Menu Close
manusmrithi page title
మూడవ అధ్యాయము (ఇ)

జలధారతో కన్యాదానం చేయడం బ్రాహ్మణులకు ఉత్తమమైనది. మిగిలిన మూడు వర్ణములలో వధూవరులు ఇరువురికీ వివాహం ఇష్టమో కాదో వారిని అడిగి తెలుసుకున్నమీదట వధువు తల్లిదండ్రులు తమ కన్యను వరునికి దానమిస్తున్నట్లు నోటిమాటగా చెప్పినా సరిపోతుంది. వారు ఉదకధారతో కన్యాదానం చేయాల్సిన అవసరం లేదు.

అష్టవిధ వివాహాలలో పుట్టే పుత్రుల గుణగణాలు

బ్రాహ్మ వివాహం కారణంగా పుట్టిన పుత్రుడు పుణ్యాత్ముడు. అతడు తన వెనుక పది తరములవారిని, తన ముందు పది తరముల వారిని పాపముల నుండి తరింపజేస్తాడు. అంటే అతడు తనను తానే కాక, తన పితరులను, పుత్రులనూ, పౌత్రులనూ మొత్తం ఇరవై ఒక్క తరముల వారిని పాపరహితం చేస్తాడు.

దైవ వివాహం కారణంగా జన్మించినవాడు తనతో పాటు తన వెనుక ఏడు తరముల వారిని, ముందు ఏడు తరముల వారిని పాపవిముక్తులను చేస్తాడు. ఆర్ష వివాహం వల్ల పుట్టినవాడు తనతో పాటు తన వెనుక మూడు తరాలవారినీ, తన ముందు మూడు తరాల వారినీ పునీతులను చేస్తాడు. ప్రాజాపత్య వివాహంలో జన్మించినవాడు తనతో పాటు తన ముందు ఆరు తరముల వారిని, తన వెనుక ఆరు తరముల వారిని రుణ విముక్తులను చేస్తాడు.

బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య వివాహాలలో జన్మించిన పుత్రులు బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుతూ, శిష్టులకు ఇష్టులుగా ఉంటారు.

రూపసత్త్వగుణోపేతా ధనవంతో యశశ్వినః |
పర్యాప్తభోగా ధర్మిష్ఠా జీవంతి చ శతం సమాః || ( 3-40 )

పై నాలుగు రకాల వివాహాల కారణంగా జన్మించిన పుత్రులు రూపము, బలము, సుగుణ సంపద కలిగినవారై, ధనవంతులై, యశశ్వులై (కీర్తి కలవారై), పర్యాప్త భోగులై (అంటే పూర్తిగా తృప్తిచెందే విధంగా సకలభోగాలూ అనుభవించినవారై), ధర్మిష్ఠులై (అత్యంత ధార్మికులై), శతం సమాః (నూరేళ్లు - సంస్కృతంలో శతం అంటే నూరు అనీ, సమా అంటే సంవత్సరము అనీ అర్థం) జీవిస్తారు.

నిందాత్మకమైన ఆసుర, గాంధర్వ, రాక్షస, పైశాచ వివాహాలనే నాలుగు దుర్వివాహాల కారణంగా జన్మించిన పుత్రులు శిష్ట జనులను హింసించే క్రూరులు, అనృతవాదులు (అసత్యం పలికేవారు), బ్రహ్మధర్మ ద్విషులు (వేద విరోధులు, యాగాది ధర్మ కార్యములను ద్వేషించేవారు) గానూ ఉంటారు.

అనిందితై : స్త్రీ వివాహైరనింద్యా భవతి ప్రజా |
నిందితైర్నిందితా నౄణాం తస్మాన్నింద్యాన్ వివర్జయేత్  ||  ( 3 -42)

అనిందితయైన (నిందితురాలు కాని) స్త్రీని వివాహం చేసుకుంటే అనిందితమైన (నిందలులేని) సంతానం కలుగుతుంది. నిందితులను వివాహం చేసుకుంటే నిందితులే పుడతారు. కనుక నరులకు నిందితులను వివర్జించడమే (వివాహం విషయంలో నిందితురాలైన స్త్రీని, నిందాత్మకమైన నాలుగు రకాల వివాహాలను వదిలెయ్యడమే) మంచిది. నిందాత్మకమైన వివాహాల కారణంగా  నిందితులే జన్మిస్తారనీ, నిందితురాలైన స్త్రీకి జన్మించే సంతానం నిందితులుగానే ఉంటారనీ, బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య వివాహాల కారణంగా జన్మించేవారంతా తాము పుణ్యలోకాలు పొందడమే కాక తమ వెనుక మరియు ముందరి తరాలవారికీ పుణ్యలోకాలు ప్రసాదిస్తారనీ మనువు చెప్పిన విషయాలకు ఎలాంటి శాస్త్రీయమైన ఆధారమూ లేదు. అవి కేవలం నమ్మకాలు మాత్రమే. మనం గతంలో అనుకున్నట్లే అసలు పుణ్యలోకాలనేవి కూడా కేవలం నమ్మకాలే. ఒకే తల్లిదండ్రులకు భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన పిల్లలు (దుష్టులు, సన్మార్గులు) పుట్టడం మనం చూస్తున్నాం. మన ఇతిహాసాలు, పురాణాలలోనూ ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. అలాంటి ఒక్క ఉదాహరణ చూద్దాం. పులస్త్య బ్రహ్మ కుమారుడైన విశ్రవసుడు సుమాలి కుమార్తె  కైకసిని వివాహం చేసుకుంటే పుట్టిన రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖల స్వభావాలలో ఎంతటి వైవిధ్యం ఉందో మనకు తెలుసు. విశ్రవసుడు కైకసిని నిందాత్మకమైన వివాహం చేసుకుని ఉంటే పుట్టినవారందరూ క్రూరులు, దుర్మార్గులు, వేదవిరోధులుగానే ఉండాలి. పుణ్యప్రదమైన వివాహం చేసుకునివుంటే వారికి పుట్టిన పిల్లలంతా పుణ్యాత్ములుగానూ, ధర్మనిరతులుగానూ ఉండాలి. రామాయణంలో చెప్పబడినదాని ప్రకారమే రావణుడు వేదవేదాంగాలను ఆపోసన పట్టినవాడు. సకల శాస్త్ర పారంగతుడైన మహా జ్ఞాని. పరమ శివ భక్తుడు. నిష్ఠాగరిష్ఠుడు కూడా. అయితే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళనుకునే తరహా మొండితనం కలవాడు. అతడు కేవలం తన చెల్లెలు శూర్పణఖకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా సీతను అపహరించి చేయకూడని తప్పు చేశాడు. విభీషణుడు యుక్తాయుక్త విచక్షణ తెలిసిన విజ్ఞుడు. తన అన్న రావణుడి మేలు కోరి అతడు ఎప్పుడూ మంచి సూచనలే చేసినా వాటిని రావణుడు పెడచెవిని పెట్టాడు. ఇక కుంభకర్ణుడిదీ, శూర్పణఖదీ మరొక తీరు. ఇలాగే జరిగిన ఒకే వివాహానికి దంపతులకు విభిన్న స్వభావాలు కలిగిన పలువురు జన్మించారనడానికి మన సాహిత్యం నుంచే ఇలా ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కనుక జరిగిన వివాహం ఏ తరహాదనే దానినిబట్టి పుట్టే సంతానం తీరుతెన్నులు ఆధారపడివుంటాయనేది కేవలం ఒక విశ్వాసం మాత్రమే. దానికి ఎలాంటి  హేతుబద్ధత గానీ, శాస్త్రీయ పునాది గానీ లేదనేది స్పష్టం.

అనులోమ వివాహం

పురుషుడు సవర్ణ స్త్రీ (తన వర్ణమునకు చెందిన స్త్రీ) ని వివాహం చేసుకున్నప్పుడు గృహ్యసూత్రాలలో హస్తగ్రహణ సంస్కారం విషయమై చెప్పబడిన పద్దతిని పాటించి పాణిగ్రహణం చేసుకోవాలి. అసవర్ణ స్త్రీని వివాహం చేసుకునేటప్పుడు ఈ కింది నియమాలు పాటించాలి.

