Menu Close
మీరేంటో మీరే తెల్సుకుంటారా!
-- ఆదూరి హైమావతి --

మీ పేరు తెలుగులో వ్రాసుకుని, అక్షరాలకు ముందున్న ఆదేశాలు, గమనించి వాటిని మీరు చేస్తున్నారా! లేదా మీకు మీరే చెప్పుకుని, మీ మార్కులు మీరే వేసుకోండి.

ఎలాగంటే – ఉదాహరణకు, ‘క’ తో కలిసి ఏ గుణింతం తో పేరు వచ్చినా – కమల, కిరణ్మయి, కారుణ్య, కుమార్, కోమలి, కౌసల్య - ఇలా ఉన్నపేర్లకు ‘క’ అక్షరం ముందున్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పేరు - కరుణాకర్ ఐతే మీరు -క-ర-ణ-క-ర- అనే అక్షరాలలోని మీ పేరులో ఒకే అక్షరం రెండేసి మార్లు రావటాన ఒకేమారు ఒక అక్షరాన్ని మాత్రమే లెక్కించండి. అంటే క-ర-ణ-ల కు ఉన్న మార్కులు మాత్రమే మీరు లెక్కించుకోవాలి.

ఇహ ముందుకుసాగండి.

***

సూచన--ఒక్కో అక్షరానికి ఉన్న వాక్యాన్ని మీకు ఎంతవరకూ వర్తిస్తుందో గమనించుకుని మూడేసి మార్కులు '+' ప్లస్ for Yes లేదా '-' మైనస్ for No - మార్కులు గమనించి వేసుకుని మీ వ్యక్తిత్వం మీరే నిర్ణయించుకోండి.

***

  1. అ- అర్ధగంట సేపైనా కనీసం రోజూ నడుస్తున్నారా?
  2. ఆ- ఆసనాలు కనీసం పదినిముషాలైనా వేస్తున్నారా?
  3. ఇ- ఇల్లువదలి బయట కెళ్ళినపుడు అందరితో స్నేహంగా మాట్లాడుతున్నారా!
  4. ఈ- ఈమధ్య ఎవరితోనైనా పోట్లాడారా! ఐతే వారిని వెళ్ళి ప్రేమగా పలకరించి మార్కులేసుకోండి.
  5. ఉ- ఉదయాన్నే ప్రాతః ప్రార్ధన చేశారా?
  6. ఊ- ఊరికే ఊసుపోక కబుర్లు చెప్తూ మీసమయాన్నీ, ఇతరుల సమయాన్నీ వృధాచేస్తుంటే -మీ మార్కులలోంచీ మూడు తీసేసుకోండి. Time is God- Do not waste Time - కాలం దైవ స్వరూపం- కాలాన్ని వృధాచేయరాదు అని మరువకండి.
  7. ఋ-ఋతువులతో పనిలేకుండా ఒకేవేళకు పెందళాడే నిద్ర లేస్తారా! అతి నిద్ర ఆరోగ్యానికి చేటు, బధ్ధకానికి తొలిమెట్టు.
  8. ఐ - ఐపోయిన వాటిగురించీ దిగులు చెందుతూ మీ కాలాన్ని వ్యర్ధ పరచుకుంటున్నారా! పాస్టీజ్ పాస్ట్ - ఫ్యూచర్ ఈజ్ అన్ సర్టెన్ – థింక్ అబౌట్ ప్రెజెంట్ - అన్నట్లుగా ప్రస్తుతం చేసే పనులు సక్రమంగా చేసి భగవంతుని పై భారమేసి, ఆత్మ విశ్వాసంతో ముందుకుసాగుతానని మీకు మీరే ప్రతిన చేసుకుని మార్కు లేసుకోండి.
  9. ఓ- 'ఓహోహో! నేను చాలా గొప్ప' అనుకుంటూ మీకు మీరే గొప్ప వారని అహంకరిస్తూ, ఇతరులను బాధిస్తున్నారా! అహింస పట్ల అవగాహన ఉందా! మాటలద్వారా చేతలద్వారా ఎవ్వరినీ బాధించకపోడమే అహింస.
  10. క- కనీసం రోజుకు ఒక్క సారైనా భగవంతుని స్మరిస్తున్నారా? ఒక్కరికైనా సహాయం చేస్తున్నారా? శరీరం ఉన్నది పరులసేవకే సుమా! స్వార్ధానికి కాదు.
  11. గ- ‘గడుసు పిండ’ మనే పేరు తెచ్చుకుని ఎవ్వరికీ చిక్కక మోసం చేస్తున్నారా! మార్కులు కట్!
  12. ఙ్ఞ- ఙ్ఞాన సంపాదనకై సత్సంగం చేస్తున్నారా?
  13. చ- చక్కని ప్రవర్తనతో అందరికీ ఆదర్శంగా జీవిస్తున్నారా! ఐదు మార్కులేసుకోండి.
  14. ఛ- 'ఛ ఛా - వారేం మనిషి బాబూ!' అని అందరికీ అయిష్టులుగా ఉంటున్నారా! మైనస్ మార్కులే!
  15. జ- జబర్దస్తీ గా అందరిపై అధికారం చలాయిస్తుంటే సున్నా మార్కులే!
  16. ఝ- ఝాము కొక్క మారైన ఏదైనా ఇతరులకు దానం, లేక సాయం చేయాలనే సంకల్పం కలుగుతున్నదా!
  17. త- పొరబాటున తప్పులు చేసిన వారిని మన్నించే క్షమాగుణం మీకుందా! మీ తప్పులను గమనించు కుంటున్నారా!
  18. ద- దయగల హృదయమే దైవ మందిరం - అన్నట్లుగా మీకు దయ గల హృదయం ఉందా!
  19. ధ- ధర్మ చేసే గుణముందా! లేక సమృద్ధిగా ధనముందని గర్విస్తున్నారా! సున్నా మార్కులు.
  20. న- నయనోమ్మే ప్రేమధార్ వచనోమ్మే అమృతధార్ - అనేలాగా ప్రేమతో ఇతరులను మన్నిస్తూ, దయా స్వభావం గలవారేనా!
  21. ప- పరులసేవే పరమాత్ముని సేవ - అనేభావన ఉన్నవారేనా!
  22. భ- 'భలేవారండీ మీరు'- అంటూ అందరితో మన్ననతో మాట్లాడు తారా! ఇతరులలోని మంచిని మెచ్చుకుంటారా!
  23. మ- మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః - అనే కోవలోని వారా! కనీసం వారిని గౌరవించే మనస్సుందా! [మనస్సులో తల చిందే మాట్లాడేవారా! లేక కపట స్వభావమా!]
  24. య- యధావిధిగా ఉన్నదాంతో ఆనందంగా ఉంటున్నారా! చిరునవ్వే మీకు సింగారమా!
  25. ర- ‘రండి మా ఇంటికి’ - అంటూ స్నేహితులనూ, బంధువులనూ ఆహ్వానించి, ఆదరించేవారేనా మీరు?
  26. ల- లవలేశము కూడా గర్వం లేనివారేనా మీరు?
  27. వ- వచనాల్లో వ్యంగ్యం లేకుండా మాట్లాడుతున్నారా!
  28. శ- శయనించేముందు మిమ్మల్ని మీరు సమీక్షించుకుంటున్నారా! శాంతిని మీ ఇంట నెలకొల్పుతున్నారా!
  29. ష- షట్చక్రవర్తి వలె సమ్మోహన పరచే రూపం మీకు ఉందని గర్విస్తున్నారా! గర్వం తీయనైన విషం సుమా! మైనస్ మార్కులే గర్వానికి.
  30. స- సత్యసంధులేనా మీరు - సహనం మీ స్వభావసిధ్ధ ధనమా!
  31. హ - హాహాకారాలు చేసి, ఐనదానికీ కానిదానికీ అందరినీ కంగారు పెట్టి ‘గాభరా ‘చేసే స్వభావమా మీది ! కాకపోతేనే మార్కులు.

***

ఇప్పుడు మీ పేరు మార్కులు మీరే కూడుకుని - మీ పేరు మార్చుకోనక్కరలేదుకానీ, మీ ప్రవర్తన మార్చుకునే ప్రయత్నం చేయండి.

***

గమనిక - ఇది కేవలం తమషా కోసమే. ఏ శాస్త్రీయ సిధ్ధాంతమూ అనుసరించి చేసినదికాదు. కాకపోతే మనల్ని మన మొకమారు వీక్షించుకుంటూ మన తెలుగు అక్షరాలను మరోసారి గుర్తుచేసుకోవడం కోసం మాత్రమే ఈ తమాషా ప్రక్రియను రూపొందించడం జరిగింది. తప్పులుంటే సహృదయంతో మన్నించగలరు.

******

Posted in October 2021, మెదడుకు మేత, సాహిత్యం

1 Comment

  1. G.S.S.కళ్యాణి

    ప్రక్రియ చాలా బాగుందండీ! మనిషికి ఉండవలసిన సద్గుణాలను ఆసక్తికరంగా చెప్పారు. ధన్యవాదాలు!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!