Menu Close
PrakriyalaParimalaalu_pagetitle
మొగ్గలు

పద్య కవిత్వం సామాన్యులకు చేరువ కాలేని పరిస్థితిలో వారు తమ భావాలను చందోబద్ద గణవిభజన సంకెళ్ళతో బంధింపనవసరం లేకుండా వచన కవిత్వం ఊరటనిచ్చింది. పుంఖానుపుంఖాలుగా అద్భుత వచన కవిత్వ సంపుటులు జనసామాన్యాన్ని చేరి అలరించాయి.

ఆ తర్వాత వచన కవిత్వం దీర్ఘ కవిత్వం నుండి మినీకవిత్వానికి దారి తీసినాక రచయితలు, పాఠకులు అనే ధోరణి నుండి విడివడి ధైర్యంగా పాఠకులు కూడా తమ భావాలను క్లుప్తత, అభివ్యక్తికి తగిన కొసమెరుపులలో బంధించి జనరంజకమైన లఘుకవిత్వాన్ని సృజించే సాహసానికి పూనుకోగలిగారు.

మినీ కవితా ఉద్యమం ఉధ్ధృతంగా సాగి విశేషాదరణ పొందింది. వందల సంఖ్యలో సంపుటులు ఔత్సాహిక వర్ధమాన రచయితలచే వెలువరించబడ్డాయి. తర్వాత తీవ్రత నిదానించిందనుకునే లోపే ఇటీవల లఘుకవితా ప్రక్రియ ఒక్కసారిగా ఊపునందుకుంది.

లఘుకవిత్వం అనేక ప్రక్రియలుగా పాఠకులను పలకరించసాగింది. కవులను ఆకర్షించింది. సోషల్ మీడియా పుణ్యమా అని వాట్సాప్, ఫేస్ బుక్, టెలిగ్రాం తదితర మాధ్యమాల ద్వారా ప్రక్రియల రూపకర్తలు ప్రత్యేక గ్రూపులనేర్పరచి కవులను ప్రోత్సహించడం, పరస్పర సహకారంతోనూ, వ్యక్తిగతంగానూ సంకలనాలు, సంపుటులు తీసుకు రావడం పెరిగింది. ప్రక్రియ ఏదైతేనేం విస్తృతంగా చదవడం, తమ భావాలను కవిత్వీకరించడం మంచి పరిణామమే కనుక ఈ ఒరవడి ప్రస్తుతం సాగిపోతోంది.

ఇన్ని ప్రక్రియలు అవసరమా అని పండితులు పెదవి విరిచినప్పటికీ ఎవరి ప్రయత్నం వారు చేస్తే ఎలాగూ జనరంజకమైనదే కాలానికి నిలబడుతుంది కదా! అనే వాదనలూ వినవస్తున్నాయి. ఇక పరిశీలిస్తే ఇటీవల పలకరించిన లఘుకవితా ప్రక్రియలలో అధిక శాతం మాత్రాగణన నియమ సహితమైనవి. పద్యానికి తమ్ముడు లా.గణాలతో పనిలేదుకానీ మాత్రల లెక్కింపుపై పట్టు పెంచేవి. పద్యం కంటే సులభం పైగా లయాత్మకం కావడంతో ఇవి విశేషాదరణ పొందుతున్నాయి. ఉదా: మణిపూసలు, కైతికాలు, ఇష్టపదులు, సమ్మోహనాలు..మొ.

కొన్ని ప్రక్రియలు హైకూలలా అక్షరాలు, పదాల సంఖ్య లెక్కతో పలకరించాయి. ఉదా: మెరుపులు, సున్నితం, నవరత్నాలు మొ.

మాత్రాగణన,పదాల సంఖ్య ..ఇలా ఏ విధమైన ఆంక్షలూ లేకుండా సులభంగా సరళంగా స్వేచ్చగా భావాలను కవిత్వీకరిస్తే చాలా బాగుంటుంది కదా! ఇలా డా.భీంపల్లి శ్రీకాంత్ మనసులో మెదిలిన ఆలోచన "మొగ్గలు" అనే లఘుకవితా ప్రక్రియగా రూపు దిద్దుకుంది. అచిరకాలంలోనే కవిత్వం వ్రాయగలమనే ధైర్యాన్ని అందరిలో నింపింది. విశేషమేమింటంటే ఇది కావాలని చేసిన ప్రయత్నం కాదు. యాదృచ్చికంగా పుట్టినవే మొగ్గలు.

