Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

తాతకు దగ్గులు నేర్పినట్లు!

రామయ్య ఒక ముదుసలి రైతు. వయస్సుమీరడం వల్ల పొలానికి నడిచి వెళల్లేక పోతున్నాడు. ఐతే సాయంకాలం ఊరి రైతులంతా చేరే రచ్చబండ దగ్గరికి మాత్రం కర్రపోటేసు కుంటూ వెళ్ళి రైతులందరినీ పరామర్శించి, తనకు తెలిసిన పొలం పనుల్లోని సులువైన సూచనలు చెప్పి వస్తుంటాడు.

తన ఎనిమిదో ఏటనుంచీ తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తూ ఎన్నో వ్యవసాయ సూత్రాలు  నేర్చుకున్నాడు. ఏ మొక్కకు ఎంత నీరు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎంత ఎరువు, ఎప్పుడు వేయాలి, కలుపు ఎప్పుడు తీయాలి, అరటి సాగు, మామిడి, నిమ్మ వంటి సాగుల్లో అందె వేసిన చేయి రామయ్యది. అరటి, తమలపాకు, తోటల్లో అంతర పంటగా ఏమేమి వెయ్యొచ్చో రామయ్యకు తెలిసినంతగా ఆ ఊర్లో ఎవ్వరికీ తెలిదనే చెప్పాలి.

రచ్చబండ దగ్గర ఆ రోజు రైతులంతా చేరి, మార్కెట్లో మంచి ధర పలికే తమలపాకు, అరటి తోటలను వేయాలని మాట్లాడుకోడం రామయ్య విన్నాడు.

అంతా యువరైతులు. పుస్తకపరిజ్ఞానమే కానీ, వ్యక్తిగత అనుభవం లేనివారు అంతా. వారు మాట్లాడుకునే మాటలన్నీ విన్న రామయ్య ఉండ బట్టలేక "అబ్బయ్యల్లారా! ఏమీ అనుకోద్దు కానీ, అరిటి తోటలు, తమల పాకుల తోటలూ యెయ్యాలంటే ముందుగా మంచి అనుబవమున్న మీ అయ్యల్నీ, తాతల్నీ సంపదించండి. పుస్తక జానం చాలదురా అబ్బయ్యల్లారా." అన్నాడు.

"తాతా! మీకంటే తగిన జానం ఎవరికుంటుంది? మీరే సెప్పండి" అన్నాడో యువరైతు.

రామయ్య "అబ్బయ్యాల్లారా! మీరు అడిగిండ్రు గనక చెపతాండా. తమలపాకు తోటలేయాలంటే ముందుగా -మే-జూన్ నెలల్లో భూవిని బాగా దున్ని సన్జేసి ఎకరాంకు 16-20 కిలోల అవిశ విత్తులు మీటరు దూరంలో విత్తాలి. 2 నెల్ల తరువాత దూర దూరంగా ఎకరంకు 20,000 తమలపాకు తల తీగలను నాటుకోవాల!.

అవిసి మొక్కలు పెరుగుతా తమలపాకు తీగలకు అల్లుకోను సపోరుటిత్తాయి. చలి, ఎండాకాలాల్లో తోటల సుట్టూ గాలులు సోక్కుండా దడులు కట్టాలి. అవసొరమైనంత నీరు అందింసాలి. పెరిగేకొద్దీ గమనించుకుంటా తీగలను అవిశ మొక్కలను కట్టాలే. నీడ తగినంతే ఉండేలా అవిశ కొమ్మల్ను కత్తిరించుకుంటా ఉండాలె. తమలపాకు తీగెల్ని నాటినంక 2 నెల్లకు ఆకులు కోతకొత్తాయి. ఆకులను ఇనుప గోరు తో కోయ్యాల. సేతిగోరు తగల్రాదబ్బయ్యా! అవిశనుంచి కూడా ఆదాయం ఉంటాది. తగుజాగ్రత్తలు తీసుకుంటా ఉంటే మంచి దిగు బడీ, ఆదాయమూకూడా వస్తాది."

అంతా విన్న ఒక యువరైతు "పో తాతా! మరీ ఇన్ని జాగ్రత్తలు ఎవరు తీసుకుంటారు? నీదంతా చాదస్తం తీగలకు బొంగులు నాటి సపోర్ట్ చేస్తే సరిపోద్ది కదా!" అన్నాడు.

"అట్టాగా చేస్తే తీగలకు ఎండ ఎక్కువగా తగిలి అవి వాడిపోతాయి రాబ్బయ్యా! తమలపాకును సుతారానికి సెప్తా రబ్బయ్యా!" అన్నాడు తాత.

అప్పుడే అక్కడికి వచ్చిన మరో అనుభవమున్న రైతు "ఏం రోయ్! ‘తాతకే దగ్గులు నేర్పినట్లు’ రామయ్య తాతకే చెబుతుండవా? ఎన్నో రకాల తోటలేసి మాకంతా సలగాలుచెప్పి ఎక్కువ లాబాలు వచ్చేట్టు సేసి ఊరి కంతా అనుభవమున్నమడిసిరా రామయ్య తాత" అన్నాడు.

"సరే తాతా! మరి అరటి తోటల గురించి కూడా చెప్పవూ?"అడిగాడు మరో యువ రైతు.

"ప్రపంచాని కంతటికీ మనదేసం లోనే అరిటి అదికంగా సాగు సేస్తున్నార్రా అబ్బయ్యా! అరిటి అతి సులువుగా సాగు సేసుకునే మొక్క. మధ్యకు నరికి పాతినా ఆ పిలక పెరుగుతాది.

దీనికి అంతర పంటలుగా తోటల్లో మినుము, అలసంద, కూరగాయలు కూడా యేసుకోచ్చున్రా. ఐతే తగు జాగరత్త తీసుకోవాలబ్బయ్యా! తోటకు తగిన నీరెట్టకపోతే ఆలీస్సెంగా గెలేయటం, సిన్న గెలలేసి, పండ్ల నాణ్యం తగ్గుద్దయ్యా! దరపలకదు. మడుసుల్లాగే అన్ని మొక్కలకూ నీరే పానాదారం గదబ్బయ్యా!.

ఒక్క గెలెయ్యంగనే అది పెరిగినంక ఆ అరిటి సెట్టును నరికేయాలె. మొదట్లో మొలిసిన పిలకల్ను మల్లింకో సోట నాటొచ్చు. ఎప్పటి కప్పుడు చూసుకుంటా ఉండాల. పనోళ్ళమీందనే వదలకూడదబ్బయ్యా!"

"ఏంటో తాతా మా నాయన సదూంకుంటానంటే 'ఇంతపొలం పెట్టుకుని మనకు సదువేంట్రా! అందరూ పల్లకీ ఎక్కికూకుంటే మోసేదె వుర్రా!' అంటూ నన్ను కాలేజీకే పంపలా!"

"నిజం కదా అబ్బయ్యా! అంతా ఉద్దోగాల కెగబడితే తినను తిండెట్టా వత్తుందబ్బయ్యా! మీనాయిన జేసిన పని మంచిదే"

"పో తాతా! ఇట్టా రోజల్లా పొలాల్లో కూకోని, మట్టి గడ్డలు కట్టుకుంటూ మురికోడులా బతకాలంటావా! ఎవరు జేస్తరు. నీదంతా చాదస్తం" అన్నాడో యువరైతు. ఇష్టంలేకుండా కష్టంగా పొలంపని చేబట్టిన రైతు బిడ్డ అతడు.

అప్పుడే అక్కడికొచ్చిన వాని తండ్రి "ఒరే రామయ్యతాతనే అంటా వుట్రా? ఆయినంత అనుబవం ఉన్న రైతు మనూర్లోనే లేరొరే! సుట్టు పక్కలూల్లనుంచీ ఆయనకాడికి వత్తార్రా సలగాలు సెప్పించుకోను. నోర్మూసుకుని రామయ్య తాత సెప్పినట్లే పొలం జేసుకుని మంచి లాబంపొందు. మనది అన్నదాతల వంసెమ్రా! జనాల కంత అన్నం బెట్టే టోల్లంరా మనవ్ ! సేవ జేసుకునే టోల్లంరా. తాతకే దగ్గులు నేర్పేంత గనుడి వేంట్రానువ్వు." అంటూ చివాట్లేసి రామయ్య తాత ను క్షమించమని అడిగాడు. తాతనవ్వుతూ లేచి కర్రపోటేసుకుంటూ ఇంటి దారిపట్టాడు.

Posted in November 2018, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!