Menu Close
guruvandanam-title
తే.గీ. తల్లిదండ్రుల పిదపను దైవసముడు
        గురువు; తత్కృపయే కదా గురు(1)కృప యగు
        అదియె కల్గిన నా డసాధ్యంబు లేదు
        శిష్యునకు మూడులోకాల చెందు శుభము
             (1) గొప్ప
కం. గురుశబ్దమ్మున కర్థము
      నిరతము అజ్ఞానతిమిరనిర్హరణమె(1) జ్ఞా
      నరుచిన్(2) బోధన వలనన్
      తరతరముల కందజేయు తత్పరు(3) డతడే
            (1) పోగొట్టుట (2) జ్ఞానమను కాంతిని (3)సామాన్య అర్థము- ఆసక్తి చూపువాడు; పరమ
                 అర్థము- భౌతికము కంటె ఉన్నతమైన భగవత్స్వరూపధ్యానమును సూచించువాడు
సీ. అవతారపురుషుడౌ ఆ కృష్ణపరమాత్మ
          సాందీపుని గురుత్వ మొంది చదివె
     అంజనాపుత్రు డర్యమశిష్యుడై(1) నవ
          వ్యాకరణంబుల అభ్యసించె
     ఏకలవ్యుడు ద్రోణునే ఎంచి గురువుగా
          విలువిద్య నసముడై నిలిచె గాదె?
     గురుకౌశికుం డిడె ఉరుమంత్రవిద్యల
          రామునకును యాగరక్ష సేయ
తే.గీ. భాగవతులకు గురువు శ్రీవ్యాసు; డఖిల(2)
        కవికులానికె గురువయ్యె కాళిదాసు
        శిష్యశిష్యులశిష్యులశిష్యులకును
        గురుపరంపర పరమాత్మవరము కాదె?
            (1) సూర్యుని శిష్యుడై (2) సామాన్య అర్థము - సకలము; పరమ అర్థము - ఖిలము (అంటే
                 శిథిలము) కానిది – నిలిచి యుండునది
తే.గీ. ఆదిశంకరుడే మన కాదిగురువు
        గురుపరంపర శిష్యులకును నిధాన
        మదియె జ్ఞానామృతము పంచి అన్నియెడల
        కారకంబగు మన పురోగమనమునకు
కం. గురుచరణకమలరజమే
      పరిపరి మలినముల పాప(1) పరిశుద్ధ మగున్
      నిరతము శిష్యుల మనములు
      గురుకృప నుడువంగ దేవగురువున కగునే?
            (1) పోగొట్టగా
Posted in July 2018, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *