Menu Close

Science Page title

సెల్ ఫోనులు

Cell Phoneఈ మధ్య సెల్ ఫోనుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సా. శ. 2011 లో ఈ భూలోకం జనాభా 7 బిలియనులు (7,000,000,000) అయితే 5 బిలియనుల సెల్ ఫోనులు వాడకంలో ఉండేవిట.

ఇప్పుడిప్పుడే సెల్ ఫోనుల వల్ల ఆరోగ్యం పాడయే ప్రమాదం ఉందేమో అని కొందరు అనుమానం పడుతూ ఉంటే కేన్సరు వచ్చే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.  ఇలాంటి హెచ్చరికలలో ఆధారం ఉన్న నిజం ఎంత ఉందో, ఆధారం లేని భయం ఎంత ఉందో మనం తెలుసుకోవాలి.

ముందు మనందరికీ బాగా పరిచయం ఉన్న రేడియో, టెలివిజన్ వంటి ఉపకరణాలకీ సెల్ ఫోనుకీ మధ్య పోలికలు, తేడాలు చూద్దాం. రేడియో కేంద్రం ఎక్కడో ఉంటుంది. అక్కడ నుండి ప్రసారితమైన వాకేతాన్ని  (signal) మన ఇంట్లో ఉన్న రేడియో గ్రాహకి (receiver) అనే “డబ్బా” అందుకుంటోంది. ఈ “డబ్బా”  రేడియో వార్తలని అందుకోగలదు కాని పంపలేదు. ఆ వార్తలని అందుకోటానికి  బయట వాకట్లో పొడుగాటి తీగని వేలాడగట్టేవారు పూర్వం. ఈ  తీగనే  ఏరియల్ అనేవారు, ఇప్పుడు ఎంటెనా (antenna) అంటున్నారు. ఇదే విధంగా వార్తలని పంపే రేడియో ప్రసారిణి  (transmitter) కూడ ఒక పొడుగాటి తీగని వాడుతుంది. ఈ తీగని కూడ ఎంటెనా అనే అంటారు. ఈ ఎంటెనాని ఎత్తయిన, బురుజులాంటి కట్టడం (tower) మీద స్థాపిస్తారు.

సెల్ ఫోను రేడియో గ్రాహకిలా వాకేతాలనీ అందుకుంటుంది, రేడియో ప్రసారిణిలా వాకేతాలని పంపుతుంది. చేతిలో పట్టే ఉపకరణం కనుక పంపటానికి వాడే తీగ, అందుకోటానికి వాడే తీగ (ఎంటెనా) కూడ పొడుగ్గా, భారీగా కాకుండా, చిన్నగా ఉండి ఫోను లోపల ఇమడాలి. ఇలా అన్నిటిని కుదించి, చేతిలో పట్టే ఉపకరణంగా చెయ్యాలంటే రేడియోలలో వాడే “పొడుగాటి రేడియో తరంగాలు” పనికిరావు; అందుకని కాసింత పొట్టిగా ఉండేవి, శక్తిమంతమైనవి అయిన “కాసింత పొట్టి రేడియో తరంగాలు” వాడతారు. మౌలికంగా అదీ సాధారణమైన రేడియోకి, సెల్ ఫోనుకి తేడా.

మరి కొంచెం తరిచి లోతుకి వెళ్లి చూద్దాం. మానవులని బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అని వర్గాలుగా విడగొట్టినా మనం అంతా మనుష్యులమే కదా; వయస్సులో తేడా, అంతే! అలాగే రేడియో తరంగాలన్నా, సూక్ష్మతరంగాలన్నా, పరారుణ తరంగాలన్నా, కాంతి తరంగాలన్నా, అతినీలలోహిత తరంగాలన్నా, X-కిరణాలు అన్నా, గామా కిరణాలు అన్నా – ఇవన్నీ పేర్లలో తేడా మాత్రమే. ఈ పేర్లలో తేడా ఈ ‘తరంగాల పొడుగు’ (wavelength) ని బట్టి మారుతూ ఉంటుంది. రేడియో తరంగాలు పొడుగ్గా ఉంటాయి. సూక్ష్మతరంగాలు కొంచెం పొట్టి. కాంతి తరంగాలు అంత కంటె పొట్టి, ఎక్స్-కిరణాలు మరికొంచెం పొట్టి, గామా కిరణాలు బాగా పొట్టి. అవసరాన్ని బట్టి వీటిని విడివిడిగా పేర్లు పెట్టి పిలుచుకోవచ్చు లేకపోతే వీటన్నిటినీ కట్టగట్టి “విద్యుదయస్కాంత తరంగాలు” అని పిలవచ్చు (రేడియో అధ్యాయంలో ఉన్న బొమ్మ చూడండి.)

“పొట్టి వాడికి పుట్టెడు బుద్ధులు” అన్నట్లు తరంగం పొట్టిగా ఉంటే దాంట్లో శక్తి ఎక్కువ ఉంటుంది. కనుక గామా కిరణాలు (సంప్రదాయికంగా మరి పొట్టిగా ఉండే తరంగాలని కిరణాలు అని పిలుస్తారు) ఎంత శక్తిమంతమైనవి అంటే అవి మన శరీరాన్ని తాకితే చర్మం కాలిపోతుంది. ఎక్స్-కిరణాలు కూడ శక్తిమంతమైనవే. అందుకనే వైద్యుడు ఎక్స్-రే ఫొటోలు తీసేటప్పుడు చాల జాగ్రత్తలు తీసుకుంటాడు; కడుపులో ఉన్న పిండానికి ఎక్స్-కిరణాల తాకిడి మంచిది కాదు. ఇంకాస్త పొడుగైన తరంగాలు అతినీలలోహిత కిరణాలు. ఇవి కంటికి కనబడవు కాని, మనం బయటకి ఎండలోకి వెళితే ఈ కిరణాల ప్రభావానికి శరీరం “కాలి” కమిలి పోతుంది. శీతల దేశాలలో ఉన్న తెల్లవాళ్లు శరీరం మరీ పాలిపోయినట్లు ఉంటే అందంగా ఉండదని ప్రత్యేకించి బీచికి వెళ్లి ఎండలో కూర్చుంటారు. అప్పుడు ఈ అతినీలలోహిత కిరణాల మోతాదుకి శరీరం కమిలి ఎర్రబారుతుంది. ఈ మోతాదు మరీ ఎక్కువైతే శరీరం కమిలి కందిపోవడమే కాకుండా చర్మపు కేన్సరు వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా పొడుగైన తరంగాలు కంటికి కనిపించే కాంతి కిరణాలు. ఎండలోకి వెళ్లటం వల్ల మనకి ఏమి ప్రమాదం వస్తున్నది? వేడికి ఒళ్లు చుర్రుమంటుంది. ఎండలో ఎక్కువ సేపు కూర్చుంటే ఒళ్లు కాలినా కాలుతుంది తప్ప పెద్దగా ప్రమాదం లేదు.

ఇంకా పొడుగైనవి పరారుణ తరంగాలు. ఇంకా పొడుగైనవి సూక్ష్మతరంగాలు లేదా మైక్రోవేవ్స్. (మన దురదృష్టం కొద్దీ ఈ పేరు స్థిరపడిపోయింది కాని, ఈ మైక్రోవేవ్స్ లో సూక్ష్మత ఏమీ లేదు; ఇవి రేడియో తరంగాలతో పోల్చినప్పుడు చిన్నగా ఉంటాయి కాని వీటి కంటె పొట్టి తరంగాలు ఇంకా చాలా ఉన్నాయి కదా!) ఈ కిరణాలని ఉపయోగించి “సూక్ష్మతరంగ ఆవాలు”  తయారు చేస్తున్నారు కదా. వీటిలో ఆహార పదార్థాలని వేడి చేసుకున్నప్పుడు ఆ ఆహారం 700 సెల్సియస్ డిగ్రీల వరకు వేడెక్కి పోతుంది. నీళ్లు 100 డిగ్రీల దగ్గర మరుగుతాయి కనుక 700 ఎంత వేడో మీరే ఊహించుకొండి. కనుక సూక్ష్మతరంగాలు ఒంటికి తగిలితే ఒళ్లు వేడెక్కి, కాలే ప్రమాదం ఉంది. ఇంకా పొడుగైనవి రేడియో తరంగాలు. వీటిని వాడటం మొదలుపెట్టి దరిదాపు ఒక శతాబ్దం అవుతోంది. వీటివల్ల ఆరోగ్యానికి భంగం అని ఎవ్వరు అనలేదు. ఇంకా పొడుగైనవి మన ఇళ్లల్లో దీపాలు వెలిగించుకుందుకి వాడే “కరెంటు” తరంగాలు.

పైన ఉదహరించిన తరంగాలన్నిటిని కట్టకట్టి “విద్యుదయస్కాంత తరంగాలు” (electromagnetic waves) అని కాని “విద్యుదయస్కాంత వికీర్ణం (లేదా వికిరణం)”  (electromagnetic radiation) అని కాని అంటారు. ఈ కథనాన్ని బట్టి అన్ని వికీర్ణాలు ఆరోగ్యానికి హాని చెయ్యవు; శక్తిమంతమైన వికీర్ణాలే ప్రమాదం. ఈ శక్తిమంతమైన వాటిల్లో గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు ఎక్కువ ప్రమాదం. అతి నీలలోహిత తరంగాలు కొంచెం తక్కువ హాని చేస్తాయి. సూక్ష్మతరంగాలు ఇంకా తక్కువ హానికరం. టెలివిజన్, రేడియో తరంగాలు, మన ఇళ్లకి విద్యుత్తు సరఫరా చేసే తీగలలో ప్రవహించే తరంగాలు సిద్ధాంతరీత్యా హాని చెయ్యటానికి వీలు లేదు.

సెల్ ఫోను లలో వాడే తరంగాలు, టెలివిజన్, వై-ఫై, బ్లూటూత్ వంటి సాధనాలలో వాడే తరంగాలు అన్నీ - కొంచెం ఇటూ అటుగా - ఒకే కోవకి (అనగా, UHF జాతికి) చెందిన తరంగాలు. టెలివిజన్ వాడుకలోకి వచ్చి 60 సంవత్సరాలు దాటుతోంది. అప్పుడు లేని కేన్సరు భయం ఇప్పుడు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు.

ఇదే విషయాన్ని మరొక విధంగా చెబుతాను. గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు, అతి నీలలోహిత కిరణాల తాకిడి వల్ల కేన్సరు వంటి వ్యాధులు వస్తాయనటానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. వీటిల్లో శక్తి “మోలు ఒక్కంటికి 480,000 జూలులు” దాటి ఉంటుంది కనుక వీటి తాకిడి ధాటీకి తట్టుకోలేక మన శరీరంలోని రసాయన బంధాలు తెగిపోతాయి. ఆకుపచ్చ కాంతిలో శక్తి “మోలు ఒక్కంటికి 240,000 జూలులు” ఉంటుంది. ఈ శక్తికి మన కంటి రెటీనా లో ఉండే బంధాలు తెగవు కాని, చలించి ఒంగుతాయి. ఇలా ఒంగినప్పుడు రెటీనా విద్యుత్ వాకేతాలని ఉత్పత్తి చేసి మెదడుకి పంపుతుంది. ఆదే మనకి ఆకుపచ్చ అనే భ్రాంతిని కలుగజేస్తుంది. సెల్ ఫోనులో పుట్టే శక్తి “మోలు ఒక్కంటికి 1 జూలు” కంటె తక్కువ. ఈ శక్తి కంటె ఆకుపచ్చ కాంతి పుట్టించే శక్తి 240,000 రెట్లు ఎక్కువ, అతి నీలలోహిత కిరణాలు పుట్టించే శక్తి 480,000 రెట్లు ఎక్కువ.

ఈ లెక్క ప్రకారం సెల్ ఫోనులకి అపకారం చెయ్యగలిగే స్థోమత లేదు. ఎక్స్-కిరణాలకి అపకారం చేసే స్థోమత ఉన్నా వాటి వాడకం మానెస్తున్నామా? తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అతినీలలోహిత కిరణాలు హాని చేస్తాయని తెలుసు కనుక ఎండలోకి వెళ్లినప్పుడు ఒంటికి లేపనం పూసుకోవటం, చలవ కళ్లజోడు పెట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సెల్ ఫోనులు ప్రసరించే వికీర్ణం (రేడియేషన్) వల్ల ప్రమాదం లేకపోయినా, సెల్ ఫోనుల విషయంలో కొన్ని మౌలికమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

మొదటి జాగ్రత్త. సెల్ ఫోనుని చేత్తో పట్టుకుని, చెవికి ఆనించి మాట్లాడటం కంటె ఫోనుని జేబులోనో, బల్లమీదో పెట్టుకుని, దాని నుండి ఒక తీగని చెవిదాకా తీసుకొచ్చి వినటానికి, మాట్లాడటానికీ సదుపాయం ఉంటే కొంత ఊరట. తలకీ, సెల్ ఫోనుకీ దూరం పెంచండి. అదే విధంగా, వీలయినప్పుడల్లా శరీరానికి, సెల్ ఫోనుకీ దూరం పెంచండి. ఈ జాగ్రత్తలకి కారణం సెల్ ఫోనులో ఉండే బేటరీ పేలిపోయి, కాలిపోయే సావకాశం ఉంది కనుక!!

రెండవ జాగ్రత్త. సెల్ ఫోను అందుబాటులో ఉంది కదా అని ఇరవైనాలుగు గంటలు అదే పనిగా దానిని చెవికి ఆనించి మాట్లాడటం కంటె, సెల్ ఫోను లోకాభిరామాయణానికి కాదని, అవసరం వెంబడి వార్తలని చేరవెయ్యటానికనీ గమనించి, క్లుప్తంగా వాడటం నేర్చుకోవాలి.

పై రెండు జాగ్రత్తలు తీసుకుంటే వికీర్ణత వల్ల ప్రాప్తించే హాని – ఏ కొదిపాటి ఉన్నా - తగ్గుతుంది.

మూడో జాగ్రత్త. కారు, రైలు వంటి వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోను మీద మాట్లాడ వద్దు. నాకు తెలుసున్న వ్యక్తి, కుర్రాడు, నవీ ముంబాయిలో కారు తోలుతూ సెల్ ఫోనులో మైమరచి  మాట్లాడుతూ ఎదురుగా వచ్చే బండిని చూసుకోకుండా గుద్దేసి నిష్కారణంగా అసువులు బాసేడు. బతికుంటే బలుసాకు ఏరుకు తినొచ్చు.

ఉత్సాహం ఉన్నవారికి మాత్రం:

All cellular phone networks worldwide use a portion of the radio frequency spectrum designated as ultra high frequency, or "UHF", for the transmission and reception of their signals. The ultra high frequency band is also shared with television, Wi-Fi and Bluetooth transmission.

Microwaves are a form of electromagnetic radiation with wavelengths ranging from as long as one meter to as short as one millimeter; with frequencies between 300 MHz (100 cm) and 300 GHz (0.1 cm). This broad definition includes both UHF and EHF (millimeter waves), and various sources use different boundaries. In all cases, microwave includes the entire SHF band (3 to 30 GHz, or 10 to 1 cm) at minimum, with RF engineering often restricting the range between 1 and 100 GHz (300 and 3 mm).

The prefix micro- in microwave is not meant to suggest a wavelength in the micrometer range. It indicates that microwaves are "small", compared to waves used in typical radio broadcasting, in that they have shorter wavelengths. The boundaries between far infrared, terahertz radiation, microwaves, and ultra-high-frequency radio waves are fairly arbitrary and are used variously between different fields of study.

Posted in January 2020, Science

1 Comment

  1. కామిశెట్టి చంద్రమౌళి

    మంచి సందేశం అందించారు. సెల్ ఫోన్లతో పాటు టెక్నాలజీ వినియోగం వల్ల ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!