మన ఆలోచనా సరళి మన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావంతో మిళితమై ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ ‘మన ఆరోగ్యం మన చేతిలో’ శీర్షిక నేను మొదలుపెట్టడానికి కారణం ఇక్కడ స్థానికంగా ఒక వ్యక్తికి ఆరోగ్యపరంగా జరిగిన అనర్ధమే అని చెప్పగలను. ఆ సంఘటన తరువాత సలహాల రూపంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా నేను ఆ దురదృష్ట సంఘటనలో భాగస్వామిని అయినందున నా మనసులో ఎంతో అశాంతి నెలకొన్నది. ఆ అలజడి నాలో రేకిత్తించిన ఆలోచనా ప్రవాహానికి అక్షర రూపం కల్పించడం మొదలుపెట్టాను. మొదట నేను అనుకున్నది రెండు లేక మూడు, మహా అయితే ఐదు సంచికలలో నా ఆవేదనను పంచుకుంటానని అనుకొన్నాను. కానీ అది జీవనది వలె నా మదిలో ఆలోచనల ఉధృతిని పెంచుతూ నేటికి 25 భాగాలు పూర్తయ్యాయి. ఈ శీర్షికకు నాకు లభిస్తున్న ముడిసరుకు, స్థానికంగా నేను చూస్తున్న, నా చుట్టూ ఉన్న, నేను గమనిస్తున్న సామాజిక మాధ్యమాల ప్రపంచమే అని చెప్పగలను.
“Let nothing be done without a purpose.” అని మనకు చిన్నప్పుడే బోధించారు. నిజమే ఒక పని అనుకొన్నప్పుడు సృజనాత్మక దృష్టితో ఆలోచించి, దానికి ఒక రూపాన్ని నీ మెదడులో రూపొందించాలి. ఆపైన దానిని ఆచరణలో పెట్టాలి. కొన్ని సార్లు నీవు డిజైన్ చేసినది ఒకటి ఏర్పడినది మరొకటి కావచ్చు. తప్పులేదు. మరల ప్రయత్నించు. అలాగే నీవు చేసిన పనియొక్క సార్ధకత ఏమిటి అనే విషయం మీద నీకు ముందుగానే ఒక అవగాహన ఉండాలి. అది నీ పనితనాన్ని, నీ సామర్ధాన్ని రెట్టింపు చేసే మంచి పనిముట్టు. ప్రతి రోజు ఒక కొత్త ఆలోచన, సరికొత్త తలంపు మనకు వస్తూనే ఉంటాయి.
డబ్బు సంపాదన అనేది నీ మానసిక ఆలోచనా విధానం మీద ఆధారపడి, అదృష్టం కూడా తోడైతో నీవు అనుకున్న పురోగతి సాధించగలవు. నీకు డబ్బు ఉండి అది ఇతరులకు ఇవ్వడం అనేది అత్యంత సులభం. కానీ నీలో ఉన్న లేక ఏర్పడిన లేక ఎన్నో సంవత్సరాల తరువాత సాధించిన బౌద్ధిక సంపద (unique intellectual property) నీకు మాత్రమే సొంతమౌతుంది. దానిని ఇతరులకు ముఖ్యంగా భావితరాలకు అందించాలంటే ముందుగా నీలో అందుకు అనువైన సంకల్పం కలగాలి. అలాగే ఆ ధర్మాలను స్వీకరించే వారు కూడా మానసికంగా అందుకు సిద్ధం కావాలి. నీవు అందించే బుద్ధికుశలత యొక్క ప్రాధాన్యతను ఎదుటివారు సరిగా అర్థం చేసుకున్నప్పుడే దానికి సరైన సార్థకత లభిస్తుంది. నీలో ఆలోచనల రూపంలో నిలువచేయబడిన ఆ స్థితిజ శక్తిని, కాలంతో పాటు నీవు చలనశక్తి రూపంలో ఇతరులకు అందజేయవలసి ఉంటుంది. అందుకు ఎంతో ఓర్పు, నేర్పు అవసరం అవుతాయి.
కాలం అనేది చాలా విలువైనది. గతించిన కాలాన్ని మరలా పొందలేము. అందుకనే అనుకున్నది, మన మనసుకు నచ్చిన ఏ విషయాన్నైనా శోధించి, సాధించి, అనుభవిస్తే కలిగే మానసిక సంతృప్తి అనంతం. అటువంటి సంతృప్తికర జీవితానుభవాలను కొన్నింటిని చేజిక్కించుకుని జీవన ప్రవాహంలో ఎదురీదుతూ, జీవనగమనంలో పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి ఒకసారి వెనుకకు తిరిగి చూసుకుంటే మన గతంలోని ఆ తీపి అనుభవాలు మనలో మరలా ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మరి అటువంటి అనుభవాలు ఏమీ లేకుండా మన జీవితాన్ని సమాజంలో హోదా కోసమో, డబ్బు సంపాదన కోసమో మాత్రమె వెచ్చిస్తే అందులో అనుకున్నంత ఆత్మసంతృప్తి కలగదు. ఇది నేను ప్రత్యక్షంగా నా స్వీయ అనుభవంతో మరియు నాకు సన్నిహితులులైన మిత్రుల ద్వారా విన్న అక్షర సత్యాలు.
