Menu Close
Balu-Kavitha-Nivaali

మాతృభాష మీద మమకారం ఎవ్వరికుండదు? అయితే ఆ మమకారాన్ని ఒక బాధ్యతగా గుర్తించి, భాషా పరిరక్షణకు తదనుగుణంగా కృషిచేస్తూ వృత్తి పరంగా, ప్రవృత్తిని కూడా మార్చుకొని భావితరాలకు సాహితీ విలువలను తన మాటల ద్వారా అనునిత్యం భోదిస్తూ, ‘శ, ష, ళ, ఝ, ఱ, థ, ణ, ౘ వంటి మన తెలుగు అక్షరాలలోని విశేషణాన్ని వివరిస్తూ, తెలుగులో పాట పాడే ఎవరైననూ స్పష్టతతో, ఉచ్ఛారణ దోషాలు లేకుండా పాడేటట్లు సదా నిర్దేశిస్తూ ఎంతో కృషి సల్పిన మన తెలుగుతల్లి ముద్దుబిడ్డ బాలు గారికి, ఆయన జయంతి సందర్భంగా మన సాహిత్యలోకం తరపున భావపూరితంగా, ఛందోబద్ధంగా మరియు వ్యాకరణ శుద్ధితో అనేక ప్రక్రియలకు నెలవాలమైన ఈ కవితా సమాహారాన్ని నివాళిగా అర్పిస్తున్నాము....

🙏 మధు బుడమగుంట 🙏

leaf-divider
గాన గంధర్వా - వేచె నీకై వేయి కనులు -- వింజమూర్ విజయ కుమార్

VVK-Kavitha

సీ. అమరగాయకుడేగె నమరేంద్రుని కొలువు
     మూగబోయెను పాట రాగ ముడిగి

     తీర్పగా నాలోటు, తెలుగుపాటకు, కొత్త,
     ఊపిరినందించి కాపు‌గాచి

     స్వరమాల నమరించి శారదార్చన చేసి
     పండితారాధ్యుల బాలుడొకడు

     ఆలపించెను వేలు, మేలైన పాటలు
     ఆపాత మధురాలు తీపి నిధులు

ఆ. అతని పాట నూగె నాసేతు శీతాద్రి
     అతని మాట లాడిరాంధ్ర ప్రజలు 
     అతడు లేని చిత్రమరుదైన దానాడు
     ఆతడున్న కురిసె అష్ట సిరులు

ఆ. గానసుధను పంచి గానగంధర్వుడు
    చేరె నమర‌పురికి సేద‌కొరకు 
    మరలి వచ్చు మహికి‌ మనబాలు తప్పక
    వేచియున్న విచట వేల‌కనులు!!!
బాల్యస్మృతిగీత -- కానుకొల్లు బాలకృష్ణ

KB-Kavitha

కం. శ్రీపతి సిరులొస గంగను 
     మాపతి కొమరు డుదయించె మన ’బాలు’డుగన్ 
     శ్రీపతి పండితు లింటన్ 
     సాపస గాన గణ మేలు సరసజ్ఞుండున్.

సీ. వెండితెరల నేలు వేవేల పాటలన్ 
            పయనించు చిత్రాల పాటసారి
     విశ్వవేదికపైన వీనుల విందైన 
            సంగీత మందించు స్వరవిహారి 
     అలవోక భావాలు పలికించు గళమున 
            గాత్రదాన విచిత్ర సూత్రధారి 
     అసమాన నటనల నవలీల మెప్పించు 
            పరకాయ విద్యల పాత్రధారి

ఆ. బాలు పాట టన్న బాల్యస్మృతిసుగీత 
     హృద్య భావ లయల పద్యకవిత 
     తెలుగు పలుకుబడులు తలయెత్తు తలకట్టు 
     బాలు డన్న తెల్గు పంచెకట్టు.

సీ. ఆబాల గోపాల మానంద మందగా 
            పరవశింపగ జేయు పాట నీవు 
     పసివారిపాటలన్ పలకరించెడివేళ
            మంత్రముగ్దుల జేయు మాట నీవు 
     పరుల గళమునైన పాటలన్ పలికించు 
            పాత్రోచితపుగాన పథివి నీవు 
     యుగయుగాలకు చాలు యుగళ గీతాలను 
            జనరంజనమొనర్చు జాణ వీవు

ఆ. నలుదిశలు వెలుంగు ‘నంది’ వర్ధనుడీవు 
     స్ఫూర్తి పెంపు జేయు కీర్తి నీవు 
     పసిడి కాంతు లొలుకు ‘పద్మ’ బాంధవుడీవు 
     భరతమాత ముద్దు బాలుడీవు.
“తెలుగు మేటి” -- మైలవరపు సాయికృష్ణ

MS-Kavitha

ఆ.వె.
ఎవరి గొంతునైన నింత కష్ట పడక
నభినయించె ఘనుడు, హావభావ
మెంత యందగించి హేలగా పాడగా
లోన నిల్చియుండె గానధనుడు ...

ఆ.వె
ఎన్ని ఎత్తులెదిగి యెంతయో సాధించె
ఖండ ఖండములను గాంచె కీర్తి!
యయిన గర్వమింత నైననంటకనుండె
తెలుగుమేటి నితని తెలియరారె ...

ఆ.వె.
తెలుగు భాష మేటి తెరపి లేక నుడివె!
పాటలెన్ని పాడి పరిఢవిల్లె!!
వేల పాటగాండ్ర వెల్లడించె! నతని
నెరుగు బాలుడండ్రు చిరుతలార ...

కం
శ్రీపతి పండిత వంశము
నాపయి యాంధ్రప్రదేశమాపయి మనకున్
దాపగు భారతదేశము
నీపయి జగమే మరులిడె నిజమిది బాలా!

 

స్వీకరించు బాలూ! -- ‘ఉదయశ్రీ’ యు. సి. ఓబులేశు గౌడ్

OG-Kavitha

బాలు! సంగీత ప్రపంచానికి ఈ రెండు అక్షరాలు చాలు!
సరిగమల సంగీతానికవే బోణీలు, పదనిసల సరి బాణీలు
మధురిమల గీతావిష్కరణలో సాగే సాకీ పల్లవి చరణాలు
విపంచి తంత్రులపై జతియుత రాగాల గమన గమకాలు
విరించి మంత్రంలో శైవస్తుతి జపాల నమక చమకాలు
శృతిలయల గతిజనిత సురసుధారసభరిత చషకాలు
పండిత పామరులకు గానగాంధర్వంతోనే తమకాలు
భావయుక్త రాగాలాపనలో స్వరాక్షరాలకు అర్చనలు
స్వరధునిలో సరిగమల మధురిమలకు మూర్ఛనలు
సంగీత సాహితీ సరస్వతులకు మంగళ హారతులు
బాలూ! నీ శతజయంత్యుత్సవాలకు నోచుకులేదు
అయినా ఉడతాభక్తిగా 76 వ నీ జయంతి వేడుక
అశ్రువులు నిండిన నేత్రాలతో ఇదే నీకు నివాళి!
స్వర్గధామమునుండైననూ స్వీకరించు మా అంజలి!
______________
నమక చమకాలు = శైవస్తుతి శ్లోకాలు
చషకాలు = మధుకళశాలు
తమకాలు = పారవశ్యాలు
మూర్ఛనలు = సప్తస్వరముల ఆరోహణావరోహణలు.అవి కూడా చతుర్దశ మూర్ఛనలు(అనగా పద్నాలుగు రకాల మూర్ఛనలు) లేదా ఏకవింశతి(ఇరవై ఒకటి రకాల మూర్ఛనలు) అని రెండు రకాలుగా ఉన్నాయి.

