సీ. తల్లిదండ్రుల ప్రేమ తగు ఊత నీయగా
మొక్క లెదుగు రీతి పిక్కటిల్లి(1)
గురుబోధనలచేత నిరతంబు జ్ఞానంబు
సుమమట్లు వికసింప సుందరముగ
జీవితాంతము నిల్చి శ్రీకరంబగు క్రమ
శిక్షణ అలవడు చిన్నతనము
విజ్ఞులన్నను తమపెద్దలన్నను గౌర
వంబు చూపెడి సత్ప్రవర్తనంబు
తే.గీ. ధృతియు దృష్టియు దాక్ష్యంబు దీపికలయి
పట్టుపట్టెడి పట్టుల(2) ప్రగతి కవియె
మార్గదర్శినులై నిల్చి మంచి కూర్చు
ఎట్టి స్థితిగతు లైనను తట్టుకొనగ
(1) వర్ధిల్లి
(2) పిల్లల
ఉ. తెల్లని కాగితంబు పయి తీరుగ వ్రాసిన అక్షరంబులే
పిల్లల చిత్తవృత్తులయి వేయివిధంబుల తీర్చి దిద్ద వా
రెల్లరు మంచిపౌరులయి ఈ భరతాంబిక ముద్దుబిడ్డలై
కల్లలు కాక కొల్ల లగు కాన్కలుగా విలసిల్ల కోరెదన్
మత్తకోకిల
భావిభారతపౌరు లందఱు పద్ధతిన్ తగు బుద్ధితో
సేవ చేయగ అంకితంబగు శీలసంపద కల్గి యే
త్రోవ నేగిన జాతిగౌరవదోహదం బగునట్లు శో
భావికీర్ణులుగా మెలంగు ప్రభాతమే కన నెంచెదన్