ఇటీవలి కాలంలో పుంఖానుపుంఖాలుగా వెల్లువెత్తుతున్న లఘుకవితా ప్రక్రియల పోకడ విమర్శకుల ఆక్షేపణకు గురి అవుతున్నప్పటికీ జోరు తగ్గకుండా కవుల కలాలనుండి కవితా శరాల పరంపర నానాటికీ పెరుగుతూనే ఉంది. బలమైన కవితా వస్తువు అభివ్యక్తి ఉండి కవి సమర్ధవంతంగా కవిత్వీకరించగలిగినప్పుడే ఆ ప్రక్రియ కాలానికి నిలబడుతుంది. కాబట్టి ప్రక్రియలు ఎన్నైనా రానివ్వండి. నష్టమేముంది? అని వాదించే వారున్నారు. పైగా కవిత్వాన్ని జనసామాన్యానికి దగ్గరగా తీసుకువెళ్ళడం, సామాన్య పాఠకులకు కూడా రచనా జిజ్ఞాస రేకెత్తించి తామూ కవులుగా మారగలమనే విశ్వాసం వారిలో ప్రోది చేయడం అదనపు లాభాలుగా చెప్పవచ్చు. సోషల్ మీడియా ప్రభావం, పెరుగుతున్న అంతర్జాల పత్రికల పుణ్యమాని ఉదయం వ్రాసిన కవితను మధ్యాహ్నమే అచ్చులో చూసేసుకోగలగడం, స్టేటస్ లో, గ్రూపుల్లో పంచి మురిసిపోవడం వారిలోని మొలకెత్తబోయే కవి లక్షణాన్ని దెబ్బ తీస్తాయనే స్పృహ వర్ధమాన కవులలో ఉంటే వారు కుకవులుగా మారే ప్రమాదం నుండి బయటపడవచ్చు.
ఏదేమైనా ఫోనును ఆటలకో మరో అనారోగ్యకర కాలక్షేపానికో వాడకుండా ధ్యాసంతా చదవడం, వ్రాయడం..ఇలా అక్షరం మీద పెట్టడం శుభ పరిణామమే కదా! అది ఈ ప్రక్రియలు చేసే అసలు సిసలైన భాషాసేవగా భావించవచ్చు. ఒక కవిత వ్రాయాలంటే ముందు మంచి పాఠకుడిగా మారి వంద కవితలు చదవాలని తెలుసుకోవాలి.
ఇక ఈ నెల ప్రక్రియ విషయానికొస్తే గత నెలలాగే మరో చందోబద్ద మాత్రానియమ సహిత అంత్యానుప్రాస నియమ ప్రక్రియను పరిచయం చేసుకుందాం. ఈ నూతన లఘుకవితా ప్రక్రియ పేరు "హరివిల్లు". పేరు చాలా ఆకర్షణీయంగా ఉంది కదా! ప్రక్రియ కూడా హరివిల్లులాగే సప్తవర్ణ శోభితమై వైవిధ్య అంశాలను అందంగా వెల్లడించగలిగేలా సరళ సుందరంగా ఉంటుంది.
సామాజికం, ఆధ్యాత్మికం, భావుకత్వం ఏ అంశం తీసుకున్నా ద్రవం పాత్ర ఆకారాన్ని సంతరించుకునట్లు సులభంగా కవి భావన హరివిల్లుగా ఒదిగిపోతుంది. హరివిల్లు నూతన లఘుకవితా ప్రక్రియ రూపకర్త శ్రీ మామిడి రమేష్ గారు. వీరు గ్రేడ్ వన్ తెలుగు ఉపాధ్యాయులుగా ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నివాసి.
ఈ ప్రక్రియ ప్రారంభమై 14 నెలలు కావస్తోంది. వాట్స్ అప్ గ్రూప్ ‘హరివిల్లు’ ద్వారా 200మంది పైగా ప్రతిరోజూ ఐచ్చికాంశాల హరివిల్లులతో సందడి చేస్తుంటారు. ఈ గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే:
"రోజుకు ఒక హరివిల్లు మాత్రమే వ్రాయాలి."
"ప్రతిరోజూ సాయంత్రం ఆనాడు వ్రాసిన హరివిల్లులనుండి ఉత్తమ కవితల్ని ప్రథమ, ద్వితీయ, తృతీయ, కొన్ని ప్రోత్సాహక ..అలా ప్రకటిస్తారు." దీని వలన ప్రతి కవికీ తాము తమ రచనా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుని విజేతగా నిలవాలనే ఆసక్తి పెరుగుతుంది. తద్వారా నాణ్యమైన హరివిల్లుల సృజన జరుగుతుంది. అంతే కాక వంద, రెండు వందలు, మూడు వందలు... అలా రచించిన కవులకు బిరుదు సహిత పురస్కారపత్రం వాట్స్ అప్ వేదికగా ప్రదానం చేయడం జరుగుతుంది.
- శతక హరివిల్లుల సృజనకు - హరివిల్లు కవిమిత్ర బిరుదు (140 మంది అందుకున్నారు)
- ద్విశత హరివిల్లుల సృజనకు - హరివిల్లు కవిరత్న బిరుదు (60 మంది అందుకున్నారు)
- త్రిశత హరివిల్లుల సృజనకు - హరివిల్లు కవిభూషణ్ (15మంది అందుకున్నారు)
- 400 హరివిల్లుల సృజనకు హరివిల్లు కవి విభూషణ్
- 500 కు హరివిల్లు కవిశ్రేష్ట ప్రకటింపబడ్డాయి.
