Menu Close
Telugu Paddemulalo Andachandamulu

మన తెలుగు, మన జాతి వెలుగు. ఘనఖ్యాతి లొలుకు జిలుగు. నుడి కాంతులిడు గిడుగు అడుగు.

మన అమ్మనుడి (మాతృభాష), అందాల బడి, అనుబంధాల ఒడి. అచ్చులతో ఉచ్ఛారణ.

అన్ని సామెతలు, కావ్యాలు మరే భాషలో లేవంటే అతిశయోక్తి గాదు.

తెలుగు ఎంతో బలిమి, కలిమి, పేరిమి, ఎలమి గల నుడి (భాష).

మన తెలుగు రచనలో పద్యము ఒక విశిష్టమైన ప్రక్రియ. మన తెలుగు పద్యాలకు మాత్రమే యతి ప్రాసల నియమాలు ఉన్నాయి. హిందీలో దోహాలని, సంస్కృతంలో శ్లోకాలని అంటారు. వాటికి యతి ప్రాసలు లేవు. మన తెలుగు కవులు పద్దెములతో అనేక ప్రయోగాలు చేశారు. చదువరులను ఆనందింపజేసినారు. ఆ క్రమంలో వ్రాసిన క్రింది పద్దెములను చూసి మీరూ ఆనందించగలరని నా ప్రగాఢ నమ్మకము.

ఏకాక్షర పద్యము (‘న’ కారంతో వ్రాసినది)

కందం:

నే, నీనానను, నీ నూ
నా, నీ, నానూనన్ననా! నీ, నానే
నూ, నా నూనెను, నీ నా
నే, నా, నూనెనని నాన నేనన్నానానే

(నూనె గురించి వివాదం)

అలాగే ‘క’ కారంతో (ఒకే అక్షరం)

కందం:

కాకికి, కేకికి, కేకకి
కూకకు, కాకికికి కేక కూకకి కేకే
కాకక, కేకకు, కేకకు
కేకికి, కాకికికి కేక కేకేకాకా

(కేకి = నెమలి, కాకి, నెమలి కూతల తేడాతో)

అలాగే పాలు, పూరీ, వడ, దోసె, గారెల పదాలతో తమాషాగా ఒక పద్యం చెప్పమంటే:

తేటగీతి:

పడతి మురిపాలు జూపు పావడను జూసి
మగడు దోసెడు పూలతో మరులు జూపె
మల్లె పూరీతి నగవుతో మగువ యనెను
అత్తగారెతో పనివుంది ఆగలేర
సఖుడ! సాంబా రుసరుసలా! సమయముంది.

చివరగా సినిమా తారలు తమన్న, సమంత, త్రిష, రోజా లతో ఒక పద్యం చెప్పమంటే:

తేటగీతి:

చూతమన్న తెలుగునుడి సోగసులేవి
దోసమంతయు ఆ ఇంగిలీసుదాయె!
పుత్రి షండుని రీతిగ పోలె నడత
మరి శిరోజాల జడలేవి మరచె వనిత

Posted in January 2019, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!