Menu Close

వీక్షణం సాహితీ గవాక్షం - 76 సమీక్ష

-వరూధిని

Vikshanam

వీక్షణం-76 వ సమావేశం ఫ్రీ మౌంట్ లోని షర్మిలా గారింట్లో ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. ఈ సభకు శ్రీ తాటిపామల మృత్యుంజయుడు అధ్యక్షత వహించారు.

ముందుగా సభలో వీరేశలింగం గారి గురించి ప్రసంగిస్తూ శ్రీ అక్కిరాజు రమాపతిరావు వారి రచనలపై తన డాక్టరేట్ రోజుల్ని గుర్తు తెచ్చుకున్నారు. వీరేశలింగం గారి విశిష్టతను సభకు పరిచయం చేస్తూ ఆధునిక ఆంధ్ర దేశం గోదావరి అయితే వీరేశలింగం నాసికాత్ర్యయంబకం అన్నారు.

తెలుగు సాహిత్యంలో ఆధునిక ప్రక్రియలైన నవల, కథ, నాటిక మొ.న అన్నిటికీ ఆయనే ఆద్యుడని పేర్కొన్నారు. ఆయన వితంతువులకి ఉచిత విద్యని అందించాడు. ఆయనను గురించి చిలకమర్తి "అటువంటి సంఘసంస్కర్త, అటువంటి రచయిత మరి కొన్ని వందల ఏళ్లకు గాని మళ్లీ పుట్టడు" అన్నారని అన్నారు. వీరేశలింగం "వివేకవర్థిని" పత్రికను నడిపారు, అనేక ప్రహసనాలు రాసేరు, ఆధునిక భావాల్ని విస్తరింపజేసారు. తన స్వీయ చరిత్రను తన శ్రీమతి రాజ్యలక్ష్మికి అంకితం ఇచ్చారు. వర్తమా నాంధ్ర భాషా సమాజాన్ని స్థాపించారు.

తెలుగులో తొలి నవల అయిన "రాజశేఖర చరిత్రము" ను రాసారు. మొత్తంగా వీరేశలింగం పత్రికా సంపాదకత్వం, గ్రంథ రచన, కవుల చరిత్ర, సమాజ సేవ, తాళపత్ర గ్రంథాల సంస్కరణ సల్పిన గొప్ప పండితుడు, అన్నిటినీ మించి గొప్ప మనిషి అని ముగించారు.

తర్వాత శ్రీమతి షర్మిల "చిట్టెమ్మ మనవరాలు" కథను చదివి వినిపించారు. ఆద్యంతం ఆసక్తిదాయకమైన ఈ కథ అందరినీ మెప్పించింది.

ఆ తర్వాత శ్రీ అక్కిరాజు బిలహరి ఏకబిగిన పోతన భాగవతం లోని నృశింహావతారం ఆవిర్భావ ఘట్టాన్ని వినిపించారు.
"అంబా నన్ కృపజూడు భారతీ..అని మొదలు పెట్టి "ఇట్లు దానవేంద్రుడు" అంటూ కరతాళ ధ్వనుల మధ్య ముగించారు.

తన కుమారుణ్ని పరిచయం చేస్తూ శ్రీ అక్కిరాజు సుందర రామ కృష్ణ బిలహరి ఈ ఘట్టాన్ని నెల రోజుల వ్యవథిలో నేర్చుకున్నారని అన్నారు. తర్వాత "సద్యోపగతుండగు.." అంటూ ఆయన స్వయంగా పద్యాలు ఆలపించారు.

విరామం తర్వాత డా|| కె. గీత "ఒక పాటకు..." అంటూ లలిత గీతాన్ని ఆలపించి సభను పున: ప్రారంభించారు. తర్వాత శ్రీ కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ సభలోని వారందరినీ ఉర్రూతలూగించింది.

ఆ తరవాత శ్రీమతి ఉదయలక్ష్మి "కుల వృత్తుల ప్రాధాన్యత" అంటూ పెళ్ళిళ్లలో మరిచిపోతున్న సంప్రదాయాల్ని గుర్తు చేశారు.

చివరగా కవిసమ్మేళనం లో కె.గీత "గర్జించే నలభై లు" కవితను, శ్రీ హరనాథ్ కంద పద్యాన్ని, శ్రీ నాగ సాయిబాబా "విన్నానులే ప్రియా" అంటూ పేరడీ గీతాన్ని ఆలపించి సభను జయప్రదం చేసారు.

ఈ సభలో శ్రీ వేమూరి, శ్రీమతి ఉమ, శ్రీ గాంధీ ప్రసాద్, శ్రీ పల్లా రామకృష్ణ, శ్రీమతి రాధ, శ్రీ లెనిన్, శ్రీ పిల్లలమర్రి కృష్ణ కుమార్, శ్రీమతి శారద, శ్రీమతి మాధవి, శ్రీ రావు, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి కోటేశ్వరమ్మ మొ.న స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Posted in January 2019, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!