టు
-- డా.వి.వి.బి.రామారావు

మరుసటి శనివారం సాయంత్ర్రం తాయారు వచ్చింది. అహల్య క్రింద నర్సింగ్ హోం లో ఏదో పని చూస్తోంది.

“హలో డాక్టర్ గారూ! నర్సమ్మ గారు లేరా? అని కొంటెగా అడిగింది. మొహం ఎరుపెక్కకుండా చిన్న చిరునవ్వుతో “ఓహో చెల్లాయా! ఇప్పుడే క్రిందకు వెళ్ళింది ఏం పిలవనా?”

“ఆఁ ఊరకే అడిగాను” తాయారు చిన్నబోయింది. సాయంత్రం ముగ్గురూ బీచికి పోయి ఎనిమిదింటికి వరకు కబుర్లు చెబుతూ కూర్చున్నారు. అహల్యకు తాయారు మాట ఏమీ నచ్చలేదు. తాను కరుణ కనికరం మీద బ్రతుకుతున్నదన్న మాట వాస్తవమే. కాని కరుణ తనకు అన్నయ్య. తన మీద గొప్ప గౌరవం- తన వ్యక్తిత్వాన్ని గౌరవించి తన బ్రతుక్కి కొత్త మలుపు చూపిన మహనీయుడు, డాక్టర్ సంజీవ రావు గారు. తన కథ గిర్రున తిరిగింది కళ్ళముందు. తను ఇంటర్ చదువుతుండగా పెళ్లి చేశారు. హఠాత్తుగా ఆయన మరణం – చీకటి. అతి సామాన్య కుటుంబం. డాక్టర్ సంజీవరావు గారి గుండె చలవ – తనను మళ్ళీ మనిషిని చేశాడు. కరుణ అంటే తనకి అమితమైన ప్రేమ. కరుణ తనని చెల్లెలుగా ఎంతో అభిమానిస్తాడు. కరుణ మీద తనకేమీ హక్కు లేదు. కానీ ఈ అమ్మాయి తనకేం నచ్చలేదు. లోపల బాధగా ఉంది. కరుణ ఒకవేళ ఆ అమ్మాయిని...మరి ఆలోచించలేకపోయింది. బయటకి సరదాగా మాట్లాడుతూ కాలక్షేపం చేసింది. ఆదివారం రోజువారి పనితో సరిపోయింది. సాయంత్రం అంతా తిరగడానికి బయలుదేరడానికి రెడీ అయ్యారు. “భీమిలి వెళదా” మన్నాడు కరుణ. అహల్య సింపుల్ గా తయారయింది. చిన్న తిలకం బొట్టు పెట్టుకుంది. ఆమె వితంతువని ఎవరికీ తెలియదు. తాయారు చాలా ఎలాబోరేట్ గా ఒక గంట డ్రెస్ చేసుకుంది. కరుణ, అహల్య ఇవతల వరండాలో కూర్చున్నారు. మహలక్షమ్మ గారు అరవిందుని జీవిత చరిత్ర మీద మనస్సు లగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ నిట్టూర్చింది.

ఇంతలో తాయారు గది బయటకు వచ్చింది. నీలి చీర, చక్కటి మేచింగ్ బ్లౌజు, అహల్య కరుణ వేపు చూసింది. అతని కళ్ళు ఆమె బ్లౌజు మీదనే ఉన్నాయి. ఏదో నిశ్శబ్దం. అహల్య చాలా డెలికేట్ గా ఫీల్ అయ్యి “చీర, బ్లౌజ్ చక్కగా మేచ్ అయ్యాయి, మీకు మంచి టేస్ట్ ఉంది” అని తాయారుని పొగిడింది. ఇంతలో ఫోన్ మోగింది. కరుణ వెళ్లి ఫోన్ తీసేడు.

