ఒక కవిత కోసం
మల్లెతీగకు ఆసరా ఇచ్చిన
ముళ్ళకంచె లాలిత్యాన్ని
మండే సూర్యుని గుండెలో
దాగివున్న జీవకోటి మంత్రజలాన్ని
అక్షరసత్యాలుగా, అణువిస్ఫోటనాలుగా
చూపే ఒక కవిత కోసం వెతుకుతాను.
వెలుతురుకు దూరమైన
చీకటిపార్శ్వపు గాయపు గొంతుకలను
కలిసి ప్రయాణిస్తున్న ఎన్నటికీ కలుసుకోని
వ్యక్తుల భావ సంఘర్షణని
కళ్ళకు కట్టినట్టుగా, కథ చెప్పినట్టుగా
ఉన్న ఒక కవితకోసం వెతుకుతాను.
ఉనికి కోల్పోతున్నప్పుడు
ఊతమిచ్చిన ఆయుధసంకల్పాన్ని
ఆది, అంతం లేని కాలంలో
పలికిన అనంత భరతవాక్యాలను
అచ్చుగుద్దినట్టుగా, గుండెకు హత్తుకునేట్టుగా
సాగే ఒక కవిత కోసం వెతుకుతాను.
చదివిన ప్రతి కవిత,
అద్దంలో ప్రతిబింబం
చూసినట్టుగా ఉండాలని
ఒక అంతులేని ఆరాటం.
నా కవితా మార్గానికి ఒక సోపానం.
నైస్ పోయెమ్ సర్ 🌹