Menu Close

గల్పిక

‘గల్పిక’ అనే పదం తెలుగు భాషలో పట్టాలు పొందిన వారికి తప్ప సాధారణ భాషాభిమానులు, సాహిత్యప్రియులకు అంతగా పరిచయం లేని పదం అవుతుంది. అందుకే మన సిరిమల్లె లో ‘గల్పిక’ అనే ఒక శీర్షికను ప్రారంభించి తద్వారా ‘గల్పిక’ అంటే అది సుపరిచితమే అనే భావన కలిగించాలని మా ఆకాంక్ష. అసలు ఈ ‘గల్పిక’ అంటే ఏమిటి? దాని స్వభావం ఎట్లా ఉంటుంది?

ఈ ప్రశ్నలకు మా “సిరికోన” లో గంగిశెట్టి గారు చక్కటి సమాధానాలను అందించారు.

కథ కాగలిగి, కథ కాలేనిది ‘గల్పిక’. సన్నివేశాన్ని..దృశ్యాన్ని సంపూర్ణంగా చూపిస్తూ, పాత్రను పూర్తిగా చిత్రించి, ఆ రెండింటి అన్యోన్యక్రియతో, చెప్పదలచుకొన్న అంశాన్ని సమగ్రంగా ఆవిష్కరించేది ‘కథ’. అందులో పై మూడింటి శిల్పభరితమైన ‘కథనం’ ఉంటుంది. అంచేత అదో గొప్ప ‘కథన ప్రక్రియ’ గా ఎదిగింది. గల్పికలో కథనం ప్రాధాన్యం తక్కువ.

ద్రుశ్యీకరిస్తూ పెంచితే కథ; రేఖామాత్రంగా సూచిస్తే గల్పిక..

భావసాంద్రత, విమర్శతో సహా, అన్ని సాహిత్య ప్రక్రియలకూ సమానమే. దీంట్లో లఘు..అనుభూతి కవితల్లో లా కాస్త ఎక్కువ. జానపద ప్రక్రియల లోని ‘దంతకథ’, ఆధునిక శైలి లోని ‘ఉదంత కథ’ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలలో ఈ ‘గల్పికలు’ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు కారణం మాధ్యమ పరిమితీ, వేగంగా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది కనుక.

మన సిరిమల్లె లో కూడా ఒక శీర్షికను మొదలుపెట్టి రచనా ఆసక్తి ఉన్న మీ వంటి వారిని ప్రోత్సహించాలనే మా ఆకాంక్షకు చేయూతనివ్వాలని కోరుకుంటున్నాను.

మొదటగా రెండు గల్పికలతో మన జనవరి సంచికలో ‘గల్పిక’ శీర్షికను ప్రారంభిస్తున్నాను.

ప్రే . మ . ర . ణం - జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

"సస్తావ్ రా రేయ్"అంటూ బస్సుడోర్లో నిలబడ్డ కుర్రాడు ఇంకా నోటికొచ్చినట్టు వాగుతూనే ఉన్నాడు.

ఇలాంటివన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే బస్సుని తరుముకు వచ్చే కారో బైకో గుద్దేసి ఆ వదరుబోతు మాటే నిజం చేస్తుంది. అందుకే బైకులకి ఆగమన్నట్టు చెయ్యి చూపిస్తూ, వాటిని తప్పించుకుంటూ, కాలిబాటమీదెక్కి పరుగందుకున్నాను. రైల్వేస్టేషన్లోకి వెళ్ళాను. అప్పటికే ప్లాటుఫారంమీద రైలు వేగం అందుకుంటోంది. అందుకే ఏమాత్రం తగ్గకుండా అదే ఊపులో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ చేత్తో పెట్టెలబండి కమ్మీ పట్టుకున్నాను. అక్కడే నిలబడ్డ కుర్రాడు రెండో చేతిని అందుకుని పైకిలాగి,"మీరు చాలా ఫాస్టంకుల్"అంటూ అభినందించాడు. నేను చిరునవ్వుతో అతనికి థాంక్స్ చెప్పాను.

బండి స్థిరవేగం అందుకునే వరకూ అక్కడే నిలబడి కాస్త అలుపు తీర్చుకున్నాను. అది ఆరక్షిత పెట్టె. అయినా సరే రిజర్వేషన్ లేనివాళ్ళు కూడా ఎక్కేశారు. ఒక సీట్లో నలుగురు మాత్రమే ఉన్నారు. నేను ఓ వారగా సద్దుక్కూర్చుని, చుట్టూ పరికించాను. అందరూ ఎవరి సెల్లులో వాళ్ళున్నారు. ఈ సెల్లులొచ్చి ఎదుటివాళ్ళతో మాట్లాడేవాళ్ళే కరువయ్యార్రా బాబూ అనుకుంటూ నేనూ వాట్సప్ చూడ్డం మొదలుపెట్టాను.

"చావనేది చచ్చినా చెప్పిరాదు. ప్రాణం అనేది చచ్చినా చెప్పి పోదు. కాబట్టీ ప్రాణం ఉండగానే చెయ్యాల్సినవన్నీ చచ్చినట్టు చేసెయ్యడమే" అనే చావు సూక్తి కనపడింది.

ఏంటో ఈ రోజన్నీ చావు కబుర్లే. ఇంటి దగ్గర బస్సెక్కుతున్నప్పుడు కాలు స్లిప్పయింది. దిగేప్పుడు బస్సు డోరుకడ్డం నిలబడ్డ వెధవ చేసిన చావు కామెంటు ఇంకా మండుతూనే ఉంది. ఈ కుర్రకుంకలింతే. వాళ్ళు దిగరు. మన్ని దిగనివ్వరు.

ఆ బస్సులో మాత్రం తక్కువా? ఎవడో ఘోర ప్రేమికుడు, తనను ప్రేమించిన అమ్మాయితో అర్థం పర్థం లేకుండా వాగుతున్నాడు. "అంతగా ప్రేమిస్తే నాకోసం చచ్చిపోగలవా? నా కోసం నీ ప్రాణాలు త్యాగం చెయ్యగలవా? నాకోసం బలిపీఠం ఎక్కగలవా?" అంటూ ఈమధ్యే రిలీజైన "ముద్దుకు మటాష్" అనే సినిమాలోని హీరోగాడి కూతలు కూస్తూ ఆమె ప్రేమని రెచ్చగొడుతున్నాడు. ఈ ధూర్త ప్రేమికుడిని ప్రేమించిన పాపానికి ఆ అమాయకురాలు ఎంత ప్రేమ నరకం అనుభవిస్తోందో ఏమో!

ఇంతకీ ప్రేమ.., త్యాగాన్ని కోరుతుందా? బలిని కోరుతుందా?

లేక ఏదీ కోరుకోకపోవడమే ప్రేమా?

ప్రేమానుభూతుల గురించి ఏ మాత్రం తెలియని ఆ లవ్ శాడిస్టుగాడి వ్యవహారం "నేను ఎంతలేసి మాటలన్నా కిక్కురు మనకుండా ప్రేమించే అమ్మాయి నాకు తప్ప, ఇంకెవరికీ లేదు చూడండహో"అని బస్సులో అందరికీ చాటింపు వేసుకుంటున్నట్లే ఉంది గానీ, ప్రేమించిన అమ్మాయితో మాట్లాడుతున్నట్లు ఏ కోశానా లేదు. వాడిదో చావు ప్రేమ ప్రదర్శన అనుకుంటూ వాడిమాట మర్చిపోవడం కోసం వాట్సప్పుని వదిలేసి యూట్యూబ్ లో దూరాను. అందులో "మనం డైలీ డ్రెస్ ఛేంజ్ చేసినట్లే హ్యూమన్ బాడీస్ ఛేంజ్ చేసేదెవరు?"అంటూ మీలో ఎవరు కోటీశ్వరుడులో చిరంజీవి లెవెల్లో రెచ్చిపోతున్న గొట్టంగాడి ప్రశ్నకి సమాధానంలా, కృష్ణుడిమల్లే మురళి వాయిస్తున్నట్టు తెగ నటించేస్తున్నాడు నాగబాబు. డబ్బులు తీసుకున్నందుకు న్యాయం చెయ్యాలి కాబట్టీ నవ్వు రాకపోయినా జబర్దస్త్ గా వెకిలి చేష్ఠలు చేస్తూ పడీ పడీ నవ్వేడుస్తోంది రోజా. అందులోనూ చావు కామెడీయే. ఆత్మలేని అడ్డమైనవాడికీ ఛానెల్లో ఛాన్సిస్తే ఇంతే.., చావుకామెడీ తప్ప ఇంకేం మిగల్దు. అందుకే బతకడానికి చచ్చే చావొచ్చి పడింది కదరా అనుకుంటూ సెల్లు మూసి కిటికీలోంచీ బైటికి చూస్తూండగా పక్కనున్న అమ్మాయి సెల్లులో ఏడుపు దిగమింగుకుంటూ మాట్లాడుతున్నట్టనిపించి అటు చూశాను.

"లేదు మదన్. నీ కోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను. కానీ వేరే అమ్మాయితో మాత్రం పెళ్ళికి ఒప్పుకోవద్దు. ప్లీజ్" అంటూంటే ఆమె కళ్ళవెంట నీళ్ళు బొటబొటా కారిపోతున్నాయి. ఆమె మాటల్లో నన్ను బాధపెట్టింది ఆమె ఏడుపు కాదు. మదన్ అన్న పేరు. అది ఇందాకా బస్సులో డబ్బారేకుల ప్రేమ ప్రదర్శకుడి పేరు. అంటే అతను రెచ్చగొడుతున్నది ఈ అమ్మాయినేనా?

ఈ అనుమానం రాగానే ఆ అమ్మాయి కదలికల్ని గమనించడం ప్రారంభించాను.

ఆ అమ్మాయి ఏడుపు ఆపుకోలేకపోతోంది. ఏడుస్తూనే అంటోంది,"ఇలా ఐతే నేను వెళ్ళి రైల్లోంచి దూకేస్తానంతే" అంటూ ప్రేమ తేనెలో పడ్డ చీమలా రెచ్చిపోతోంది.

అవతలి వైపునించీ ఆ మదన్ గాడు ఏమంటున్నాడోగానీ ఈ అమ్మాయి మాత్రం, హఠాత్తుగా సెల్లో వీడియో కాల్ ఆన్ చేసింది.  సెల్ని దూరంగా పట్టుకుంది. "ఇదిగో లేస్తున్నాను చూడు" అంటూ రన్నింగ్ కామెంటరీ మొదలు పెట్టింది. "డోర్ దగ్గరకి వెళ్తున్నాను" అంటూ విసురుగా డోరువైపుకి పరుగందుకుంది.

ఆమె ఏం చేస్తోందో అక్కడ ఎవ్వరికీ అర్థం కాలేదు, నాకు తప్ప.

అందుకే నేనూ పైకి లేచాను. ఆ అమ్మాయిని అడ్డుకోవడం కోసం ఆమె వెంట పడ్డాను. అప్పటికే ఆమె డోరు దగ్గరకి వెళ్ళిపోయింది. ఆ డోర్లో అటూ ఇటూ జనాలున్నారు. దూకడానికి వాళ్ళు అడ్డం పడతారనే అసహనంతో పాసేజ్ లోంచీ మరింతవేగంగా అవతలి కంపార్టుమెంటులోకి పరిగెత్తింది. ఆమెని ఆపడం కోసం నేనూ పరిగెడుతున్నాను. చుట్టూ ఉన్నవాళ్ళ చూపులు ఆమెవంకా నావంకా విచిత్రంగా చూస్తున్నా వాటిని పట్టించుకునే సమయం లేదు. "నీకోసం నేను ప్రాణాల్నే బలిచ్చేస్తా.., మదన్ ఐ లవ్యూ" అంటూ జనాల్ని తప్పించుకుంటూ పరిగెడుతూనే ఉంది. నేను వెంటపడుతూనే ఉన్నాను.

