రేడియేషన్ అంటే ఏమిటి?
ఇప్పుడు రేడియేషన్ గురించి ఆలోచిద్దాం. గాలి వీచని రాత్రి భోగి మంట దగ్గర కూర్చున్నప్పుడు మనకి తగిలే వేడి, వెలుతురు “రేడియేషన్” అనే ప్రక్రియకి ఉదాహరణలు.
రేణువుల రూపంలో కాని, కిరణాల రూపంలో కాని, కెరటాల రూపంలో కాని ప్రసరించి ప్రయాణం చేసే శక్తి (energy) రేడియేషన్‌కి మరొక ఉదాహరణ. అలాగని నీళ్లల్లో వచ్చే కెరటాలు, గాలిలో ప్రవహించే శబ్ద తరంగాలు రేడియేషన్ కావు.
రేడియేషన్ అనేది కంటికి కనిపించే వెలుగు (దృశ్య కాంతి) రూపంలో ఉండవచ్చు, కంటికి కనిపించని వేడి రూపంలో ఉండవచ్చు, కంటికి కనిపించని ఆల్ఫా రేణువులలా ఉండొచ్చు. నిజానికి కంటికి కనిపించే వెలుగుతో పోల్చి చూస్తే కంటికి కనిపించని రేడియేషన్ కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. కంటికి కనిపించే రేడియేషన్ ని “కాంతి” అనీ ‘వెలుగు” అనీ అంటాం.
విశ్వమంతా శక్తి మయం కనుక ఈ విశ్వంలో రేడియేషన్ లేని స్థలం అనే ప్రసక్తి లేదు. అది సర్వవ్యాప్తం. ఈ దృశ్యాదృశ్య శక్తి స్వరూపాలన్నిటికి రేడియేషన్ అన్న పేరు ఎందుకు పెట్టేరు?
ఒక కేంద్రం నుండి “రేడియల్” (radial) దిశలలో ప్రవహిస్తుంది కనుక దీనిని “రేడియేషన్” అన్నారు. కేంద్రం నుండి పరిధికి గీసిన ఏ గీతనయినా సరే ఇంగ్లీషులో “రేడియస్” (radius) అంటారు. ఈ నామవాచకం నుండి వచ్చిన విశేషణమే “రేడియల్.” కనుక ఒక కేంద్రం నుండి అన్ని దిశల వైపు ప్రయాణించేది “రేడియేషన్.”
తెలుగులో “రేడియస్” ని వ్యాసార్ధం అంటాం. కాని ఈ మాట పైన చెప్పిన విధంగా రకరకాలుగా మలచటానికి లొంగదు. వ్యాసం (diameter) అనే మాట కొంచెం లొంగుతుంది. వ్యాప్తి చెందేది వ్యాసం కనుక, అన్ని దిశలలోకీ కిరణాలులా వ్యాప్తి చెందే ఈ రేడియేషన్ అన్న మాట ని తెలుగులో “వ్యాకిరణం” (వ్యాప్తిచెందే + కిరణం) అనొచ్చు. కాని మనకి సంస్కృతంలో “వి” అనే ఉపసర్గ “మిక్కిలి” అనే అర్థాన్ని సూచిస్తుంది: జయం అంటే గెలుపు, విజయం అంటే గొప్ప గెలుపు. చలనం అంటే కదలిక, విచలనం అంటే మిక్కిలి కదలిక. జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం, విజ్ఞానం అంటే మరొక రకమయిన బ్రహ్మజ్ఞానం – సైన్సు. ఇదే ధోరణిలో వికిరణం అన్నా వికీర్ణం అన్నా మిక్కిలి వ్యాప్తి చెందేది – రేడియేషన్. అన్ని పక్కలకి ప్రసరించేది కనుక దీన్ని “ప్రసారం” అని కూడ అనొచ్చు. కాని “ప్రసారం” అన్న మాటని బ్రాడ్‌కేస్టింగ్ (broadcasting) కి కేటాయించేసేరు కనుక మనం రేడియేషన్ ని వికీర్ణం (లేదా, వికిరణం) అందాం.
“రేడియేషన్” అన్న మాటని భౌతిక శాస్త్రంలో వాడినప్పుడు ఈ ప్రవహించేది “శక్తి” అవుతుంది. ఈ శక్తి వేడి రూపంలో ఉంటే ఈ ప్రవాహం “హీట్ రేడియేషన్” (heat radiation), లేదా “ఉష్ణ వికీర్ణం.” ఈ ప్రవహించేది కాంతి అయితే అది “కాంతి వికీర్ణం” (light radiation) లేదా దృశ్య వికీర్ణం (visible radiation). ఈ ప్రవహించేది “సూక్ష్మతరంగాలు” అయితే ఇది “సూక్ష్మతరంగ వికీర్ణం” (microwave radiation).
మన ఆకాశవాణి వంటి రేడియో కేంద్రాలు, దూరదర్శని వంటి టెలివిజన్ కేంద్రాలు, సెల్ ఫోనులు, ఇళ్లల్లో కంప్యూటర్లలోని "వై-ఫై" - అన్నీ కూడా, విద్యుదయస్కాంత తరంగాల వికీర్ణం మీదనే ఆధారపడి ఉంటాయి. ఆ తరంగాల తరచుదనం అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది కనుక పేరులో మార్పు కనిపిస్తుంది; కొన్ని "రేడియో జాతి తరంగాలు," కొన్ని సూక్ష్మతరంగాలు.
రేడియేషన్ అన్న మాటని సాధారణమైన అర్థంతో కూడ వాడవచ్చు. ఆత్మవిశ్వాసంతో పిటపిటలాడుతూన్న వ్యక్తిని ఇంగ్లీషులో “హి ఈస్ రేడియేటింగ్ కాన్‌ఫిడెన్స్” అంటాం.