Menu Close
అంతిమ మర్యాద
-- శ్రీముఖి --

సత్యమూర్తి,కొడుకు సతీష్, వారికి తెలిసిన మరో ఇద్దరు ఇంటి ముందు వసారా లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

సతీష్ ఉద్యోగ రీత్యా భార్యాబిడ్డలుతో ఢిల్లీలో ఉంటున్నాడు. తల్లిదండ్రులను చూసి వెళ్ళటానికి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచీ ఎవరో ఒకరు వచ్చి పలకరించి వెళుతున్నారు.

అంతలో సుందరయ్య వచ్చాడు, ఊళ్ళో అతన్ని అందరూ 'వెట్టి సుందరం' అంటారు. శవ దహనసంస్కారాల్లో పాల్గొంటూ ఉంటాడు, వయసు యాభైఏళ్లు పైమాటే!

"సతీష్ బాబూ! బాగున్నారా?" అడిగాడు సుందరయ్య.

"బాగున్నాను సుందరం, మీరంతా బాగున్నారా?"అడిగాడు సతీష్.

"ఏదో... తమ దయండీ!" నమస్కారం తో పాటు చిన్నగా నవ్వుతూ అన్నాడు సుందరయ్య.

సతీష్ జేబులో నుండి ఒక వంద రూపాయిల నోటు తీసి ఇచ్చాడు.

వెళ్లబోతున్న సుందరయ్యతో, సత్యమూర్తి "ఆగు సుందరం..." అంటూ, లోపలికి చూస్తూ, భార్యను పిలిచాడు.

"మహాలక్ష్మీ...సుందరయ్య వచ్చాడు....సుందరం, మీ అమ్మాయి వంటగదిలో ఉంది, వెనక్కి వెళ్ళు" అన్నాడు.

"అలాగే అయ్యా!" అంటూ ఇంటిప్రక్క నుండి వెనక్కి వెళ్ళాడు సుందరయ్య.

అక్కడున్న వారితో మాట్లాడి, పంపాక, సతీష్ లోపలికెళ్లాడు, వెనుకనే, సత్యమూర్తి కూడా వెళ్ళాడు.

వీరు వెళ్ళేసరికి...వంటగది ముందు ఉన్న అరుగుమీద కూర్చుని ఏదో తిన్నట్లున్నాడు...సుందరయ్య...

ఎడంగా వెళ్లి చేయి కడుక్కుంటున్నాడు.

మహాలక్ష్మి విస్తరాకులో పొట్లం గా కట్టిందేదో అతనికిస్తూ అంది "అన్నా, ఇది పిల్లల కివ్వు" అని.

అతను వెళ్లి పోయాక, సతీష్ తల్లితో "అమ్మా! ఆ ఇచ్చేదేదో ముందే ఇచ్చేస్తే ఇంటికెళ్లి తినేవాడు కదా...పైగా,

'అన్నా' అనే సంబోధన లొకటి...." నొసలు చిట్లిస్తూ, విసుగ్గా అన్నాడు.

"ఏం...అంటే ఏమయిందిరా? నాకంటే పెద్దవాడు, ఎపుడు కనిపించినా, అభిమానం గా పలకరిస్తాడు." అంది మహాలక్ష్మి.

"సరేలే, మీ ఇష్టం. వరసలు అవసరమా అని, అలవాటు చేయటం.." ముభావంగా అంటున్న సతీష్ ని

గమనిస్తూ, భార్యను కనుసైగతో వారించాడు సత్యమూర్తి.

"నేనూ, సుందరం ఒక ఈడువాళ్ళం. ఒకే ఊరు వాళ్ళం కూడా. మీ అమ్మ 'అన్నా’ అంటే, వచ్చిన.....

నామర్థా  ఏముందిలేరా...ఉద్యోగాలు చేయని వాళ్ళను 'గారు' అనటానికి మనకెటూ నోరురాదుగా!"

తండ్రి మాటల్లోని వ్యంగ్యాన్ని గమనించిన సతీష్ అక్కడ నుండి అవతలకు వెళ్లి పోయాడు.

"వాడిలాంటి వాళ్లకు ఇలాంటివి...పరువు తక్కువగా ఉంటాయిలే"మెల్లిగా భార్యతో అని...వసారాలో కెళ్ళి, వాలు కుర్చీలో కూర్చున్నాడు సత్యమూర్తి.

పల్లెటూళ్లలో వరసలు పెట్టి, పిల్చుకోవటం ఎంత మామూలో...కొంతమందిని అంతే తేలిగ్గా చూస్తూ, చులకనగా పిలవటం కూడా అంతే మామూలు! పారంపర్యం గా వస్తున్న అలవాట్లు!

వాలుకుర్చీలో ఆలోచిస్తూ కూర్చున్న సత్యమూర్తి కి  మొన్నామధ్య,...పంటల సమయం లో విన్న కొన్నిమాటలు మనసులో మెదిలాయ్...

*****    *****   *****

సత్యమూర్తికున్న ఐదు ఎకరాల్లో వేసిన వరి పంట కోయటం అయ్యింది. ఆ రోజు ఆరిన పనలను కట్టలు కట్టి కుప్పలు వేయిస్తున్నాడు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాయి.

మళ్లీ పనిలో దిగారు కూలీలు వరి పనలను కొందరు కట్టలు కడుతుంటే, ఇంకొందరు అందిస్తుంటే, ఓ ఇద్దరు నైపుణ్యంతో, కుదురుగా, కుప్పగా వేస్తున్నారు వాటిని.

వచ్చేపుడు ఇంటిదగ్గర చెప్పి, వచ్చాడు మహాలక్ష్మి కి...

"మధ్యాహ్నం భోజనాలు వాళ్లే తెచ్చుకుంటారు కాబట్టి, మూడుగంటల వేళ వాళ్లందరికీ తినటానికేమైనా పంపు" అని. ప్రతి సంవత్సరం కుప్పలు వేసేపుడు అలా పంపటం అలవాటే.

అంతలో పాలేరు కుర్రాడు సైకిల్ కి ఒక కేనూ, పెద్ద ఫ్లాస్క్ తగిలించుకుని వచ్చి, ఇచ్చి వెళ్ళాడు.

కేను మూత తీసి చూశాడు సత్యమూర్తి. కేనులో క్రింద పకోడీలు, పైన విస్తరాకులో పెట్టిన జిలేబీలు, పెద్ద ఫ్లాస్క్ నిండుగా 'టీ' పోసి ఉన్నాయి.

"రండిరా బాబూ, ముందివి తినండి, చల్లారిపోతాయ్" పిలిచాడు సత్యమూర్తి.

అలసిపోతున్నపుడు...కడుపులో కాస్త ఎత్తు పడితే, పనిలో హుషారు పెరుగుతుంది. లేకపోతే ఆ రోజు పూర్తి కావల్సిన పని మర్నాటికి మిగిలి పోతుంది. మరింత కూలి ఖర్చు పెరుగుతుంది. ఫలానా వాళ్లకు పనికెళితే, కూలితో పాటు, మంచి తిండీ దొరుకుతుందని పేరూ వస్తుంది. అనుభవం మీద తెలిసిన సత్యం!

చేను గట్టుమీదున్న బిందెలో ఉన్న నీళ్లతో, చేతులు కడుక్కుని, కేను చుట్టూ కూర్చున్నారు, కూలీలు.

"నువ్వూ రా పెద్దయ్యా!" పిలిచారు.

"నాకవేం వద్దుగానీ, కాసిని 'టీ' మాత్రం పోసివ్వరా జానూ!" అన్నాడు సత్యమూర్తి.

వాళ్ళిచ్చిన' టీ' తాగుతూ, మడిలో అక్కడక్కడ జారి పడిన వరికంకులు ఏరసాగాడు. వాళ్ళు తింటూ చెప్పుకునే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.

"ఈ రోజు పొద్దున్న సోమయ్య చచ్చిపోయాడంట గా?"

"పోనియ్, భూదేవికి భారం తగ్గుద్ది"

"ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు"

"ఆడిని తగలెయ్యటానికి కట్టెలు అక్కర్లా...సంపాంచుకున్న కట్టలు, వడ్డీలకిచ్చి రాపిచ్చుకున్న నోటు కాయితాలు చాలు"

"ఆడేంటొ ఆకాశం నుండి దిగొచ్చినట్టు...మనలాటోళ్లని ఎంత ఈనంగ చూసేవోడనీ?"

కూలికెళితే...డబ్బులియ్యటానికి తిప్పి తిప్పి చావగొట్టేవాడుగా..."

"అయితే ఆ కామయ్య మరియాదే ఈడికీ...చేత్తారు మనోళ్లు..హి..హి..."

"ఏం చేశార్రా... కామయ్యకి?"

"కామయ్యని తగలెయ్యటానికి మనోళ్లే ఎల్లారు...ఆళ్ల బిడ్డలు, బందుగులు నిప్పెట్టే వరకేగా దగ్గర ఉండేది? తరవాత దూరంగా పోయి, చెట్లకింద నుంచుంటారు... కాల్తాకాల్తా మద్దెలో ...కాలో,చెయ్యొ పైకి లేత్తుంటాయిగా? అట్ట లేసినపుడెల్లా... "ఇన్నాళ్ళకి దొరికావు రా..." అంటూ, మనోళ్లు...కర్రలతో పొడుత్తూ...బండ బూతులు తిట్టటవే...." నవ్వుకుంటున్నారు!

తల అటు తిప్పకపోయినా, వాళ్ళ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయ్ సత్యమూర్తికి. ఒళ్ళు జలదరించింది.

"...ఆడేమో గానీరా...సంజీవయ్య గారు పోయినప్పుడు మాత్తరం, మాకు...ఆయన్ని దానం చేసినంత సేపూ ...కళ్ళమ్మట నీళ్లు కారతానే వుండాయ్..."

"ఆయనే!..దరమ ప్రబువు.."

వాళ్ళ తిండీ, మాటలు చెప్పుకోవటం పూర్తయినట్టున్నాయ్, లేచి పని లో వంగారు మళ్లీ.

******** ******** ********

నిన్నటి నుండి సత్యమూర్తికి పదేపదే పొలం లో విన్న కూలీల మాటలే గుర్తొస్తున్నాయ్...

సాయంత్రం 'టీ' త్రాగుతూ కూర్చున్నపుడు ఆ మాటలే మహాలక్ష్మికి చెప్పాడు.

"అయ్యో! చచ్చిపోయిన వాళ్ళనలా చేయడం పాపం కదండీ?" అందామె.

"---------------" మాట్లాడలేదు సత్యమూర్తి.

"అయినా, అట్లా చేయటానికి, తిట్టటానికి వాళ్లకు నోరెట్లా వచ్చింది?" విన్న మాటలు జీర్ణించుకోలేక పోతోంది ఆమె.

"అపుడపుడు చూసే మనలాంటి వాళ్లకు ఆ భావాలు, భావోద్వేగాలు...వృత్తిగా చేసే వాళ్లకు...పైగా, అలాంటపుడు వాళ్ళు అలవాటుగానో, గుండెదిటవుకనో మందుకొడతారు, ఆ తిమ్మిరిలో కొంత..."

"---------------"

"...బ్రతికున్నపుడు వీళ్ళ అహంభావం...అణచుకుంటున్న వాళ్ళ అసంతృప్తీ...ఆ రకంగా బైట పడతాయేమో..." ఆలోచిస్తున్నట్లు ఆగి ఆగి మాట్లాడు తున్నాడు సత్యమూర్తి.

"మన పల్లెటూళ్లలో నేనా, పట్టణాల్లో కూడా ఇంతేనా?' అడిగింది మహాలక్ష్మి.

"పట్టణాలలో కరెంట్ వి వచ్చాయి, కొన్ని చోట్ల మామూలువి వున్నా, అందరూ అందరిని అలా చేయరు"

"ఏమో బాబూ, నాకు భయం వేస్తోంది...రేపు నన్ను కూడా అలా..."

"ఛ! ఆపు, లక్ష్మీ...నేను వినలేను." అసహనంగా అన్నాడు సత్యమూర్తి.

"---------------"

కొన్ని నిముషాలాగి సత్యమూర్తి అన్నాడు "ఆ మధ్య మనం 'కాశీ' వెళ్ళినపుడు...హరిశ్చంద్ర ఘాట్ కి వెళ్లాం, నీవు చూడలేనంటూ దూరంగా ఉండి పోయావు..."

"అవును."

"ఆ రోజలాగే...గంగ ఒడ్డునున్న అరుగు మీద దహనం చేస్తూ, వాళ్ళ బంధువులు అటు వెళ్ళగానే, సగం కాలిన దేహాన్ని గంగలోకి నెట్టేస్తున్నారు..."

"అయ్యో...ఎందుకలా?"

"కట్టెలు, సమయం కలసి వస్తాయని.."

"శివ శివా..." కళ్ళు మూసుకుంది వినలేక.

"ఏమిటో లక్ష్మీ...ఎలా బ్రతికినా, ప్రాణం పోయాక, జాలి తోనో, సంస్కారం తోనో ...మానవత్వంతోనూ పంపితే...అది...పోయినోళ్ళకు ఆత్మశాంతి, ఉన్నోళ్లకు మనశ్శాంతి..." భర్త చెప్పేది వింటూ అంది మహాలక్ష్మి.

"అలాంటి దుర్గతి పట్ట కూడదనే కాబోలు..పెద్దవాళ్ళు పాపపుణ్యాల హెచ్చరికలు చేసేది!"

జీవితం ముగిసి పోయిన ఆ... 'జీవి'కి...బుద్ధిజీవులుగా మనం చేసే "అంతిమ మర్యాద" అట్లా ఉండ కూడదు..." తనకు తాను చెప్పుకుంటున్నట్లుగా అన్నాడు. మళ్లీ తనే,

"అయితే...బతికిన నాలుగురోజులు నడత కూడా అట్లాగే ఉండాలనుకో" నిట్టూర్చాడు సత్యమూర్తి.

వింటూ ఉండి పోయింది ఆమె.

******** ******** ********

..........ఎందుకనో...సతీష్ ఇందాక సుందరయ్యను ఈసడించుకున్న విధం చూసేసరికి...విన్నవి, కన్నవి... కదలాడుతున్నాయ్...సత్యమూర్తి మస్తిష్కంలో...

"ఏమిటలా కూర్చున్నారు? వంట అయ్యింది, భోజనానికి లేవండి...అబ్బాయిని కూడా పిలుస్తాను."

మహాలక్ష్మి పిలుస్తూంది...మౌనంగా లేచాడు సత్యమూర్తి.

o00o00o00o00o

Posted in June 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!