దాదాపు అన్ని డోర్లదగ్గరా ఒకళ్ళో ఇద్దరో ఉన్నారు. ఎవరూ లేని డోరు కోసం వెతుక్కుంటూ ఉన్మాదిలా పరిగెడుతూనే ఉందా అమ్మాయి. చివరికి జనంలేని డోరు కనపడింది.

అంతే,"ఐ లవ్యూ మదన్.., ఐ లవ్యూ..,"అంటూ దూకెయ్యబోయింది.

సరిగ్గా అదే సమయానికి నేను ఆమె చేతిని అందుకోగలిగాను. ఆ చెయ్యి పట్టుకుని బలంగా వెనక్కి లాగాను. ఎంత బలంగా లాగానంటే.., నా బలానికి ఆమె నన్ను దాటి కంపార్టుమెంటులోకి వచ్చిపడింది.

ఆ అమ్మాయిని లాగడానికి నా సర్వశక్తుల్నీ ఉపయోగించడం.., ఆ ఉపయోగించడంలో ఎప్పుడో ఎడంకాలి మడమ మెలికపడ్డం.., దాంతో కుడికాలిమీద నిలబడ్డానికి ప్రయత్నించడం.., ఆ ప్రయత్నం విఫలం కావడం.., అనుకోకుండా వెనక్కి తూలడం.., నన్ను నేను నిలదొక్కుకోవడానికి కమ్మీని అందుకోబో...మ్.., మ్.., మ్.., మ్ మ్మాహ్..!

నడిచే పూలవనం - అత్తలూరి విజయలక్ష్మి

చాలాకాలంగా నాకో కోరిక తీరకుండా అల్లాగే ఉండిపోయింది.

నిజానికి నాకా కోరిక ఉండకూడదు.. నేను అంత  కుసంస్కారంగా ఆలోచించకూడదు..

కానీ ఆలోచిస్తున్నాను.. వద్దని నా మనసు  చెప్తున్నా ఆలోచన మాత్రం ఆగడం లేదు, నా మనసు చెప్పేది మెదడు వినడంలేదు. మామూలుగా మనసు చెప్పేదే మెదడు వింటుందని తదనుగుణంగానే మెదడు పని చేస్తుందని అంటారు. కానీ నా మెదడుకి, మనసుకి ఎందుకనో సమన్వయం కుదరడం లేదు.

నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకు నాలో అకస్మాత్తుగా ఇంత శాడిజం ప్రవేశించింది అని..

కానీ బలంగా పాతుకుపోయిన కోరిక మాత్రం అది శాడిజం అని ఎంత మాత్రం ఒప్పుకోడం లేదు.

అలా జరగాలి.. అలా జరగాలి అని ప్రతి క్షణం అనిపించడం, అలా జరిగే సంఘటన కోసం ఎదురుచూడడం మామూలు అవుతోంది.

ఇంతకీ నా కోరిక ఏంటో చెప్పలేదుగా.. చెప్తాను..

“ఏం చేస్తున్నావు చెవులు పని చేయడం లేదా.. పిలిస్తే పలకవేం” కర్కశంగా వినిపించిన స్వరం నా ఆలోచనలను చెదరగోట్టింది..

గబుక్కున లేచాను కూర్చున్న దగ్గరనుంచి ..

“కాఫీ ఇవ్వు...” కొంచెం ప్రసన్నంగా చెబితే ఎక్కడ తన అధికారం కోల్పోతానో అనే భయమేమో ఎప్పుడూ ఆ మొహం చిట, పట లాడుతూనే ఉంటుంది. ఆ మొహం వైపు చూడాలని కూడా అనిపించదు నాకు.