రోజుకొకటే అనే నియమం వలన నాణ్యమైన సృజన జరుగుచున్నది.
ప్రక్రియ రూపకర్త అక్షర జలపాతాలు పేరుతో హరివిల్లు సంపుటి వెలువరించగా ఇప్పటికే 25 మంది తమ వ్యక్తిగత హరివిల్లుల సంపుటులను వెలువరించారు. మరో 25 మంది తమ సంపుటులను సిద్దం చేస్తున్నారు. ఇది హర్షణీయం.
ఈ కార్యక్రమాల నిర్వహణలో మామిడి రమేష్ గారికి సమర్ధవంతమైన స్నేహితుల అండ లభించడం వారి అదృష్టమేనని చెప్పాలి. శ్రీ వి.టి.ఆర్.మోహన రావు, సీరా ప్రసాద్ వెన్నెముకగా నిలబడగా పరిశీలకులుగా చిట్టి మధు, గొబ్బూరి గంగరాజు, సిరికొండ మంజుశ్రీ, సీర ప్రసన్న గార్లు నాలుగు స్తంభాలుగా తమ బాధ్యతను సమర్ధవంతంగా సక్రమంగా నిర్వహిస్తున్నారు.
హరివిల్లులు ఎలా వ్రాయాలో ఆ ప్రక్రియ నియమాలేంటో ఇప్పుడు చూద్దాం.
హరివిల్లు నూతన లఘు కవితా ప్రక్రియ నియమాలు:-
- ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి.
- ప్రతిపాదంలో 8నుండి 12 మాత్రలు మాత్రమే ఉండాలి.
(తెలుసు కదా! గురువు రెండు మాత్రలు,లఘువు ఒక మాత్ర) - 2,4 పదాలలో చివర అంత్యప్రాస ఉండాలి.
- 4 పాదాలూ కలిపి చదివినపుడు భావాత్మకంగా ఉండాలి.
రూపకర్త ఉదా:
హృదయం మేఘమైతే
భావం కురిసే జల్లు
సాహిత్యాకాశంలో
కైత విరిసే హరివిల్లు.
అర్ధమైందనుకుంటున్నాను. ఇప్పుడు మరింత అవగాహన కోసం నేను వ్రాసిన హరివిల్లులు కొన్ని:
తెలుసుకోరా నరుడా!
బ్రతుకే ఒక గ్రంథమని
గుర్తెరుగుము మానవుడా!
మనసే నిజ నేస్తమని (1)
తరువులను తెగనరుకు
తప్పిదము మానాలి
తమ తప్పు దిద్దుకొను
యోచనను చేయాలి (2)
దోసెడు అక్షరాలు
కవితగా పండుతాయి
భావ కుసుమ తావియై
మనసంతా నిండుతాయి (3)
కన్నీటికి కారణాలు
కనుదోయికి తెలియవులే
విషాదమో వినోదమో
హృదయానికి ఎరుకేలే (4)
ప్రణయసుధా కావ్యాలను
స్వప్నించే కలమౌతా
సామాజిక హక్కులకై
నినదించే గళమౌతా (5)
గాయపరచవద్దంటూ
కత్తినడిగి లాభమేమి?
కన్నీటిని దాయమంటు
కంటినడిగి ఫలమేమి? (6)
వచ్చే నెల మరో ప్రక్రియతో పలకరిస్తాను. అంతవరకూ హరివిల్లులు వ్రాస్తుండండి. ఇక సెలవా మరి?
హరివిల్లు ప్రక్రియ గురించి చాలా ఆద్భుతముగా వివరించారు.
అద్భుతంగా హరివిల్లు ప్రక్రియను పరిచయం చేసిన శ్రీమతి గుడిపూడి రాధికా రాణి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు… చక్కని విశ్లేషణ ద్వారా క్లుప్తంగా వివిధ ప్రక్రియలను పరిచయం చేయడంలో రాధికా రాణి గారిది ఓ భిన్నమైన శైలి… అభినందనలు మేడమ్ గారు…
లఘు కవితా ప్రక్రియ హరివిల్లు గురించి చాలా చక్కగా వివరించారు. రాయగలిగే శక్తి కల్గి ఉండికూడా చాలా మంది సరైన వేదిక లేక నిస్తేజంగా ఉండిపోతున్నారు. ఆశావహులులలో నిద్రాణమై ఉన్న కవితాభినివేశాన్ని అందరికీ పరిచయం చేస్తూ వారిలో ఉత్తేజం కల్గించడమే నేటి నూతన కవితా రీతుల సదాశయము. రోజూ రెండు వందల మంది కవులు/కవయిత్రులతో కవితలు రాయిస్తూ వారిని ప్రోత్సహిస్తూ హరివిల్లు ప్రక్రియ ఆ ఆశయం నెరవేర్చిందనే చెప్పాలి.
వృత్తిరీత్యా గణితోపాధ్యాయినియైనా ప్రవృత్తిరీత్యా తెలుగు సాహిత్యంలో దాదాపు అన్ని నూతన ప్రక్రియలలో కవితలు రాస్తూ నేటి ప్రక్రియలన్నింటిలో మంచి అభినివేశం కల మీరు ఇలా అన్ని నూతన ప్రక్రియలను పరిచయం చేస్తూ హరివిల్లు కవితా లక్షణాలను కూడా పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. అందుకుగాను మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.