మనిషిని మనిషిగా చూడటం అనేదానికి జనాలు స్వార్థ చింతన, హోదా, డబ్బు, పలుకుబడి అనే రంగులు అద్దుతూ బ్రతుకుతున్నారు. మన జీవితం ఒక రైలు ప్రయాణం వంటిది. ఎంతోమంది మనతో పాటు ప్రయాణిస్తుంటారు. మధ్య stations లో ఎక్కుతుంటారు, దిగుతుంటారు. వారిలో కొంతమంది మనతో మాటలు కలిపి సన్నిహితులుగా మారుతారు. కొందరు అంటీ అంటనట్టు ఉంటారు. కొందరు మనసుతోనే మాట్లాడతారు. మనం ఏ station లో దిగిపోతామో మన చేతిలో లేదు. కాకుంటే మన ప్రయత్నంగా పలానా station వరకు ప్రయాణిస్తే బాగుంటుందని ఆశించి అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకుంటూ అందుకు తగిన వసతులను ఏర్పరుచుకొని, తగినన్ని జాగ్రత్తలు తీసుకుని మనుగడ సాగిస్తాము. మంచి స్నేహితులనే వారు మనకు మొదట్లోనే తారసపడితే వారు దిగిపోయిననూ మనతో వారు గడిపిన మధుర సమయాలు మనలను మరల వారి వద్దకు చేరుస్తాయి. వాటితో కలిగే ఆనందం అనంతం. అటువంటి ఆనందకర శక్తి సూత్రాలను మనం మరిచిపోతే నష్టం మనకే కానీ ఎదుటివారికి కాదు. కనుక హోదాలను, అంతస్తులను పక్కన పెట్టి ఒక మనిషిగా మనం ఎదుటివారిని ముఖ్యంగా బాల్య మిత్రులను, ఆప్త మిత్రులను గౌరవించాలి. నీవు ఈ హోదాలో ఉన్నావు, నీ చుట్టూ ఎంత సంపద ఉన్నది, నీ పరివారం అంతా ధనవంతులేనా, ఒకే వర్గం వారా? తదితర barricades అంటే అడ్డుకట్టలను విస్మరించాల్సిన కనీస బాధ్యత మన చేతిలోనే ఉంది. మంచి మిత్రులను, ఆప్తులను, కుటుంబ సభ్యులను, మనవారు అనుకున్న వారిని ఎప్పుడూ విస్మరించకూడదు.
నీవు రిటైర్ అయిన తరువాత నీ హోదా, స్థాయి అలాగే కొనసాగుతాయి అంటే అది జరగదు. కానీ నీవు చేసిన మంచి పనులు, నీవు ఆ స్థాయిలో ఇతరులతో మెలిగిన విధానం నీకు ఓక ప్రత్యేక గుర్తింపును తెస్తుంది. అది నీతోనే ఉంటుంది. ఉదాహరణకు నీవు ఆఫీసర్ గా ఉండి రిటైర్ అయినప్పుడు నీ క్రింద పనిచేసిన బంట్రోతు కానీ, నీ డ్రైవర్ కానీ కొన్ని సంవత్సరముల తరువాత కూడా నిన్ను గుర్తించి పలుకరిస్తే కలిగే సంతృప్తి అనన్యము.
మరొక్క విషయం ఏంటంటే, మనం ఒక స్థాయిని చేరి రిటైర్ అయిన తరువాత, మనం సాధించిన పరిణతి, సంపద, ప్రజ్ఞ, అనుభవం, గుర్తింపు తదితర అంశాలు మనలను ఒక చట్రంలో నిలబెడతాయి. ఆ తరువాతి కాలంలో మనం ఎంతసేపు ఆ చట్రంలోనే తిరగడం తప్ప మన మైండ్ సెట్ లను మార్చుకొని వేరే పంథాలో వెళ్ళలేము కనీసం ఆలోచించలేము. ఎందుకంటే ఏదో అయిపోతుందన్న భయం. మరి ఆ భయాన్ని తొలగించుకొని మనం స్వేచ్ఛా ప్రపంచం లోకి అడుగు పెట్టాలంటే అందుకు ఎంతో మానసిక పరిపూర్ణత, ఆత్మావలోకనం అవసరం. అది చెప్పినంత సులువు కాదు. నా మటుకు నేనే ఆ చట్రంలో నుండి బయటకు వెళ్ళాలనే ప్రయత్నించి విఫలమవుతున్నాను. అందరికీ చెప్పడం అంత సులువుకాదు ఆచరించడం.
ఈ విశాల విశ్వంలో, మన స్థాయి, మన మనుగడ పోల్చుకుంటే అసలు గుర్తింపదగిన సంఖ్య ఏదీ లేదు. మరి ఎందుకీ ఆరాటం, పోరాటం, అనవసర పితలాటకం. ఈ ఆరాటాలు, పోరాటాల ద్వారా మనం పొందేది ఏమిటి అంటే అనవసరమైన జీవన సమస్యలు, ఆరోగ్య ఒడిదుడుకులు, మానసిక వత్తిడులు. ఇక్కడ కూడా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది.
‘సర్వే జనః సుఖినోభవంతు’