అది నడి వేసంగిలో మిట్ట మధ్యాహ్నం. ఎండ దంచేస్తోంది. చలవబండిలో ప్రయాణిస్తున్నా కూడా చెమట్లు పడుతున్నాయి. మొహం తీసికెళ్ళి చలవ గవాక్షం దగ్గర పెడితే మాత్రమే కాస్తంత చల్లదనం తగుల్తోంది. ఆ చలవంతా మా దాకా వచ్చేలోపే ఆవిరైపోతోంది. అందుకే కిటికీ అద్దాన్ని కొద్దిగా కిందికి దించాను. ఇంకాస్త దింపితే గాడ్పులు ఈడ్చికొడతాయి. అందుకే హాయిగా కూర్చుని ప్రయాణిస్తున్నా ఆపసోపాలు తప్పడం లేదు.
పక్కనే కూర్చుని శీతల పానీయాన్ని కొద్దికొద్దిగా ఆస్వాదిస్తున్నాడు చింటూ. వాడు చాలా తెలివైనవాడు. వాళ్ళ బడిలో బెంగాలీ పంతులమ్మ వాడి గురించి పదిమందితోనూ చాలా గొప్పగా చెబుతూ ఉంటుంది. అలా చెప్పడానికి కారణం ఆవిడ మాత్రమే వాడి తెలివితేటల్ని అర్థం చేసుకోవడం. వాడి తెలివితేటల్ని మిగిలిన పంతులమ్మలూ పంతుళ్ళూ కూడా అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది? కానీ అందరూ ఆవిడంత సహృదయులు కాలేరు కదా! అందుకే వాడు ఇంటిపని చెయ్యలేదని ఒకళ్ళూ.., బడిపని చెయ్యలేదని ఒకళ్ళూ.., పాఠాలు అప్పజెప్పడం లేదని ఇంకొకళ్ళూ.., అడిగిన ప్రశ్నకి పుస్తకంలో ఉన్న సమాధానం తప్ప అన్ని సమాధానాలు చెప్పి తన అతితెలివిని ప్రదర్శిస్తూ మా మెదళ్ళు తినేస్తున్నాడని మరొకళ్ళూ.., ఇలా వాడి మీద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూ నా బుర్ర జుర్రేస్తూ ఉంటారు.
అయినా వీళ్ళు చెప్పే పాఠాలూ చదువులూ ఊడిగం చెయ్యడానికి తప్ప ఎందుకు పనికొస్తాయి చెప్పండి. నిజానికి వీడిలాంటి మేధావులకి పాఠాలు చెప్పాలంటే ముందా పంతులమ్మలూ పంతుళ్ళూ నిజమైన చదువంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎంతసేపూ వాడు పుస్తకాల్లో లేని సమాధానాలు చెబుతున్నాడని మొత్తుకుంటారే తప్ప వీడి సమాధానాలు సరైనవని ఒప్పుకోవడానికి మాత్రం వాళ్ళ మనసొప్పదు. సరైన సమాధానం పుస్తకంలో ఉన్నా లేకపోయినా సరైందే కదా? మీరైనా చెప్పండా అయ్యవార్లకి.
చింటూగాడు శీతల పానీయం తాగుతూ నన్ను బెలిపిస్తూంటే.., నేను వాడిని బులిపిస్తూంటే.., మా మురిపాలాటల్ని చూసి ముచ్చట పడిపోతున్నాడు మా వాహనాన్ని నడిపే చోదకుడు రాము. అతనిక్కూడా నాలాగే దాహం వేస్తున్నట్లుంది. అందుకే అన్నాడు,"ఇంత హడావిడిగా బయల్దేరితే ఏదో ఒకటి మర్చిపోతాం. దాహం వేస్తే తాగడానికి నీళ్ళుకూడా లేవు.
