Menu Close

page title

మన జాతీయపక్షి, నెమలి

Peacock

నెమలి {ఆంగ్లంలో ‘పీకాక్’ (peacock)} అందమంతా దాని పింఛంలో ఉంటుంది. నెమలిని చూడంగానే మనకు కనబడేవి దాని అందమైన ఈకలు. మగ నెమలికి మాత్రమే ఇలాంటి పొడవైన ఈకలు ఉంటాయి. శ్రీకృష్ణుని శిరస్సును చేరి నెమలి ఈక అందం, హోదా పెరిగాయి. శివుని పుత్రుడైన సుభ్రమణ్యస్వామి వాహనం నెమలే! దీని ఆహారం పూవుల రెక్కలు, మొక్క భాగాలు, విత్తనం మొలకలు, కీటకాలు, అప్పుడప్పుడూ బల్లి వంటి సరీసృపాలను కప్పలను కూడా తింటుంటాయి. కాంగో నెమలి (ఆఫ్రోపావో కాంగోలెన్సిస్) మధ్యఆఫ్రికాలోని కొన్నిప్రాంతాల్లోనూ, భారత నెమలి (పావోక్రిస్టేటస్) మన భారత ఉపఖండంలోనూ, ఆకుపచ్చనెమలి (పావో మ్యూటికస్) తూర్పు మయన్మారు నుండి జావా వరకు గల ప్రాంతాలలోనూ నివసిస్తాయి.

మగ నెమళ్ళకు మాత్రమే అందమైన మెరిసే నీలం-ఆకు పచ్చ లేదా ఆకు పచ్చ రంగు పింఛం ఉంటుంది. మగ నెమలికి తోకలోని పొడవాటి ఈకలే దాని అందంతో పాటుగా మృత్యువూనూ కలిగిస్తుంటాయి. ఈ ఈకలకు కళ్ళు ఉంటాయి. వాటి అందమంతా నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నప్పుడే కనిపిస్తాయి. నెమలి పింఛాలలోని ఆ అద్భుత రంగులకు కారణం, వాటి ఈకల మీద పేర్చినట్లు ఉండే సన్నని పీచులాంటి పదార్దాలే. అక్కడ కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. నెమలి నాట్యం చేసేటప్పుడు, వాటి పింఛాలు మనకు వివిధ కోణాలలో వివిధ రంగులుగా కనిపించి కనువిందు చేస్తాయి.

Peacock

ఆడ నెమలికి ఆకుపచ్చ, గోధుమ, బూడిద రంగులలో ఉండే పింఛం ఉంటుంది. కానీ అది పూరి విప్పి నాట్యమాడే సందర్భాలు ఉండవు.

Peacock

తెల్ల శరీరం కల నెమళ్ళు చెప్పుకో తగ్గవి. సాధారణంగా నెమలి జగడాలమారి! ఇతర పక్షులతో అంత త్వరగా కలవదు. పక్షిజాతిలో "యోగవిద్య" తెలిసిన పక్షులు ఐదుమాత్రమే ఉన్నాయి, అవి శుకము, హంస, గ్రద్ద, నెమలి, పావురము. వీటికి ’షట్చక్రాల కుండలినీ’ పరిజ్ఞానము ఉంది.

నెమలి జన్మ వృత్తాంతం చిత్రమైనది.

శ్రావస్తి పట్టణ సామంత రాజైన పంచవర్ణుడు రెండు గాయపడిన క్రౌంచ పక్షులకు చికిత్సచేసి నయం చేస్తాడు. దానికిగాను వృద్ధుడైన ఆ రాజుకు యవ్వనాన్ని ప్రసాదిస్తామంటే, వద్దని, 'మీలాగే నేనూ ఆకాశంలో విహంగంగా(పక్షి) విహరించాలని కోరికగా ఉంది. దాన్ని తీర్చమని కోరతాడు.' ‘అలాగే' అని అవి ఒక దేవతా మంత్రాన్నిఉపదేశించి, 'ఆకాశం మేఘావృతమైనపుడు, ఈ మంత్రం జపిస్తే చిత్రవిచిత్రమైన రంగులుకల ఈకలు, పింఛము వచ్చి, ఈ జగత్తులోనే అందమైన పక్షిగా మారి ఆకాశంలో ఎగిరి సంతోషించమని', చెప్తూ ఒక హెచ్చరిక కూడా చేస్తారు. ఎట్టి పరిస్థితులలో నైనా కానీ ఈ మంత్రాన్ని ఇతరులకే కాదు, భార్యకు చెప్పినా ఆపద కలుగుతుంది జాగ్రత్త!' అని చెప్పి వెళతారు.