ఒక బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహం చేసుకునే సమయంలో బ్రాహ్మణుడి చేతిలో ఉన్న ఒక శరము (బాణము) యొక్క కొనను ఆమె పట్టుకోవాలి. అదే వైశ్య కన్యక అయితే ఆమె తాను వివాహమాడనున్న బ్రాహ్మణుడి లేక క్షత్రియుడి చేతిలోని ప్రతోదమును (మునికోల లేక  చెర్నాకోల) యొక్క చివరను పట్టుకోవాలి. ఒక శూద్ర కన్యక తన పై మూడు వర్ణముల పురుషులను వివాహం చేసుకుంటే అప్పుడామె వారు ధరించిన పై పంచె కొసను పట్టుకోవాలి.

భార్యతో మైథునం

భర్త తన భార్యను సంతోషపెట్టడాన్ని ఒక వ్రతంగా భావించి, ఋతుకాలపు నిషిద్ధ దినములు, పర్వ దినములు మినహా మిగిలిన దినములలో రతియందు కోరికతో భార్యను కూడాలి. స్త్రీలకు స్వాభావికంగా బహిష్టు అయిన షోడశ (అంటే పదహారు) దినముల వరకు ఋతుకాలం అంటారు. దానిలో మొదటి నాలుగు రోజులు నిందితములు. ఆ నాలుగు రోజులలో సజ్జనులు తమ భార్యలతో కలవరు. మిగిలిన ఋతుకాలపు దినములలో పదకొండవ రాత్రి (ఏకాదశి), పదమూడవ రాత్రి (త్రయోదశి) నిందితములు. ఇక మిగిలిన పది రాత్రులు భార్యతో మైథునక్రియకు ప్రశస్తమైనవి.

సాధారణంగా ఒక స్త్రీ కి తరువాత నెలసరి మొదటిరోజునుంచి వెనుకకు 14 నుంచి 12 రోజుల కాలంలో అండకోశం నుంచి అండం విడుదలౌతుంది. క్రమం తప్పక ఇరవై ఎనిమిది రోజులకు నెలసరి వచ్చే ఒక స్త్రీకి బహిష్టు అయిన 14 వ రోజున అండం విడుదల అవుతుంది. అండం విడుదలైన రోజుకు మూడు రోజులు ముందు, మూడు రోజులు తరువాత గర్భధారణకు పూర్తిగా అనుకూలమైనవిగా శాస్త్ర పరిశోధనలలో తేలింది. పదకొండవ రాత్రి, పదమూడవ రాత్రి, అమావాస్య, పున్నమి దినాలలోనూ, పర్వదినాలలోనూ  మైథునక్రియను మనువు నిందితంగా భావించడం కేవలం నమ్మకానికి సంబంధించిన విషయమే తప్ప శాస్త్రీయం కాదు. ఋతుకాలంలో మొదటి నాలుగు రోజులు ఋతురక్త స్రావం వల్ల మైథునక్రియకు అసౌకర్యంగా ఉండే  కారణంగా ఆధునికులు కూడా సాధారణంగా మొదటి నాలుగురోజులు ఆగి, ఋతుస్నానం తరువాతనే తమ భార్యలతో కలుస్తారు. ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనల ప్రకారం ఒక స్త్రీ బహిష్టు అయ్యాక వెంటనే మొదటిరోజునే పురుషుడితో కలిసినా కూడా ఒక్కోసారి గర్భం ధరించే అవకాశాలు ఉంటాయని తేలింది. పురుషుడి వీర్యం స్త్రీపురుష సంయోగం తరువాత ఏడు రోజుల వరకు ప్రభావవంతంగానే ఉంటుంది కనుక స్త్రీ అండం కొంచెం ముందుగా విడుదలయిన సందర్భాలలో ఇలా మొదటి నాలుగు రోజులలో దంపతులు కలిసినా కూడా అరుదుగా గర్భధారణ జరిగే అవకాశముంది.

పైన తెలిపినట్లు మొత్తం స్త్రీ ఋతుకాలం (Menstrual Cycle) పదహారు రోజులలో మొదటి నాలుగు రోజులు, 11, 13 రోజులు తీసేసి, గర్భధారణకు ప్రశస్తమైన మిగిలిన పది రోజులలో 6, 8, 10, 12, 14, 16 రోజుల (సరి సంఖ్య రోజుల) లో దంపతులు కలిస్తే పుత్రులు పుడతారు. కనుక పుత్రుడు కలగాలని కోరుకునే భర్త తన భార్య ఋతుకాలంలోని 16 రోజులలోని సరి సంఖ్య రాత్రులలోనూ, పుత్రిక కలగాలని కోరుకునే భర్త బేసి సంఖ్య రాత్రులలోనూ (అంటే 5, 7, 9,15 రోజులలో) తన భార్యను కలవాలి.