"నిజమే. నేను కూడా మర్చిపోయాను. అదే మిగిలినవాళ్ళకీ మా చింటూగాడికీ తేడా. మనం నీళ్ళు మర్చిపోయినా వాడు కూల్ డ్రింక్ మాత్రం మర్చిపోలేదు. ఎంతైనా మా పండుగాడు పండుగాడే. అంటూ వాడిని ముద్దుపెట్టుకున్నాను. వాడూ నా ప్రేమకి మురిసిపోతూ నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని గారం గునుస్తున్నాడు. దాన్ని చూసి మా రాము నవ్వుతూ అన్నాడు,"చిన్నబ్బాయ్ గారూ నాకూ దాహం వేస్తోంది. కాస్త కూల్ డ్రింక్ ఇవ్వరా?"
"ఛీ ఎంగులి తాగుతారా?" అంటూ ఒకళ్ళు ఎంగిలిచేసినదాన్ని మరొకళ్ళు తాగితే కలిగే అనర్థాలగురించి రాముడికి పావుగంట వివరించాడు. దెబ్బతో రాము దాహం గాలికెగిరిపోయింది. చివరికి,"పోన్లెండి ఎంగిలొద్దుగానీ బాటిల్ మాత్రం పారెయ్యకండి. ముందు చెరువొస్తుంది. అక్కడ బాటిల్ కడుక్కుని నీళ్ళు పట్టుకుంటే సరిపోతుంది"అన్నాడు.
దానికి చింటూ సమాధానం చెప్పలేదు. అంటే వాడు మా రాముకి ఓ ఝలక్ ఇస్తాడన్నమాట.
చెరువు దగ్గరకొచ్చాం. బండాపి చెరువులో నీళ్ళు తాగిన తరవాత నీళ్ళు ముంచుకోవడం కోసం సీసా అడిగాడు రాము. వాడి దగ్గర సీసా ఉంటేగా? అంటే వాడిప్పుడు సీసా గురించి రాము జన్మలో ఊహించలేని సమాధానం చెబుతాడన్నమాట.
రామూకి సమాధానం చెప్పాడు మా చింటూ,"సీసా ఇంకెక్కడుంది. ఊళ్ళోనే పారేశాను"
“అదేంటి మనకి పనికొస్తుంది పారెయ్యద్దని చెప్పాను కదా?"
"మన వస్తువుని మనకోసం మాత్రమే ఉపయోగించుకుంటే స్వార్థం అంటారు. అదే పదిమందికి ఉపయోగించేలా చేస్తే దాన్ని సహృదయత అంటారు. నేను ఆ బాటిల్ పడేశాను. దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఎవరూ పట్టించుకోని దానికోసం మీరెందుకు తాపత్రయ పడతారు బాబుగారూ అనేది నీ అనుమానం. అలా ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే అది చెత్త ఏరుకునే కుర్రాడి కంట్లో పడుతుంది. అతను దాన్ని ఏరుకుంటాడు. అమ్ముకుంటాడు. దాంతో డబ్బొస్తుంది. ఆ డబ్బుతో వాడు చిన్న కిళ్ళీ కొట్టు పెడతాడు. కోట్లు సంపాదిస్తాడు. ఆ కోట్లతో అనాధాశ్రమాలూ వృద్ధాశ్రమాలూ కట్టిస్తాడు. అందులో ఎంతోమంది పేదలు తలదాచుకుంటారు" అంటూ వాడు చెబుతుంటే రాముగాడికి కలిగిన జ్ఞానోదయం ఎంతని చెప్పమంటార్లెండి. ఎంతైనా మా చింటుగాడి తెలివే తెలివి.
“ఎక్కడికి వెళదాము” అడిగాడు కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు మూర్తి.
“ఎక్కడేముంది మనం వాడుగ్గా తీసుకునే ఆంజనేయులు దగ్గరకే వెళ్దాము అక్కడే కంచి పట్టు చీరలు క్వాలిటీ బాగుండేది. వరలక్ష్మి వ్రతానికి ప్రతి ఏడూ మంచి చీరలు తెప్పిస్తాడు కూడా” అంది స్వప్న.
“ఛాన్స్ దొరికింది కదా అని రెచ్చిపోయి కొనకు. ఒకటో, రెండో కొనుక్కో..” ఆన్లైన్ లో తెప్పించుకోకుండా బయటకు వెళ్దాము ఉదయాన్నే ఎందుకందో అర్ధమై అన్నాడు.
