మా వూళ్ళో ఉన్న హాస్పిటల్లో వాలంటీరుగా పనిచేసే మా అమ్మాయికి కిందటేడు డిసెంబర్లో ‘క్రిస్ట్మస్ బాంక్వెట్’ ఆహ్వానం అందినప్పట్నుండీ నేను మొత్తుకుంటూనే ఉన్నాను “అది మనకొద్దూ, అక్కడ మనం తినేవి ఏవీ ఉండవూ” అని. మొగాళ్ళమైన మనం “ఇది చేయం అది చేయం” అని భీష్మ శపధాలు చేయడమూ "ఓసోసి వీడెవడ్రా" అని పక్కకి తోసిపారేయడమూ మన ఆడవాళ్లకి అలవాటే కనక మొత్తానికి - వచ్చేవాళ్ల లెక్కా రాని వాళ్ళ లెక్కా కలిపి తీసేసి - నేనూ మా పిల్లలిద్దరూ అక్కడికి వెళ్ళి ఆ బాంక్వెట్టులో పెట్టే గడ్డి తిని రావడానికి నిర్ణయమైపోయింది, అదీ ఓ శుక్రవారం సాయింత్రానికి. మా ఆవిడతో సహా అందరూ ఎందుకెళ్ళలేదో అనే గూట్లే ప్రశ్నలు మీరడగరాదు, నే చెప్పరాదు. ఇంక మాట్లాడకండి. నాకు అక్కడకెళ్లకుండానే ఓ పెద్ద సందేహం మొదట్నుండీను. ఇండియాలో ఉన్నప్పుడు 'Z' అక్షరాన్ని జెడ్ అన్నట్టూ ఇక్కడ అమెరికాలో కుదరదు; అలాగే షెడ్యూల్ అన్నదాన్ని ఇక్కడ ష్కెడ్యూల్ అంటున్నాం కనక ఈ శుక్రవారం విందుని “బాంకే” అనాలా, “బాంక్” అనాలా, బాంకెట్ లేకపోతే రెండు టి లు కలిపేసి శుద్ధ “బాంక్వేట్ట్” అనాలా అని. అసలేమంటే ఏమౌతుందో, అనకపోతే ఏమౌతుందో?
మనకేదీ తెలియనప్పుడు చెప్పడానికి అప్పనంగా గూగిలమ్మఉంది కనక దాన్ని అడిగితే బాంక్వెట్ అనాలని తెల్సిపోయింది. మరి మనం శుక్రవారప్పూటా మోకాలి దగ్గిర చిరిగిపోయిన జీన్సు, ఒళ్ళు కనీ కనపడకుండా ఉండే ఓ టి-షర్టూ, మట్టికొట్టుకుపోయిన ఒకప్పటి (తెల్ల) షూసూ ఆ పైన చలి ఆగడానికి రెండేళ్ళుగా ఉతకని మాసిపోయిన కోటూ వేసుకుని ఆఫీసుకెళ్ళినా ఎవరూ ఏమనరు కనక, ఆ బట్టల్తోటే పోవచ్చా బాంక్వెట్టుకి? ఈ ధర్మసందేహం తీరాలంటే ఎలా? దానికి మా అమ్మాయే సమాధానం చెప్పేసింది - నువ్వు అలాంటి బట్లేసుకుంటే నీతో వచ్చేది లేదు పో అంటూ. అంటే మనం ఎప్పుడో ఓ సారి వేసుకునే టై కట్టాలా? ఇదేదో బాగానే ఉందే హుందాగా కనబడి పోజు కొట్టొచ్చు, కాస్త చలి తగ్గుతుంది, ఫోటో దిగొచ్చు కూడా అనుకునే లోపుల మరో మొట్టికాయ. తాను రాకపోయినా మేము ముగ్గురం ఏంచేయాలో, చేయకూడదో చెప్పే హోం మినిస్టర్ గారి నుంచి, “ఈ రంగు పేంటు కుదరదు. టై అక్కర్లేదు (హతోస్మి!), ఆ ఎర్ర రంగు చొక్కా వేస్తే చీపురు తిరగేస్తా,” వగైరా వగైరా...
మొత్తానికి రెండువారాలు ఎదురు చూసాక ఆ బాంక్విట్ శుక్రవారం రానే వచ్చింది. సాయంత్రం ఆరింటికి మంచి బట్టలేసుకుని డ్రెస్ షూస్ తో బయల్దేరాం ముగ్గురమూను. క్రిస్ట్మస్ డిన్నర్ బాంక్వెట్ అంటే నేను అనుకున్నట్టేమీ లేదు. గుండ్రం బల్లలూ, చుట్టూ ఏడుగురు కూర్చోడానికి కుర్చీలూ ఆ బల్లల మీద అప్పటికే ఒక్కొక్కరికీ వేరు వేరుగా పెట్టిన అదో రకం కేకు ముక్కలూను. ఏదో ఓ బల్ల చూసుకుని కూర్చోడం కుదరదు. అంతకుముందే మన అమ్మాయి, దాని స్నేహితురాలూ, వాళ్ళ అమ్మా నాన్న ఉన్న బల్ల దగ్గిర కూర్చోడానికి “ఏతత్శుభ ముహుర్తమునకు పెద్దలు నిశ్చయించినారు గావున,” అక్కడకి ముందే వచ్చి కూర్చున్న వీళ్ల దగ్గిరకెళ్ళి, “అహం శర్మా అభివాదయే” అంటూ సంకల్పం చెప్పుకుని ఓ షేక్ హాండ్ పారేసి కూర్చున్నాం. కళ్లముందు తిండి కనబడితే ఆకలున్నా లేకపోయినా నేను ఆగలేను కనక, మరో ధర్మసందేహం – “ఈ బల్లమీద పెట్టిన కేకు ముక్క ఇప్పుడు తినేయొచ్చా, లేకపోతే అందరికీ 'టేక్ ఇట్ టామీ' అని కుక్కకేసినట్టూ ఆర్డరేసే దాకా ఆగాలా?” కోటు తీసి కుర్చీకి తగిలిస్తూ ఈ పక్కకీ అటువైపుకీ చూసేసరికి ఈ ధర్మ సందేహం తీరిపోయింది. అందరూ చిన్న చిన్న ముక్కలు చప్పరించడం చూసి. ఈ పక్కనే ఉన్న మా అబ్బాయి కేసి చూస్తే అప్పటికే వాడి కేకు ముక్క ఉన్న ప్లేటు కురుక్షేత్రంలో అభిమన్యుడు ఛేదించిన పద్మవ్యూహంలా ఉంది. మరింకెందుకాలశ్యం?
ఈ కేకు ముక్క తింటూంటే మధ్యలో కాఫీ అనీ స్వీట్ టీ అని వడ్డన. దాంతోటే నాకు తెల్సిపోయింది ఎవర్నీ అడగక్కర్లేకుండనే - ఇదే బాంక్వెట్ అంటే. ఈ రాత్రికి ఎలాగా ఇంటికెళ్ళి గోంగూర పచ్చడి వేసుకుని ఉల్లిపాయతో లాగించకపోతే మనకి నిద్ర పట్టదు. ఇక్కడేదో తినేసి ఉద్ధరిద్దామనుకున్నాం గానీ నేనన్నదే రైటు - ఆఖరికి ఈ తెల్లోళ్ళకీ నల్లోళ్ళకీ కూడా గొడ్డు మాంసమూ (బీఫ్) లేదు, పీకి పీకి ఉడికించిన పంది మాంసమూ (పుల్డ్ పోర్క్) లేదు. కాఫీ మీద కాఫీ తాగుతూ ఆ కేకు ముక్కచప్పరిస్తూ ఏవో కబుర్లు. ఎందుకైనా మంచిదని ఇంటిదగ్గిరున్న మా ఆవిడకో టెక్స్టు మెసేజి పెట్టా - కాసిని బియ్యం రైసు కుక్కర్లో పడేయి తల్లీ ఇంటికొచ్చి ఖాళీ కడుపుతో పడుకోకుండా అని. ఈ లోపున హాస్పిటల్ ప్రెసిడెంటూ, చర్చ్ ఫాదర్ గారూ చిన్న చిన్న ఉపన్యాసాలు, చప్పట్లూ, ఆ పైన వాలంటీర్లు చేసిన సేవకి చిన్న చిన్న బహుమతులూ గట్రా. "ఇంక ఇదేనా మన తిండి, నేను చెప్పలేదా, రావొద్దు మొర్రో అని?" అని నేను మా అమ్మాయి చెవిలో గొణిగేసరికి దానికి ఇంతెత్తున కోపం. “ఉష్ష్” అంటూ నోరు మూసుకోమని చెప్పాక మళ్ళీ మరోసారి కాఫీ - అవును నల్లదే లేకపోతే అమెరికాలో జనం తెల్లకాఫీ తాగడం ఎక్కడైనా కన్నదా విన్నదా?
అదిగో అప్పుడొచ్చేడు వాలంటీర్ డైరక్టర్ అనే పెద్దమనిషి వేదికమీదకి. వచ్చి చెప్పేదేవిటంటే “అందరూ ఒకేసారి లేచి పరుగెడితే కంగాళీ అయిపోతుంది కనక ఇదిగో నేను పిల్చే బల్లల నెంబర్ల తాలూకు జనం అలా వెళ్ళి ప్లేట్లలో తిండి వడ్డిస్తారు తెచ్చుకోండోహో” అంటూ. వార్నీ ఇంకా తినడానికేదో ఉందన్న మాట, ఇది ముందు చెప్పి ఏడిస్తే అన్ని కాఫీలు తాక్కూండా ఉండేవాణ్ణి కదా? అయినా ఇప్పటిదాకా మేము కూర్చున్న టేబిల్ కి నెంబరు ఉండడమే గమనించలేదు. మన నెంబరు పిలిచేక వెళ్ళేం వడ్డించేవాడి దగ్గిరకి. కాసిని ఎండిపోయిన బ్రెడ్డు ముక్కలూ, రెండు మాంసం కూరలూ, పొటాటో సాలాడ్ అనబడే బంగాళా దుంప పేస్టూ, సూపు అనబడే మరో రకరకాల కూర ముక్కలు వేసిన అదో వాసనేసే మనం తినగలిగే ఒక వెజిటేరియన్ ధప్పళవూను. ఆ పక్కనే మళ్ళీ డిసర్టు (మళ్ళీ దీన్ని ఎలా పలకాలో నాకు క్లాసు పీకకండే?) అనబడే మరో కేకు ముక్క! తెలుగువాడు ఎంతా ఆశాజీవి అయినా మనక్కావాల్సిన ముద్ద పప్పూ, వంకాయ కూరా, ఆవకాయా, సాంబారూ ఉంటాయా ఇటువంటి ఫైవ్ స్టార్ ప్లేసుల్లో?
ఆ మాంసం ముక్కలు మనం తినలేం కనక వాట్నిఅలా వదిలేసి మిగతావి తెచ్చుకుని తినడం సాగించాం. అమ్మాయికి తన స్నేహితురాల్తో కూర్చోడం కబుర్లు చెప్పుకోవడంలో మన కడుపులో ఎలకలు - లోపలకి పంపించిన మూడు గ్లాసుల నల్ల కాఫీతో - ఎలా పరుగెడుతున్నాయో తెలియదు. కుర్రాడూ నేనూ ఓ జట్టు తినడానికి. ఆ లైన్లో నిలబడి తెచ్చుకున్నదే కుమ్మి కుమ్మి మొత్తమ్మీద ఎనిమిదింటిదాకా లాగించాం బండి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. మేము తింటూంటే ఓ కుర్రాడూ, కుర్రమ్మ చాలా సేపు గిటార్లో పాటలు పాడి వినిపించారు. మేమందరం తినేవరకూ పాపం ఆయన అలా వాయిస్తూనే ఉన్నాడు; ఆవిడ అలా పాడుతూనే ఉంది జీసస్ గురించి. ఆ తర్వాత లాటరీలో గెలిచిన వాళ్ళకై బహుమతి ప్రధానం. మనకి లాటరీలో గెలిచే అంత అదృష్టం ఉంటే ఇలా కేకు ముక్కల బాంక్వెట్ కి వచ్చేవాళ్ళమా? అదంతా చూసి క్రిస్ట్మస్ చెట్టు కిందా, ఆ పక్కనా రెండు మూడు ఫోటోలు దిగి అందరికీ థేంక్సు చెప్పి బయటకొచ్చేసరికి ఎనిమిదిన్నర. సరిగ్గా మన భోజనం టైము!
ఇంటికొచ్చేసరికి రైసు కుక్కర్లో అప్పుడే ఉడికిన వేడి వేడి బాస్మతీ రైసు రారమ్మని పిలుస్తోంది. పక్కనే ప్రియావారి గోంగూర పచ్చడి! వెంఠనే ఓ ముద్ద కలిపేసరికి నాకు, నాకు అంటూ అమ్మాయి, అబ్బాయి తలో కంచం పట్టుకుని తయారు. నాకైతే కడుపులో ఖాళీ ఉంటుందనుకున్నాను కానీ పిల్లలకి కూడా కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయని అప్పుడే తెల్సింది. ఓ ఉల్లిపాయ తరుక్కుని ఆ పచ్చట్లో నంచుకుని స్వర్గానికి ఒక అంగుళం కిందా పైనా విహరిస్తూ గోంగూరా, గడ్డ పెరుగూ అన్నం లాగించి పదయ్యేసరికి మంచం ఎక్కాం, సర్వేజనా సుఖినోభవంతు అనుకుంటూ.
ఝాము రాత్రి ఒళ్ళు తెలీని నిద్రలో ఎవరూ కుదుపుతే మెలుకువొచ్చింది. ఇంటినిండా లైట్లు వేసున్నాయి. అమ్మాయీ, ఆవిడా బెడ్రూం లోంచి బయటకీ లోపలకీ పరుగులు. లేచి చూస్తే ఏవుంది? అర్ధరాత్రి ఎనిమిదేళ్ళ కుర్రాడు మంచం మీదే కక్కేసాడు సాయంత్రం దగ్గిర్నుంచీ తిన్న కేకు ముక్కా, ధప్పళం, గోంగూరా, పెరుగూ అన్నీ అరగని అన్నంతో సహా. అన్నీ అవే ఆకారంలో బయటకొచ్చేసాయి. వెంఠ వెంఠనే వాణ్ణీ బాత్రూంలోకి తీసుకెళ్లబోతూంటే దారంతా డోకు. బాత్రూం అంతా డోకు మయం. ఒక్కసారి నిద్ర ఎక్కడిదక్కడ ఎగిరిపోయింది.
ఇంక మంచం మీద దుప్పట్లూ, కవర్లూ, గలీబులూ తీయడం, బాత్రూంలో నేల తుడవడం, కడగడం, అవన్నీ తడిపి వాషర్లో వేయడం ఇవన్నీ ఉతికి మడతపెట్టుకుని అన్నీ మరో సారి క్లీన్ చేసి కార్పెట్ వాక్యూం అయ్యేక మళ్ళీ డోకు వాసన రాకుండా అదో పెర్ ఫ్యూం జల్లి పడుకోడానికి అనువుగా చేసేసరికి శుక్రవారం రాత్రి మొదలైన ఈ బాంక్విట్ ప్రహసనం పూర్తయ్యేసరికి సోమవారం తెల్లారిపోయింది. ఉరుకులు పరుగుల్తో ఆఫీసుకెళ్ళాల్సిన ఆగత్యం. అదృష్టం ఏవిటంటే డోకేసిన కుర్రాడికి జ్వరం ఏవీ లేదు; అంతా డోకేసాక కడుపు పూర్తిగా ఖాళీ అయిపోయింది కదా, మర్నాటినుంచీ మామూలుగానే ఉన్నాడు. మొత్తానికి నేర్చుకున్న నీతి ఏమిటంటే, ఈ సారి ఎవరైనా ఇలాంటి బాంక్వెట్ కి పిలిస్తే వడ్డించిన ఆ చిన్న కేకు ముక్క ఒక్కటే తినడం మంచిది. ఎవరైనా అడిగితే “అబ్బే నేను డయట్ మీదున్నాను” అంటే పుణ్యమూ పురుషార్థమూను, ఏవంటారు?
శర్మ గారు చాలా బాగా చెప్పారు.ధన్యవాదాలు.