Menu Close

Adarshamoorthulu

డా. ఎల్లాప్రగడ సుబ్బారావు

Yellapragada

మనిషి మేధస్సు యొక్క గొప్పతనం, అందులో ఉద్భవించే ఆవిష్కరణ వెల్లువలకు అలుపు అనేది లేదు. ఎంతోమంది మేధావులు తమ మస్తిష్కంలో జనిస్తున్న ఆలోచనలకు సరైన రూపకల్పన చేసి ఎన్నో అనూహ్యమైన విజ్ఞాన మార్పులకు, సిద్ధాంతాలకు కారణభూతులైనారు. ఆ విషయంలో నాటి నుండి నేటి వరకు మన భారతీయుల బుద్ధి బలము, పాశ్చాత్యులతో పోల్చిన కొంచెం ఎక్కువనే చెప్పాలి. కాకుంటే మన వారికి తగిన ప్రోత్సాహము, ఆసరా లభించుటలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకనే మన మేధోసంపత్తి, విదేశీయులకు ఒక కల్పతరువైనది.

ఐదవ శతాబ్దంలోనే సున్న ను కనిపెట్టిన ఆర్యభట్ట మొదలు, ఒక రామానుజన్, ఒక రామన్, ఒక చంద్రశేఖరన్, ఒక కలాం, అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు... ఇలా చెప్పుకుంటూ వెళితే మన భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన బుద్ధికుశలత గలగిన ఎంతోమంది మహానుభావులు మనకు తారసపడతారు. ఆ జాతి ముత్యమే, ప్రపంచానికి టెట్రాసైక్లిన్ అనే సూక్ష్మజీవనాశక  ఔషధాన్ని కనుగొని ఎన్నో మహామారి వ్యాధుల నియంత్రణకు పాటుపడిన జీవ రసాయన శాస్త్రవేత్త, మన తెలుగువాడు డా.ఎల్లాప్రగడ సుబ్బారావు నేటి మన సంచిక ఆదర్శమూర్తి.

మనిషి ఆయువు యొక్క ప్రమాణం పెరిగి నేడు మనందరం ఎక్కువ కాలం నివసించ గలుగుతున్నామంటే అది సుబ్బారావు వంటి శాస్త్రవేత్తల, శాస్త్రీయ ఆవిష్కరణల పుణ్యమే. Hetrogen, Tetracycline, Methotrexate (anti-cancer drug) ,Polymixin (Cattle Food), ATP (adenosine triphosphate), Vitamin B9 లాంటి దివ్యౌషధాలను కనుగొనుటలో తన వంతు పాత్రను పోషించి ప్రపంచంలో నలుమూలలా ఎన్నో రుగ్మతలను కలిగిస్తున్న అనేక సూక్ష్మక్రిములను నశింపజేయగలిగిన సామర్ధ్యాన్ని నేటి ఆధునిక వైద్య రంగానికి అందించారు.

Yellapragada Statueఎల్లాప్రగడ గారు జనవరి 12, 1895 న భీమవరం లో పుట్టారు. స్కూల్ చదువులు రాజమండ్రి లో పూర్తి చేసుకుని, మద్రాస్ లో ఇంటర్ పూర్తి చేసి మద్రాస్ మెడికల్ కాలేజ్ లో LMS డిగ్రీ సంపాదించారు! పిమ్మట మద్రాస్ ఆయుర్వేద కాలేజీలో అధ్యాపకుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఎన్నో రుగ్మతలను చిటికలో తగ్గించగలిగి, ఎంతో గొప్పదై మన పూర్వీకుల అందించిన మన ఆయుర్వేదాన్ని సాటి భారతీయులే హేళన చేస్తున్న ఆ రోజుల్లో మన సుబ్బారావు గారికి ఆ ఆయుర్వేద వనమూలికల సామర్ధ్యం మీద ఆసక్తి ఏర్పడి వాటి గురించి పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడే సర్పగంధి మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. సర్పగంధితో చాలా రోగాలను నయం చేయవచ్చు. కావాలసిందంతా పరిశోధనలకు పెట్టుబడి అని ఎన్నో సార్లు తన సన్నిహితులతో ఆయన అన్నారు. కానీ అందరూ ఆయనను పిచ్చి పరిశోధకుడు అనే వారే కానీ ఆయనలోని జిజ్ఞాసను ఎవ్వరూ గుర్తించలేదు. మన ప్రాచీన ఆయుర్వేద మూలికలను ఏ విధంగా ఆధునిక పద్దతులలో వాడి మానవ జీవన ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చు అని ఆలోచించడం మొదలుపెట్టారు.

ఆ సమయంలోనే తన పరిశోధనలకు తగిన ప్రోత్సాహం లభించేసరికి ఆయన అమెరికా వెళ్లి హార్వర్డ్ విశ్వవిద్యాలయం లో పిహెచ్.డి. పట్టాను కూడా పొందారు. పిమ్మట అక్కడే ప్రముఖ మందుల తయారి కంపెనీ LEDERLE COMPANY లో చేరి తన ప్రతిభా పాటవాలతో ఆ సంస్థకు అధిపతి అయ్యే స్థాయికి ఎదిగాడు.

మిగిలిన శాస్త్రవేత్తలతో కలిసి నిరంతర కృషితో తన పరిశోధనలను సాగిస్తూ ఎన్నో అమూల్యమైన వైద్య విషయాలను కనుగొన్నారు.  రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాలో వైద్యసేవలు అందించారు. ఇలా విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు, ఆరోగ్య సూత్రాలకు మూలపురుషుడైన సుబ్బారావు గారికి ఎలాంటి గుర్తింపు మాత్రం రాలేదు. కారణం ఆయనకు తన ఆవిష్కరణలతో వ్యాపారం చేయడం చేతకాలేదు. గుర్తింపు కోసం పాకులాడలేదు.  అదే మన దురదృష్టం. కనీసం మన భారత ప్రభుత్వం అయినా ఆయన సేవాతత్పరతను గానీ, మేధాసంపత్తిని గానీ పట్టించుకోలేదు. ఇప్పడు ఉన్న పద్మవిభూషణ్ గాని, భారతరత్న వంటి గుర్తింపు పతకాలు నేడు లేవు కదా అందుకేనేమో! ఇప్పుడైనా ఆయనను ఏదోఒక గౌరవంతో సత్కరించవలసిన బాధ్యత మనమీద ఉంది.

ఆయన ఒకే ఒక చిన్న మాటను నోబెల్ ప్రైజ్ కమిటీ ముందు చెప్పడం జరిగింది. తను అన్ని  పరిశోధనలకు కావలిసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే అందించానని, పరిశోధనల రూపకల్పన అందుకు అవసరమైన మేధోసంపత్తి, ఆలోచనలను అందించలేదని తెలిపారు. అందుకే ఆయన పేరు మనకు ఎక్కడా ఏ ఆరోగ్యపరమైన విషయాలలో కనపడదు.  ఎందుకంటే ఆయన ఏదో ఆశించి ఇవన్నీ కనిపెట్టలేదు ! ప్రపంచ క్షేమం కోసం కష్టపడ్డారు!

1948 ఆగష్టు 8 న ఆయన చనిపోయారు. ఆయన చివరి క్షణాల్లో ఆయన పలికిన మాటలు వింటే ఆయనంటే ఏంటో మనకు అర్థమౌతుంది. ‘భగవంతుడు నాకు ఇంకొంత కాలం ఆయుషు ఇచ్చివుంటే మరొక వ్యాధికి మందును కనుగొందునేమో’. అంటే అప్పుడు కూడా మానవ శ్రేయస్సునే తలచాడు.

ఏది ఏమైనా ఆయన కనుగొన్న విలువకట్టలేని విజ్ఞాన విషయాల పుణ్యమా అని నేడు మానవజాతి వందేళ్ళ ఆయుష్షు కలిగి ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో! ఆయన పనిచేసిన LEDERLE COMPANY వారు తమ ప్రాంగణంలో సుబ్బారావు గారి విగ్రహం ప్రతిష్ఠించి ఆయనపై తమ గౌరవాన్ని చాటుకున్నారు.

Posted in April 2018, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *