Menu Close
Kadambam Page Title
త్యాగరాజు
డా. గోపాల్ నేమన

దాదాపు 20 ఏళ్ళ క్రిందట  కీ.శే.  హరి అచ్యుతరామ శాస్త్రి గారు తిరువయ్యూరు ఆరాధనోత్సవాలలో జరుగుతున్న అన్యాయాలుూ, pickpockets, త్యాగరాజు ఆలయం condition నాతో చెప్పుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు స్పందించి వ్రాసింది.

శ్రుతి యందు, గతి యందు
లయ యందు, పదమందు
సుగతి చూపు భక్తి మేళవించి,
మతి లేని మానవులకెల్ల నీ
గీతితో ముక్తి నొసగితివోయి త్యాగరాజా!!

మూర్తిత్రయమ్ములో నొకడుగా నిలిచి
మూర్తిత్రయాతీత బ్రహ్మవైతి
తాపత్రయాభూత సంసారమందు
మునిగి, తేలునట్టి మానవాళి
నుద్ధరించునట్టి నావ చుక్కానివైతి.

నీదు గాన రసాబ్ధిలో నోలలాడి
ప్రజలు తమ్ము తానె మఱచినారు
భక్తి, వేదాంతాలు రెండు కూడ
ముక్తి సోపానాలన్న మాట
ఋజువు చేసినావు.

నీ కవితలో గానమున్నదని యొకడు,
లేదు, నీ గానమ్ములోనే కవిత కలదటంచు
మరియొకరు వాదులాడ,
గాన,కవితలకు రాణి, ఆ వాగ్దేవి నిన్ను
వాగ్గేయకారునిగ దీవించెనయ్యా.!

రాజా సత్కారములు త్రోసి పుచ్చినావు
నీ తిరస్కారములు లోకవిదితమాయె
రాజవరుడైన రామచంద్రుండు నీకండగా
నుండ, తేజమ్ము, యశస్సు నిను వరించె.

కుల,మతాల కతీతమైన  గీతి
మనసు స్పందించు మానవాతీత గీతి
కూనలనించి గూనితో నడుచు వృద్ధులంతా
మనసు తీరుగా పాడుకొను భావనగీతి.

ఊరూర వెలసినవి నీ విగ్రహాలు
దేశదేశాల పుట్టె నీ నామ సంఘాలు
కుక్కగొడుగులవలె పుట్టుకొచ్చినాయి
ఒక్కడైన నీపాటలో మాట తీరు చక్కగా గ్రహియించి నడుచుకోలేదు.

నీవున్న తిరువూరు ఒక క్షేత్రమాయె
నీదు ఆరాధన జగద్వ్యాప్తమాయె
నీవూరు చూడ ధైర్యమ్ము నాకు లేదు
నా ధనము దోచెదరను భయము తోను.

అందుకని నిన్ను నిత్యమ్ము తలచుకొనుచు,
కాలమ్ము వెళ్లదీయుదు నా ఇంటిలొనే
కలకాలమ్ము నీ కృతుల భావమ్ములన్ని
కలపి, రంగరించి నా మదిలోన పోసికొందు.

Posted in August 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!