ఆ తరువాత, ఒకనాడు ఆకాశం మేఘావృతమై యుండగా మంత్ర ప్రభావం చూద్దామని, పంచవర్ణుడు మంత్రోఛ్ఛారణ చేయగా మనోహరమైన, అందమైన పక్షిగా మారిపోయి ఆనందంగా గెంతులు వేస్తూండగా అతని భార్య చూసి, ఆనాటి నుండి భర్తను ఎన్నో విధాలుగా 'మంత్రం తనకూ చెప్పమని’ వేధించ సాగిందిట. ఆమె బాధ పడలేక ఆ రాజు ఆ మంత్రాన్ని ఆమెకు ఉపదేశిస్తాడు.

ఇది తెలిసి ఆ మంత్ర అధిష్టాన దేవత అతని భార్యకు బుద్ధి చెప్పాలనుకుని, కారు మేఘాలను సృష్టించి వాతావరణాన్ని ఆనందమయం చేస్తుంది. ఆ సమయంలో ఆ రాజు భార్య ఆ మంత్రం జపించి అతి సుందరమైన పక్షిగా మారి పోతున్నాననే భావనలో "అతిసుందర: "అన బోయి "అసుందర:"అనడంతో ఆమె ఆ మంత్రాన్ని తప్పుగా పలికినందుకు, ఆమె పింఛం లేని ఆడ నెమలిగా మారిపోయింది. తమ కిచ్చిన వాగ్దానాన్ని తప్పినందుకుగాను ఆ క్రౌంచపక్షులు ఆ రాజుని శాశ్వతంగా మగ నెమలిగా మారిపొమ్మని శపించాయి. మాట తప్పితే అంతే మరి. ఇచ్చినమాట కాపాడుకోవడం ఒక వరం.

నెమళ్ళు తమ వీర్యాన్ని ఊర్ధ్వముఖంగా నడిపించ గల శక్తి గలవి. ఐతే జ్ఞానంలో మనిషి కన్నా స్థాయి తక్కువగా ఉండటం వలన ఈ రేతస్సు పల్చటి జిగురు రూపంలో కంటిలోని గ్రంధుల ద్వారా బయటకు శ్రవించబడి ఒక రకమైన వాసనను చిమ్మి ఆడ నెమలిని ఆకర్షిస్తుంది. ఆడనెమలి మగనెమలి కంటి నుండి పడిన బొట్లు మ్రింగటం వల్ల గర్భం ధరిస్తుంది. నెమళ్ళు అర్ధస్ఖలిత బ్రహ్మచారులు. ఐతే జీవశాస్త్ర నిపుణులు ఈ విషయాన్ని అంగీకరించకపోవచ్చు. ఇది పురాణాలలో లిఖించిన విషయం.

మగ నెమలి విసనకర్రలా ఉండే ఈకలతో, కంటి క్రింద ఒక తెల్లని మచ్చతో పొడవైన, నాజూకైన మెడతో ఉంటుంది. మగజాతి నెమలి, ఆడజాతి నెమలి కంటే అందంగా, మెరిసే నీలం రంగు ఛాతీ, మెడ కలిగి, కంటికి ఇంపైన రంగులో దాదాపు రెండు వందల పొడవైన ఈకలతో ఉండే పింఛంతో ఉంటుంది. ఆడనెమలి గోధుమరంగులో మగ నెమలి కంటే చిన్నగా ఉండి, తోక లేనిదై ఉంటుంది. మగ నెమలి సర్వాంగ సుందరమైన ’ప్రణయనృత్యం’తో తన తోకను విసనకర్రలా విప్పి ఈకలను సవరించుకునే విధానం ఒక కమనీయమైన దృశ్యం. ఐతే ఇంత అందమైన నెమలి గొంతు విప్పిందంటే గార్ధభ స్వరమే!అందుకే అవి నృత్యం తప్ప సంగీతం జోలికెళ్ళవు. ప్రతి జీవికీ భగవంతుడు పుట్టుకతోనే ఒక్కో కళను వరంగా ఇస్తాడు. అన్నీ అన్నింటికీ ఇస్తే ఈ సృష్టే మారిపోతుందేమో!

Posted in July 2018, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *