Menu Close

Alayasiri-pagetitle

మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు

శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్

Ranganatha Templeమహాభారతాన్ని తెలుగులోకి అనువదించినది ‘కవిత్రయం – నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రగడ’. ఈ ముగ్గురిలో, తిక్కన గారు, సింహపురి రాజధానిగా పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో ఉంటూ ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడని ఒక నానుడి. మహా భారతం లోని పద్దెనిమిది పర్వాలలో పదిహేను పర్వములు తిక్కన సోమయాజి అనువదించాడు. అంతటి గొప్ప చరిత గలిగిన విక్రమ సింహపురి, నెల్లు అనగా వరి పంటకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు పట్టణంలో ప్రవహిస్తున్న జీవనది పెన్న ఒడ్డున వెలసియున్న శ్రీ రంగనాథ ఆలయానికి సంబంధించిన విశేషాలే నేటి మన ఆలయసిరి.

నెల్లూరు పట్టణం లో ఉన్న పురాతన దేవాలయాలలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఒకటి. పల్లవ రాజుల కాలంలో అంటే 7-8 శతాబ్దాల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కానీ 12 వ శతాబ్దంలో, రాజా మహేంద్ర వర్మ ఆధ్వర్యంలో పూర్తి ఆలయ నిర్మాణం జరిగినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తున్నది. స్కంద పురాణం వైష్ణవ సంహితలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉంది. దానిని బట్టి ఈ ఆలయం ఎంత పురాతనమైనదో చెప్పవచ్చు.

Ranganatha Templeఇక్కడి రంగనాథుడు శేషతల్పము మీద పవళించి యున్నందున ఈ ఆలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ ఆలయం తూర్ప దిశ నందు ఏడు అంతస్ధులు కలిగి 70 అడుగుల ఎత్తుతో నిర్మించిన రాజగోపురం. ఈ రాజగోపురం పైన దాదాపు పది అడుగుల ఎత్తువున్న కలిశాలను ప్రతిష్టించారు. అయితే ప్రధానాలయం మాత్రం పశ్చిమాభి ముఖంగా ఉంటుంది. ఆలయం పశ్చిమ వైపున పెన్నానది ప్రవహించు చున్నది. ప్రధాన ఆలయంలోనికి దక్షిణ ద్వారం ద్వారా మాత్రమే అనుమతి ఉంది. అయితే ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామి వారిని దర్శించుకోవచ్చు. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

Ranganatha Temple

ఈ ఆలయంలో గల మరొక ఆకర్షణ అద్దాల మండపం. ఈ అద్దాల మండపం లోపలి పై కప్పున చిత్రించిన శ్రీ కృష్ణుని తైల వర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది.

Source1, Source2, Source3, Source4

Posted in January 2019, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!