“భయపడకండి.. నాకేం అంత పిచ్చి లేదు” అలిగినట్టుగా అంది.
నవ్వుతూ జనరల్ బజార్ లో ఉన్న ఆంజనేయులు కంచిపట్టు చీరల కొట్టు వైపు పోనిచ్చాడు కారు.
షాపు దగ్గర ఆపి “కారు పార్క్ చేసి వస్తా నువ్వు లోపలికి వెళ్ళు... శానిటైజర్ తీసుకుని వెళ్ళు...మాస్క్ సరిగా వేసుకో.... ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చాడు.
“నా దగ్గర ఉంది” అంటూ మాస్క్ ముక్కుకి, నోటికి సరిగా పెట్టుకుని షాపు లోపలికి నడిచింది స్వప్న. కౌంటర్ దగ్గర మాస్క్ తో కూర్చుని ఉన్నాడు ఆంజనేయులు .. షాప్ లో ఎవరూ లేరు.. అతను రోడ్ మీద తిరుగుతున్న జనం వైపు ఆశగా చూస్తున్నాడు షాప్ కి ఎవరో ఒకరు రాకపోతారా అన్నట్టుగా. లతని చూడగానే అతని కళ్ళల్లోకి వెలుగు వచ్చింది.
“బాగున్నారా ఆంజనేయులుగారూ” అడిగింది స్వప్న.
“ఏదో ఉన్నామమ్మా.. రండి, రండి” సంతోషంగా, ఆప్యాయంగా ఆహ్వానించాడు. స్వప్న పెళ్ళికాక ముందు నుంచీ అదే షాపులో చీరలు కొంటున్నది. ఆమె అక్కచెల్లెళ్ళు, తల్లి అందరూ అదే షాపు లో కొంటారు. ఎన్ని పెద్ద, పెద్ద షో రూమ్స్ వచ్చినా ఆ షాప్ లో ఉన్నంత నాణ్యమైన బట్టలు ఎక్కడా ఉండవని పేరు. ధరలు కూడా రీజనబుల్ గా ఉంటాయి. వెయ్యి రూపాయలు ఎక్కువ చెప్పి, నాలుగు వందలు తగ్గించే టాక్టిక్స్ లేవు అతనికి. ఎంతో నిజాయితీ పరుడు. లిమిటెడ్ కస్టమర్స్ అతనికి. అందరూ కూడా ఎన్నో ఏళ్ల నుంచీ అతని దగ్గర కోనేవాళ్ళే ... అలాంటి ఆంజనేయులు ఇప్పుడు దీన వదనంతో అటూ, ఇటూ తిరుగుతున్న జనానికేసి ఆశగా చూస్తూ అలా కూర్చుని ఉంటె స్వప్న హృదయం తరుక్కుపోయింది.
“ఏంటండి? కస్టమర్స్ ఎవరూ ఇంకా రావడం లేదా” అడిగింది.
నిరాశగా నవ్వాడు “ లేదమ్మా.. అందరూ భయపడుతున్నారు..” అన్నాడు.
“పాపకి పరికిణీ, నాకు చీర..కంచి పట్టులో చూపించండి. కొత్త డిజైన్ ఏమన్నా వచ్చాయా” అడిగింది.
“లేదమ్మా ఎక్కడి నుంచి వస్తాయి.. సంక్రాంతికి తెప్పించిన స్టాక్ అట్లానే ఉంది...రాత్రికి రాత్రి లాక్ డౌన్ అనగానే మూసి ఉన్న షట్టర్ తెరవలేదు.. చీరలు అన్నీ కండిషన్ ఎట్లా ఉందొ కూడా చూడలేదు.. ఇదిగో మళ్ళీ వారం క్రితం తెరిచి చూస్తే కొన్ని చీరలు డామేజ్ అయి ఉన్నాయి.. ఏమనుకోకమ్మా పాతవే ఉన్నాయి.. బాగా తగ్గించి ఇస్తాను తీసుకోండి” అన్నాడు.
మూర్తి ప్రవేశించి “ఎలా ఉన్నారు ఆంజనేయులుగారు” అన్నాడు.
“ఎలా ఉంటాను సార్! బతకలేక బతుకుతున్నాము..
“ అయ్యో.. అంతమాట అనకండి..మళ్ళీ మంచిరోజులు వస్తాయి..” ఓదార్పుగా అన్నాడు.
పట్టు చీరలు నీటుగా సైన్ గుడ్డలో మూటలు కట్టి పెడతాడు అద్దాల మాటున ఉండవు. ఆ మూటలు తీసి తెల్లటి పరుపు మీద పెట్టి, ముడి విప్పుతూ విరక్తి గా అన్నాడు. “ఎప్పుడు సార్! నాకిప్పుడు వయసు డెబ్భై ఐదు.. నా భార్యకి డెభై... మేముంటున్న ఇల్లు తప్ప మాకు పెద్ద ఆస్తులు లేవు. పెద్ద, పెద్ద షో రూములు వచ్చి మా వ్యాపారాలు కొంత దెబ్బ తీసాయి.. ఇదిగో మీలాంటి వాళ్ళ వలన కొంచెం నిలదొక్కుకుని, నడిపిస్తూ వచ్చాము. ఈ మహమ్మారి వచ్చి మమ్మల్ని పూర్తిగా పతనం చేసింది సార్ ... మూడు నెలలైంది.. ఒక్క చీర అమ్మలేదు.. ఒక్క వేయి రూపాయల ఆదాయం లేదు.. నాకున్నది ఒక కొడుకు. ఇద్దరు ఆడపిల్లలు.. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసాను. వాళ్ళు బాగానే ఉన్నారు. నా కొడుకుని నాతోపాటు ఈ వ్యాపారం లో పెట్టాను. వాడికి ఇద్దరు పిల్లలు.. భార్య.. ఎట్లా బతుకుతారు వాళ్ళు. మా గురించి నాకు చింత లేదు..వారం అయింది షాప్ తెరిచి ఎవరూ రాలేదు.. ఇంత వరకు ఒక్క జాకెట్ ముక్క కూడా అమ్మలేదు. ఎట్లా బతకాలో ఏంటో, ఎప్పటికి బాగు పడతామో ఏమి అర్ధం కావడం లేదు... ఈ కరోనా ఇప్పుడప్పుడే తగ్గే ఆశ లేదు.. ఈ పరిస్థితుల్లో ఈ షాపు అమ్మేయడం తప్ప వేరే దారి లేదు అనిపిస్తున్నది”
కంఠం రుద్ధమైంది.. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. చేయి మడిచి జబ్బతో కళ్ళు తుడుచుకున్నాడు. స్వప్న మనసంతా జాలితో నిండిపోయింది. అన్యమనస్కంగా ఆయన చూపించిన చీరలు చూసి, నాలుగు చీరలు సెలెక్ట్ చేసుకుని, రెండు పరికిణీలు తీసుకుని “ఇవి పాక్ చేయండి” అంది..
ఆంజనేయులు ఆమె సెలెక్ట్ చేసుకున్నవన్నీ కవర్లలో పెట్టి, ఆ కవర్లు పెద్ద జూట్ బాగ్ లో పెట్టి ఇచ్చాడు. యాభై అయిదు వేలు అయిన బిల్లు ని డిస్కౌంట్ తో నలభై వేలు చేసాడు.
మూర్తి మౌనంగా నలభై వేలరూపాయల బిల్లు కార్డ్ తో చెల్లించి, “బాధ పడకండి.. తప్పకుండా మంచి రోజులు వస్తాయి” అని మరోసారి ఓదార్చి బయటకు నడిచాడు.. అతన్ని అనుసరిస్తూ “వెళ్లొస్తాను” అని చెప్పింది.
“మంచిదమ్మా ...ఇన్నాళ్ళ తరవాత నాకు వచ్చిన ఆదాయం ఇది.. మీ చల్లని చేత్తో ఇచ్చారు సౌభాగ్యంతో వర్ధిల్లండి” అన్నాడు కంపించే స్వరంతో ...
కారులో కూర్చున్నాక పశ్చాత్తాపం ధ్వనించే స్వరంతో అంది స్వప్న “సారీ! మాట తప్పాను...బిల్లు ఎక్కువ చేసాను.”
కుడి చేత్తో స్టీరింగ్ పట్టుకుని ఎడం చేయి ఆమె చేయి మీద వేసి మెత్తగా నొక్కుతూ “ఐ నో ... నువ్వెందుకు అవసరానికి మించి కొన్నావో నాకర్ధమైంది.. డొనేషన్ ఇస్తే తీసుకోడు కదా!” అన్నాడు
నీళ్ళు నిండిన కళ్ళతో ప్రేమగా నవ్వింది స్వప్న.
"ద్విజూ, నాన్నగారు, చెల్లి, నీవు భోజనానికి రండి" కొడుకుని పిలుస్తూ చెప్పింది ధరణి.
"అలాగే అమ్మా" జవాబిచ్చాడు ద్విజేంద్ర.
"మూడు కంచాలే పెట్టావ్, నీకు"? కూర్చుంటూ భార్యని అడిగాడు గోపాల్.
"నాకు ఆకలిగా లేదులే..." అంటూ వడ్డించసాగింది ధరణి.
ఓ క్షణం భార్యని నిశితంగా చూసిన గోపాల్ కు అర్థమయ్యింది ఆమె ఎందుకలా ఉందో. నిద్రకళ్ళతో మవునంగా కూర్చున్న కూతురు స్వప్న కంచం తీసుకుని అన్నం కలిపివ్వసాగాడు.
"ఆకలి ఎందుకుండదు? నువ్వూ పెట్టుకోమ్మా." అన్నాడు ద్విజేంద్ర.
"తర్వాత తింటాలే...మీరు కానివ్వండి"
"నువ్వొక్కదానివి తినవు. ఆగు నేను పెడతాను."
"అబ్బ.. ద్విజూ..." అంటూ ధరణి కొంచెం అన్నం పెట్టుకుని పెరుగు వేసుకుంది.
"అదేమిటి...అప్పుడే పెరుగు? ఎందుకమ్మా అలావున్నావ్"?
"............"
"మీరేం అడగరేమిటి నాన్నగారు"?
"నీవు అడుగుతున్నావ్ కదరా"
"చెల్లి చూడు ...గుటుకు గుటుకు ఎలా మింగుతుందో"?
"బాగుందిరా...మీ అమ్మ తినటం లేదనా, చెల్లి తింటుందనా...ఎవరి మీద నీ చిరాకు"? చిన్నగా నవ్వుతూ అడిగాడు గోపాల్.
**** **** ****
వంటగది సర్దేసి వచ్చింది ధరణి.
కొడుకు గది దగ్గరకు వెళ్లి "ద్విజూ, నిద్ర పోతున్నావా"? అడిగింది.
"లేదమ్మా...ఏం కావాలి"? చటుక్కున లేచి కూర్చుంటూ అడిగాడు.
ఆమె వచ్చి మంచం పై కొడుకు పక్కనే కూర్చుంది.వాడి భుజాల చుట్టూ చెయ్యి వేసి, కొంచెం దగ్గరగా తీసుకుంది.
"ఏంటమ్మా, ఒంట్లో బాగాలేదా"? అడిగాడు.
కొద్ది క్షణాలు మవునంగా ఉంది.
"నాన్నా,...ఇన్నాళ్లు ఊరిలోనే చదివావు. టెన్త్ అయిపోయింది. కాలేజీలో చేర్చటానికి రేపు నాన్నగారు నిన్ను సిటీకి తీసుకెళుతున్నారు.."
ఓ...అదా అమ్మా నీ బెంగ"? నవ్వుతూ అడిగాడు పదహారేళ్ళ ద్విజేంద్ర.
"నువ్వే కదమ్మ పెద్ద చదువులు చదవాలిరా అంటావు, మళ్ళీ ఈ దిగులేమిటి"?
"అవును నాన్నా, నీవు బాగా చదువుకోవాలి. ఇప్పుడే బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్నావు.
ఇక నుండి నీవు చదువులో, లోకజ్ఞానంలో, ఆఖరికి ఎత్తులో కూడా నన్ను మించిపోతావ్..."వింటున్నాడు ద్విజూ.
"పెద్దవాడివయ్యాక నేను చెప్పేవి వినిపించుకుంటావో లేదో...."
"ఎందుకు విననమ్మా...వింటాను."
"అంటారు కదా అడ్డాల నాడే బిడ్డలు గానీ....." పూర్తి చేయలేదు ధరణి, చిన్నగా నవ్వుతూ ఆగిపోయింది.
అయినా ఆ సామెత ద్విజూ చాలాసార్లు విన్నాడు. అప్రయత్నముగా అతని చూపుడు వేలు ముక్కు క్రింది కి వెళ్ళింది. తల్లి చూడకుండా అప్పుడప్పుడే మొలకెత్తిన నూనూగు మీసాలను తడుముకుంది.
"ముఖ్యంగా నేను చెప్పే రెండు మాటలు నీ వెప్పుడు గుర్తుంచుకోవాలి ద్విజూ...."
"చెప్పమ్మా"
"బయటి ప్రపంచం చాలా విశాలంగా, ఆకర్షణీయంగా., విలాసంగా కనిపిస్తుంది.
నీచుట్టూ వుండే స్నేహితులు కూడా ఏదనిపిస్తే అది చేసేద్దాం....అనేంత ఉత్సా హంగా, స్వేచ్ఛగా వుండొచ్చు.
ఒక్కటి మాత్రం గుర్తుంచుకో...మీతో పాటు ఎంతోమంది ఆడపిల్లలు కూడా చదువుకోవటానికి వస్తారు.
మీలాగే వాళ్ళు కూడా నవ్వుతూ, తుళ్ళుతూ వుంటారు.
ఆడ, మగ, అని కాదు ..మీ వయస్సులో ఆ ఉత్సాహం సహజం.
అంత మాత్రాన వాళ్ళను అసభ్యంగా కామెంట్ చేయటం, వాళ్ళతో అనుచితం గా ప్రవర్తించడం చేయకు.
నేను నిన్ను మరీమరి కోరేది ఇదే. నీ స్నేహితులు ఎవరయినా అలా చేస్తుంటే నీవు వాళ్లకు దూరంగా వుండు. ఆడపిల్లల్ని అశ్లీలం గా మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆగి నన్ను, చెల్లిని గుర్తు చేసుకో.”
ఓ సారి చింటూగాడు చెల్లిని "కొబ్బరి బోండాం లా ఉన్నావే" అంటే నీవేమి చేశావ్"?
"కొట్టి వచ్చాను."
"అలాగే ఆడపిల్లలందరికి అన్నలో... నాన్నలో వుంటారు. వాళ్లొచ్చి పచ్చడి చేస్తారు."
"......."
"మగపిల్లాడి వయినా నాకొడుకు ఎలా నెగ్గుకు వస్తాడో ..ననీ నాకే ఇంత భయంగా వుందే....
చదువులమీద, వాళ్ళ భవిష్యత్తు మీద గంపెడాశ తో పంపుతున్నా ఆడపిల్లల తల్లుల వేదన ఇంకెలా ఉంటుందో వూహించు...."
"ఏమిటి తల్లీ కొడుకుల చర్చలు ఇంకా అవలేదా"? అంటూ వచ్చిన గోపాల్ భార్య అంటున్న చివరి మాటలు విన్నాడు.
కూర్చున్న కొడుకు తల నిమురుతూ, అన్నాడు.
"అమ్మ చెప్పినవి విని బెదిరిపోయి, బిగుసుకు పోయి వుండకు. అందరితో సరదాగా, స్నేహంగా వుండు. నీ ప్రవర్తన అవతలి వాళ్లకి అపకారంగా, మనకు అపకీర్తి తెచ్చేలా లేకుండా చూసుకో, చాలు. మార్కుల కంటే, ఇది ముఖ్యం. పొద్దుపోయింది. ఇంక పడుకోండి" చెప్పాడు గోపాల్.
"పడుకో నాన్నా" అంటూ, భర్తతో పాటు లేచి వెళ్ళింది ధరణి.
తల్లితండ్రుల మాటలను మననం చేసుకుంటూ పడుకున్నాడు ద్విజూ.