ఫలదీకరణం ఫలవంతమై ఒక స్త్రీ గర్భం ధరించాలంటే స్త్రీ అండం, అండకోశం, ఫాలోపియన్ ట్యూబులు దోషరహితంగా ఉండడం అవసరం. అలాగే పురుషుడి వీర్యంలో తగినన్ని వీర్యకణాలు ఉండడం, వాటికి తగినంత చురుకుదనం ఉండడం కూడా అంతే అవసరం. పురుషుడికి ఒక మిల్లీలీటర్ వీర్యంలో కనీసం రెండు కోట్ల వీర్యకణాలు ఉండాలి. అయితే కొందరిలో వీర్యకణాలు అసలు ఉండకపోవడం (Aspermia  or Azoospermia ) లేక తగినంత సంఖ్యలో లేకపోవడం (Oligospermia) వంటి లోపాలు కూడా ఉంటాయి. మనపై మనం తినే ఆహారధాన్యాలు, కూరగాయలు వగైరాల సాగులో మితిమీరి వాడుతున్న పురుగు మందుల ప్రభావం, పారిశ్రామిక వ్యర్థాల వల్ల  రోజురోజుకూ పెచ్చు పెరిగిపోతున్న జల వాయు కాలుష్యాల ప్రభావం వంటి వాటి కారణంగా ఈ రోజులలో పురుషుల వీర్యంలో నాణ్యత సాధారణ స్థాయిలో ఉండడం లేదు. ఇంకా  మద్యానికి బానిస కావడం, మితిమీరి పొగతాగడం, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వాడకం, బిగుతు వస్త్రాలు ధరించడం, ఎప్పుడూ కూర్చుని ఉండే శారీరక అలవాటు, ఇంటర్నెట్, సెల్ ఫోన్  ల నుంచి వెలువడే రేడియేషన్ వంటి వాటివల్ల కలిగే దుష్ప్రభావాల వల్ల కూడా  వీర్యకణాల సంఖ్య (Count), వాటి చురుకుదనం (Motility) ఎక్కువ మంది పురుషులలో తగిన స్థాయిలో ఉండడం లేదు. పురుషులకు సత్ఫలితాల కోసం సరైన వైద్య చికిత్స, జీవనశైలి, అలవాట్లలో మార్పులు వంటివి తప్పనిసరి. శరీరంలో తగినంత వీర్యం ఉత్పత్తి కాని  పురుషులు వైద్య సలహా మేరకు మందులు వాడుకుంటూ రోజు విడిచి రోజు శృంగారంలో పాల్గొనడమూ ప్రయోజనకరమే. మనువు విధించినట్లు పున్నమి, అమావాస్యలు, పర్వదినాలు, ఋతుకాలం 16 రోజులలో మొదటి నాలుగు రోజులు, పదకొండవ, పదమూడవ రోజులు శృంగారానికి వర్జనీయాలనే నియమంలో మాత్రం శాస్త్రీయత కంటే నమ్మకం పాలే ఎక్కువగా కనిపిస్తున్నది.

పురుషుని శుక్రం (వీర్యం) అధికమైనప్పుడు మగ పిల్లవాడు, స్త్రీ శోణితము ఎక్కువగా ఉన్నప్పుడు ఆడపిల్ల జన్మిస్తారు. అవి రెండూ సమానంగా ఉన్నప్పుడు నపుంసకుడు కానీ అమడలు (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిసి  కవలలుగా కానీ)  జన్మిస్తారు. శుక్ర, శోణితములు రెండూ అసలు లేకున్నా, లేక తగినంతగా లేకున్నా అసలు సంతానమే కలగదు.

శాస్త్రీయంగా చూస్తే తల్లి తన శిశువుకు సాధారణంగా 40 వారాలకు (పది నెలలకు) జన్మనిస్తుంది. అదే కవలలు(Twins) అయినట్లయితే 36 వారాలకే అంటే నాలుగు వారాల ముందే పుడతారు. త్రిక శిశువులు (Triplets) 33 వారాలకు, చతుష్టయాలు (Quads) 31 వారాలకే జన్మిస్తారు. స్త్రీలు కొందరు  ఒకే ఋతుకాలం (Menstrual Cycle) లో ఒకటి కంటే ఎక్కువ అండాలను విడుదల చేయడం (Hyperovulation) కూడా జరుగుతుంది. ముఖ్యంగా సంతాన సాఫల్యం కోసం చికిత్సలు చేయించుకున్నవారిలో ఇలాంటివి సర్వసాధారణం. అలాంటి సందర్భాలలో  ఒకేసారి రెండు అండాలు ఫలదీకరణం చెందడం కారణంగా కవలలు జన్మిస్తారు.

ఇక పురుషుడి వీర్యం అధికమైనప్పుడు మగపిల్లవాడు, స్త్రీ శోణితము ఎక్కువగా ఉన్నప్పుడు ఆడపిల్ల జన్మిస్తారని మనువు చేసిన నిర్ధారణ అప్పటి పరిమితమైన శాస్త్ర విజ్ఞానం ఆధారంగా చేసినదే. అండం ఫలదీకరణానికి ఒక్క వీర్యకణం సరిపోతుంది. చురుగ్గా ముందుకు కదలి, ప్రతికూలతలను అధిగమించి, ఆ నెల విడుదలైన అండాన్ని ముందుగా చేరుకునే వీర్యకణం దానిని ఫలదీకరిస్తుంది. ఆధునిక వైద్య పరిశోధనలు ఆడ, మగ శిశు జననాలకు కారణాలను మరింత లోతుగా విశ్లేషించాయి. ప్రతి మానవ జీవకణం లోనూ 23 జతల అంటే మొత్తం 46 క్రోమోజోములు ఉంటాయి. ఈ 23 జతలలో రెండు జతలు సెక్స్ క్రోమోజోములు. స్త్రీ అండంలో ఉండే క్రోమోజోముల జత (X, X) కాగా పురుష వీర్య కణంలో ఉండే  క్రోమోజోముల జత (X, Y). స్త్రీ అండం, పురుష బీజకణం సంయోగం చెందినప్పుడు పురుష వీర్యకణంలోని X క్రోమోజోము స్త్రీ అండంలోని X  క్రోమోజోముతో కలిస్తే ఆడ శిశువు (X, X) పుడుతుంది. పురుష వీర్యకణంలోని Y క్రోమోజోము స్త్రీ అండంలోని X  క్రోమోజోముతో కలిస్తే మగ శిశువు (X, Y) జననం జరుగుతుంది. అండం ఫలదీకరణం చెంది, కణ విభజన ద్వారా అది పిండంగా అభివృద్ధి చెందుతూ, 7 వారాల తరువాత స్త్రీ లేక పురుష శిశువుగా రూపొందడం మొదలౌతుంది. ఇక ఆ తరువాత మాత్రమే పిండంలో స్త్రీ లేక పురుష శిశువు లక్షణాలు పరీక్షలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పురుషులు లేక స్త్రీలు తీసుకునే ఆహారం వారికి పుట్టే బిడ్డ లింగాన్ని నిర్ణయిస్తుందనేది కొందరికున్న అంధ విశ్వాసం మాత్రమే. పురుషులు, స్త్రీలు ఇరువురిలోనూ ఉండే టెస్టోస్టిరోన్ (Testosterone) అనే హార్మోన్ పురుషుడిలో ఉండవలసిన స్థాయికన్నా తక్కువగానో, లేక స్త్రీలో ఉండవలసిన దానికన్నా ఎక్కువగానో ఉన్నప్పుడు అబ్బాయి పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్ర పరిశోధనలలో తేలింది. కనుక సరి సంఖ్య రాత్రులలో భార్యతో  కలిస్తే మగ బిడ్డ, బేసి రాత్రులలో కలిస్తే ఆడ బిడ్డ జన్మిస్తారని మనువు పేర్కొన్నది కూడా కేవలం అశాస్త్రీయమైన నమ్మకమే. అంతేకాదు. పురుషాధిక్య సమాజంలో అందరూ పురుషుడు పుట్టాలనే కోరుకోవడం మరొక వైచిత్రి. రాజ్యాల రక్షణ అవసరాల రీత్యా, వ్యవసాయం మొదలైన జీవనోపాధికి సంబంధించిన వృత్తుల రీత్యా సమాజానికి, కుటుంబానికి పురుషుల అవసరం ఎంతగానో ఉండేది. స్త్రీకి  వీరమాత గానూ, వీరపత్నిగానూ, మగ బిడ్డల తల్లిగానూ సమాజంలో అపారమైన గౌరవం లభించేది. అందుకే వారు కూడా మగ సంతానం కోసమే పలవరించేవారు. తండ్రికి, ఇతర పితృదేవతలకు అంత్యేష్టి మొదలు అన్ని శ్రాద్ధ కర్మలు చేయాల్సింది కుమారుడే కనుక, ఎలాగైనా పురుష సంతానం పొందడమే నాటి తండ్రుల ఏకైక లక్ష్యం. ఇందుకోసం ఉన్నత వర్ణాలవారు, ధనికులు ఖర్చుకు వెనకాడకుండా పుత్రకామేష్టి (పుత్రుడిని కోరుకుంటూ చేసే ఇష్టి అంటే యజ్ఞం), పుం సవనం వంటివి చేసేవారు. ఇప్పటికీ ఇలాంటివి చేస్తున్నవారు ఇంకా ఉన్నారు. అయితే వీటి కారణంగా పురుష సంతానం కలుగుతుందనేది కేవలం అశాస్త్రీయమైన విశ్వాసం మాత్రమే.

