Menu Close
balyam_main

పంచతంత్రం కథలు

- దినవహి సత్యవతి

ముంగిస విశ్వాసం

Panchatantram

అనగనగా ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆతడికి భార్య ఒక ఎనిమిది నెలల కుమారుడు. ఊరిలో అవసరమైనవారికి  పూజా కార్యక్రమాలూ ఇత్యాదివి జరిపించగా వచ్చిన సంభావనతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు బ్రాహ్మణుడు.

బ్రాహ్మణుడు తన ఇంట ఒక ముంగిసను పెంచేవాడు. ఆ ముంగిస అంటే బ్రాహ్మణ దంపతులకి ఎంతో మక్కువ. తమ కుమారుడితో సమానంగా ముంగిసను కూడా ఎంతో ప్రేమగా సాకేవారు. వారు చెప్పేవన్నీ శ్రధ్ధగా ఆలకించి ఆచరిస్తూ ముంగిస కూడా ఎంతో విశ్వాసపాత్రంగా మసలుకునేది.

ఒకనాడు బ్రాహ్మణుడు ఆ ఊరి జమీందారుగారి ఇంట్లో పూజాకార్యక్రమం జరిపించడానికి ఒప్పుకుని ఉదయానే బయలుదేరి వెళ్ళిపోయాడు.

బ్రాహ్మణుడి భార్య ఇంటిలో నీరు నిండుకోవడంతో చెరువుకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకుందామని  బయలుదేరింది. కానీ పసివాడిని వదిలి వెళ్లడమెలాగా అని ఆలోచించి, బిడ్డను నిద్రబుచ్చి ఉయ్యాలలో పడుకోబెట్టి, ముంగిసను పిలిచి ‘నేను వచ్చేదాకా బిడ్డకి కాపలా ఉండు, ఎక్కడికీ వెళ్ళకు సరేనా?’ అని చెప్పి వెళ్ళింది.

ముంగిస కూడా అర్థమైనట్లుగా తలూపి ఉయ్యాల ప్రక్కనే కాపలా కూర్చుంది. ఇంతలో ఎక్కడినుండి వచ్చిందో ఒక పెద్ద త్రాచు పాము ఇంటిలోనికి వచ్చి పసిబిడ్డ పడుకున్న ఉయ్యాల వైపుగా కదలసాగింది.

అది చూచిన ముంగిస, పాము బిడ్డకి హాని చేయబోతున్నదని గ్రహించి, దానిని పళ్ళతో కొరికి చంపివేసింది. ఆ సందర్భంలో ముంగిస నోటినిండా పాము రక్తం అంటుకుంది.

ఇంతలో యజమానురాలు వస్తున్న అలికిడి విని ‘నేను బిడ్డని పాము నుంచి కాపాడాను’ అని సంతోషంగా చెప్పడానికన్నట్లుగా బ్రాహ్మణుడి భార్యకి ముంగిస ఎదురు వెళ్ళింది.

బ్రాహ్మణుడి భార్య ఎదురుగావస్తున్న ముంగిస మూతి పై రక్తాన్ని చూసి భయపడి ‘అయ్యో! పాపిష్టి ముంగిసా నా బిడ్డని పొట్టన పెట్టుకున్నావా?’ అని బిగ్గరగా ఏడుస్తూ కోపావేశాలతో నీటితో నిండి ఉన్న బిందెను ముంగిసపై పడవేసింది. ఆ బరువైన బిందె మీద పడగానే ముంగిస బాధతో అరుస్తూ గిలగిలాకొట్టుకుని ప్రాణాలు విడిచింది.

అదేమీ పట్టించుకోకుండా బిడ్డ ఏమైయ్యాడో అని ఏడుస్తూ ఇంటిలోనికి వచ్చి చూసిన బ్రాహ్మణుడి భార్యకి ఉయ్యాలలో నవ్వుతూ ఆడుకుంటున్న పిల్లవాడు, ప్రక్కనే క్రింద ముక్కలు ముక్కలై  చచ్చిపడి ఉన్న త్రాచుపాము కనిపించాయి. పాము తన బిడ్డని కాటు వేయ వస్తే ముంగిస దానిని చంపి తన బిడ్డ ప్రాణాలు కాపాడిందని తెలుసుకుంది ఆమె.

ఇంతలో పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన బ్రాహ్మణుడు బయట చచ్చి పడి ఉన్న ముంగిసను, లోపల పామును చూసి, జరిగినది భార్య ద్వారా తెలుసుకుని ‘ఎంత పని చేసావే మూర్ఖురాలా. అసలు నిజం తెలుసుకోకుండా విశ్వాసపాత్రురాలైన ముంగిసను అకారణంగా చంపావు కదే !’ అని భార్యని చీవాట్లు పెట్టాడు.

తన అనాలోచిత చర్యకి, ఏ తప్పూ చేయని ముంగిస అకారణంగా ప్రాణాలు కోల్పోయిందే అని బ్రాహ్మణుడి భార్య కూడా ఎంతో దుఃఖించింది.

నీతి: ఏవిషయంలోనైనా నిజా నిజాలు తెలుసుకోకుండా, తొందరపాటుతో ఎవ్వరినీ శిక్షించకూడదు.

Posted in January 2020, బాల్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!