Menu Close

Adarshamoorthulu

తమ జీవిత అనుభవపూర్వక గాథల ద్వారా మన జీవితాలలో స్ఫూర్తిని నింపి, ప్రశాంత జీవన సరళికి మార్గ నిర్దేశకులుగా నిలిచిన ఎందఱో మహోన్నత వ్యక్తుల జీవన శైలి గురించిన సమాచారం అందించడమే ఈ ‘ఆదర్శమూర్తులు’ శీర్షిక యొక్క ముఖ్యోద్దేశం. ప్రతి సంచికలో తమ తమ రంగాలలో నిష్ణాతులై, నిస్వార్ధంగా నివసించి అందరికీ మంచి మార్గాన్ని చూపించిన ఒక మహానుభావుడి గురించిన సమాచారం క్రోడీకరించి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము.

మన సిరిమల్లె చతుర్థ వార్షిక ప్రత్యేక సంచిక సందర్భంగా సెప్టెంబర్ 2018 నుండి జూలై 2019 సంచిక వరకు ప్రచురించిన ఆదర్శమూర్తుల జీవిత గాథలు మరొక్కసారి సంగ్రహంగా మీకు అందిస్తున్నాం.

ఈ అంశాలను పూర్తిగా చదువుటకై క్రింద ఇవ్వబడిన శీర్షికలపై క్లిక్ చేయండి.

సెప్టెంబర్ 2018- ఆంధ్రదేశ చరిత్ర చతురాననులు – మల్లంపల్లి సోమశేఖర శర్మ

ఎదిగే గుణం, ఎదగాల్సిన అవసరం ఏ మొక్కకైనా తప్పనిసరి. అలాగే మానవుడు ఏ పని చేసినా అందులో పరిపూర్ణత్వాన్ని సంతరించుకొంటే, ఆ పని వలన పదిమందికి మంచి జరిగితే, అతని కృషి కలకాలం అందరి హృదయాలలో నిలిచిపోతుంది. అట్టి కార్య సాధకులలో ముఖ్యులు, ఎన్నో చారిత్రాత్మక శిలా శాసనాలను పరిశోధించి శాసన పరిష్కర్తలుగా, భాషాకోవిదులుగా, పాతబడిన సాహిత్య గ్రంధాలను, తెలుగు చరిత్రలోని అద్భుత విషయాలను, వాస్తవాలను సంకలనాలుగా ముద్రించి, మన తెలుగు సాహిత్య చరిత్రకారునిగా పేరొందిన శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు నేటి మన సంచిక ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/mallampalli-somasekhara-sharma/

అక్టోబర్ 2018- శ్రీమతి కృష్ణమ్మాల్

ఏ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం .. నరజాతి సమస్తం పరపీడన .... అని మహా కవి శ్రీ శ్రీ అన్నట్లు, మన చరిత్రలో ఎన్నో మాసిపోని మరకలున్న పుటలు ఉన్నాయి. బడుగు ప్రజలను దోచుకొనే బడా బాబులు నాడు, నేడు ఏనాడైనా ఉంటారు. అయితే వారి అన్యాయాలకు అడ్డుకట్ట వేసే అభ్యుదయ వాదులు సామాజిక సేవా మూర్తులు ఎందఱో సగటు సమాజంలో చైతన్యం తీసుకొచ్చే సత్కార్యాలకు శ్రీకారం చుడుతుంటారు. అటువంటి వారినే మనం కారణజన్ములు అంటాం. వారి పుట్టుకకు ఒక ఉద్దేశ్యం ఉంటుంది. వారు అందుకు తగినట్లుగానే తమ జీవితాలను నిర్దేశించుకొని సామాజ శ్రేయస్సు కొఱకు ఎంతగానో శ్రమిస్తారు. అటువంటి వారు పదవులు, పట్టభిషేకాలు, ప్రశంసా పత్రాలు ఆశించి పనిచేయరు. అటువంటి మహా మనిషి, మానవతావాది శ్రీమతి కృష్ణమ్మాల్, నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/srimathi-krishnammaal/

నవంబర్ 2018- చిలకమర్తి లక్ష్మీ నరసింహం

సాధారణంగా చరిత్రను పుస్తకాలలో చదివితే అంతగా బుర్రలోకి ఎక్కదు. అదే దృశ్య శ్రవణ రూపంలో అందరి మనసులకు హత్తుకునే విధంగా చూపిస్తే, వినిపిస్తే, అవలీలగా అందరికీ చేరి వారికి గుర్తుండిపోతుంది. ఈ చిట్కా ఇప్పుడే పుట్టినది కాదు. మన పెద్దవాళ్ళు ఏనాడో ప్రయోగాత్మకంగా చేసి సఫలీక్రుకృతులైనారు. అందుకే నాటి నాటకాలు, వీధి భాగోతాలు, హరికథలు, బుర్రకథలు మొదలు నేటి టీవీ సీరియల్స్ వరకూ అన్నింటికీ మనం బందీలైనాం. ముఖ్యంగా మన పౌరాణికాలు, ప్రబంధాలు సామాన్య ప్రజలకు అతి సులువుగా అర్థమయ్యేటట్లు చేసిన ఆ నాటక రచయితలకు జోహార్లు. అటువంటి ప్రజానాడి తెలిసి తదనుగుణంగా సామెతలు, నుడికారాలు, లోకోక్తులను, జాతాయాలను తన నాటక రచనలలో చొప్పించి, ఆయా పాత్రల ద్వారా సగటు ప్రేక్షకునికి ఎంతో అనుభూతిని అందచేసిన మహా రచయిత, మానవతా వాది, దాదాపు పాతిక వరకు నాటకాలను సృష్టించిన సంఘ సంస్కర్త, జాతీయ, అంతర్జాతీయ సాహితీ పండితుల మన్ననలను పొందిన మహనీయుడు శ్రీ చిలకమర్తి  లక్ష్మీ నరసింహం, నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/chilakamarthi-lakshmi-narasimham/

డిసెంబర్ 2018- శ్రీ అక్కిరాజు రమాపతిరావు

మనకి తెలుగు రచయితలూ, కవులూ, సంఘ సంస్కర్తలూ, ప్రముఖ వ్యక్తులూ, రాజకీయ నాయకులూ చాలామంది ఉన్నారు. తెలుగు ప్రముఖ రచయితలూ, రాజకీయ నాయకులూ, ఇతర ప్రముఖులూ - చాలామంది గురించి ఇవాళ ప్రత్యక్షంగా, అధికారికంగా తెలుసుకోవాలంటే మీకు చాలా తక్కువ మంది దొరుకుతారు. కొందరు కొంతమటుకు గత రచయితలగురించి, వ్యక్తుల గురించి చెప్పగలుగుతారు. కానీ,  గత 65 ఏళ్లలో ఇలాంటి ప్రముఖ వ్యక్తులనెందరినో కలిసి, వారితో ముఖాముఖి చర్చలు జరిపి, వాళ్ళ దృక్పథమేమిటో మనకి ఇవాళ గొప్ప వివరాలతో చెప్పగల విశిష్ట వ్యక్తి నాకు తెలిసి ఒకరే ఉన్నారు. ఆ విశేషమైన వ్యక్తి, స్వతహాగా గొప్ప రచయిత, కవి, పరిశోధనకర్త, ఎన్నో రచనలని ఆవిష్కరించిన మనీషి. ఆయనే నేటి మన సంచిక ఆదర్శమూర్తి - శ్రీ అక్కిరాజు రమాపతిరావు.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/sri-akkiraaju-umapathirao/

జనవరి 2019 - ఆచార్య స్టీఫెన్ హాకింగ్

సాధించాలనే పట్టుదల, సంకల్ప బలం స్థిరంగా ఉంటే, జయం ఖచ్చితంగా మనవైపే ఉంటుందని ఎంతోమంది మహానుభావులు తమ జీవిత అనుభవాల ద్వారా నిరూపించారు. ముఖ్యంగా మనకు తెలియని విషయాల మీద అవగాహన పెంచుకొని నూతన శాస్త్రీయ విషయాలను కనుగొనడంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు అవిరళ కృషి సల్పారు. ఈ భూమిపై నివసిస్తున్న మనకు ఇది అనంత విశ్వం లోని అశేష నక్షత్రాలలో ఒకటైన సూర్యుని కుటుంబంలోని ఒక చిన్న గ్రహం మాత్రమే అని తెలుసు. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర గలిగిన ఆ అనంత విశ్వం గురించి మాత్రం నేటికీ మనకు తెలిసినది ఇసుమంత మాత్రమే.

Stephen Hawking విధివశాత్తు అంగవైకల్యం సిద్ధించినను వెరవక, తన అద్భుత మేధోసంపత్తే పనిముట్టుగా చేసి ఎన్నో అమూల్యమైన అంతరిక్ష విషయాలను అలవోకగా అందరికీ అర్థవంతముగా వివరించిన అనన్య సామాన్యుడు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో గణిత ఆచార్యుడు గా పనిచేసిన ప్రొఫెసర్ స్టీఫెన్ విలియం హాకింగ్ నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/stephen-hawking/

ఫిబ్రవరి 2019 - శంకరంబాడి సుందరాచారి

ఆదికవి నన్నయ్య మొదలు, తిక్కన, ఎఱ్రాప్రగడ కవిత్రయం సాక్షిగా, నాటి నుండి నేటి వరకు ఎందఱో మహానుభావులు, భాషా పండితులు మన తెలుగు సాహితీ భాండాగారాన్ని తమ అనిర్వచనీయమైన రచనలతో నింపి తెలుగు భాషామతల్లికి సదా నీరాజనాలు అర్పిస్తూనే ఉన్నారు. ఒకరు కాదు వందమంది కాదు వేలమంది తెలుగు కవులు తమదైన శైలిలో ఎన్నో రచనలను మనందిరికీ అందించి మనకు భాష మీద మమకారం రెట్టింపు అయ్యేందుకు, మనలో అణగారిపోతున్న భాషా శ్వాసకు ఊపిరి పోసి మన తెలుగు భాష పరిరక్షణకు పూనుకొన్నారు. అటువంటి ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొంది, మన తెలుగు రాష్ట్ర గీతమైన “మా తెలుగుతల్లికి మల్లెపూదండ...” ని రచించిన శ్రీ శంకరంబాడి సుందరాచారి నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/shankarmbaadi-sundraachari/

మార్చి 2019 - రతన్‌ప్రసాద్ (రేడియో చిన్నక్క)

ఏ సామాజిక జీవన స్రవంతిలోనైనా కాలానుగుణంగా శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగేకొద్దీ మనిషి జీవన విధానం మారుతూ వస్తుంది. ఆ మార్పుకు, అభివృద్ధికీ, వార్తా పత్రికలు, ఆకాశవాణి (రేడియో), ప్రస్తుత కాలంలో అయితే టీవీలు, అంతర్జాల మాధ్యమాలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. పాత రోజుల్లో వార్తా పత్రికలు ఉన్ననూ అందరూ చదువరులు కాదు కనుక అర్థవంతమై, ఆరోగ్యవంతమైన భాషా వినియోగానికీ, భావాల ప్రసారానికి రేడియో ఎంతగానో ఉపయోగపడింది.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/rathan-prasad-radio-chinnakka/

ఏప్రిల్ 2019 - శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి

మనిషి జన్మ ఎంతో మహత్తరమైనది. మరి అటువంటి జన్మ మనకు సిద్ధించినందుకు, మన పుట్టుకకు ఒక అర్థం పరమార్థం ఉండాలి. మిగిలిన జీవరాసుల వలె తినడం, నిద్రించడం, యాంత్రికంగా జీవించడం వలన మనకు స్వార్థపూరిత తృప్తి లభిస్తుందేమో కానీ జన్మ సార్థకత మాత్రం సిద్ధించదు.

కొంతమంది మహానుభావుల పుట్టుకకు ఒక నిర్దేశ సూచనలు ముందుగానే లిఖించబడి వారు ఈ భూమి మీద ప్రాణం పోసుకొనిన పిదప అవి కార్యాచరణ దాల్చడం మొదలుపెడతాయి. ఆ కారణజన్ములు మన సమాజ సంస్కృతినీ, పద్ధతులను పదిమందికి పంచి మనిషి జీవన ప్రమాణాలను పెంచేందుకు దోహదపడతారు. అటువంటి మహానుభావుల వరుసలో నిలబడి, తన సాహిత్య ప్రతిభా పాటవాలతో మన ఇతిహాస గ్రంధాలను తెలుగులోకి అనువదించడం మొదలు ఎన్నో శతకాలు, పద్యకావ్యాలు, నాటకాలు వంటి అమూల్య సంపదను మనకు అందించి భావితరాలకు విలువకట్టలేని సాహిత్యాన్ని బహుమతిగా ఇచ్చి తనదైన రీతిలో సహాయ సహకారాలు అందించిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/sripaada-krishnamoorthy-saastri/

మే 2019 - డా. వింజమూరి (అవసారల) అనసూయ

వింజమూరి (అవసారల) అనసూయ గానం శాస్త్రీయ, లలిత, జానపద సంగీతాల త్రివేణి సంగమం. గురువుల దగ్గర నేర్చిన శాస్త్రీయ సంగీతం స్వచ్ఛ గంగ. వారి తల్లి దండ్రులు వెంకట రత్నమ్మ, వెంకట లక్ష్మీ నరసింహారావుగారు. ఇద్దరూ సాహితీపరులే. వారి మేనమామ కృష్ణ శాస్త్రి. ఈ భావకవితా సాహితీ క్షేత్రంలో అనసూయమ్మ స్వేచ్ఛగా, రమణీయంగా సంగీతం కూర్చి పాడుకున్న గేయాలు యమున. భావా సంగీతం లేక లలిత సంగీతం మొదలుపెట్టిన వారిలో అగ్రశ్రేణిలో ఉన్నవారు అనసూయమ్మ. జానపదం సరస్వతి, అంతర్వాహిని. కాల కాలాల నుండి సామాన్య ప్రజలలో ఉన్నదే. ఆ జానపద సరస్వతిని అనసూయమ్మ సభలలో వినిపించారు. అనసూయమ్మ శాస్త్రీయ సంగీత విదుషీమణి. చిన్నతనంలో కచ్చేరీలు చాలా చేశారు. ఆ తరువాత భావ సంగీతం ప్రాచుర్యం పొందుతున్నప్పుడు కొన్ని వందల కచ్చేరీలు చేశారు. అయితే, ఆవిడ జీవితాన్ని అంకితం చేసుకున్నది జానపద సంగీతం కోసం. ఈ ఆదర్శమూర్తుల స్మరణికలో అనసూయమ్మ శాస్త్రీయ సంగీతం గురించి లిప్తముగా, భావ సంగీతం గురించి క్లుప్తముగా, జానపద సంగీతం గురించి విపులముగా తలుచుకుందాము.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/vinjamuri-anasuya/

జూన్ 2019 - డా. వింజమూరి (అవసారల) అనసూయ

మునుపటి సంచికలో వింజమూరి అనసూయ గారి శాస్త్రీయ సంగీతం గురించి లిప్తం గానూ, భావ సంగీతం లేక లలిత సంగీతం గురించి క్లుప్తంగానూ వివరించబడినది. ఈ సంచికలో అనసూయమ్మ జానపద సంగీతం గూర్చి చేసిన అసమాన కృషి గురించి విపులంగా పరిశీలించుదాము.

జానపద గీతాలు

అనసూయమ్మ ఎనిమిదేళ్ల వయసులో కాకినాడలోని సంగీతపు పోటీలలో "నిధి చాలా సుఖమా" పాడబోయి, ఆ ఉదయం ప్రక్కింటి గ్రామఫోనులో విన్న బిడారం రాచప్పగారు పాడిన "మగడొచ్చి పిలిచెరా, పోయి వత్తురా స్వామి" జావళి పాడారు. ఆ రోజులలో (1928) జావళీకి నేటి సినిమా పాటలకున్నంత లోక ప్రియత్వము ఉండేదట. ఆ జావళి పాడిన తరువాత న్యాయ నిర్ణేతలు "బాగా పాడావు కానీ, ఇది శాస్త్రీయ సంగీతపు పోటీ" అని అంటె, "ఓ అది కూడా పాడుతాను అని "నిధి చాలా సుఖమా" పాడి మొదటి బహుమతి గెలుచుకుంది.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/vinjamuri-anasuya-02/

జూలై 2019 - థామస్ ఆల్వా ఎడిసన్

ఆధునిక పరిజ్ఞాన ఆసరాతో, విద్యుత్ రంగంలో వచ్చిన అనూహ్యమైన మార్పులతో, మనిషి జీవన విధానం నేడు LED దీప కాంతులతో వెలిగిపోతున్నది. అయితే దాదాపు 150 సంవత్సరాల క్రితం పరిస్థితిని విశ్లేషిస్తే, నాడు మనిషి సూర్యుని వెలుగు మీదనే ఆధారపడి తన జీవితాన్ని కొనసాగించేవాడు.  సహజ వనరులతో కొవ్వత్తులు, బుడ్డి దీపాలు ఉన్ననూ అవి కేవలం సంపన్నుల వరప్రసాదాలుగా ఉండేవి. నేటి ఆధునిక జీవన విధానంలో సామాన్యునికి కూడా విశేష భోగ వసతులు అందుబాటులో ఉన్నాయి. అందుకు కారణం తమ మెదడులోని ఆలోచనలకు పదునుపెట్టి సరికొత్త విధానాలను, సాంకేతిక వసతులను, పరికరాలను కనుగొన్న ఎందఱో శాస్త్రవేత్తలు. ఆ కోవలోనే పయనిస్తూ తన పరిశోధనల ద్వారా విద్యుత్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు అంకురార్పణ చేసి, నేడు మనం అనుభవిస్తున్న అన్ని రకాల ఆధునిక పరిజ్ఞానానికి మూలపురుషుడు అయిన థామస్ ఆల్వా ఎడిసన్ నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/thomas-alva-edison/

Posted in August 2019, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!