స్త్రీ ఋతుకాలమైనట్టి 16 రోజులలో మొదటి నాలుగు రోజులు, పదకొండు, పదమూడు దినములు, పవిత్రమైన పర్వదినములు. అమావాస్య, పౌర్ణమి దినములు మినహాయించి, మిగిలిన రాత్రులలో తన భార్యతో సంగమించే ఒక పురుషుడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ అతడు పవిత్రమైన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నట్లే.

కన్యాశుల్కం కూడనిది

కన్యాదానం సందర్భంగా వరుడి నుంచి కన్య తండ్రి అణ్వపి (అణువంతైనా-కొద్దిగానైనా సరే) గృహ్ణీయాచ్ఛుల్కం (గృహ్ణీయాత్ + శుల్కం) అంటే కన్యాశుల్కం (ఓలి లేక ఉంకువ) తీసుకొనరాదు. ఒకవేళ ధనలోభంతో అతడు ఏ కాస్త ఓలి తీసుకున్నా అతడు తన కుమార్తెను అమ్ముకున్నట్లే.

స్త్రీధనాని తు యే మోహాదుపజీవంతి బాంధవాః |
నారీయానాని వస్త్రం వా తే పాపా యాంత్యధోగతిమ్ || ( 3- 52 )

ఒక కన్యకు ఆమె తండ్రి లేక చుట్టాలు వివాహ సందర్భంగా ఇచ్చిన ధనాన్ని (స్త్రీ ధనాన్ని), నారీ (చెలికత్తెలు, సేవికలను), యానములను (వాహనాలు, వాటిని లాగే జంతువులనూ యానము అనే అంటారు), వస్త్రాలను ఆమె భర్త వైపు బంధువులు తాము ఉపయోగించుకుంటే, అలాంటి వారు పాపం మూటగట్టుకుని అధోగతి పాలౌతారు.

కన్య తండ్రి ఆర్ష వివాహంలో వరుడినుంచి ఒక ఆవును, ఒక ఎద్దును ఓలిగా తీసుకోవడం సవ్యమేనని కొందరు చెపుతారు. కానీ అది మృషమే ( అసత్యమే). అల్పంగా ఓలి తీసుకున్నా కన్న తండ్రి కన్యను అమ్ముకున్నట్లే అవుతుంది తప్ప వేరే కాదు.

ఏ స్త్రీ వివాహం సందర్భంగా ఆమె తల్లిదండ్రులు లేక బంధువులు కన్యాశుల్కం (ఓలి) తీసుకొనరో అది కన్యా విక్రయం కిందికి రాదు. అయితే వివాహం సందర్భంగా ఎవరైనా బంధుమిత్రులు వధువుకు ఇచ్చిన కానుకలు మొదలైనవాటిని వధువు వైపు వారు తమ అవసరాలకు ఎట్టి పరిస్థితులలోనూ వినియోగించుకోకూడదు. వారు ఆ కానుకలను, ధనాన్ని ఆ వధువు వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆమె తన ఇష్టానుసారం ఖర్చుచేయడానికే వదిలెయ్యాలి. అలాంటి స్త్రీధనాన్ని తమ అవసరాలకు వినియోగించుకున్న వధువు తల్లిదండ్రులు, బంధువులు కన్యాశుల్కం స్వీకరించినట్లే కనుక ఆ వివాహం కన్యావిక్రయం కిందే లెక్క.

వివాహ సమయంలో వరుడు ఇచ్చిన ధనాన్ని, కానుకలను తమ కుమార్తె భవిష్యత్ అవసరాల నిమిత్తం ఆమెకే స్త్రీధనంగా ఇచ్చివేయడమే కాదు. ఆ తరువాత కూడా వధువు మేలుకోరే ఆమె తల్లిదండ్రులు, తోబుట్టువులు (అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు), భర్త, మరదులు ఆ స్త్రీల శ్రేయస్సునే కోరుతూ తరచు వారిని భోజనాలతో, నూతన వస్త్రాలు, భూషణాలతో పూజించాలి.

పై శ్లోకాల సారాన్ని బట్టి మనువు కాలం నాటికి, అంతకు పూర్వం విస్తృతంగా ప్రాచుర్యంలో ఉన్న కన్యాశుల్కం అనే ఆచారం శిష్టులు, సంస్కారవంతులచే అసహ్యించుకోబడుతున్నట్లు, క్రమంగా అది ఒక దురాచారంగా భావించబడుతున్నట్లు మనం గ్రహించగలం. వధువు తండ్రి కన్యాశుల్కం తీసుకుంటే అది కన్యావిక్రయం కిందికే వచ్చే పాపిష్టి చర్యగా మనువు తేల్చడం ఇక్కడ గమనార్హం. సమాజంలో స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బహుభార్యాత్వం (Polygamy), స్త్రీలు తక్కువగా ఉన్నప్పుడు బహుభర్తృత్వం (Polyandry) వంటి ఆచారాలు వ్యాప్తిలో ఉండేవని చరిత్ర పరిశోధకుల అంచనా. ఆ ఆచారాలు వ్యాప్తిలో ఉన్నప్పుడు అవే అందరికీ ఆదర్శాలన్నట్లు నాటి పాలకులు, ఆదర్శపురుషులు, దేవతలు కూడా అవే ఆచారాలను పాటించినట్లుగా కావ్యాలు, కథలు అల్లారు. స్త్రీల  జనాభా అధికంగా ఉన్న సమాజంలో వారందరికీ పురుషులు దొరకని నేపథ్యంలో వరకట్న దురాచారం ప్రబలితే, స్త్రీల జనాభా తక్కువగా ఉన్నప్పుడు వధువు తండ్రి వరుడి నుంచి ఓలి తీసుకుని ఆమెను తెగనమ్మే కన్యాశుల్క దురాచారం ప్రబలింది. మనువు కాలానికి కన్యాశుల్క దురాచారం నాటి సమాజాన్నుంచి నిష్క్రమిస్తున్నట్లు మనం గ్రహించవచ్చు. అయితే వివాహం విషయంలో పాటించిన ఈ దురాచారాలు సమాజంలో స్త్రీపురుష జనాభా నిష్పత్తి, ఇతర సామాజిక ఆవశ్యకతలను బట్టి మళ్ళీ మళ్ళీ వస్తూ పోతూ ఉండే చక్రీయ పరిణామాలు (Cyclic Changes) గానే  మనం గ్రహించాలి. స్త్రీ ధనంగా ఇవ్వబడిన మొత్తాలను వధువు పుట్టింటివారు ఖర్చుచేయరాదనే నియమం, వివాహం తరువాత కూడా పుట్టింటివారు, అత్తింటివారు ఒక వధువును భోజన, వస్త్రాదులతో పూజించాలనే నియమం మనువుకు స్త్రీల పట్ల కొంత ఉదార వైఖరి ఉందనే దానికి తార్కాణాలుగా నిలుస్తాయి.

***సశేషం***

Posted in August 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!