డా.భీంపల్లి శ్రీకాంత్ తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామానికి చెందిన వారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. పాలకొండలో పనిచేస్తున్నారు. వీరు రూపకర్తగా మొగ్గలు ప్రక్రియ 2017 నవంబర్ నుండి కవులను తద్వారా పాఠకులను చేరుకుంది. శ్రీకాంత్ గారు యాదృచ్చికంగా అనుసరించి ఈ నియమాలతో సరళంగా వ్రాసుకున్న మొగ్గలు బాగుందని తానూ వ్రాసి ఒక ప్రక్రియగా ప్రచారం చేసిన మిత్రుడు బోల యాదయ్యకు కృతజ్ఞతలు తెలపడం వీరి సంస్కారానికి నిదర్శనం. మిత్రుని ప్రోత్సాహంతోనే ఆరునెలల తర్వాతైనా మొగ్గలు లోకం చూశాయి.

తన ప్రక్రియ గురించి ఒక మొగ్గగా శ్రీకాంత్ ఇలా చెప్తారు.

"ఎన్ని అక్షరాలను విత్తనాలుగా నాటానో
మొగ్గలుగా కవితావనంలో విరబూయడానికి
మొగ్గలు సాహితీ క్షేత్రంలో పండే నిత్య పంట."

వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం తదితర మాధ్యమాలలోనూ ప్రతిరోజూ దినపత్రికలలోనూ మొగ్గలు వికసించి పరిమళిస్తూనే ఉంటాయి. ఇప్పటికే 33 సంపుటులు వెలువడగా ఇప్పుడు పి.వి.మొగ్గలు 100 మంది కవులచే వ్రాయబడి శ్రీకాంత్ గారి సంపాదకత్వంలో సిద్దంగా ఉంది. బతుకమ్మ మొగ్గలు, బాల మొగ్గలు, గాంధీ మొగ్గలు తర్వాత వీరి సంపాదకత్వంలో వస్తున్న నాలుగవ సంపుటి ఇది.

ఇప్పుడు మొగ్గలు ఎలా వ్రాయాలో చూద్దాం.

మొగ్గలు లఘుకవితా ప్రక్రియ నియమాలు:

 1. మొత్తం మూడు పాదాలు ఉంటాయి.
 2. మొదటి రెండు పాదాలు కొనసాగింపుగా ఉంటాయి.
  (అంటే మొదటి వాక్యం అసంపూర్తిగా ఉండి రెండో వాక్యంతో కలిసి ముగింపబడాలి.)
 3. మూడవపాదం పై రెండు పాదాలను సమర్ధిస్తూ వ్రాయాలి.
  ఈ మూడవ పాదం ఒక నినాదంగా సూక్తిగా సామెతగా ఉండొచ్చు.
 4. మూడు పాదాలూ కలిపి సాదాసీదా వాక్యాలు కాకుండా చక్కని భావసంపదతో కవితాత్మకంగా ఉండాలి. చమక్కులా మెరవాలి. క్లుప్తత, గాఢతతో ఉండాలి. చదవగానే సంతృప్తి కలగాలి.

అర్ధమైంది కదా! అక్షరాల పదాల సంఖ్యా పరిమితి లేదు అనుకుని చేంతాడంత వాక్యాలు వ్రాయకుండా మూడు నాలుగు లేదా అయిదు పదాలతో క్లుప్తత పాటిస్తే మన అభివ్యక్తి ఆకర్షణీయమైన మొగ్గగా పరిమళించగలదు. ఇప్పుడు మరింత అవగాహన కోసం నేను వ్రాసిన కొన్ని మొగ్గలు చూద్దాం.

మొగ్గలు:

1. అంశం: మొగ్గలు

విరులుగా వికసించినపుడే
భ్రమరములనాకర్షించేది.
పరిపూర్ణతే సమాజానికి అవసరం.

అరవిచ్చిన మొగ్గలనే
అందరూ ఇష్టంగా చూసేది.
బాల్యమే సర్వులకూ ప్రీతికరం

గడ్డిపూలైనా గులాబీలైనా
తుషారికలను సమంగా ఆకర్షిస్తాయి.
సమానత్వభావన బోధించే గురువు మంచు

నేడు మొగ్గలై రేపు పువ్వులైనా
ఎల్లుండికి రాలిపోవలసిందే.
జీవితం అశాశ్వతమని గుర్తించాలి.

పూవుల్లో ఎన్ని వర్ణాలున్నా
అన్నీ అందంగానే అగుపిస్తాయి
సుకుమారతలోనే సౌందర్యం.

