Menu Close
మర్మదేశం (ధారావాహిక)

ఘాలి లలిత ప్రవల్లిక

ఘాలి లలిత ప్రవల్లిక

అందరి దృష్టి ఆ నక్షత్రాల గుంపులమీద పడింది.

"వాటిని ఏమంటారో మీకు తెలుసా?"అని ప్రశ్నించింది ఆ గొంతు. తెలియదు అన్నట్టుగా అందరూ తలలు అడ్డంగా ఊపారు.

'వాటిని క్లస్టర్ గెలాక్సీలు అని అంటారు. ఇలాంటి కొన్ని క్లస్టర్ గెలాక్సీ లను కలిపి సూపర్ క్లస్టర్ గెలాక్సీ అని అంటారు' అని పలికింది ఆ వాణి.

"అంకుల్ నీ వాయిస్ వినబడుతోంది. నువ్వు కనబడటం లేదు ఎక్కడున్నావ్?" అడిగారు వాళ్ళు.

"జవాబుచెప్పంకుల్" ఏక కంఠంతో పిలిచారు అందరూ.

'భయపడకండి నేను మీతోనే ఉన్నాను. మీ కంటికి కనిపించకుండా' చెప్పాడు మేథా.

'ఏం నువ్వు మాకు ఎందుకు కనిపించవు?' అడిగాడు దినేష్.

"నేను మీకు రక్షణ గా ఉన్నాను కదా కనిపిస్తే ఏమి? కనిపించకపోతే ఏమి? రండి అందరూ' అని పిలిచాడు మేధా.

అందరూ కలిసి ఫ్లయింగ్ సాసర్ లోకి ఎక్కేసారు. ఖగోళ వింతలు ఎన్నో వాళ్ళ కళ్ళముందు కదిలిపోతున్నాయి.

"అటు చూడండి అటు చూడండి అది ఎంత కాంతి తో మెరిసిపోతోందో" ఆశ్చర్యంగా అన్నాడు దినేష్.

అందరి దృష్టి ఆ తెల్లని మెరిసే రిబ్బన్ వంటి పాలపుంత పై పడింది.

"దానిని మందాకిని అంటారు". అంది శార్వాణి.

"మందాకినికాదు అది క్షీరసాగరం" అన్నాడు కౌషిక్.

"అది ఏది కాదు అది పాలవెల్లి" అన్నాడు దినేష్.

"దానిని మిల్కీ వే అనికూడా అంటారు. అంతే కదా ఇందాక మీరు అన్న ఆకాశగంగ, పాలపుంత, మందాకిని, క్షీరసాగరం లాంటి పేర్లతో కూడా పిలుస్తారు. అంతే కాదు మనం ఈ గెలాక్సీ లోనే ఉన్నాము, మనం సూర్యుడు అని పిలిచే నక్షత్రం కూడా ఇందులోనే ఉంది” అన్నాడు చరణ్.

"ఈ పాలపుంత కేంద్రానికి సూర్యుడు 30 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లుగా ఈ మిషన్ నాకు చూపించింది అన్నాడు." కౌషిక్ తన చేతికమర్చిన వాచ్ లాంటి దాంట్లో చూస్తూ చెప్పాడు ఆశ్చర్యంగా.

"ఈ పాలపుంతలో 10 వేల కోట్లకు పైగా నక్షత్రాలు ఉన్నాయి అన్నాడు." ఆశ్చర్యంగా దినేష్ తనకిచ్చిన మిషన్లో చూస్తూ ...

"కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందిట" శార్వాణి తన మిషన్లో చూస్తూ చెప్పింది.

"బలే బలే మనం కూడా అదేవేగంతో ప్రయాణం చేస్తే ఎంత బాగుంటుందో భలే త్రిల్లింగ్ గా ఉంటుంది". అన్నాడు కౌషిక్.

"అమ్మో అంత వేగమే నేను కళ్ళు తిరిగి కింద పడిపోతాను". భయంగా అన్నాడు దినేష్.

"ఒరేయ్ పిరికోడా అన్నింటికీ భయపడతావ్. నీ భయం ఫ్రీజ్ అయిపోనూ. మేమంతా ఉన్నాంగా నిన్ను కింద పడనిస్తామా ఏమిటి? ఓసారి చూడు ఫీల్ భలే ఉంటుంది. మేథా ప్లీజ్ మమల్ని ఆ వేగంలో తీసుకెళ్ళావా" రిక్వెస్ట్ గా అడిగాడు చరణ్.

"మీరు అంతకన్నా ఎక్కువ వేగంతోనే ప్రయాణిస్తున్నారు". అన్నాడు మేథా.

"ఈ మండలంలో లక్షల నక్షత్రాలలో మన సూర్యుడూ ఓ నక్షత్రం. మనఈ పాలపుంత నక్షత్ర మండలం సర్పిలాకారనక్షత్ర మండలం. పాలపుంత నక్షత్ర మండలపు కేంద్రానికి చాలా దూరంలో ఒక అంచుకు దగ్గర్లో ఈ సూర్యుడు ఉన్నాడు. అంటే మనం పాలపుంత అనే ఒక నగరానికి సబర్స్ లో ఉన్నాము అన్నమాట. మనం సూర్యుని చుట్టూ పరిభ్రమించిన్నట్టుగానే పాలపుంతలో తారలన్ని కేంద్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. సూర్యుని దగ్గర ఉన్న గ్రహాలు ఎలా ఎక్కువ వేగంతో తిరుగుతున్నాయో పాలపుంతలో కేంద్రానికి దగ్గరలో ఉన్న తారలు కూడా అలాగే ఎక్కువ వేగంతో పరిభ్రమిస్తాయి. మన సూర్యుడికి ఆ గెలాక్సీ కేంద్రం చుట్టూ ఒక ప్రదక్షిణ చేయడానికి 200 మిలియన్ సంవత్సరాలు పడుతుంది.

సూర్యుడు హెర్ క్యులి అనేపేరుగల తారా రాశి దిక్కుగా కదులుతున్నాడు. పాలపుంతకు కాస్త క్రిందగా బుల్లి గెలాక్సీ భూమిక చంద్రుడిలా. దానిని సాడిటేరియస్ మరుగుజ్జు గెలాక్సీ గమనిక అంటారు." అంటూ పాలపుంత గురించి క్రేన్ వివరించాడు.

"మనం సూర్యుని భగవంతునిలా కొలుస్తాము కదూ!" అన్నాడు చరణ్.

"రథసప్తమి రోజున సూర్యుడికి పొంగలి నైవేద్యం కూడా పెడతారు." అంది శార్వాణి.

"అయితే మనం ఆ సూర్యుని చూసి వద్దాము. దేవుడు కదా చూసేసి వరాలు అడిగేసి వద్దాం. ప్లీజ్ మేథా మమ్మల్నిఅక్కడికి తీసుకు వెళ్ళవు?" బ్రతిమాలుతున్నట్లుగా మేథా నడిగాడు దినేష్.

"మనం రోజూ చూస్తూనే ఉన్నాం కదా! ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇంకేంటి చూసేది." అన్నాడు కౌషిక్ చిరాకుగా.

"నాకు సూర్యుణ్ణి దగ్గర్నుంచి చూడాలనిపించింది". అన్నాడు దినేష్.

"ఏంటయ్యా ఉండుండి తమరికి ఇలాంటి కోరిక పుట్టింది." ఆశ్చర్యపోతూ అడిగింది శార్వాణి.

"ఏం లేదు మా తాతయ్య రోజూ సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయం చదువేవాడు. ఎందుకు తాతయ్యా ఇవన్నీ అని అడిగితే. 'సూర్యుడు ఆరోగ్యం ఇస్తాడు రా నువ్వూ చెయ్యి' అని చెప్పేవాడు అలాంటి తాతయ్య కు ఇప్పుడు ఆరోగ్యం బాలేదు. ఎందుకు మా తాతకు ఆరోగ్యం ఇవ్వలేదో నిలదీసి అడుగుతాను. ఆ సూర్యు ణ్ణి." ఆవేశంగా అన్నాడు దినేష్.

"ఏంటి ఆ భాస్కరుని దగ్గరికి వెళ్లి భస్మం కాకుండా రాగలము అనే నమ్మకం నీకుందా?!?" ఆశ్చర్యంగా అంది శార్వాణి.

"మనం అయితే వెళ్ళలేము కానీ, మన ఈ అంతరీక్ష మిత్రుల సాంకేతిక పరిజ్ఞానం చూశాక వెళ్ళాలనిపించింది." అన్నాడు దినేష్ ఆశగా.

"అన్ని గ్రహాల లోకి వెళ్ళగలిగాంగానీ ఒక్క సూర్యమండలం లోకి వెళ్ళ లేకపోతున్నాం." మేథా సిగ్గుగా తల వంచుకొని అన్నాడు.

"అవునా! మీరు గొప్ప మేధావులనుకొన్నా! ఇంతేనా ....మా దగ్గరే నా మీ పరిజ్ఞానం ఉపయోగపడేది." వెటకారంగా అన్నాడు దినేష్.

సూర్య మండలం లోకి వెళ్లేందుకు కూడా ఫ్లయింగ్ కప్ నొకదాన్ని రూపొందించాము. అందులో ఒక్కళ్ళు మాత్రమే కూర్చునే అవకాశం ఉంది. అది మమ్మల్ని పర్మిట్ చేయడం లేదు. అది నీకు ఉపయోగపడుతుందేమో! ధైర్యం ఉంటే నువ్వు ప్రయత్నం చేయకూడదు." కొంటెగా అన్నాడు డింగూ.

"ఓరి దేవుడో మిమ్మల్ని అన్నానని నన్ను చంపేందుకు ఇంత కుట్ర చేస్తావా!" భయంగా అన్నాడు దినేష్.

"భలేవాడివే కుట్ర గిట్రా అంటున్నావేమిటి. మనం స్నేహితులు అన్నమాట మర్చిపోయావా. నువ్వు సూర్య లోకం చూడాలని మనసు పడ్డావు కాబట్టి నీకు మార్గం చూపించా వెళ్లడం వెళ్లక పోవడం అనేది నీ ఇష్టం." అన్నాడు డింగు.

"అమ్మో నేనొక్కడినే .....! నాకు భయం బాబు." గుండెల మీద చెయ్యి వేసుకుని భయంగా అన్నాడు దినేష్.

"సరే ఓ పని చేద్దాం. దినేష్ నువ్వు ఆ ప్లైయింగ్ కప్ లో కూర్చో. నా దగ్గర ఓ రసాయనం ఉంది. దాన్ని మేము సేవించి అదృశ్యరూపంలో నీకప్పు తోనే వస్తాం." అన్నాడు మేథా.

"ఆ....ఆ....వస్తారు..... వస్తారు.... నాకసలే భయం. ఊ అంటే ఉలిక్కి పడతా. ఆఖరికి ఒకటికిపోవాలన్న తోడు తీసుకుని పోతా. అలాంటిది కంటికి కనపడని మీతో నేనొక్కడినే ఎలా ప్రయాణం చేస్తాను? వద్దు బాబు వద్దు నేను వెళ్ళను." అన్నాడు భయంగా దినేష్.

"ఎందుకంత భయపడతావ్? నువ్వేమన్నా దెయ్యాల లోకంలోకి వెళుతున్నావా ఏంటి?

ఆది దేవుడు, మన ప్రత్యక్ష దైవం అయిన ఆ ఆదిత్యుని దగ్గరికేగా. జీవపదార్థం జన్మించి, పెరిగి వికసించి, పరిణామం చెందడానికి అవసరమైన వెలుగు వేడిని ప్రసాదించే, మన భూగోళాన్ని జీవ గోళంగా మార్చిన దైవం దగ్గరకేగా" అన్నాడు చరణ్.

"నీకేం బాబు ఎన్నైనా చెబుతావ్ వెళ్ళేది నువ్వు కాదు కదా! నీళ్ళు దాహం తీరుస్తున్నాయి కదా అని ఏటిలోకి దూకుతామా ఏంటి? మనకు ఆహారాన్ని వండి పెడుతోంది కదా అని, అగ్నిని ముద్దాడతామా ఏమిటి? భలే చెబుతున్నావే!" అన్నాడు దినేష్.

"హే ....ఆపరా నీ గోల నిన్ను ఏదో మేము చంపే ప్రయత్నం చేస్తున్నట్లు ఫీలవుతున్నావు." అన్నాడు చరణ్.

1980 వ సంవత్సరంలోనే 'సోలార్ మాక్స్'అనే కృత్రిమ ఉపగ్రహం సూర్యుడికి దగ్గరగా వెళ్లి ఎంతో విలువైన పరిశీలనలు జరిపింది. యులిసెస్ అనే అంతరీక్ష శకటం ద్వారా రాడార్ ని ప్రయోగించారు. మన మేథా వాళ్ళ టెక్నాలజీ ని మనం కళ్ళారా చూసాము. ఎటువంటి తేడాలున్నా మనకు చెప్పరుగా! మంచి అవకాశం చేజార్చుకుంటున్నావ్. దేనికైనా గట్స్ ఉండాలి. నువ్వు ఇలా ఎప్పుడూ భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ విజయం సాధించలేవు. మనిషి తోడు ఎల్ల వేళలా ఉండదు. తెలుసుకో.‌‌ ఇంకా నువ్వు వెళ్ళలేను అని భయపడితే ఇక వెళ్ళిపోదాం పద." అన్నాడు కోపంగా కౌషిక్.

"మా అతిథులు మీరు మీ కోరిక తీర్చడం మా ధర్మం. నాకు ఓ ఆలోచన తట్టింది. సూర్యగోళంలో అన్ని చోట్లా ఒకే రకమైనఉష్ణోగ్రత కలిగి ఉండదు. కొన్ని చోట్ల సౌర జ్వాలలు కలిగి ఉంటే వాటి చుట్టుపక్కల తక్కువ కాంతి గల మచ్చలు కనిపిస్తాయి. ఇదో సౌర వింత. ఆ జ్వాలలు తక్కువగా ఉండే ప్రాంతంలో ల్యాండ్ అవుదాం." అన్నాడు క్రేన్.

"సూర్యుని లో కరోనా, క్రోమోస్పియర్, ఫొటోస్పియర్, కన్వెక్టివ్ జోన్, రేడియేటివ్ జోన్, కోర్ అనే ఆరు పొరలు ఉన్నాయి కదా! ఏదో ఒక దాంట్లో దిగుదాం." క్లాస్ టీచర్ చెప్పినది గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు చరణ్.

"అబ్బో పెద్ద పుడింగి గాడు చెప్పాచ్చాడు. కరోనా దగ్గరికే ఎవరూ వెళ్లలేకపోయారు. ఎక్కడైనా దిగొచ్చంటూ చెప్తున్నాడు." వ్యంగ్యంగా అన్నాడు కౌషిక్.

"ఇక ఆపండి రా బాబు. క్రేన్ అంకుల్ చెప్పినట్లుగా ప్రయత్నిద్దాం. వెళ్ళగలిగితే వెళ్దాం లేకపోతే వెనక్కి వెళ్లి పోదాం." అంది శార్వాణి.

"సూర్యుని కలవాలంటే తప్పకుండా దినేష్ ఆ ఫ్లైయింగ్ కప్ ఎక్కాల్సిందేగా. అది ఎక్కడానికి భయపడుతున్నాడు కదా దినేష్. ఇక మేం చేయగలిగినది ఏదీ లేదు. పోదాం పదండి” అన్నాడు డింగూ.

"పాపం దినేష్ ముచ్చట తీర్చలేక పోతున్నాము.” జాలిగా అన్నాడు క్రేన్.

"లేదు లేదు దినేష్ కోరికను నేను తీర్చ బోతున్నాను." అన్నాడు మేథా.

"ఎలా?" అందరూ ఆశ్చర్యంగా ఏకకంఠంతో అడిగారు.

"ఇలా" అంటూ కళ్ళు మూసుకుని ఏదో మంత్రం జపించాడు మేథా.

***సశేషం***

Posted in August 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!