“యస్. యస్. కరునాకర్రావ్ హియర్. యస్ ప్లీజ్ పిలవండి. ఆ అవునండి, ఏమిటి విశేషం? ఓహో వెరీ గ్లాడ్! వెరీ గ్లాడ్! హోప్ ఎవ్విరితింగ్ ఈజ్ ఆల్రైట్. ఫైన్ ఏమంటారు? అహల్య ఇక్కడే ఉంది. వన్ మినిట్” మౌత్ పీస్ మీద చెయ్యి పెట్టి “అహల్యా శాంతికి డెలివరీ టైం అట. విఠల్ రావు గారు ఫోన్ చేశారు. డాక్టర్ రెడ్డి డెలివరీ కి అటెండ్ అవుతుందట. అంతా రెడీ గా ఉన్నారు. శాంతి నీకు ఫోన్ చెయ్యమందిట, నీలాంటి స్నేహితురాలు పక్కనుంటే తనకు ధైర్యమని మరీ మరీ చెప్పమందిట. నీవు వస్తానంటే కారు పంపుతామన్నారు విఠల్ రావు గారు.”

“శాంతికి డెలివరీ టైమా? నన్ను ప్రత్యేకంగా రామ్మందా? అన్నాయ్, నే వెళ్తా. మీ ప్రోగ్రాం మార్చుకోక భీమిలి వెళ్లి రండి. డెలివరీ అయిన ఓ గంటలో నీనింటికి వచ్చేస్తా.”

“విఠల్ రావు గారు అహల్య వస్తానన్నది. కానీ కారు మాత్రం పంపకండి. నేనెలాగూ బయలుదేరుతున్నాను. అహల్యను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను” అని కరుణ విసురుగా ఫోన్ పెట్టేశాడు .

“సరే చెల్లాయ్ పద. అక్కడ హడావిడిలో నేను మాత్రం లోపలి రాను” అన్నాడు కరుణ. అహల్య ముందు, వెనుక తాయారు కరుణ మేడ దిగుతుంటే మహలక్షమ్మ బోల్డు ముచ్చట పడింది.

&&&&

కారులో అహల్యను డ్రాప్ చేసిన తరువాత కరుణ, తాయారు మౌనంగా కూర్చున్నారు. కరుణ బుర్రలో ఆలోచనలు తను నడిపే కారు కంటే వేగంగా పరిగెడుతున్నాయి.

“ఏం తాయారు! ఎలా ఉంది మీ అక్క. నే ఉత్తరాలు కూడా రాయడం మానేశాను.”

“అక్క ఈ మధ్య ఎదో దిగులుగా ఉంటోంది డాక్టర్! ఆమె ఫారిన్ పిచ్చి పూర్తిగా వదిలిపోయింది. ఇప్పుడిద్దరు పిల్లలు. అంత స్లిమ్ గా ఉండే అక్కని ఇప్పుడెవరూ పోల్చుకోలేరు. బాగా లావెక్కిపోయింది. కొద్దిగా బ్లడ్ ప్రెషర్ ట్రబుల్ కూడా ప్రారంభం అయిందట. కనీసం తన డజను పాత జాకెట్లు సరికొత్త కండీషన్ లోవి మొన్న నే వెళ్ళినప్పుడు నా సూట్ కేసు లో పెట్టింది.” బ్లౌజు మాట వినేసరికి మొహం పక్కకి తిప్పి తాయారు వంక చూసేడు కరుణ. ఇప్పుడతని అనుమానం తొలగిపోయింది.

“ఈ బ్లౌజు పదేళ్ళ క్రిందటిదంటే నమ్ముతారా?”

“ఫైన్, చాలా బాగుంది. నీవు విశాఖకు వస్తున్నట్లు పంకజకు తెలుసా?”

“ఓ! తెలియకేం. ఇక్కడికి వచ్చే ముందే కదా నే బొంబాయి వెళ్ళా.” కరుణ మోహంలో అతిచిన్న చిరునవ్వు వెలిగింది.

“ఇదిగో గంట స్థంభం.” అన్నాడు.

సెంట్ ఏన్స్ కాన్వెంట్ వెనుక బీచ్ లో కూచుని ఇద్దరూ మౌనంగా చాలా సేపు గడిపారు. ఏం మాట్లాడాలో ఇద్దరికీ తెలియలేదు. కరుణకి తాయారుని పంకజం గురించి వేయి ప్రశ్నలు అడగాలని ఉంది. కాని ఎలా అడగాలో తెలియడం లేదు. తను వేసిన ప్రశ్నలకు తాయారిచ్చిన సమాధానం మాత్రం అతనికెంతో తృప్తినిచ్చింది. కొంచెం సేపు ఏవో సినిమాల గురించి విశాఖపట్నంలో పెరుగుతున్న ప్రజానీకం గురించి సమస్యలు గురించి ఇద్దరూ మాటాడుకున్నారు. తాయారు మనసులో మరీ బాధగా ఉంది. ఈ సాయంత్రం తన అదృష్టాన్ని మెచ్చుకొని ఏదో సాధించగలననుకొన్నది. కాని తనకెప్పుడూ ఎదురయ్యే ఫెల్యూర్ మళ్ళీ ఎదురైంది. మరికొంతసేపు పోయాక ఇద్దరి గుండెలూ బరువెక్కాయి. మరి కూచోలేక లేచారు. అలా కాసేపు ఇసుకలో తిరిగి మళ్ళీ కారు దగ్గరకు వచ్చారు. కారు చూసి మళ్ళీ కరుణకు ప్రాణం వచ్చింది. రోడ్డు వైపే దృష్టి పెట్టి ఓ అరగంటలో ఇల్లు చేరారు. భోజనాలు చేసి అంతా ఇవతల వరండాలో కూర్చున్నారు. మహలక్షమ్మ పంకజం పిల్లల గురించి తాయారుని బోల్డు ప్రశ్నలు వేస్తూంది. కరుణ పరాకుగా ఏదో మెడికల్ జర్నల్ పేజీలు తిరగేస్తున్నాడు. అహల్య వచ్చింది చాటంత మొహంతో.

“అన్నాయ్! శాంతికి పండంటి మగబిడ్డడు. డాక్టర్ రెడ్డి సిజేరియన్ చేసి తీసింది. బాబు పదకొండు పౌండ్లు ఉండవచ్చు. వెయ్ చేస్తానంటే విఠల్ రావు గారి మొహం ఎర్రబడింది.” అని గట్టిగా నవ్వింది. కరుణాకరం నవ్వలేదు. అహల్య చిత్రంగా చూసింది. ప్రజలలో ఇలాంటి ప్రవర్తనలు చూసి నవ్వుకోవడం వారిద్దరికీ అలవాటే. అహల్యకి కరుణ సీరియస్ నెస్ ఎంత ప్రయత్నించినా అర్థం కాలేదు. సాధారణంగా కరుణ తనతో అని విషయాలు చెప్తాడు. తను మద్రాసులో ట్రైనింగ్ అవుతున్న రోజుల్లో కూడా కరుణ తనను ఈక్వల్ గానూ, చెల్లెలి గాను చూశాడు. ఈ అమ్మాయి ఎవరో, కరుణ వింత ప్రవర్తన ఏమిటో అహల్యకి అర్థం అవడం లేదు.

మరుసటి రోజు తాయారు హాస్టల్ కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆదివారం మహలక్షమ్మ గారు కారు పంపినా రాలేదు. ఒకసారి సమ్మర్ కోర్సు వాళ్ళతో ఎక్సర్షన్ అని, మరో ఆదివారం ఏదో అసైన్మెంట్ మీద వర్క్ చేస్తున్నానని కబురంపింది తాయారు. వెళ్తున్నానని చెప్పడానికి మాత్రం వచ్చి కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయింది. మహలక్షమ్మ గారు అమ్మాయిని ఆదరించి చీర, బ్లౌసే తెప్పించి ఇచ్చింది. అహల్యకు ఇదేం అర్థం కాలేదు.

ఆ రోజు ఆదివారం. తాయారు వెళ్ళిపోయి వారం కావస్తుంది. సాయంకాలం కరుణ తన గదిలో బట్టలు వేసుకుంటున్నాడు. ఇవతల వరండాలో ఒక మూల కూచొని అహల్య క్రిస్టియన్ బెర్నార్డ్ ‘వన్ లైఫ్’ చదువు కుంటూంది. వాష్ కాన్ స్కీ కి కొత్త గుండె వేసిన కొన్ని రోజుల తరువాత ఆస్పత్రి లోని ఘట్టం చదువుతోంది. ఆస్పత్రిలో స్టాఫ్ అంతా పనిచేసి చేసి అలిసిపోయారు. డాక్టర్ సిస్టర్ పాసేన్ డీర్ కి రెండు రాత్రులు ఆఫ్ ఇచ్చాడు. కాని ఒక రాత్రి తరువాత సిస్టర్ పేషెంట్ ని చూడకుండా ఉండలేక ఆస్పత్రికి వచ్చింది. ఏం కర్తవ్య నిర్వహణ? చావుని గెలవడానికి ఏమి కృషి, ఏం ఆరాటం? బార్నార్డ్ విషయంలో తనకూ భాగముంది. ఆ సిస్టర్ జీవితం ఊహించుకొని తోటి మనిషి సేవకి అంకితం చేద్దామని అనుకుంటోంది అహల్య. పుస్తకం చదువుతూ చదువుతూ బెర్నార్డ్ మీంచి కరుణ వైపు పోయింది ఊహ. ఎప్పుడూ సరదాగా ఉండేవాడు. కొన్ని వారాలుగా ముభావంగా ఎందుకుంటున్నాడు? తాయారు సడన్ గా ఎందుకు రావడం మానేసింది? కరుణని చూస్తె ఏదో బాధగా ఉంది.

“చెల్లాయ్” పిలిచాడు కరుణ.

ఈ సమయంలో తనతో ఏం పనా అని ఆలోచిస్తూ “ఏం అన్నాయ్” అంది అహల్య.

“ఏమో ఊసుపోవడం లేదు. క్లబ్ కి వెళ్లాలని అనిపించడం లేదు. సినిమాకు పోదాం వస్తావా?” అన్నాడు.

“సరే” అంటూ లేచింది అహల్య.

సినిమా హాల్లో జనం కిట కిట లాడుతున్నారు. సినిమా అవుతున్నంత సేపు మెల్ల ఏదో కరుణ రన్నింగ్ కామెంటరీ ఇచ్చేవాడే. ఇవాళ మౌనంగా కూర్చున్నాడు. ఏదో వింతగా ఉంది. కొంచెం సేపు పోయాక “ఏం అన్నాయ్! సినిమా బాగా లేదా? ఇంటికి పోదామా? అంది అహల్య.

ఇద్దరూ బయటకు వచ్చేరు. కారు బయటకు తీసుకొని రోడ్డు మీదకు వచ్చిన తరువాత “ఇప్పుడిప్పుడే ఆకలి కావడం లేదు. ఇంటి కెళితే అమ్మ భోజనం చేయమంటుంది. కాసేపు బీచి లో కూర్చుందాం” అన్నాడు.

ఇసుకలో ఇద్దరూ కూర్చున్నారు. కరుణ పరాగ్గా ఏదో ఆలోచిస్తున్నాడు. అహల్యకు కరుణ ఏదైనా మాట్లాడితే బాగుండుననిపించింది. చూసి చూసి తనే అడిగింది.

“తాయారు గురించి నీ అభిప్రాయం?” ప్రశ్న పూర్తిగా అడిగిన తరువాత ఎందుకు అడిగానా అని బాధపడింది.

“పంకజం చాలా తెలివైంది.”

తాయారు గురించి అడిగితే పంకజం గురించి చెప్తాడేం అనుకుంది అహల్య. కానీ వెంటనే అర్థమైంది. అయితే కరుణ పంకజం గురించి ఆలోచిస్తున్నాడన్నమాట.

“పంకజం ఎవరు?”

“తాయారు అక్క. నా క్లాస్ మేట్. మేం ఇద్దరం చాలా గాఢ స్నేహితులం. మా ప్రేమాయణం ఊరంతా తెలిసిందే. నాన్నగారు చూసీ చూడనట్టు ఊరకుండేవారు. పంకజం సర్జరీ ప్రొఫెసర్ కూతురు. నాన్నగారు ఆయన చిన్ననాటి స్నేహితులు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. కాలేజీ రోజుల్లో పంకజం చాలా చలాకీగా ఉండేది. హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు మా పరిచయం కొంచెం చిక్కబడింది. ఫ్యామిలీ ప్లానింగ్ సెమినార్ మా హౌస్ సర్జన్సీ చివరి రోజుల్లో హైదరాబాద్ లో జరిగింది. కుటుంబ నియంత్రణ ప్రభుత్వ విధానంగా మన దేశంలో వస్తూన్న కొత్త రోజులు. మమ్మల్నిద్దరినీ పంపేరు మెడికల్ స్కూల్ నుంచి. మరేం ఇద్దరమూ చేరాము హైదరాబాద్ లో. కాచీగూడా స్టేషన్ దగ్గర ఉన్న టూరిస్ట్ హోటల్ లో దిగాము. పంకజం చిరునవ్వు నవ్వుతుండగా డాక్టర్ అండ్ మిస్ కరుణాకరం అని హోటల్ బుక్ లో వ్రాశాను. ఒక డబల్ రూమ్ తీసుకున్నాం..”

చాలాసేపు కరుణ మాట్లాడలేదు. అహల్య అతనిని డిస్టర్బ్ చేయలేదు. కొద్ది నిమిషాలు తరువాత ఉస్సురని నిట్టూర్చి కరుణ మళ్ళీ ప్రారంభించాడు.

“ఆవేళ ఏదో అమెరికన్ ప్రొఫెసర్ టాక్ విన్నాము. సాయంకాలం మాకెక్కడికీ వెళ్ళబుద్ధి వేసేది కాదు. సెమినార్ ముగిసిన తరువాత అలా కాలినడకన తిరిగే వాళ్ళం. కాచిగూడా చౌరస్తా ముందు ఒక పెద్ద మార్వాడి బట్టలకొట్టు ఉంది. ఒకనాడు దాని పక్క నుండి నడుస్తూ నాకొక చిత్రమైన బుద్ధి పుట్టింది. ఇద్దరం కొట్లోకి వెళ్ళాం. పంకజం ఏవో చీరలు చూస్తోంది. నాకు రోల్ చేసిన పట్టు బ్లౌజు మెటీరియల్ కనబడింది. అందులో నాకు నీలిరంగు బాగా నచ్చింది. “అద్భుతం” అన్నాను. “ఏమిటి” అంది పంకజం చిత్రంగా చూస్తూ. ఆ నీలం బట్ట చూపించి ఒక బ్లౌజు ఇమ్మన్నాను. నా చేతితో పంకజం కిచ్చిన “ప్రెజెంట్” అదే. మరుసటి దినం బ్లౌజుకు మ్యాచ్ అయ్యే చీర కోసం పంకజం హైదరాబాద్ అంతా గాలించింది. అంతే దాని సంగతి మరిచిపోయాను.

నీకు తెలియదు కానీ పంకజం నేను సడన్ గా విడిపోయాము. నాన్నగారు పోయిన తరువాత పంకజంకు అమెరికా పిచ్చి. అమెరికా వెళ్లి సరదాగా గడపాలని ఆశ. అమెరికన్లు లాగే మనం ఉండాలని అనుకుంటూ ఉండేది. నాకు నాన్నగారి ప్రాక్టీసు చూసుకోవలసిన బాధ్యత. నాన్న గారు పోవడంతో అమ్మ ఏకాకి అయింది. అమ్మనొదిలి, దేశం వదిలి పోవడం అంటే బాధగా ఉండేది. ఇంతలో పంకజంకు వాళ్ళ వాళ్ళు సంబంధం కుదిర్చేరు. పెళ్ళికొడుకు అమెరికాలో ఇంజనీర్. ఏదో దగ్గర సంబంధమే. అమ్మ చాలా బాధపడింది.”

“ఇంతకీ నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పావు కాదు” అంది ఆలోచనతో అహల్య.

“పంకజం చాలా తెలివైంది”

మళ్ళీ మొదటికి వచ్చేడు అనుకుంది అహల్య.

“అంటే”

“పంకజం కు తెలుసు, నేను చాలా బాధపడుతున్నానని తాను పొందలేకపోయింది చెల్లెలయినా పొందగలుగుతుందని అనుకుంది. తెలివిగా తాయారుని పంపింది. ఎంతమటుకు బ్రీఫ్ చేసిందో తెలియదు. చాలా రోజుల తర్వాత హఠాత్తుగా వచ్చిన తాయారు అమాయకంగా రాలేదని నాకనిపించింది. అమ్మ మనింట్లో ఉండమని కోరితే ఉండలేదు. అమ్మ మనస్తత్వం పంకజం కు బాగా తెలుసు. బొత్తిగా మనిష వాపు మనిషి. మరీ దగ్గరగా ఉండక దూరంగానే ఉండి అమ్మను రెచ్చగొట్టింది. మనం భీమిలి వెళదామనుకొన్నప్పుడు చూశావా ఎలా తయారయిందో. నీవంటే తాయారు లోపల అసహ్యించుకున్నది. కారణం అంతుతెలియని అసూయ. మరో సంగతి తాయారు పంకజం లాగే స్నాబ్. తన కంటే సాంఘీకంగా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళని చులకనగా చూస్తుంది. విఠల్ రావు గారి టెలిఫోన్ కాల్ దైవికంగా వచ్చినా తన మంచికే అనుకుంది. కానీ నీవు చేసినది చేసి వెళ్లావు. తాయారు బ్లౌజును మెచ్చుకున్నావ్ జ్ఞాపకం ఉందా? అప్పుడే అనుమానం కలిగింది. తాయారుని, పంకజం పంపించిందా అని. భీమిలి వెళ్లాం. ఆలోచనల బరువుతో నాకట్టే మాట్లాడాలనిపించలేదు. ఎలాగైతేనేం చివరికి అడిగాను పంకజం ఎలావుందని. చెప్పింది. ఇద్దరు పిల్లలు బాగా లావై పోయిందట. ఏదో దిగులుట. మాటవరసకి చెప్పింది. పదేళ్ళ క్రిందటివి ఒక డజను జాకెట్లు తన సూట్ కేసు లో పడేసిందని. బ్లూ బ్లౌజు మళ్ళీ చూసి తృప్తిగా నవ్వుకున్నాను. అప్పుడడిగేను, ‘నీవు విశాఖ వస్తున్నట్లు పంకజం కు తెలుసా?’ ‘తెలియకేం విశాఖ వచ్చేముందే కదా నేను బొంబాయి వెళ్త’ అంది. అప్పుడు తెలిసింది పంకజం చాలా తెలివైందని మళ్ళీ పంకజం లాంటి మనిషి ఎప్పుడు కనిపిస్తుందో? ఎవరిని చూసినా ఏదో ఒక లోపం. అమ్మ బాధ చూడలేను కానీ మనసుకు ద్రోహం చేసుకోలేను కదా?”

ఇప్పుడు బోధపడింది అహల్యకు. కరుణ గాంభీర్యానికి అర్థం. రాత్రి పది దాటింది. ఇద్దరూ లేచారు. ఇల్లు చేరేసరికి అమ్మ మేల్కొని ఉంది.

“ఏం అహల్యా! ఇంత ఆలస్యం?”

కారు గారేజీలో పెట్టి లోపలకు వస్తూ వుంటే అహల్య సమాధానం వినబడింది.

“సినిమాలో ఉండగా..హార్ట్ కేస్....”

(ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక, 2-2-73 సౌజన్యం తో)

***** సమాప్తం *****

Posted in January 2020, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!