2.అంశం: వర్షం

చినుకు చినుకూ కలిసి చిరుజల్లుగ మారి
పరితపించే ప్రకృతిని పలకరించి పోతుంది
సమస్త జీవుల ఆత్మీయ బంధువు వర్షం

కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరయ్యే ప్రకృతిని
జాలిగా నిలువెల్లా తడిమి తడిపి వెళ్తుంది
భూమాతకు ఆకాశపు తలంటే తొలకరి

పలకరించే వానని చూసి
పులకరించే పువ్వౌతాడు రైతు
కాయకష్టంతో శ్రమఫలం అందించును అన్నదాత.

మట్టినీ గట్టునీ చెట్టునీ
సమదృష్టితో తడుపుతుంది వర్షం
ప్రాంతీయ కులమత భావనలకి అతీతమైనది ప్రకృతి

పూలతావితో పోటీగా ఆహ్లాదపరుస్తూ
వానకి తడిసిన మట్టి పరిమళం.
బాహ్య సౌందర్యమే ప్రధానం కాదని బోధిస్తుంది వాన.

3.అంశం: రవీంద్రనాథ్ ఠాగూర్

గీతాంజలి కావ్యం రాసి
సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందారు
నోబెల్ పొందిన తొలి ఆసియావాసి రవీంద్రుడు

దేశభక్తి గీతాలెన్నో రాసి
జనగణమననూ రాశారు
జాతీయగీత రూపకర్త రవీంద్రుడు

అనేక ప్రపంచభాషలలోకి అనువదింపబడి
సాహిత్యంలో గొప్పరచనగా నిలిచింది
గీతాంజలి సృష్టికర్త రవీంద్రుడు

కేవలం రచయితగా ఉండిపోక
బాలలకు గురుకులంలాంటి బడిపెట్టెను
విశ్వభారతివిశ్వవిద్యాలయ స్థాపకులు రవీంద్రుడు

చదువుతోపాటు కళలూ ముఖ్యమంటూ
బాలల మనోవికాసమునకు కృషిచేసెను
కళాభవన్ స్థాపకులు రవీంద్రుడు

గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని భావించి
గ్రామ పునర్నిర్మాణానికి కృషిచేశారు
శ్రీ నికేతను నెలకొల్పినది రవీంద్రుడు

డెబ్బయ్యేళ్ళ వయసులో చిత్రకళాసాధన ప్రారంభించి
రెండువేలపైగా చిత్రాలు గీశారు
విదేశాలలో చిత్రప్రదర్శనలు జరిగిన చిత్రకారులు రవీంద్రుడు

భారతీయ సంగీత చరిత్రలో
రవీంద్రసంగీతం ప్రత్యేకశాఖగా ఏర్పడెను
మధుర గాయకుడు రవీంద్రనాధ్ టాగూర్

రచయితగా చిత్రకారునిగా గాయకునిగానే కాక
విద్యావేత్తగా గొప్పమానవతావేత్తగా పేరొందెను
నెహ్రూ గాంధీలు మెచ్చిన విశ్వకవి రవీంద్రుడు.

అర్ధమైంది కదా! మొగ్గలు వ్రాయాలనే ఉత్సాహం, వ్రాయగలమనే ధైర్యం వచ్చిందనుకుంటాను.ఇక ప్రారంభించండి.

అన్నట్లు ఒకో అంశంపై ఒకో మొగ్గ వ్రాసే వీలుంది. కానీ కొన్ని అంశాలు తీసుకుని ఒకో అంశంపై ఒక అయిదారు మొగ్గలు కూర్చితే చక్కని సంపుటి కాగలదు. నా అభిప్రాయం ప్రకారం మహనీయుల జీవిత విశేషాలను మొగ్గలుగా కూర్చడం వలన అందమైన కవిత రూపం వస్తుంది. ప్రకృతి, సామాజికాంశాలు, నైతిక విలువలు, ఆధ్యాత్మికం..కాదేదీ మొగ్గకనర్హం..

వచ్చే నెల మరో చక్కని ప్రక్రియతో మిమ్మల్ని పలకరిస్తాను. అంతవరకు కొన్ని మొగ్గలు పరిమళాలు వెదజల్లేలా వికసింపజేస్తుండండి మరి. ఇక సెలవా! నమస్కారం.

***సశేషం***

Posted in July 2021, సాహిత్యం

3 Comments

 1. Yamini kolluru

  నమస్తే అండి 🙏
  మొగ్గలు ప్రక్రియ అద్భుతంగా వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *