Menu Close
Teneloluku Page Title

పల్లె పదాల నుండి పండిత వాక్యాల వఱకు
అందరినీ అలరించి ఆకర్షించే మనదైన మాతృభాష
తేనెలొలుకు మన తెలుగు సాహిత్య మధురిమలు
మరువగలమా మనం మనిషిగా ఉన్నంతవఱకు

ఎంతో విశిష్టత కలిగిన మన తెలుగు భాషను, సాహిత్యాన్ని మరింతగా పటిష్ఠ పరిచి భావి తరాలకు అందించే బృహత్తర కార్యము మన ముందుంది.

ఈ మధ్యనే ఒక పెద్ద పత్రికలో ధారావాహికగా వచ్చిన ఒక శీర్షికలో మన తెలుగుకు జరిగిన అన్యాయాన్ని ఎంతో సంపూర్ణంగా వివరిస్తూ వచ్చారు. సామాన్య జనుల భాషగా బతికిన తెలుగును, ఆర్య భాష అయిన సంస్కృతంతో నింపి, దాని సహజ రూపాన్ని దూరం చేశారనీ, ఇలా వాడుక తెలుగును సామాన్యుడికి అర్థంకాని స్థాయికి తీసుకెళ్లి పండితులు తెలుగు సాహిత్యాన్ని తమ గుప్పిట్లో ఉంచేసుకున్నారనీ, జనం కళలు, భాష, సాహిత్యాన్ని న్యూనతా భావంలోకి నెట్టేశారనీ ఈ వ్యాసాలు ఆరోపిస్తాయి. వాస్తవంగా చూస్తే వారు చేసిన విమర్శలకు ఒక అర్థముంది, హృదయమూలాలలో దాగివున్న ఆవేదన కనపడుతుంది. నేటి జీవన విధానంలో అందరూ ఆంగ్లం భాషమీద మోజు పెంచుకోవడానికి ఒక కారణమైంది.

ఇక ఇప్పుడు మన ‘అసలు తెలుగు’ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే,

భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించారు. అనగా తెలుగు – హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు) చెందకుండా, తమిళము, కన్నడము, మలయాళము, తోడ, తుళు, బ్రహూయి మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందినదని భాషాశాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు కుయి, కోయ, కొలామి కూడా ఉన్నాయి. తెలుగు భాష దాదాపు 2400 సంవత్సారాల క్రితమే అంటే క్రీస్తుపూర్వం నుండే వాడుకలో ఉందని ఋజువులు ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. సింధులోయ నాగరికతలోని భాష గురించి కచ్చితంగా ఋజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం.

ఇక మనం తెలుగు అంకెలు అని ప్రస్తావిస్తే అందరూ 1,2..10 అనే చెప్తారు. కానీ ౧, ౨, ౩,...౧౦ అని తెలీదు. ఎందుకంటే అవి వాడుకలో లేవు. అందుకే ఆ అంకెలు మీ కొఱకు ఇక్కడ అందిస్తున్నాను.

సున్నా (0) - 0, ఒకటి (1) – ౧, రెండు (2) – ౨, మూడు (3) – ౩, నాలుగు  (4) – ౪, ఐదు (5) - ౫ ఆరు (6) – ౬, ఏడు (7) – ౭, ఎనిమిది (8) – ౮, తొమ్మిది (9) – ౯, పది (10) - ౧౦

ప్రస్తుతం తెలుగు అంకెలు, సంఖ్యలు మన తెలుగు కేలెండర్ లో తప్ప వేరెక్కడా చూడము. అయితే మన సిరిమల్లె లో ‘సామెతల ఆమెతలు’ శీర్షికలో మన తెలుగు సంఖ్యలనే మీరు చూస్తారు.

Tenelolukuప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా, మన తెలుగు భాష విశిష్టతను గుర్తింపుగా ఒక తపాలా బిళ్ళను విడుదల చేశారు. అందులో - "దేశ భాషలందు తెలుగు లెస్స", "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు", "పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న" అని తెలుగుతల్లి బొమ్మతో కలిపి ముద్రించారు.

Posted in July 2018, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *