Menu Close
balyam_main

పంచతంత్రం కథలు

- దినవహి సత్యవతి

పండిత మిత్రులు

01_panchatantram

అనగనగా ఒక ఊర్లో నలుగురు మిత్రులు ఉండేవారు. వారికి చిన్నతనంలోనే  దేశాంతరాలు వెళ్ళి గొప్ప విద్యలు నేర్చుకోవాలన్న కోరిక కలిగింది.

ఒక ప్రతిష్ఠాకరమైన విద్యాలయాన్ని ఎంచుకుని, నలుగురూ బయలుదేరి వెళ్ళి, అక్కడ సకల విద్యలూ క్షుణ్ణంగా అభ్యసించి అందరిచేతా గొప్ప పండితులని కొనియాడబడ్డారు. వారి పాండిత్య ప్రతిభకు ఎంతో సంతసించిన గురువులు తమ శిష్యులకి  విలువైన, ఉపయోగకరమైన శాస్త్ర  గ్రంథాలను బహుమతిగా ఇచ్చారు.

గ్రంథాలను చేతబట్టి తమ ఊరికి తిరుగు ప్రయాణమయ్యారు ఆ నలుగురు మిత్రులూ.  కొంతదూరం వెళ్ళాక వారు వెళుతున్న రహదారి  రెండుగా చీలింది.

‘మిత్రమా ఇప్పుడు మనం ఎటు వెళ్లాలి?’ సందేహం వెలిబుచ్చాడు ఆ నలుగురిలో ఒకడు.

ఇంతలో ఒక శవాన్ని మోసుకుంటూ కొందరు ఆ రెంటిలో ఒక దారమ్మట స్మశానం వైపుగా కదిలి పోయారు.

అందులో మరొకడు తన వద్ద ఉన్న గ్రంథంలో చూసి ‘ఇందులో నలుగురూ నడిచి వెళ్ళేదే బాట అని వ్రాసి ఉంది కనుక మనం అ శవాన్ని మోసుకెళుతున్న వారి బాటనే వెళదాము’ అన్నాడు.

మిత్రుడి మాటకు మిగిలిన ముగ్గురూ అంగీకరించారు. అందరూ ఆ బాటను నడిచి స్మశానం చేరుకున్నారు. అక్కడ వారికి ఒక గాడిద కనిపించింది.

అప్పుడు మరొకడు తన వద్ద ఉన్న గ్రంథం తెరచి ‘సంతోషం కలిగినప్పుడు, ప్రమాదం సంభవించినప్పుడు, తిండి దొరకనప్పుడు, శత్రుభయం కలిగినప్పుడు, రాజ సభ దగ్గర, స్మశానం దగ్గర ఎవరు కనబడతారో వారే బంధువు అని ఇందులో వ్రాసి ఉంది’ అన్నాడు.

ఆ మిత్రుడు చెప్పిన మాటల ప్రకారం ‘ అవును ఈ గాడిదే ఇక మన బంధువు’ అంటూ దాని చుట్టూ చేరారు ఆనందంగా.
అంతలో అటుగా ఒక ఒంటె వచ్చింది. దానిని  చూసి మరొకడు తన వద్ద ఉన్న గ్రంథం తెరచి ‘ధర్మం అతి వేగముగా ప్రయాణించును’ అని చదివి ’ఒంటె వేగంగా ప్రయాణిస్తుంది కాబట్టి ఆ ధర్మం మరెవరో కాదు ఈ ఒంటె’ అన్నాడు.

అప్పుడు నాలుగోవాడు తన వద్ద ఉన్న శాస్త్ర గ్రంథం తెరచి ‘ఇష్టులైన వారిని ధర్మానికి బధ్ధులుగా చేయాలని తెలుపబడింది’ అని చదివాడు.

‘మనకు ఇష్టులైన వారంటే బంధువులే కదా! ఇప్పుడు మన బంధువు ఈ గాడిద. శాస్త్రంలో చెప్పిన ప్రకారం దీనిని ధర్మానికి అంటే ఈ ఒంటె కి బధ్ధురాలిని చేయాలి’ అన్నాడు ఒకడు.

‘అవును, అవును..అన్నారు’  మిగిలినవాళ్ళు.

వెంటనే ఆ నలుగురు మిత్రులూ కలిసి గాడిదను ఒక తాడుతో ఒంటె మెడకి కట్టారు.

ఇదంతా చూసిన దారినపోయే వాడొకడు ప్రక్కనే చెరువు వద్ద బట్టలు ఉతుక్కుంటున్న చాకలికి చెప్పాడు.

అది విన్న చాకలి పరుగు పరుగున వెళ్ళి ‘నా గాడిదని వదిలి పెట్టండి’ అని అరుస్తూ తన చేతి కర్రతో నలుగురు మిత్రులనీ బాదడం మొదలుపెట్టాడు.
ఆ దెబ్బలు భరించలేక ‘కుయ్యో మొర్రో’ అంటూ తమ గ్రంథాలు చంకన పెట్టుకుని అక్కడనుంచి పరుగు లంకించుకున్నారు  నలుగురు మిత్రులూ.
అది చూసిన వారందరూ ‘ఎవరో వెర్రిబాగుల వాళ్లలా ఉన్నారు’ అనుకుని నవ్వుకున్నారు.

నీతి: లోకజ్ఞానం లేనప్పుడు ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా వ్యర్థమే.

Posted in January 2019, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!