Menu Close
sravanthi_plain
అమరస్వరఝరి
(కీ.శే. శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంగారి జయంతి సందర్భంగా...)

ఎన్నో ఎత్తుపల్లాల మీదుగా ప్రవహిస్తూ, ప్రతి గులకరాయినీ పలుకరిస్తూ, తనతో కొంత దూరమైనా తీసికొని పోయి, నిరంతరం, తరంతరం పులకిరించేలా చేసి, వాటిలో ఉన్న అన్ని కోణాలను సునిశితంగా పరిశీలించి, సరిదిద్ది, చక్కని శిల్పాలుగా, స్వరరూపాలుగా, తన గలగలలతో పాటు, ఇంతో అంతో గళం కలిపి ప్రయాణం చేసిన అపురూపస్వరఝరి బాలుగారు.

తమవైపు కూడా త్వరలోనే వస్తుందని, ఆ స్పర్శానుభవాన్ని పంచిపెడుతుందని, ఎదురుచూసే ఎన్నో ప్రదేశాలు చూస్తూనే ఉండిపోయాయి.

ఈ సుదీర్ఘమైన, అనంతమైన ప్రయాణంలో ఒక పెద్ద బండరాయి ఎదురైతే, “పరవాలేదు, దీని మీదనుంచి పాఱి, వెళ్లిపోవచ్చు” నని తనశక్తి నంతా కూడగట్టుకొని ఎక్కింది, దిగింది, సాగింది ఈ ఝరి కాని, అందులోనే తనశక్తి యావత్తు ఖర్చు అయిపోయిందని తెలియని ఈ గానప్రవాహం ఒక్కసారిగా, చతికిలపడిపోయింది.

పరమాత్మ అనే సాగరతీరానికి ఇంకా చాలా దూరం ఉండగానే, ఈ ప్రవాహం ఇంక సాగలేకపోయింది. “పాడుతా తియ్యగా” అంటూ, ఎన్నో భావాలను, రసాలను తనదైన ప్రత్యేక శైలిలో, ఎన్నో శీర్షికలతో, ఎన్నో శ్రుతిగతులతో, ఎన్నోరంగాలలో, ప్రతిభాపాటవాలను చాటుతూ, మీటుతూ, ఎన్నో మైలురాళ్ళను దాటుతూ, నిత్యయవ్వనంతో ముందుకుసాగే స్రవంతి బాలుగారు.

తనగళంలో ఉద్భవించిన గలగలలే ఎన్నో గుండెల కదలికలలో విడదీయరాని భాగంగా, దశాబ్దాలపాటు మిళితమై, దేశవిదేశాలలో చైతన్యంగా రూపొందిన ఈ అనితర స్వరమాధురీప్రవాహం నిలిచిపోయినా, ఎన్నటికీ కోట్ల హృదయాలలో సజీవంగా నిలిచిపోయిన ఒక అద్భుతసృష్టివరం, ఒక భారతమాత కంఠహారంలోని రత్నం, ముద్దుబిడ్డ, ఇతోధికంగా తన అమరగానంతో అలరిస్తూ, పరమాత్మలో ఐక్యమవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.

తే.గీ. శ్రీపతిసఖు కటాక్షము చెంది పుట్టి
      పండితారాధ్యులౌ గురువరుల చెంత
      బాలదశనె సుబ్రహ్మణ్యపటిమ నొంది
      ‘గానగంధర్వు’డను ఖ్యాతి గాంచె పిదప

చం.  నలుబది రెండు వేల పయి నల్వురి మన్నన లొందినట్టి పా
      టలు సరిలేని తేనియ హుటాహుటి నందఱి కందజేయ మా
      టలు సరియైన పద్ధతి నెడందల పుట్టి బయల్పడంగ ని
       చ్చలు తప మాచరించిన విశారదు శారదపుత్రు నెంచెదన్

కం.  “సామజవరగమనా” యని
      సామూహికగానసేవ సలిపెను బహుది
      క్సామజము లదరగా తుద;
      కా మహితాత్ముండు పుట్టినట్టి దినానన్                              

ఉ.  భారతమాత గర్వపడు భాగ్యము తెచ్చిన ముద్దుబిడ్డకున్
     హారతు లెత్తగావలయు; నాయమ జోలల గానమాధురిన్
     తీరము లెన్నొ దాఁటి తన తీరున పంచిన ధన్యజీవి తా
     రారవిచంద్రకీర్తి మెయి రాజిలుచున్ దివిజత్వ మొందఁగన్
Posted in June 2021, బాలు ప్రత్యేకం, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!