Menu Close
సుధీర
-- G.S.S. కళ్యాణి --

కరోనా లాక్-డౌన్ తర్వాత అప్పుడప్పుడే కొందరు నగరవాసులు ధైర్యం చేసి, శుభ్రతకు ప్రాధాన్యతను ఇస్తూ ఆరోగ్య సంబంధిత నియమాలను కచ్చితంగా పాటించే కొన్ని రెస్టారెంట్లకు వెడుతున్నారు. అలా ఒక రెస్టారెంటుకు వచ్చి ఒక టేబుల్ వద్ద కూర్చుని మెనూ చూస్తోంది పద్మజ. అంతలో తన పక్కనున్న టేబుల్ వద్దకు ఎవరో వ్యక్తి వచ్చి కూర్చోవడంతో పద్మజ యధాలాపంగా అతని వంక చూసింది. సదరు వ్యక్తి తన ముఖానికున్న మాస్కును తీసి పక్కన పెట్టి మెనూ కార్డును చేతిలోకి తీసుకుంటూ పద్మజ వంక చూసి చిరునవ్వు నవ్వాడు.

ఆ వ్యక్తి మొహంలోకి చూసిన పద్మజ ఏదో గ్రహించినదానిలా, "మీరూ...! స్త్రీ సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టే సుధీర్ గారు కదూ?!!", అంది.

ఆమె గొంతులో ఆనందం, ఆశ్చర్యం గమనించిన సుధీర్ నవ్వుతూ, "అవును! నేనే!", అన్నాడు.

"ఇది కలా? నిజమా?? మిమ్మల్ని ఈ విధంగా కలిసే అవకాశం నాకు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు! నాకు చాలా సంతోషంగా ఉంది! నేను మీ వీరాభిమానినండీ!!", అంటూ సంబరపడిపోయింది పద్మజ.

"మంచిదండీ! ఇంతకీ మీరూ..?", అంటూ పద్మజ వివరాలను అడగకనే అడిగాడు సుధీర్.

“సుధీర్ గారూ! నా పేరు పద్మజ. మీరు సమాజంలో స్త్రీల సమస్యల గురించీ, వాటి పరిష్కారాల గురించీ రాసిన పుస్తకాలన్నీ నేను చదివాను. వాటి ప్రభావం నామీద చాలానే పడింది! నాకు తోచిన విధంగా స్త్రీలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. మీరు చేసే కార్యక్రమాల వివరాలు ప్రతిరోజూ ఫేస్-బుక్ లో పెడుతూ ఉంటారు కదా? నేనవి చూస్తూ ఉంటాను! అవే నాకు ప్రతినిత్యం ప్రేరణను కలిగిస్తూ ఉంటాయి!", అంది పద్మజ ఉత్సాహంగా.

"ఓహో! ఇప్పుడు తెలిసింది!! నాకు అప్పుడప్పుడూ ఉత్తరాలు పంపేది మీరేనా??", అడిగాడు సుధీర్.

"అవునండీ! ఆ పద్మజను నేనే!", గర్వంతో కూడుకున్న ఆనందంతో చెప్పింది పద్మజ.

"ఓ! అవునా..?! మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నిజంగా నా అదృష్టం! ఒక స్త్రీగా పుట్టి, ఇంటికే పరిమితంకాకుండా సమాజంలోని స్త్రీలకోసం అడపాదడపా కార్యక్రమాలను చేపట్టి, వాటిని సమర్ధవంతంగా చెయ్యగలుతున్నందుకు మీకు నా అభినందనలు!!", అన్నాడు సుధీర్.

"సుధీర్ గారూ! చెప్పానుకదండీ మీరే నాకు ప్రేరణ అనీ?! అయినా, మీ గొప్పతనం ముందు నాది లెక్కే కాదు!! ఒక అబ్బాయిగా పుట్టి కూడా మీరు మా స్త్రీ జాతికి ఎంతో చేస్తున్నారు! అందుకు మీరే అభినందనీయులు!! అసలు మీరు రాసిన ఒక్కొక్క పుస్తకం చదువుతూ ఉంటే ఆ రాసినది ఒక పురుషుడన్న విషయం నమ్మశక్యంగా ఉండదు తెలుసా?! అంత బాగా స్త్రీల సమస్యలను మీరు అర్ధం చేసుకోగలిగారు! ఒక స్త్రీగా ఆలోచించగలిగారు! నేటి సమాజంలో స్త్రీలు అనుభవిస్తున్న బాధలను మా కళ్ళకు కట్టినట్లు చెప్పగలిగారు!", అని సుధీర్ ను మెచ్చుకుంటూ అంది పద్మజ.

ఆ మాటలు విన్న సుధీర్ మొహం ఎందుకో గంభీరంగా మారిపోయింది!

"ఈ ప్రపంచంలో పురుషులకిచ్చే గౌరవంలో స్త్రీలకు ఇచ్చేదెంత?", అన్నాడు సుధీర్ మంద్రస్థాయి స్వరంలో.

పద్మజ స్పందించేలోపు సుధీర్, "ఒక ఆడపిల్ల పుట్టగానే కన్నవారు 'అయ్యో! ఆడపిల్లా!' అంటూ ఆమెను భారంగా భావిస్తారు! పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్లాలని చెప్తూ ఆ ఆడపిల్లకు ఎటువంటి సరదాలూ లేకుండా, ఎక్కడికక్కడ ఆమె స్వతంత్రాన్ని కట్టడి చేస్తూ, బొత్తిగా స్వేచ్ఛ లేకుండా పెంచుతారు! పెళ్లి తర్వాత భర్త సంపాదన ఉంటుందన్న నెపంతో ఆడపిల్ల చదువుకు విలువనివ్వరు! యవ్వనంలో మన సమాజంలోని కీచకులవంటి మగవాళ్ళతో ఆమె అనుభవించే బాధ వర్ణనాతీతం! ప్రతిక్షణం 'నేను మగవాడిగా ఎందుకు పుట్టలేదూ?' అని ఆమె తనను తాను ప్రశ్నించుకునేలా చేస్తుందీ లోకం! సాంకేతికపరంగా ఎంతో ప్రగతిని సాధించామని అంటున్న ఈ ప్రపంచం స్త్రీలకు సంపూర్ణ భద్రతను కలిగించలేకపోవడం బాధాకరం! పట్టపగలైనా, ఆడవారు ఒంటరిగా కాలేజీకెళ్లాలంటే భయం! ఒంటరిగా ప్రయాణించాలంటే భయం! ఒంటరిగా ఉద్యోగానికెళ్లాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి! ఒకవేళ ఆమె పెళ్లి చేసుకుని ఇంటిపట్టున ఉండాలని నిర్ణయించుకుంటే ఆమెకు వచ్చే అత్తమామలు, భర్త మంచివారై ఉండాలి! అలాకాకుండా వారు ఆమెను కష్టపెట్టేవారైతే ఇక ఆమె గోడు వినేదెవరు?  గృహహింసకు గురవుతున్న స్త్రీలెందరో ఉన్నారు! స్త్రీలను ఏడిపించే దుర్మార్గులను ఒక్కొక్కరినీ అంతం చేయడమొక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని నాకు అనిపిస్తోంది! నిజం చెప్పాలంటే ఒక మగవాడిగా ఉండటంవల్ల మాత్రమే నేను స్త్రీ జాతికి ఏదో ఒకటి చెయ్యగలుగుతున్నాను! అదే ఆడపిల్లనైతే, మిగతా ఆడవారిలా కష్టాలను అనుభవిస్తూ బేలగా మిగిలిపోవడంకన్నా ఈ సమాజశ్రేయస్సు కోసం ఏమీ చెయ్యలేకపోయేవాడిని! ", అన్నాడు సుధీర్.

"మీరు పొరబడ్డారు సుధీర్ గారూ! సమాజాన్ని మార్చగలిగే శక్తి స్త్రీలకు లేదని అనుకోవడం చాలా తప్పు!! ఒక స్త్రీ అసలు బాధ్యత ఆమె పెళ్ళైన వెంటనే మొదలవుతుంది! తను పెళ్లి చేసుకున్న వ్యక్తికి అర్ధాంగిగా, తను మెట్టినింటిలో ఒక కోడలిగా, తను ఉంటున్న ఇంట్లో ఇల్లాలిగా, తన పిల్లలకు ఒక తల్లిగా తన ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తిస్తే, ఆ స్త్రీ మన సమాజశ్రేయస్సు కోసం తన వంతు సహాయం అందించినట్లే! భర్తలను భార్యలు ప్రేమ అనే పాశంతో బంధించినప్పుడు ఆ భర్తలకు పరస్త్రీలపట్ల మోజు పుట్టదు! ఇక పిల్లల విషయానికి వస్తే తల్లి పిల్లలపట్ల చూపించే ప్రేమ వారిని ఆ తల్లి మాట వినేలా చేస్తుంది! ప్రతిమనిషికి తల్లేగా తొలి గురువు? మరి ఆ తల్లి తన పిల్లలకు పసిప్రాయంనుండే సనాతనధర్మాన్ని నేర్పుతూ, నీతీనియమాల విలువలను తెలుపుతూ, వారి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడం తన బాధ్యతగా స్వీకరిస్తే సమాజంలో స్త్రీలు ఎదుర్కునే సమస్యలు సగానికి సగం పరిష్కారమైపోతాయని నా అభిప్రాయం! మీరు ఒక దుర్మార్గుడిని అంతం చేస్తే వాడి స్థానంలో పదిమంది పుట్టుకొస్తారు! అంతమందిని అంతం చెయ్యడం దాదాపు అసాధ్యమే! నేటి పిల్లలకు చిరుప్రాయంనుంచే అందరిలో దేవుడిని, స్త్రీలలో అమ్మవారిని దర్శించగలిగే వివేకాన్నీ, సంస్కారాన్నీ కలిగిస్తే వారికి ఆడవారిపట్ల గౌరవం తప్పక ఏర్పడుతుంది! కనీసం రేపటి సమాజం బాగుపడుతుంది! ఆడది మీరన్నట్లు బేల కాదు సుధీర్ గారూ! పురాణాలను సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి స్త్రీ మూర్తి ఆ పరాశక్తి అంశమే!! కాదంటారా?“, అని సుధీర్ ని సూటిగా ప్రశ్నించింది పద్మజ.

పద్మజ అన్న ప్రతిమాటా పచ్చినిజంలా తోచింది సుధీర్ కి. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయిన సుధీర్, "నిజమే! స్త్రీలను తక్కువ చెయ్యకూడదని అనుకుంటూనే వారి సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేశాను! నన్ను క్షమించండి!", అన్నాడు.

"అయ్యో! మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏమిటీ? మీరు గొప్పవారు! మీవల్ల స్త్రీ జాతికి మరింత మేలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను! ", అంది పద్మజ.

అంతలో వెయిటర్ వచ్చి సుధీర్, పద్మజల వద్ద ఆర్డర్ తీసుకుని వెళ్ళాడు.

"ఏదేమైనా ఈనాటి వార్తలు చూస్తూ ఉంటే ఈ కరోనా లాక్-డౌన్ వల్ల ఆడవారి కష్టాలు కొంత తగ్గినట్లు అనిపిస్తోంది సుధీర్ గారూ!", అంది పద్మజ.

"కరోనా దేశాన్ని కుదిపేస్తున్న నేటి సమస్య కాబట్టి అందరి దృష్టీ ఇప్పుడు ఆ వైపుకి మళ్లింది. ఆడవారి కష్టాలు తగ్గాయని కచ్చితంగా చెప్పలేం పద్మజ గారూ! ఎటూ వెళ్లే పరిస్థితులు లేక ఇంట్లో ఉంటూ గృహ హింసకు గురై మగ్గిపోతున్న ఆడవాళ్ళెందరో! కరోనా సృష్టిస్తున్న అలజడిలో పడి గతంలో భయంకర అవమానాలను ఎదుర్కొన్న ఆడవారి వేదనను ఈ ప్రపంచం మర్చిపోయినా ఆ ఆడవాళ్లు వారికి జరిగిన అన్యాయాన్ని మరువగలరా? ఆ బాధ వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది!", అన్నాడు సుధీర్.

"నిజమే సుధీర్ గారూ! కాకపోతే, సమాజంలో చేదు అనుభవాలున్న స్త్రీలు మీరంటున్నట్లు ఎప్పటికీ బాధతో కుమిలిపోతూ ఉండక్కర్లేదు! రామాయణంలో సీతమ్మవారే మనకు ఆదర్శం. ఎంతటి కష్టం వచ్చినా ఆడవారు కుంగిపోకుండా మనోధైర్యంతో నిలబడాలి! ఆ ధైర్యమే వారిని ఆ బాధనూ, ఆవేదననూ అధిగమించేలా చేస్తుంది!”, అంది పద్మజ.

"ఊఁ! అవును!", అన్నాడు సుధీర్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ.

పద్మజ, సుధీర్లు ఆర్డర్ చేసిన ఫలహారాలు రావడంతో ఇద్దరూ అవి తిని ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అయితే వీడ్కోలు చెబుతున్నప్పుడు సుధీర్ మోహంలో అంతకు ముందున్న ప్రశాంతత కనపడలేదు పద్మజకు.

‘సుధీర్ తో స్త్రీల విషయంలో ఎక్కువగా మాట్లాడి అతడి మనసు కష్టపెట్టినట్లున్నాను!’, అని అనుకుంది పద్మజ.

రెండురోజులు గడిచాక, ‘సుధీర్ గారూ! నేను మీతో తప్పుగా మాట్లాడి మిమ్మల్ని బాధించి ఉంటే నన్ను క్షమించండి!', అని మనవి చేస్తూ సుధీర్ కు ఒక ఉత్తరం రాసింది పద్మజ. ఆ ఉత్తరానికి సుధీర్ ప్రత్యుత్తరం పంపించాడు! అందులో ఇలా ఉంది!

"పద్మజ గారూ! మీరు నాకు క్షమాపణలు చెప్పవలసిన అవసరం లేదు! మీ రూపంలో ఆ భగవంతుడే నా కళ్ళు తెరిపించాడు! మీరు సూచించిన మార్గం నేటి సమాజంలోని స్త్రీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుంది! మగవారిలా పుట్టాలని కలలుగన్న ఆడవారిలో నేను కూడా ఉన్నాను! సమాజంలోని నరరూపరాక్షసుల బారిన పడిన ‘సుధీర’గా లోకమంతటికీ సుపరిచితురాలినైన నేను, ఇప్పుడు ‘సుధీర్’గా మారి సమాజంలోని స్త్రీల సంక్షేమం కోసం నాకు తోచిన మంచి పనులు చేస్తున్నాను. నాది సరైన నిర్ణయమనే భ్రమలో నేను ఇన్నాళ్లూ ఉన్నాను. కానీ రెస్టారెంటులో మీరు నాతో అన్న మాటలవల్ల వాస్తవాన్ని గ్రహించాను. మనము అంతం చెయ్యాల్సినది దుర్మార్గులైన మనుషులను కాదనీ, వారి వికృతపు ఆలోచనలను అనీ నేను తెలుసుకోగలిగాను! సమాజాన్ని సరైన తోవలో పెట్టే నేర్పు, ఓర్పు ఆడవారికి ఉన్నాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు! స్త్రీల కోసం మీరు చేస్తున్న కార్యక్రమాల వివరాలు నాకు పంపితే, నా వంతు సహాయాన్ని మీకు అందించి, స్త్రీలకు ఎంతో కొంత మేలు చెయ్యాలన్న నా ఆరాటాన్ని తీర్చుకోగలుగుతాను! - సుధీర్.”

ఆ ఉత్తరం చదివిన పద్మజకు కొన్నేళ్ల క్రితం కామాంధులైన కొందరు యువకుల చేతిలో చిత్రహింసలకు గురై, మృత్యువుతో పోరాడి గెలిచి వార్తల్లో నిలిచిన సుధీర గుర్తుకువచ్చి, నిశ్చేష్టురాలై ఆ ఉత్తరం చూస్తూ నిలబడిపోయింది!

(సమాప్తం)

Posted in October 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!