Menu Close
Geethanjali-page-title

భారతీయ ఆధ్యాత్మిక భగవదన్వేషణా మార్గాలు మానవ సమాజానికి అయాచితంగా లభించిన అపురూప రత్నాలు.

రవీంద్ర సాహిత్యం, ప్రత్యేకంగా గీతాంజలి, భారతదేశ సాహిత్యానికి ప్రపంచ వాఙ్మయంలో ప్రత్యేక స్థానాన్ని‌ కల్పించడంలో విశేష పాత్ర వహించింది.

రవీంద్రుని గీతాల్లో అంతర్లీనంగా అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలు, మధుర, దాస్య, సఖ్య భక్తి మార్గాలు విశేషంగా దర్శనమిస్తాయి. అంతే కాకుండా, "ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్" అన్న ఉపనిషద్వాక్యానికి గీతాల రూపాన్ని చేకూర్చాడా అన్నట్టుగా ప్రకృతి అణువణువులోనూ పరమాత్మ స్వరూపాన్ని దర్శించి పాఠకులకు ప్రదర్శిస్తుంది విశ్వకవి గీతాంజలి.

గీతాంజలి చిత్రకారులకు అందమైన ఉద్యానవనం, కవులకు అక్షర స్వర్గం, తాత్వికులకు పరమాత్మ దర్శనం.

నిజానికి ఈ గీతాలు రవీంద్ర కవి తనకొరకు వ్రాసుకొన్నవే కానీ ఆ గీతాల విశ్వజనీనత చేత పాఠకునికి తన హృదయంలోని‌ భావాలు ఎదుట సాక్షాత్కరిస్తాయి.

గీతాంజలిని విశ్వకవి స్వయంగా బెంగాలీ నుంచి ఆంగ్లంలోనికి అనువదించారు. అటుపిమ్మట ఆంగ్లం నుంచి ఎందరో మహానుభావులు తెలుగులో పద్య రూపంలో, వచన కవితల రూపంలో మనకు అందించారు. వారిలో ముఖ్యంగా ప్రఖ్యాత నటులు కీ.శే. కొంగర జగ్గయ్య గారు, కీ.శే. చిలుకమర్రి రామానుజాచార్యులు, శంకరంబాడి సుందరాచారి గారు, గుడిపాటి వెంకటా చలం గార్లు (చలం).

అంతటి మహత్తర కృతిని మళ్ళీ అనువాదం చేయడం సాహసమైనా ఆ ఆలోచన కేవలం భగవద్సంకల్పం అన్న భావన నన్ను ముందుకు నడిపించింది.

సీస పద్యం తెలుగు భాషకు ప్రత్యేకం అత్యంత సుందరమైనదీ ఆలాపనకు అనువైనదీ కావడం చేత ఆ ఛందస్సును ఎన్నుకోవడం జరిగింది.

ఆచార్య రామచంద్రుడు గారి రచనలు చిలుకమర్రి వారి గీతాంజలి ఆవిష్కరణ, పూజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య గారి కుసుమ హరనాథ భక్తి గీతాలు, పోతన భాగవతమూ నన్ను ఎంతో ప్రభావితం చేసిన కృతులు, ఈ మహా కవుల భావనా సౌకుమార్యము రచనా ప్రౌఢిమ వాటిని చదివినప్పుడల్లా నాకు అత్యంత ఉత్సాహాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. అందువల్ల ఆ మహా కవుల పదాలు భావనలు ఈ పద్యాల్లో అగుపి‌ంచడం వారి రచనల పట్ల నాకున్న ఆకర్షణ, అభిమానం మాత్రమే.

ఎందరో మహానుభావులు గురుదేవుల నుండి బెంగాలీ గీతాంజలిని దత్తత తీసుకొని తమ పుత్రికగా ప్రేమనందించి తమదైన భాషలో అనేక దశాబ్దాలుగా  పెంచుకున్నారు. ఆ మాహాకవులు పూజించిన అక్షరసుమాల గంధాన్ని ఆఘ్రాణించి ఆనందించి, విశ్వకవి తాను స్వయంగా చేసిన ఆంగ్లానువాదాన్ని అలతిపదాలతో వ్రాసిన ఈ పద్యాల్లో దోషాలు ఏవైనా దొర్లి ఉంటే సహృదయిలైన తెలుగు పాఠకులు పెద్ద మనసుతో స్వీకరించి ఆ గీతసుమగంధాన్ని ఆస్వాదించగలరని భావిస్తూ...విశ్వకవికి నా అక్షర సుమాంజలులు సమర్పిస్తున్నాను :

namaste

సీ. గరికపై కదలాడు గాలి సుగంధమ్ము,
కర్షకుల నుదుటి ఘర్మ జలము

అడవిపూవుల తేనె, కడలి యలలపాట
పరమాత్మకై యార్తి, ప్రకృతి శక్తి

గహనమౌ భావాలు, కనరాని లోకాలు
కనువిందు చేయునీ కావ్య రీతి

విశ్వనాథునునికి విశ్వమ్ములోగాంచి
విశ్వకవిగ నీవు పేరు పొంది

ఆ. భరత జాతి ఖ్యాతి ధరణిలో వెలుగగా
కావ్య రచన జేయు కవివరేణ్య
నిలుచు నీదు కవిత నిత్యమై సత్యమై
అంజలి ఘటియింతు నందుకొనుము

Ravindranath-Tagore

purple-lotus

1

THOU hast made me endless, such is thy pleasure. This frail vessel thou emptiest again and again, and fillest it ever with fresh life. This little flute of a reed thou hast carried over hills and dales, and hast breathed through it melodies eternally new.

At the immortal touch of thy hands my little heart loses its limits in joy and gives birth to utterance ineffable. Thy infinite gifts come to me only on these very small hands of mine. Ages pass, and still thou pourest, and still there is room to fill.

సీ. చిన్ని వెదురు నను, చేత కోనల ద్రిప్పి
కొత్త పాటలు నేర్పి గొప్ప జేసి,

అవధిలేకను జేతువానందమది నీకు
శిథిల కలశమందు సుధలు నింపి

ఉబికిపొంగును మనమ్ముడుగుచేష్టలు, నీదు
అమృతహస్తము నన్ను నిమిరి నంత

ఊపిరందుకొనె నేడుల్లమందున నేదొ
అవ్యక్త భావమ్ము లక్షరముగ

ఆ. అఖిల దాతవీవు, సకలమీయ గలవు
పట్టు కొనగ నాకు, ప్రజ్ఞ లేదు!
ఎన్ని మార్లు నాకు నెంతయిచ్చిన నీవు
కొరత మిగిలిపోవు కొంత నాకు

2

WHEN thou commandest me to sing it seems that my heart would break with pride; and I look to thy face, and tears come to my eyes.

All that is harsh and dissonant in my life melts into one sweet harmony - and my adoration spreads wings like a glad bird on its flight across the sea.

I know thou takest pleasure in my singing. I know that only as a singer I come before thy presence.

I touch by the edge of the far spreading wing of my song thy feet which I could never aspire to reach.

Drunk with the joy of singing I forget myself and call thee friend who art my lord.

సీ. ఆనతిచ్చితివీవు గానమ్ము సేయంచు,
అతిశయమ్మున గుండె అదుపు తప్పె

కరుణతో ననుజూడ కన్నీరు యేరులై,
కఠినత్వమంతయు కరగి పోయె

నీరంధ్రమున దేలి నీలాభ్ర  వీథిలో
రివ్వుమనుచు సాగు గువ్వ నైతి

నాదుగానము నీకు మోదమని తెలియు
గాయకునిగ నాదు గరిమ దెలియు

ఆ. మనసు చేర లేని ఘనమైన పదసీమ
పాటనాలపించి బడసినాను!
మత్తు లోన బడితి మరచిపోతిని స్వామి
నేస్త మనుచునెంచి, నిఖిల ప్రభుని!

Posted in March 2020, సాహిత్యం

5 Comments

  1. మల్లావఝల చంద్రశేఖర్. శర్మ

    చాలా బాగున్నాయి

    ప్రాసయతి ధ థ చెల్లుతుందా
    అనేది ఒక.సందేహం
    పద్యాలన్నీ సుందరంగా ఉన్నాయి

  2. G.N

    చక్కటి భావ శైలి. నన్ను ఆకొట్టుకున్న శీర్షిక ఇది ఒక్కటే. విశ్వకవి ఆశీస్సులు మీకు సదా ఉండుగాక.

    • వింజమూర్ విజయకుమార్

      చాల సంతోషం! G.N గారు. గీతాంజలిని చదివి మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆనందమే పరమావధి మానవ జీవితానికి అని ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. బ్రహ్మము ఆనంద స్వరూపము. ఆ సత్ చిత్ ఆనందమే అన్ని జీవరాసుల్లోనూ నర్తన నిరంతరం నర్తన చేస్తుంది. దాన్ని గుర్తించి నడుచుకునే జీవితము ధన్యము. అందుకే కాబోలు రవీంద్రుడు, మృత్యువును కూడా ఆనందంగానే స్వీకరిస్తాను‌అని వ్రాసుకున్నాడు గీతాంజలిలో.

  3. Surya

    ఎందరో మహానుభావులు ఇంతక ముందే తెలుగు భాషకు పరిచయం చేసిన మీరు చెప్పిట్లు, రవీంద్రడు గొప్ప కవిట అనుకొనే వరకునే తెలుసుకున్నము మేము ఇప్పటి వరకు. మీ ఈ అనువాద కవిత్వం చదువుతుంటే వికసించిన పుష్పం వెదజల్లుతున్న సువాసన పరిమళాన్ని ఆనందిస్తున్నంత హయి గా ఉంది. అద్బుతమైన రచనా సరళి మీద మన ఈ తరం వాళ్ళలో, మీ ప్రయత్నానికి సదా కృతజ్ఞతలు 🙏.

    • వింజమూర్ విజయకుమార్

      చాల సంతోషం సూర్యా!! పద్యాలు మీకు‌నచ్చినందుకు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!