Menu Close
prabharavi

దేశానికీ వెన్నెముక
రైతునే విరిచేసి
ఆయుధంగా చేసుకొని
పొలం గుండెలో పొడుస్తున్నారు.

రాత్రి చీకట్లు
ముసురుకున్నాకే గదా
సూర్యుడు
వెలుతురై ప్రవహించేది.

ఇతరుల్ని చూసి
కొంద రేడుస్తుంటే
ఆహ్వానం లేని నవ్వు
వాళ్ళను చూసి ఏడుస్తుంది.

చెట్టు వినయంగా
భూమికి మొక్కుతూ
గుట్ట గర్వంగా
నింగిపై కెక్కుతూ

నాకే దొరికిందని
అడ్డదిడ్డంగా వూగకు,
నీ అధికారం
ప్లాస్టిక్ కుర్చీ.

పుట్టేది గిట్టేది
ఆసుపత్రిలోనే,
రెండు ఏడుపుల మధ్య
మళ్ళీ ఏడు పెందుకు!

ఉప్పూ కారంతో
కలవా లంటే
ముక్కలు కావలసిందే
రుచి కోసం మామిడి కాయ.

ఉప్పూ కారం
మంచి స్నేహితులు,
ఎక్కడికైనా చక్కగా
కలిసి పోతారు.

“మషాళా” మాటలకు
అలవాటు పడ్డారు,
మనుషులకు
“గ్యాస్ ట్రబుల్”.

డబ్బు నాజూకు రాయి,
మనిషి మోజు “పడ్డాడు”
మానవత్వం తల
పగిలిపోయింది.

వెలుగుతూ కరుగుతూ కొవ్వొత్తి
ప్రాణం మొత్తం పంచుతూ
చివరికి తన శవమూ
ఎవరికీ అడ్డు లేకుండా.

శ్రమ జీవి
రవి,
ఉపకరణాలు
కిరణాలు.

ఎక్కడో ఉంటాడు
భయం లేదు,
సూర్యుణ్ణి తిట్టు,
మహా పోజు పెట్టు.

తాడు దేముంది,
నీ చేతుల్లోనే ఉంది,
పసుపు తాడైనా
ఉరి తాడైనా.

జుట్టుకు
రంగేసుకుంటున్నారా!
మనసు
“నలుపు”కుంటున్నారా!

 సినిమాలు, టీవీల
గుండెల్లో కత్తి దించు,
పసిపాపల “రేపిస్టు”ల
గుండెల్లో దించినట్లే!

ఇంట్లోకి
రాకూడదు బల్లి,
అది
మొగుడి తల్లి.

కుడి ఎడమల భేదాలు
చేతులకే,
నేలను ప్రేమించిన
కాళ్ళ కుండవు.

మామిడి పండ్లు
తెచ్చేదీ ఎండాకాలమే,
సుడిగాలితో
రాల్చేదీ ఎండాకాలమే.

దేవుళ్ళు వరాలు
అదృశ్య శక్తులు
ఏవీ వద్దు-
నాకు పుస్తకా లున్నాయి.

Posted in January 2020, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!