Menu Close
SirikonaKavithalu_pagetitle
చూపు -- ల.నా. గంగిశెట్టి

చూపు
ఇంటిగుమ్మం దాటి వీధి వైపు మళ్లింది
వీధి అంచుదాటి ఊరిపైకి వెళ్ళింది
ఊరుదాటి రాష్ట్రాన్ని సమీక్షించింది
రాష్ట్రాన్ని దాటి దేశాన్ని చూసింది
దేశపటాల్ని, భూగోళాన్ని చూసి చూసి
చుట్టి చుట్టి ఆకాశంలోకి ఎగిరింది
తెలిమబ్బుల దోస్తీలో తేలి ఆడింది
నీలాల నింగిలో భాగమై పోయింది
చుట్టూ మబ్బులే, మబ్బు వనాలే, మొయిలు తోటలే, మేఘాల సయ్యాటలే
ఏ ఆకసం కేసి చూస్తూ చూపు చిన్నప్పటి నుండి ఆసపడిందో
ఇప్పుడదే ఆకసం,ఏముంది? నీలాల బయలు!
అంతా తేలిపోయే మబ్బు శకలాలు
మా ఊరి పత్తి మిల్లు పైకప్పు సుడిగాలి కెగిరిపోతే
ఒడికిన దూది విడిపోయి మింటి కెగిసిపోతున్నట్లు
కలగన్న నింగి అంతా ఒట్టి దూదిపింజల మయమే
తరుముకొని తరుముకొని సాగే మేఘ శకలాల నిలయమే
రూపులేని నీలాకాశంలో రూపు దాల్చిన మేఘాల పిచ్చి పందెమే
కదలికే లేకుంటే అందమేమున్నట్లు
పరుగే లేకుంటే పరమార్థమేమన్నట్లు
నేలా నింగి మెరుపుల పరుగుల్లో తేడా ఏముంది?

ఆడిఆడి, తేలితేలి, అలిసిసొలసి
చూపే బరువెక్కి పోయింది
కరి మబ్బులో కలిసి భోరున కురిసింది

ఇప్పుడు చినుకు చినుకుగా, పిలగాలి తోడుగా
నేల రాలుతోంటే ఎంత హాయిగా ఉంది
మట్టిలోకి ఇంకి, మరో పచ్చగరికగా మొలకెత్తుతోంటే ఎంత హాయిగా ఉంది
పచ్చగరిక చెంపలపై మంచు ముత్యమై జాలువారుతోంటే మరెంత హాయిగా ఉంది

అంతా క్షణికమే!
క్షణాల మృదు స్పర్శలో
క్షణ క్షణం మారే రూపాల అణు గుణింతంలో
గుణాతీత అనంతంలో
తేలి పోతూ, జారిపోతూ
జారిపోతూ, మారిపోతూ
కణం కణంతో క్రీడిస్తూ,వినోదిస్తోంటే
విశ్వమెంత హాయిగా ఉంది.
క్షణికత లేని ఘనీభూతమైతే ఈ విశ్వంలో విలాసమేముంది?
ద్రవించని స్థాణువులో మాధుర్యమేముంది?
రసప్లావితం కాని రవితేజానికి విలువేముంది?
రసోవైసః!!!!

కవితా లతాంతాలు......14.. -- బాలకృష్ణారెడ్డి

ఎంత
అదృష్టవంతురాలివో !

ఆమె
అధరం పైన
తిష్ట వేసావు
మరింత ఎర్రగా
అందంగా పూచావు

నాకన్నా
నువ్వు గొప్ప
ముద్ద మందారాన్ని
.....మల్లెమొగ్గ పొగిడింది ....

నాపైన
స్వైర విహారం చేసే
నీ కన్నానా
ఆ తెల్లని నవ్వులన్ని నీవేగా

నీకన్నా నేనేం గొప్ప
అరవిచ్చిన మందారం
మల్లెపువ్వుని
........ఆకాశాని కెత్తింది..

అరుణరాగంతో పాటు
మకరంద
మాధుర్యాన్ని కూడా
పంచి ఇచ్చావు కదా
.....మల్లె సంవాదం ..

ఎన్ని ఇచ్చినా
నీ మరుమల్లె నవ్వుకే
ప్రాచుర్యం ఎక్కువ కదా
.......మందారం అభియోగం ..
***
బాగుంది
మీ ఇద్దరి సంవాదం
ఏది ఏమైనా
అద్భుతం మీ సుమవేదం

అప్పుడే
అటు వచ్చిన ఆమె
నిండుగా ముసిముసిగా నవ్వి

తనను కీర్తించే
ఆ రెండు సుమాల
నును లేత చెంపలు నిమిరి

అందమైన
తన వాలుజడలో
వాటిని మరింత అందంగా తురుముకుంది

గోడలు -- స్వాతీ శ్రీపాద

ఖాళీ గోడలనే అంటారు అందరూ
కాని
రోజంతా వాటి ఎదురుగా ఉంటానా
క్షణానికో దృశ్యం -ఒకదాని వెనక ఒకటి
ఎక్కడమొదలై ఎక్కడ ముగుస్తాయో తెలియదు.
నిమిషనికో కిటికీ తెరుచుకున్నట్టే అనిపిస్తుంది.

పచ్చపూల తీగఒకటి కిటికీ పక్కనే కదులుతూ
ఆకు పచ్చని అరచేతుల మధ్య
బంగారు పూపాపలను ముద్దుచేస్తున్నట్టే ఉంటుంది.
చేసొచ్చిన ప్రయాణాలూ చూసొచ్చిన స్వప్నాలూ కలబోసినట్టు
తైలవర్ణ చిత్రం ఒకటి ఉదయపు గోడపై వేళ్ళాడుతుంది.

మిట్టమధ్యాన్నపు వేడి ముసురు మధ్య
గాలికూడా ఊపిరిబిగబట్టి
కొమ్మల మధ్య విలాసంగా వెనక్కు వాలి
కళ్ళు తెరుస్తూ మూస్తూ కధలు కధలుగా
కావ్యాలు పలవరిస్తున్న రెక్కల కువకువల్ను వింటూ
చెట్టూ మొదట్లో తొక్కుడుబిళ్ళాడుకున్న పరవశం
అలలు అలలుగా మతిపోగుడుతుంది
మగత నిద్ర మధ్య.

వెలుగంతా ముడుచుకు నల్లదుప్పటి బిగించి
కళ్ళు మూసుకున్నాక
మినుకుమినుకుమంటూ సోయగాల
నది మధ్యన తారట్లాడే తారకలు
ఈదుకుంటూ వచ్చి
ఎన్ని విన్యాసాలు ప్రదర్శిస్తాయో
చీకటి గదిలో సినిమా ప్రదర్శనలా

ఖాళీ కోసం వెదుక్కోడం మానుకున్నాక
ఖాళీ లేని సమయమంతా
దేనికోసమో వెదుక్కుంటూనే ఉంది.
దారి కడ్డంగా నిలుచుని
కాస్సేపు ఆగమని సైగ చేస్తూనే ఉంది.
కాళ్ళావేళ్ళాపడి
గోడలనిండా కలలు అలుముతూనే ఉంది.

పాట.... -- దీపక్

మబ్బులో వర్షాన్ని నిద్రలేపినట్టుగా...
పొద్దులో పచ్చదనం విచ్చినట్టు గా...
మనసులో కాలమే మారిపోయినట్టుగా...
చూపులే సిగ్గుతో నవ్వినట్టుగా...

నను కదిలించావే ప్రేమగా....ప్రేమను కలిగించావే మాయగా

చీకటే వింతగా వెలుతురైనట్టుగా....
ప్రకృతే కొత్తగా మెరిసినట్టుగా....
కళ్ళలో నీ ఊహాలే ఊగుతున్నట్టుగా....
గుండెలో హాయినే పోసినట్టుగా....

నను కదిలంచావే ప్రేమగా...ప్రేమను కలిగించావే మాయగా

భూమికే రంగులే దిద్దినట్టుగా....
నింగికే చుక్కలే అద్దినట్టుగా....
పూలదండ తో గుండెనే చుట్టినట్టుగా
పాలపుంతలో ప్రాణమే తేలినట్టుగా....

నను కదిలించావే ప్రేమగా....ప్రేమను కలిగించావే మాయగా

మత్స్యపుచ్ఛాభిరామ -- బులుసు వెంకటేశ్వర్లు
మత్స్యపుచ్ఛాభిరామ విధా ముహుర్ముహు
         ర్వళిత సంవళిత విశ్రాంత గతుల
కమఠాకృతి వ్యక్త కమ్రశిర:పద
         మీలనైక క్రియో ద్వేలగతుల
గురుఘుర్ఘురారావ ఘుర్ణ మానక్రోడ
         రౌద్రోగ్ర చంక్రమ క్రమ సరణుల
హర్యక్ష భయద గర్జాంతరశ్రుత మనో
         హరవాక్య మాలా ప్రచుర ఫణితుల
యాచకజనానుకరణ వాక్య విసరముల
వ్యక్త జగదేక చాపవిద్యా విధముల
రమ్యముగ జీవలక్షణ గ్రహణ శీలి
లీల నటియించె -బాలగోపాల మూర్తి !!
వీడని బంధం -- పి.లక్ష్మణ్ రావ్

ఇది రక్తబంధంరా తమ్ముడూ
పంతాలకూ ,పట్టింపులకూ
నెత్తురు నీరైపోతుందా ...... ?
రంగుమారి వెలిసిపోతుందా ...?
కాలం కుట్రచేసి
మనమధ్య అపోహల గీత
అడ్డంగా గీసినంతమాత్రాన
బంధం వీడిపోతుందట్రా ?
సందేహాలు తీరిపోతే
మళ్ళా మన మనసులు ఒక్కటైపోవూ !
అమ్మా నాన్నా ఉక్కు కణాలతో
నిర్మించిన బంధ సౌధంరా ఇది
తుదిశ్వాస వరకూ నిలబడే ఉంటుంది !
నువ్వు అమెరికాలో వున్నా
నేను అంటార్కిటికాలో వున్నా
మన బంధం
దేహంలో ఊపిరై ,కంటిలో నీరై
తడితడిగా ప్రవహిస్తూనే ఉంటుంది
చిన్నప్పుడు
సంపూర్ణ రామాయణం సినిమాకు
ఇద్దరం కలిసి వెళ్ళొస్తే
మనల్ని రామ లక్ష్మణులని నాన్న అనలేదూ !
ఇద్దరం ఒకే ఆకులో కలిసి భోంచేస్తే
అమ్మ ముచ్చటపడలేదూ !
నిన్ను ఎంతమంది అవమానించారో
నన్ను ఎంతమంది ఎగతాళి చేసారో
ఇంకా మనస్సులో రగులుతూనే ఉందికదా
ఇప్పుడు మనం విడిపోతే
శత్రువులు సంతోషించి
పండగలు చేసుకోరూ ...!
విరోధులు ఈలలు వేసి గోలచేయరూ ... !
గతాన్ని ఒక్కసారి
గుర్తుచేసుకోరా చిన్నోడా
నదినుండి విడిపోయి ఉపనదులుగా సాగినా
మరలా ఆ నదిలోనే కలిసిపోవడం
చూస్తున్నాం కదా !
మన బంధం కూడా అంతేరా
అనుబంధంలో కలవాల్సిందే !

(అపోహలతోను, పంతాలు పట్టింపులతోనూ విడిపోతున్న రక్త సంబంధీకుల కోసం .... తుది శ్వాస వరకూ అందరూ కలిసే వుండాలని కోరుకుంటూ ...)

Posted in October 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!