చాటుపద్య, గద్య మణి మంజరులు
వేద మంత్రాలు – వాదోపవాదాలు
పెద్ది భట్టు అతని తోడల్లుడు కలిసి అత్తవారింటికి వెళ్ళారు. పెద్ది భట్టు యొక్క వేదం వైదుష్యము అతని అత్తమామలకు నచ్చలేదు. చిన్న అల్లుని శాస్త్ర చతురత వారికి నచ్చింది. అందువల్ల పెద్దల్లుని నడవలో చాపమీద పడుకోమన్నారు. చిన్నల్లుని పట్టిమంచం మీద పడుకోమన్నారు. చిన్నవాడు కావాలనే లఘుశంక కు రాత్రి బయటకు వెళుతూ పెద్ది భట్టును కాలితో తన్ని ఏమీ ఎరుగనట్లు “క్షమధ్యమ్” అని చెప్పి వెళ్ళేవాడు. అప్పుడు పెద్ది భట్టు ఒక రాత్రి తన తోడల్లుడు తనను తన్నగానే లేచి తోడి అల్లుని వంగదీసి గుద్ది “పోగారుబోతా! ప్రతి దినము నన్ను తన్నుచూ నొకటే ‘క్షమధ్యమ్’ చెప్పుచున్నావు. నీకు ఒక ‘క్షమధ్యము’ వచ్చిన నాకు ముప్పది మూడు స్రయధ్వములు వచ్చును..” అంటూ ప్రథమా ద్వితీయోఘ శ్రయధ్వం.. అంటూ ముప్పై మూడు సార్లు వాడి వీపు మీద గుద్ది తన కోపం తగ్గించుకొన్నాడట పెద్ది భట్టు. ఇంతకూ ఏవిటంటే ముప్పై మూడు శ్రయధ్వములు గల వేదమంత్రం ఒకటున్నది. పెద్ది భట్టు కథ వాళ్ళ ఈ మంత్రం ఒక పరిభాషా పదంగా మారిందనవచ్చు. ఎవరైనా తన్నులు తింటే ‘శ్రయధ్వములయినాయా!’ అనుట వైదికుల మాటలలో వాడుకలో ఉన్నదన్నారు వే.ప్ర.శాస్త్రి గారు (పేజీ 92).
మాంగల్యం తంతునా...నడిమింటి మంగళేశ్వర శాస్త్రి
నడిమింటి మంగళేశ్వర శాస్త్రి ఉద్దండ పండితుడు. ఇతడు రచించిన ‘సమాసకుసుమావళి’ అనే సంస్కృత గ్రంథం మన దేశంలో బాగా ప్రచారంలో ఉంది. యితడు తెనాలి రామలింగకవి వంటి వాడు.
శాస్త్రి గారు ఒకరోజు ఒక పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళిలో మాంగల్యధారణ జరిగేటప్పుడు పురోహితుడు పెండ్లి కొడుకు చేత ‘మాంగల్యం తంతునా..’ అనే శ్లోకం పలికిస్తున్నాడు. అప్పుడు శాస్త్రి గారు తన ప్రక్క వాళ్ళతో ‘ఆ శ్లోకార్థం మీకు తెలుసా?’ అని అడిగాడు. వారు శాస్త్రి గారినే అర్థం చెప్పమన్నారు. అప్పుడు ఆయన చెప్పిన యనర్థం చూడండి;
మాంగల్యం తంతు – న – ఇది (మాంగల్య సూత్రం – దారం)
మంగళకరమయిన మాంగల్య తంతువు – న – కాదు.
(నేనా ముసలి వెధవను నాకెక్కడిది మంగళకరము అని భావం)
అనేన మమ – జీవన హేతు – న(నా) ( ఈ పెళ్లి వాళ్ళ నాకున్న రెండకరాల ఆస్తి తెగనమ్మేశాను)
కంఠే బద్నామి (నీ కుత్తుకకు త్రాడు కట్టు చున్నాను)
సుభగే (సుభగులారా!) త్వం (నీవు) శరదాం
శతమ్ (నూరేళ్ళపాటు) జీవ (జీవించుము –ఏడుస్తూ)
ఈ శ్లోకానికి శాస్త్రిగారు చెప్పిన అర్థం చమత్కారంగా పైకి కనపడుతున్నా, ఇందులో కొన్ని క్రూర సాంఘీక దురాచారాలు అంటే బాల్య వివాహాలు, వృద్ధవరుల వెర్రి వేషాలు, తల్లిదండ్రులు ఆడపిల్లలను అమ్ముకోవడం తదితర దుర్మార్గాలను పెళ్లి మంత్రం నుండి విప్పి చెప్పిన మంగళేశ్వర శాస్త్రి గారి మాటలు అందరికీ మంగళకరమైనవే. మనసుకు పట్టించుకోవలసినవే.
ఒకసారి ఒక గర్విష్ఠి అధికారి చెయ్యెత్తి నమస్కారం చెయ్యకుండానే ‘నమస్కారమండి’ అన్నాడట. అందుకు మంగళేశ్వర శాస్త్రి గారు ‘దీర్ఘమాయురస్తు’ అని దీవించాడట. దీర్ఘమ్ – ఆయుః – మాయుః అస్తు. ‘చిరంజీవివి కమ్ము’ అని సామాన్యమైన అర్థం. రెండవ అర్థం ‘నీకు గొప్ప పైత్యము కల్గుగాక’ అని. సంస్కృత భాష లోని అద్భుతమిదే.
‘కవిసార్వభౌముడు’ శ్రీనాథుడు – అతని చాటువులు
కర్ణాటాధీశ్వరుడగు ప్రౌఢ దేవరాయలును (1406-1422) దర్శించడానికి శ్రీనాథుడు వెళ్లినప్పుడు అక్కడ ధర్మాధికారి – ముమ్మకవి అనే విద్వత్కవిని కవిని కలిసి రాజ దర్శనము కావలెనని కోరుతూ కొన్ని పద్యాలను శ్రీనాథుడు చెప్పాడు. అందులో ఒకటి, రెండు;
“డంబు సూపి ధరాతలం బుపై దిరుగాడు
కవి మీద గాని నా కవచ (?) మేయ (ఖడ్గమా?)
దుష్ప్రయోగంబుల దొరగొని చెప్పెడు
కవి శిరస్సున గాని కాలు చాప
సంగీత సాహిత్య సరస విద్యల నేర్చు
కవుల డొమ్ములు గాని కాల్చి విడువ
చదివి చెప్పగ నేర్చి సభయందు విలసిల్లు
కవి నోరు గాని వ్రక్కలుగ దన్న
దంట కవులకు బలువైన ఇంటి మగడ
కవుల వాదంబు విన వేడ్కగ వెనేని
నన్ను బిలిపింపు యాస్థాన సన్నిధికిని
లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర”
అని తన కావ్య నిర్మాణాది ప్రౌఢత్వమును ప్రౌఢదేవరాయలకు సగర్వంగా తెల్పి ప్రౌఢదేవరాయల ఆస్థానంలో డిండిమ భట్టు తో తలపడి అతనిని ఓడించి కంచుఢక్కా పగులగొట్టి కనకాభిషేకమును చేయించుకొన్న ఘనుడు శ్రీనాథ కవి సార్వభౌముడు. “అసలు కన్నా వడ్డీ ముద్దు” అన్నట్లు ప్రబంధాది రచనలకు ఏమాత్రం తీసిపోకుండా ఆయా కవుల పాండిత్యాది సుగుణాలకు మైలు రాళ్ళుగా నిల్చిన చాటువులు తెలుగు సాహిత్య లక్ష్మి ఇంటి మణిదీపాలేనని చెప్పడం అతిశయోక్తి కాదు.
భట్టుమూర్తి, భట్టు కులస్థుడు. అందువల్ల అతని కవిత్వం ఆశుభాలకు, అనర్థాలకు దారి తీస్తుందని చెప్పడం ఈ పద్యం ఉద్దేశ్యం. భట్టుమూర్తి కృష్ణరాయల అల్లుడైన అళియరామరాయల యొక్క ఆస్థానకవి. రామరాయలకు ఒకసారి వాయురోగం వచ్చినప్పుడు అతనికి మందులు వాడుతుండగా రామలింగకవి వెళ్లి ఈ పద్యం చెప్పాడట;
ఓ యమ్మలాల మందులు
వే యేల! మకారకొమ్ము విషకవిగానిక్
వా యెత్త కుండ జేసిన
వా యెత్తదు రామరాయ వశు ధీశునకున్!!
‘ఓ తల్లులారా! అంతఃపుర స్త్రీలారా! రాజుగారికి మందులు అవసరం లేదు. ‘మ’ కు కొమ్ము ఇస్తే ‘ము’ అవుతుంది. ఆ అక్షరం విషాక్షరం. కాబట్టి ఆ అక్షరంతో పేరున్న మూర్తి కవిని (భట్టుమూర్తి) కవిత్వం వ్రాయకుండా వాయి (నోరు) మూసుకొంటే రాజు గారికి వా యెత్తదు = వాతరోగం ఉండదు కాబట్టి అతన్ని – మూర్తి కవిని కవిత్వం రాయడం ఆపమనండి’ అని చెప్పాడట.
దీనివల్ల మనకు ఆనాటి కవులలో ఉన్న కుల వైషమ్యాలు తెలుస్తున్నాయి. అంతేగాక వసుచరిత్ర గొప్ప కావ్యం. శ్లేష కవితా చక్రవర్తిగా పేరు పొందిన సంగీత, సాహిత్య, నాటక రంగాలలో లోతులెరిగిన భట్టుమూర్తి యొక్క పేరు ప్రఖ్యాతులకు ఓర్వలేక కొందరు ‘భట్టుమూర్తి రచన చేపలబుట్ట’ వంటిదని విమర్శించడం దురదృష్టకరం. కాని, రామలింగ కవి వంటి వారు కూడా ఈ విధంగా భట్టుమూర్తి ని గూర్చి ఇటువంటి అభిప్రాయాలు వెల్లడించడం మంచిది కాదని చెప్పక తప్పదు. పిల్ల వసుచరిత్రలు పుట్టడానికి కారకుడై, శ్లేష కవితా చక్రవర్తి గా పేరుగాంచిన భట్టుమూర్తి రచించిన వసుచరిత్ర ఒక గొప్ప ప్రబంధము. రామ, హనుమ, పార్వతి మొదలైన దేవతలను శ్లేషలో స్మరించి తరించిన గొప్ప భక్తుడు ఈ రామరాజభూషణ బిరుదాంకితుడైన భట్టుమూర్తి. అళియరామరాయల ఆస్థానానికి భూషణంగా ఉన్నవాడని, అలాగే రామభక్తి భూషణంగా ధరించిన వాడని రెండర్థములతో భట్టుమూర్తి రామరాజభూషణ బిరుదు పొందాడు.
రామలింగ కవి లేక రామకృష్ణ కవి అని పిలవబడుచున్న తెనాలి రామలింగడు ‘వికటకవి’ గా ప్రసిద్ధిగాంచాడు. ఒకానొక సందర్భంలో మొల్లను గూడా ఇలాగే అసభ్య పదజాలంలో పలకరించగా ఆమె, చాలా గుంభనంగా, ఉదాత్తంగా సమాధానం చెప్పినట్లు ఒక చాటువు కూడా ప్రచారంలో ఉంది. విజ్ఞులు, పండితోత్తములు చూపవలసిన చమత్కృతి కి ఇలాంటి రచనలు మాయని మచ్చలుగా మిగిలిపోతాయని చెప్పక తప్పదు.