Menu Close
ప్రకృతి వరాలు పుష్పాలు
ఆదూరి హైమావతి

కంటితో చూడగానే హృదయానికి ఆనందం చేకూర్చి మనస్సును దోచుకునేవి ప్రకృతి వరాలైన పుష్పాలు. ఈ ప్రకృతి వరాలు మానవునికి అనేక విధాలుగా ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీకూడా చేకూరుస్తున్నాయి.

వివిధరకాల పూలను మానవులమైన మనం అనేక రీతుల్లో వాడుకుంటూనే ఉన్నాం. కొన్నింటిని పూజకు వాడుతాం, మాలలుకట్టి భగవంతుని పటాలకు, ప్రతిమలకు వేస్తాం, కొన్నింటిని అష్టోత్తర శతనామాలు చదువుతూ దేవుని పాదాలచెంత ఉంచి పూజిస్తాం. కొన్నింటిని తలలో ధరిస్తాం. మరికొన్నింటిని అందమైన మాలలు గా చేసి అనేకమంది గురువులకూ, రాజకీయ నాయకులకూ, సన్మానాల సందర్భంగా మెడలో అలంకరించి గౌరవిస్తున్నాం. కొన్నిపూలతో వైద్యాలనూ, మరి కొన్నింటిలో పరిమళాల నేనెలకూ, అత్తరు సెంటు వంటి వాటికీ కూడా వాడుకుంటున్నాం. మానవులు ఉపయోగించని పూలే లేవు

ఆలయాలముందు అనేక మంది పూల వ్యాపారులు అంగళ్ళు పెట్టుకుని పూలు అమ్ముకుంటూ జీవనాలను గడుపుకుంటున్నారు. ఇలా పూలు మానవ జీవితాల్లో అనేక విధాలుగా అవసరాలుగా మారాయి.

ఈ పుష్పాల గురించి ఎందఱో మహా కవులు వివిధ రూపాలలో రచనలు చేసి అందమైన, సువాసనలు వెదజల్లే పుష్పాల గురించి మరెంతో అందంగా వర్ణనలు చేశారు. అందరిలో ముందుగా మనకు స్ఫురించేది కరుణశ్రీ- జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ఖండకావ్యంలోని, ఒక కవితా ఖండం పుష్పవిలాపం.

అందులో పూలగురింఛి శాస్త్రి గారు ఇలా అన్నారు:

ఊలుదారాలతో గొంతు కురి బిగించి
గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము
అకట! దయలేనివారు మీ యాడువారు.

పూల హృదయాలలో దూరి మృధుమధురంగా ఆ కవి చెప్పిన పద్యాలు వింటే మనకు పూలను కోయనే బుధ్ధవదు. ఇలా పూలు ఒక విధంగా మనకు సంపూర్ణ సేవ భావాన్ని చెప్తున్నాయనుకోవచ్చు. పుష్పించే మొక్కలకు పునరుత్పత్తి భాగాలుగా సేవ లందించడమే కాకుండా, పుష్పాలు మానవులకు ప్రధాన ఆనందదాయకాలుగా నిలుస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా పూలున్నచోట పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి. కొన్నిపూలు చెట్లకు,  కొన్ని గుట్టగా ఉండే పొదలకు, కొన్ని తీగలకు పూస్తాయి. ఉదయం లేవగానే మనకు స్వాగతం చెప్తూ తలలు ఊపుతుంటాయి.  మధురంగా నవ్వుతాయి.

పూలు మానవులనే కాక తేనెటీగలను,ఇంకా అనేక రకాల కీటకాలనూ తమ రంగు వాసనల ద్వారా ఆకర్షిస్తాయి. కీటకాలు ముఖ్యంగా సీతాకోకచిలుకలు పూలమీద వాలి కమ్మని తేనెను త్రాగుతూ ఎగురుతూ ఉండటం చూడను చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పూలవలన మనం అనేక రకాల సీతాకోకచిలుకలను చూడవచ్చు.

అందమైన వివిధ ఆకారాల పుష్పాలను సృష్టించిన భగవంతునికి మనం ఎంతైనా కృతఙ్ఞతలు చెప్పుకోవాల

లిల్లీ వంటి పొడవైన కొన్ని పూలు, మందారం వంటి కొన్ని పెద్ద పూలు, మల్లె, జాజి వంటి చిన్న పూలూ ఇంకా అనేక రకాల పూలను మనమంతా చూసే ఉంటాం. పూల గురించి ఎంత చెప్పుకున్నా తనివితీరదు. ప్రకృతి ప్రసాదించిన వరాలు పుష్పాలు. అన్నింటి ఆకూలూ ఒక్కటిగానే ఉన్నా పూలు మాత్రం వివిధ రంగుల్లో, వివిధ ఆకారాల్లో పూచి మానవుల మనస్సులను దోచుకుంటాయి.

పూలనుంచీ మనం ఎన్నో నీతులు నేర్చుకోవాల్సి ఉంది. ప్రత్యుపకారం కోరకుండా నిస్వార్ధంగా మానవుల మనస్సులకు ఆనందాన్ని చేకూర్చే పూలు నిజంగానే భగవత్ ప్రసాదాలు కదూ!

కీ.శే ఆదూరి.శ్రీనివాసరావు గారు పూలను ఎలా గురుదేవునికి అర్పించాలో మనసారా వ్రాసుకున్న ఈ క్రింది పాటను పూలమీద మొదలుపెట్టిన ఈ శీర్షిక సందర్భంగా ఒకసారి గుర్తుచేసుకుందాం.

గురుదేవుని చరణాలకు గులాబీలమాల
సత్య సాయి బాబాకూ సంపంగులమాల
మధురభాషి మన స్వామికి మల్లెపూలమాల
కమనీయ రూపునకు కనకాంబర మాల
మహిమాన్విత మూర్తికొరకు మందారమాల
చేదుకొనే మా సాయికి చేమంతుల మాల
భక్తపరాధీనునకు బంతిపూలమాల
పద్మదళ నేత్రునకు పారిజాత మాల
మోక్షమొసగు మురహరునకు మొగలిపూలమాల
పుట్టపర్తి నాధునకు పున్నాగుల మాల
కాలకూట కంఠునికి కలువపూలమాల
నిఖిలలోక శరణ్యునికి నీలాంబరమాల
ఆత్మవిద్య బోధకునకు అన్నిపూలమాల
నడయాడేదేవునకు నవరత్నమాల
గురుదేవునిచరణాలకు గులాబీలమాల!!!

సిరిమల్లె నాల్గవ వార్షికోత్సవానికి మల్లెతో మొదలా పూలతో సంవత్సరమంతా ముంచేద్దామా!

Jasmine

మల్లె పూవు చెప్పగానే ఎవరికైనా మనస్సు మైమరచిపోతుంది. ఎంత తెల్లగా ఉంటాయో అంత సువాసన వెదజల్లుతుంటాయి.

మల్లెను మల్లిక అనీ, ఆంగ్లంలో జాస్మిన్ అనీ అంటారు.

దీని వర్గీకరణ నామం: జాస్మిన్. పొదల ప్రజాతికి చెందిన ఆలివ్ కుటుంబానికి చెందిన తీగలా పెరిగే మొక్క ఇది. మల్లె సుమారు 200 రకాల జాతులుగా ఉష్ణమండలాల్లోనూ, ఉష్ణోగ్రత వేడిగా ఉండే యూరేషియా, ఆస్ట్రేలియా, ఓసియానియా ప్రాంతాలలోనూ పెరుగుతాయి.

మల్లె మంచి సువాసనలిచ్చే స్వచ్ఛమైన హృదయంలాంటి, ముత్యాల వంటి తెల్లని పూలూ పూసే తీగ మొక్క. మల్లె మొక్క సంవత్సరమంతా బతికినా పూలుమాత్రం వేసవిలోనే లభిస్తాయి. నిలువుగా తీగపైకి ప్రాకి వ్యాపిస్తుంది. మల్లెల్లో నలభై రకాల వరకు భారతదేశంలో ఉంటాయి. అధికంగా పందిరిమల్లె, తుప్ప మల్లె, జాజిమల్లి, కాగడామల్లె, నిత్యమల్లె వంటివాటిని ఎక్కువగా చాలా మంది పెంచుతున్నారు.

మల్లెలు మాఘ మాసంలో పూయటం మొదలెట్టడాన వీటిని ‘మాఘ్యం’ అని కూడా అంటారు. సువాసనకూ, అందానికీ, స్వచ్చమైన, తెల్లనికాంతులీనే మల్లె పూలు స్త్రీలనేకాక అందరినీ ఆకర్షిస్తాయి. మల్లెపూలు ధరించని మహిళే ఉండదు. భగవంతుని మల్లెపూలతో పూజంచడం ఎంతోమంది ఇష్టపడతారు. పెళ్ళిళ్ల సమయంలో మల్లె లేంది మేళం మోగదు కూడా. వేసవి వచ్చిందంటే మల్లెలపరిమళాలు పూల అంగళ్ళలో పరిమళిస్తుంటాయి. ఎంతో మంది వేసవిని ఇష్టపడకపోయినా మల్లెలకోసం వేసవికి ఎదురు చూస్తారు.

కుటజము, కొడస, చంద్రిక, మల్లిక, మల్లియ, మృగేష్టము ఈ పేర్లన్నీ మల్లెవే. ప్రపంచవ్యాప్తంగా మల్లెల జాతులు చాలా ఉన్నప్పటికీ మనకు తెలిసిన మల్లె జాతి మాత్రం జాస్మినమ్ సంబక్ మాత్రమే. దీన్నే అరేబియన్ జాస్మిన్, మల్లిక, కుండమల్లిగై, మోగ్రా.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. పూలరేకుల పరిమాణాన్ని బట్టి ఇందులోనూ రకాలున్నాయి.

ఒకే వరుసలో ఐదు లేదా అంతకన్నా ఎక్కువ రేకలతో ఉండేదే మెయిడ్ ఆఫ్ ఓర్లియాన్స్. వీటినే రేక మల్లె, గుండు మల్లె అంటారు. గుండుమల్లెలానే ఉంటాయికానీ వాటికన్నా కాస్త బొద్దుగా ముద్దుగా ఉండేవే అరేబియన్ నైట్స్. కాడ సన్నగా ఉండి గుండ్రని మొగ్గల్లా ఉండే బొడ్డు మల్లెల్నే బెల్లె ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. వీటినే మైసూర్ మల్లెలనీ అంటారు. ఎండ తగులుతుంటే ఏడాది పొడవునా పూస్తుంటాయి. వీటిల్లోనే మరోరకం సన్నని పొడవాటి రేకలతో ఉంటుంది. దీన్ని బెల్లె ఆఫ్ ఇండియా ఎలాంగేటా అంటారు. చూడ్డానికి చిట్టి గులాబీల్లా ముద్దగా ఉండే రోజ్ జాస్మిన్ లేదా సెంటుమల్లె అనేది చాలా మనోహరంగా ఉంటుంది. మూడురోజులవరకూ వాడదు. ఈ పూలు ఒక్కరోజుకే రాలిపోకుండా కొన్నిరోజులపాటు చెట్టుకే ఉండి సువాసనలు వెదజల్లుతాయి. దొంతరమల్లె అనే మరో రకం ఉంది. ఇందులో పూరేకులు అరలు అరలుగా అందంగా అమర్చినట్లు ఉంటాయి. మాఘమాసంలో ఎక్కువగా పూసేదే జాస్మినమ్ మల్టీఫ్లోరమ్. మాఘ మల్లిక, స్టార్ జాస్మిన్ అని పిలిచే ఈ పూలు ఎక్కడా ఆకు అన్నది కనిపించకుండా పందిరంతా తెల్లగా పూసి మొక్క మొత్తం తెల్లగా కనిపిస్తుంది.

మల్లికను సంస్కృతంలో మల్ల లేదా మల్లి అంటారు. వసంతరుతువు ముగిసి గ్రీష్మఋతువు ఆరంభ మవుతున్న సంధి సమయంలో పూస్తాయి కనుక ‘వార్షికి ‘అంటారని, గ్రీష్మంలో మహా బాగాపూసి జనాల హృదయాలను ఆకట్టుకునే  మల్లెలు శీతాకాలాన్ని చూస్తే భీతిల్లినట్లుగా పూయడం ఆగిపోతుంది. కనుక దీన్ని ‘శీతభీరువు’ అంటారని అమరకోశం లో ఉంది.

పగలంతా పనిచేసిన వారికి కళ్ళమీద మల్లెపూలు కొద్దిసేపు ఉంచుకుంటే కళ్ళు చల్లబడతాయి. సబ్బులు, తలనూనెలు, సౌందర్య సాధనాలకూ, అగరు బత్తీల తయారీల్లో మల్లెపూలను ఉపయోగిస్తారు. సెంట్లు, ఫర్‌ఫ్యూమ్‌లలో మల్లెపూలదే అగ్రస్థానం.
కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి బాగా రెండురోజులవరకూ నాననిచ్చి, దాన్నికాచి వడగట్టి తలకురాచుకుంటూ ఉంటే  సువాసన తో పాటుగా జుట్టుకు మంచిపోషణ, చలవకూడా.

సినిమాల్లో మల్లె మీద పాటలు చాలానే ఉన్నాయి.మనసున మల్లెల మాలలూగెనే (మల్లీశ్వరి), ఇది మల్లెల వేళయని, మల్లియలారా మాలికలారా (నిర్దోషి), తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసము (అంతస్తులు), సిరిమల్లె పువ్వల్లే నవ్వు (జ్యోతి). ఇలా మల్లెల గురించీ చెప్పుకుంటూ పోతే మన సిరిమల్లెలో చోటైపోతుంది కనుక ఇంతటితో ఆపుదాం.

Posted in August 2019, వ్యాసాలు

2 Comments

  1. Anupama

    హైమావతి గారు ధన్యవాదాలు.ఎంత బాగా చెప్పారమ్మ.మనస్సు చాలా ఆనందంగా , ఉత్సాహంగా వుంది మీరు పూల గురించి వర్ణిస్తుంటె.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!