నిశ్శబ్దంగా లేచి వంట గదివైపు నడిచాను. మా వంట గది కిటికీలోంచి మా ఇద్దరికీ కామన్ గా ఉండే పెరడు కనిపిస్తుంది. ఆ పెరట్లో నా తులసి మొక్క తప్ప మిగతా మొక్కలన్నీ ఆవిడవే.. ఆవిడ లాగే పచ్చగా కళ, కళలాడుతూ పూలతో మందారాలు, గులాబీలు, చామంతులు, పండ్లతో జామ చెట్టు, అరటి నిండుగా ఉంటుంది పెరడు ఆవిడ జీవితంలాగే.

ముగ్గురు పిల్లలతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది ఆవిడ ఇల్లు..

పూలు కోసుకుంటూ చిరునవ్వు నవ్వింది ఆవిడ. “పూజ అయిందా.. పూలు కోసుకోండి బోలెడు పూసాయి కదా..”  అంది మందారంలా నవ్వుతూ.

నేను బలవంతంగా నవ్వాను. సమాధానం చెప్పడం ఇష్టం లేకున్నా మర్యాద కోసం అలాగే అన్నాను గొంతు పెగల్చుకుని..

“వంట అయిందా” అంది మళ్ళి.

“లేదు చేయాలి” అన్నాను కాఫీ గ్లాసులో పోస్తూ..

“సరే  ఉంటాను” నిండుగా పూలతో నిండిన సజ్జ పట్టుకుని కదిలే పూలవనంలా వెళ్ళిపోయింది.

గుండె నిండా ద్వేషంతో వెళ్లి కాఫీ ఇచ్చాను ఆ మనిషికి..

“వేడి లేదు.. ఎక్కడ పెడతావు మెదడు..” ఎగదోసిన మంటలా భగ్గుమన్నాడు.

ప్రేమగా చెప్పనపుడు ఎందుకు చేయాలి? మర్యాద కదా.. నాకన్నా పదేళ్ళు పెద్దవాడు.. పెద్దవాళ్ళకు మర్యాద ఇవ్వడం నాకు చిన్నప్పటి నుంచీ అలవాటు. నిశ్శబ్దంగా గ్లాసు తీసుకుని మళ్ళి వేడి చేసి ఇచ్చాను.

మళ్ళి నా ఆలోచన ఆవిడ మీదకి మళ్ళింది. ఆవిడా ఆడదే... నేనూ ఆడదాన్నే.. ఆవిడ అంత సంతోషంగా ఎలా ఉంది? ఆవిడ జీవితం అంత ప్రశాంతంగా ఎలా ఉంది? ఆవిడ ఇల్లు ఎప్పుడూ అలా ఎలా కళ కళలాడుతూ ఉంటుంది! ఆవిడ అంత నిండుగా ఎలా ఉంటుంది?

నేనెప్పుడూ సంతోషంగా ఉండలేదు.. ఇప్పుడూ ఉండడం లేదు.. అప్పుడు పేదరికం వల్ల.. ఇప్పుడు ప్రేమరాహిత్యం వల్ల. కారణం ఏదైతేనేం ...నా కళ్ళు మాత్రం నిరంతరం ప్రవహించే నదులు..

నాకు బలంగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఆవిడ నా సంతోషం, నా సుఖం, నా శాంతి నిశ్శబ్దంగా కొల్లగొట్టింది.
ఆవిడ నా శత్రువు.

నా శత్రువు అవడానికి కారణం కూడా నాకు తెలియదు.. ఆవిడ నా చెల్లి కాదు, అక్క కాదు, నా సవతి కాదు, నాకు ఏమి కాదు.. కేవలం పక్కింటి గృహిణి ... ఇద్దరం పక్క, పక్క ఇళ్ళల్లో ఉంటున్నా ఒకే పంపు లోంచి వచ్చే నీళ్ళు తాగుతున్నా ఆ పరిసరాల్లో వీస్తున్న గాలే పీలుస్తున్నా మా జీవితాల్లో ఈ తేడా ఎందుకు? ఆవిడకి ముగ్గురు పిల్లలు, నాకు పిల్లలు లేరు ... ఆవిడ నవ్వుతూ ఉంటుంది ఎప్పుడూ..నేను నిశ్సబ్దంగా ఏడుస్తూనే ఉంటా.. ఆవిడ భర్త మంచివాడు .. నా భర్త కోపిష్టి, బహుశా ఆవిడ భర్త రొమాంటిక్ అయి ఉండచ్చు.. నా భర్త తాగి, తాగి అసమర్థుడైనాడు... అందుకే ఆవిడ ఎప్పుడూ నడిచే పూలవనంలా ఉంటుంది.. నేను మోడుగా మారిన చెట్టులా విషాదం మూర్తీభవించి ఉంటాను.

అందుకే నాకు ఆవిడంటే కోపం ... ఇద్దరం ఆడవాళ్ళమే అయినప్పుడు ఆవిడ అంత సంతోషంగా ఎందుకు ఉండాలి.. ఆవిడ కూడా నాలా దుఖంతో ఉండకూడదా.. ఆవిడకి ఉన్న అనేక సంతోషాల్లో కనీసం ఒక్కటన్నా ఆ దేవుడు నాకు ఇవ్వకూడదా.. ఎంత దుర్మార్గుడు దేవుడు.. నేను ఎప్పుడూ దేవుడిని ఏమి కోరలేదు కొంత ఆనందం తప్ప అదెలాగా దక్కలేదు.. ఇప్పుడు నా కోరిక ఒక్కటే ఆవిడ కళ్ళల్లో కన్నీళ్లు చూడాలి.. ఆవిడ ఏడవాలి..

ఆవిడ ఏడ్చే చక్కటి సందర్భం కోసం ఎదురుచూస్తున్నాను.

వచ్చేసింది... వచ్చేసింది.. ఆవిడ ఏడుస్తోంది.. పదేళ్ళ నుంచి ఎదురుచూస్తున్న ఓ అపూర్వ సన్నివేశం వచ్చేసింది.. నడిచే పూలవనం ఇప్పుడు కన్నీటి సంద్రం అయి, నది దగ్గరకు వస్తోంది.. నా పెదవుల మీద  పుచ్చపువ్వులా విచ్చుకుంది చిరునవ్వు .. రండి, రండి అన్నాను.

“సంధ్యగారూ ఈ తాళం చెవి మా పిల్లలు వస్తే ఇవ్వండి ఆయన్ని అర్జంటుగా హాస్పిటల్ కి తీసుకువేల్తున్నాను..”

ఎందుకు? ఏమైంది అప్రయత్నంగా అడిగాను.

“నా దురదృష్టం... దేవుడికి నా మీద దయలేదు” భోరుమంది.

నా మొహం ప్రశ్నార్ధకంలా మారింది.

“మా వారికి కాన్సర్...  పువ్వులా చూసుకున్నాను.. చేయని పూజలేదు.. కానీ పరిస్థితి విషమించింది.. తరవాత మాట్లాడతాను.. ముందు హాస్పిటల్ కి వెళ్ళాలి.. ఆవిడ హడావుడిగా వెళ్లిపోతుంటే నా కళ్ళు బాణాల్లా దూసుకువెళ్ళాయి. గేటు బయట ఆగిఉన్న కాబ్ లో అతి జాగ్రత్తగా ఎక్కిస్తోంది భర్తని..

నా పెదవుల మీద పుచ్చాపువ్వులాంటి చిరునవ్వు .... లేదిప్పుడు..

నా మనసులో కోరిక రూపం మారింది.. ఆవిడ భర్తని కాపాడు దేవుడా.. ఆమె ఎప్పుడూ నడిచే పూలవనంలాగే ఉండనీ.

 

Posted in January 2019, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!