సంగీత సమాహారమే వ్యక్తిత్వంగా నిలచిన గానగంధర్వుడు -- గుమ్మడిదల వేణుగోపాల రావు

GVR-Kavitha

అతడిపాట రాగాలతోట, అనుబంధాల మూట
ఉత్సాహంతో, కొడతారు కేరింతలు పాట వింటూ జనం
గీతంలో, విషాదానికి ద్రవించని గుండె యుండదు
ప్రేమగీతంలో, ఆర్ద్రతకి కన్నీరు కార్చని కన్నుండదు
గమకాల పరుగులో, ఆడని ఊపిరితో కొట్టుమిట్టాడుతాయి గుండెలు
సరిగమల జలధి అలలపై నర్తించే రాగాలు
తీయిస్తాయి కూని రాగాల సరాగాలు అందరి నోటా...
నెర్చుకోలేదట సంగీతం శాస్త్రబద్ధంగా
అయినా,
నేర్చుకోవాలన్న తపన, అకుంఠిత దీక్షతో
స్వీయసాధనే చేర్చింది అతడిని ఉన్నత శిఖరాలకు
శభాషనిపించింది సంగీతంలో నిష్ణాతుల చేత
ఎవరా గంధర్వ మాంత్రికుడు, ఇంకెవ్వరు గాన గంధర్వుడే
అజరామరుడైన పండితారాధ్యుల వంశబాలుడే...

పాటల పరిమళం -- గుడిపూడి రాధికారాణి

GR-Kavitha

సూర్యుడు నడినెత్తినెక్కి కష్టపెట్టిన వేళైనా
చిమ్మచీకటి చుట్టుముట్టి చిరాకుపెట్టిన వేళైనా
నా నీడ నన్నొదిలిపోయిందిగానీ
ఊరటనిచ్చే నీపాట నన్ను వీడిందే లేదు

కడుపులో ఉండగా తల్లి మురిపాల ముచ్చట్లలో
స్నానాల లాలిపాటలో, ఊయలన జోలపాటలో
నేస్తాలతో బడిబాటవెంట, మేడల్లో, గుడిసెల్లో
చదువాట విరామంలో, ఉద్యోగ విహారంలో
పెళ్ళినాటి సందడిలో, షష్ఠిపూర్తి ముంగిటిలో
ప్రణయం పండినపుడు, ప్రళయం మండినపుడు
ఎండమావుల్లోనూ, పండువెన్నెల్లోనూ
నా జీవనసాఫల్య మెట్టుమెట్టులో...

నేను నడిచిన దారంతా నీ పాటల పరిమళమే..

నువ్వు పాడుతుంటావు గంధర్వ రాజులా మహరాజుగా
పాటలు కావవి ఓషధులు
మదిన రుగ్మతలను పోగొట్టే దివ్యమంత్రాలు
గాత్రమే లేపనము మా బాధలన్నిటికి
నెమలీకలా తాకి మృదువుగా మురిపించి
చిరునవ్వు మొలిపిస్తుంది, చింతలను పోగొడుతుంది.

బాలూ!! నీకూ తెలిసిన నిజమే..నువ్వున్నా..లేకున్నా..
ఆగని అగరొత్తుల పరిమళంలాంటి నీ పాటలేగా తోడు ఇంక
మిగిలిన జీవిత ఎత్తుపల్లాల్లోనూ ఎగుడుదిగుడుల్లోనూ..
గాయాలకు లేపనమౌతూ.. ఊరటనిస్తూ ఊతమౌతూ
మా హృదయాలలో నీ పాట రూపంలో
నీవు మెదులుతూనే ఉంటావు మాతోనే ఉండిపోతావు.

ఇంటింటా బాలుడివై -- విప్పగుంట రామ మనోహర

VRM-Kavitha

‘బాల రసాల సాల నవ పల్లవ కోమల’
గానాన్విత బాల సుబ్రమణ్యమా .. నాద బ్రహ్మమా!
జతుల గతుల సంగతుల కొంగొత్త సరళి లో
సంగీత జగతి చేసుకున్న వేయి తపముల ఫలితమా
గానామృత వర్షమా!!

నీ గళమున పలికిన సరస సరాగ యుగళ గీతి
యుగ యుగాలు మురిపించే యువలోకపు స్వప్న పరవశం
చెరగని ప్రేమ రగుల్చు పారిజాత సుమ శరం

బ్రహ్మమురారి సురార్చిత లింగ మూర్తి కర్పించిన
నీ శంకరాభారణ రాగార్చన...
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మ మొక్కటే యని
అన్నమయ్యే నిన్నావహించి ఎలుగెత్తిన నీ పరవశం...
ప్రతి గుళ్ళో భక్తుల గుండెల్లో ప్రతిధ్వనించె వేద సూక్త మంత్రాలు

పుణ్య భూమి నాదేశం నమో నమామీ అని నీ కంఠం నినదిస్తే
నర నరమున జ్వాల మండి, స్పందించిన ప్రతి హృదయం
ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి, తాము సైతం ఆహుతిస్తాయి.

నీ పాట
నవరసాల మేలు తోట
తెలుగు పలుకు తేనె లూరు ఊట ...
పండితారాధ్యుడైన శివుని జటల రాలు గంగా నది తేట
గాంధర్వపు సిరి కోనల కురిసిన సిరి మల్లెల జడి వాన
సంగీతపు సాగు చేయు గాయక పసి కూనలకది
సుస్వరాల నదులు పారినట్టి ఒండ్రు మేట
వెదుకు సంజీవని రాగ లతలు తగిలి
నీ రూపున గురువై తెరుచుకున్న వెలుగు బాట

నీ తలపే మా మనసు తోటలోన విరగ కాయు వెన్నెల సైదోడు
మా జీవిత ప్రతి మలుపున నీ పాటే మాకు సాంత్వనిచ్చు తోడు
బాలూ.. పాట తీపి, తెలుగు రోచి మాకు పంచి
ఇంటింటా నిత్య బాలుడివై దోగాడు..
మా గుండెలు నిండేలా ఆనంద నింగి కోయిలవై జోల పాడు.

సదా స్మరణీయుడు బాలు -- సౌందర్య కావుటూరు

SC-Kavitha

శ్రీపతి పండితారాధ్యుల వంశాబ్ది సోముడు
సినీ సంగీతాకసమున భాసిల్లిన భానుడు
సర్వజన రంజకుడు, సదా స్మరణీయుడు
సింహపురి పుత్రుడు, గాన గంధర్వుడు
మన బాలసుబ్రహ్మణ్యం

ప్రియమైన బాలూ....

పాడుతా తీయగా అని పలుకరిoచావు
ప్రతి తెలుగు హృదయాన్ని పరవశింపజేశావు
పాట నా ప్రాణం అన్నావు
గాయపడిన సినీ గేయానికి సరిక్రొత్త ఊపిరులూదావు

నీ గానం అమరానందం
అది నినదిస్తుంది దశ దిశాంతం
పాటకు పట్టాభిషేకం
నిన్నలరించిన పద్మశ్రీ, పద్మ విభూషణం, నంది పురస్కారం

తెలుగు పాటలో తేనెలూరించావు
అరవం లోనూ రవము పూరించావు
బహుభాషా కోవిదుడవు
సకలకళా విశారదుడవు
అన్నింటా నీకునీవే సాటి
నీ ప్రజ్ఞకు లేదు పోటీ

నీ జన్మదినం తెలుగునాట ఇంటింటా పర్వదినం
నీకిదే మా హృదయపూర్వక వందనం.

గాన తపస్వీ -- బుడమగుంట లక్ష్మీ శోభాన్విత

BLS-Kavitha

ఓ యసస్వీ ! మధుర గాన తపస్వీ!! అని
మనసారా అభిమానులు నిను కీర్తించినా
గర్వమించుక లేని నమస్సుతో
నిండు నవ్వు మోము తో
మురిపించే మాటలతో
సకల జనుల సంతోషం కాంక్షించే
సంస్కార సుమనస్వీ! మా ఆత్మీయ ఎస్పీ బీ!!

భాషేదైనగాని బాలు మావాడేనని
భారతీయులంతా ప్రేమ కురియగా
పాడుతా తీయగా అంటూ ప్రతి మనసును
పరవశింప చేసిన గాయకజాతి రత్నమా
శ్రీపండితారధ్యుల పవిత్ర వంశ తేజోదీపమా
శకుంతలా సాంబమూర్తుల ముద్దుల బంగారమా

సింహపురి చరిత లోన స్వర్ణాక్షర పర్వమై
తర తరాలు తెలుగు జాతి భావి స్ఫూర్తి ప్రదాతవై
విరిసిన పద్మ విభూషణ బాలసుబ్రమణ్యమా
శంకరుడే దిగివచ్చి మెచ్చిన శంకరాభరణరాగమా

సంగీత సాహిత్య అంతరార్థాలను అన్వయించి
స్వరకర్తల జీవితాల సారమంత మేళవించి
సప్త వర్ణ పరిమళాల పాటల పూదోటై విరబూసి
నీ వెక్కిన ప్రతి వేదిక జ్ఞాపకాల పల్లకి గా పలవరించె...
మా గుండెల ప్రతి ధ్వనించె

ప్రాత: స్మరణీయుడవై నిలిచిన నిత్యవిజ్ఞాన ఖనీ
పాడేందుకు తపన పడ్డ ప్రతి గొంతుకకూ
నీ శ్వాసను అందించి
ప్రతిభకు స్వరాభిషేకం గావించి నడిపిన మార్గదర్శీ
నువు మము విడిచిన బాధను మరచి
వేల గాన రూపాలుగ, నిలిచి వెలుగు దీపాలుగ నిను తలచీ
నువు మలచిన శిల్పాలెన్నో దీక్షలు బూని
నీవొదిలెళ్లిన సుస్వరాల జాడలెంట
పసి అడుగులు వేస్తున్నాయి
నీ గానామృత సోనలు కురిసిన చల్లని వెన్నెలకు
నూలుపోగులై నమస్కరిస్తున్నాయి!!!

ఓ బాలూ.. -- నరేంద్ర బాబు సింగూరు

NBS-Kavitha

ఓ బాలూ..
బాలుడిగా... కథలు పాటలు గా విన్నావు
కధలో పాట గా పలికావు..

కవి హృదయానికి గొంతువైనావు..
పాటల పల్లకి మోశావు..
సంగీతానికి...సామ్రాట్ వైనావు
ఉషా కిరణాలు...తిమిర సంహరణాలు..అన్నావు
పాటోదయాలు ప్రభవించావు.

మాటే రాని..చిన్నదాన్ని...అంటూ
పాటల పలుకులు ....ఊపిరి బిగపట్టి పాడేవు...
పాటకో కొత్త ఊపిరి వైనావు

పాడుతా తీయగా...అంటూ
ప్రపంచానికి సంగీత మాధుర్యాన్ని పంచావు.
పాటలలో మునిగావు..పాటలలో తేలావు.

అద్భుతః...అంటూ
వెండితెరపై...మురిపించావు..

స్వామీ శరణం...అంటూ ..అయ్యప్పని
కొండలలో..అంటూ..ఏడుకొండల వాడ్ని..
ఏ గుడి కేగినా..నీ గొంతు పాట నైవేద్యమే.

నీ పాట తో ఆరాధించావు.
అన్ని మతాలని సమ్మతించావు
భాష లు వేరైనా పాట ఒకటే అన్నావు.
ఎందరో కవుల హృదయానికి గొంతుకవైనావు..

నీ పాట..ఒక లాలి..పసి మనసుకి
నీ పాట ఒక ఊపు యువతకి
నీ పాట ఒక దాపు అలసిన మనసుకి
నీ పాట ఒక ఓదార్పు ఓడిన మనసుకి
అందరినీ మైమరపించావు..మురిపించావు..

నీ జయంతి శతకోటి జనులకు పాటల స్రవంతి
ప్రతి సంగీత ప్రియునికి నీవు
ఒక మరపురాని అనుభూతి
నిన్ను సదా ప్రార్థిస్తూ ...ఈ కవితాంజలి.

Posted in June 2021, కవితలు, బాలు ప్రత్యేకం

1 Comment

  1. Yamini kolluru

    గుడిపూడి రాధిక గారు బాలు గారి గురించి అద్బుతం గా వివరించారు, ఆయన పాడిన
    ప్రతి పాట పరిమళమే,కొత్త కళాకారులకు మార్గ నిర్దేశం చేస్తు,ప్రేక్షకుల మదిలో కొలువైన
    పాటల మాంత్రికుడు. ఆయనకి ఘన నివాళి.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!