Menu Close
దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర
పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

తిరుప్పురంకుండ్రం

తిరుప్పరంకుండ్రం మీనాక్షీ ఆలయం తర్వాత శైవాగమాచారంలో అంత మంచి శిల్ప కళ గల క్షేత్రం. ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి 'మురుగన్' గా వెలిసి ఉన్నారు. ఈ గుడి వెనక ఉన్న యానమలై కొండలోంచి చెక్కబడి ఉంటుంది. ఈ 'యానమలై ' అనే కొండకి ఆ పేరు రావడానికి కారణం దూరం నించి చూస్తే ఆ కొండ ఒక ఏనుగు కూర్చుని ఉన్న ఆకారంలో ఉండడమే. తమిళంలో 'యాన' అంటే ఏనుగు, మలై అంటే కొండ. గుళ్ళోకి వెళ్లబోతూఉంటే ప్రధాన గోపురం 7 అంతస్తులతో, 7 కలశాలతో రంగు రంగులుగా ఉంటుంది. శైవ గుళ్ళలో గోపురం మీద పూర్తిగా చిన్న చిన్న దేవాలయాలు కట్టి, వాటిలో వివిధ దేవతలని చెక్కుతారు. రంగులు వేస్తే ఆ విగ్రహాలన్నీ బాగా కనపడతాయి. లోపలకి వెళ్ళగానే మీకు ప్రధాన గుడి, దానికి ఎడమ పక్కగా సగం ఎత్తు దాకా మాత్రమే ఉన్న రథం కనబడతాయి. సగమే ఎందుకుంది? మిగతా ఆలయాల్లాగా నా ప్రశ్నలకి పూర్తిగా సమాధానం ఇచ్చేవారు దొరక లేదు; భక్తులు చాలా మంది ఉండటంతో కష్టమైంది. కానీ, ఈ గుడి శిల్ప సంపద మీకు అడుగడుగునా కనిపిస్తుంది. ముందరగా ఒకటి ప్రస్తావించి ఆ తరువాత లోపలకి వెళదాం.

మధురలో విష్ణువు మీనాక్షి అమ్మవారి చేతిని సుందరేశ్వరుడి చేతిలో పెట్టిన దృశ్యం గురించి చెప్పాను. అదే చాలా గొప్పగా ఉన్నదని అన్నాను. అయితే ఆ శిల్పం ఒక స్థంభం గోడమీద చిత్రంలాగా చెక్కారు. తిరుప్పురంకుండ్రంలో అదే దృశ్యం పూర్తి నిలువెత్తు విగ్రహాల్లాగా కనిపిస్తుంది. పాండ్యుల కాలంనాటి విగ్రహమని ఆ కిరీటాలు చూడగానే తెలిసిపోతుంది మనకే. అంటే 6 వ శతాబ్దమన్నమాట. ఇక్కడ విష్ణువు అమ్మవారి చేతిమీదనించి శివుడి చేతిలో నీళ్లతో ధార పోస్తున్నట్లు దృశ్యం. నమ్మండి, ఆ నీరు కూడా మీకు కనిపిస్తుంది. అద్భుతం కాదూ? (తరువాత అనుకున్నాను, దేవేంద్రుడు తన కూతురును సుబ్రహ్మణ్యుడికిచ్చి పెళ్ళిచెయ్యడం కాదా అని). ఎంతాలోచిస్తే అంత కదా! ఇక్కడ వెండి తొడుగున్న నందీశ్వరుడున్నాడు. చాలా నేచురల్ గా, ఇప్పుడే లేచి పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నట్లనిపిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యంగా, ఒక స్థంభం మీద రామాయణంలో ఆంజనేయులవారు రావణాసురుడి ముందర తనతోక చుట్టుకుని తానే రాజ సింహాసనం కంటే ఎత్తుగా ఆసనం ఏర్పరుచుకుని కూర్చున్న దృశ్యం కనిపిస్తుంది. శివ విష్ణు అభేదం కి ఇంతకంటే ఋజువు ఏంకావాలి? (పాత సినిమాలు చూసారా?)

అమ్మవారి విగ్రహం ఒకటి పెద్దది కూడా స్థంభం మీద చెక్కి ఉన్నది. మనం లోపలికి  వెళుతున్న కొద్దీ అటూ ఇటూ గొప్ప చెక్కడాలు ఉంటాయి. అసలు బయట నుంచి చూస్తేనే కనిపించే స్తంభాలు అశ్వాలతోనూ, ఏనుగులమీద, ఇతర జంతువుల మీద స్వారీ చేస్తున్న శిల్పాలు కనిపిస్తాయి. ఇంకొక క్షేత్రంలో ఇలాంటి విశేషాలు చూపాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఇక చెప్పను. ఒక స్థంభం పైన కాల భైరవుడున్నాడు. ఆయన వెనక శునకం ఎంత చక్కగానో ఉన్నది.

ఒకమాట - ఈ ఆలయంలో శుభ్రత తక్కువనిపిస్తుంది. మనుషులంతా ఎక్కడపడితే అక్కడ కూర్చుని ఉంటారు. కొట్లు ఎక్కువ, ముందంతా. కోలాహలంగా ఉంటుంది. నేను ఒక గంట - ఇంట్లో పూజకి వాడకానికి కొన్నాను. ఇక్కడి గంటలు ప్రసిద్దన్నారు.

చాలా దేవతలని స్తంభాలపై చూస్తాం. ఒక్క స్థంభం కూడా వృధా చెయ్యకుండా ఎన్నో శిల్పాలు ఉంటాయి. అన్ని పేర్లూ గుర్తుంచుకోవడం కష్టం అవుతోంది. వినాయకుడికి ఒక చిన్న గుడిలాగా ఉంటుంది. అక్కడ మూడు విఘ్నేశ్వర విగ్రహాలు ఉంటాయి. మీనాక్షి గుడి గురించి రాసేటప్పుడు శివ పార్వతి నృత్య పోటీ గురించి రాసాను కదా, ఇక్కడ శివుడికి అలా కాలు పైకెత్తిన విగ్రహం ఎంతో మంచి వివరంతో ఉన్నది. కానీ చిన్నది.

తమాషా ఏమిటంటే ఇక్కడ యోగ నరసింహస్వామి విగ్రహం ఉన్నది! రెండు చేతులూ నమస్కారం పెట్టినట్లు, కిందకి చూపడం ఒక యోగముద్ర. ఎంతో అందమైన విగ్రహం. అసలు మనం సమయం వెచ్చించాలే గానీ, ఒకొక్క శిల్పం చూస్తూ ఎంతో నేర్చుకోవచ్చు. అమెరికా నించి వెళ్లాం కాబట్టి, మళ్ళీ మళ్ళీ వెళ్లటం పడుతుందో లేదో అని బాగా చూడడానికి ఇష్టపడ్డాను.

ఈ ఆలయంలో లలితాంబిక, శివుడు, వినాయకుడు, విష్ణువు ముఖ్యదేవతలుగా కనిపిస్తారు. ప్రధానమూర్తి సుబ్రహ్మణ్యుడైనా, మనకి అద్వైతం అర్థం అవుతూనే ఉంటుంది. వల్లీ సుబ్రహ్మణ్యుల వివాహ చరిత్ర గోడలమీద చిత్రించబడి ఉన్నది. దేవాదాయ శాఖ వాళ్ళు ఇంకొంత ధ్యాస పెడితే ఇంకా చాలా బాగుంటుంది.

ఇక్కడ షణ్ముఖుడి దర్శనం చేసుకుని, కొంత సేపు అర్చకుడితో మాట్లాడ్డం అయింది కానీ, రికార్డు చెయ్యలేక పోయాను. అన్ని చోట్లా కుదరదు కదా! ఇది సుబ్రహ్మణ్య స్వామీ ఆరు దివ్యదేశాల్లో ఒకటి అని చెప్పారు. షణ్ముఖుడి చేత శూరపద్ముడి వధ ఇక్కడి స్థల పురాణం. అయితే ఇది 'వధ ' కాదు. ఈ శూరపద్ముడు వజ్రుడి మనమడు, తారకాసురుడి కొడుకు. శివుడిని తీవ్ర తపస్సుతో మెప్పించి, అపారమైన శక్తులు సాధించిన సూరపద్ముడు దేవతలని బాధిస్తుండగా సుబ్రహ్మణ్యస్వామి వాడిని వధించడానికి చాలా దివ్యసంవత్సరాలు యుద్ధం చేసినా వాడు చావలేదు. ఆఖరికి తన శక్తితో కొట్టగా వాడు, మాయావిగా ఉన్నవాడు, ఒక నెమలి, ఒక కోడి గా మారాడు. ఆ నెమలి అకస్మాత్తుగా సుబ్రహ్మణ్యుడిని చూడగా ఆయన అందానికి, సమ్మోహన శక్తికి లోబడి ఆయననే చూస్తూ ఉండిపోయాడు. స్వామి అతనిని తన వాహనంగా, కుక్కుటమును ధ్వజంగానూ చేసుకుని దేవతలకి ఆనందం చేకూర్చాడు. చాలా ఆనందించిన దేవేంద్రుడు తన కూతురైన దేవసేనని సుబ్రహ్మణ్యుడికిచ్చి పెళ్లి చేశాడు.

ఇక్కడ స్వామి నిలుచుని 'వేల్' పట్టుకుని ఉంటారు. ముందర ఉత్సవ విగ్రహం ఉంటుంది. పక్కన వినాయకుడి కోవెల ఉంటుంది. ఉత్సవ మూర్తులలో జీవ కళ ఉట్టిపడుతుంటుంది. అసలు తమిళనాడులో ప్రత్యేకతే ఈ విగ్రహాలు. ఆ సుందరమైన ముఖాలు చూసింతసేపూ ఇంకా చూడాలనిపిస్తుంది.

ఇక్కడ వేదం పాఠశాల నడుపుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ చిన్న యువకులు - 14 - 16 ఏళ్ల వాళ్లు - కనపడతారు. అందరూ కలిసి వేదం నేర్చుకుంటూ ఉంటారు. ముచ్చటగా ఉంటుంది.

ఇక్కడ ఒక మాట చెప్పాలి. వైష్ణవం చాలా మటుకు ద్రావిడ దేశంలో ప్రబలినా, పెద్ద పెద్ద వైష్ణవ క్షేత్రాలు తెలుగునాట ఉన్నాయి. అలాగే మనకు శైవమెక్కువైనా, శైవ క్షేత్రాలు తమిళనాట చాలా ఉన్నాయి. రెండు చోట్లా అద్వైతం మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఆది శంకరులవారి ప్రభావం అనుకుంటా. ఇక్కడనించి ఇంకో రెండు దివ్య క్షేత్రాలు పక్క పక్కనే ఉంటాయంటే అక్కడకి బయలుదేరాము.

### సశేషం ###

Posted in June 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!