Menu Close
61. మీ కాళ్ళు మొక్కుతున్నాం ఊళ్ళోనే పనివ్వండి

దేశాన్నేలే నాయకులారా దండం పెడుతున్నాం
ప్రభుత్వమేలే పాలకులారా మీ కాళ్ళు మొక్కుతున్నాం
మాకే ఎందుకింతబాధ
మా బ్రతుకుపైన మీకు లేదా ఇసుమంత చింత...

కంటనీరు జారే
గుండె మంటరేగే
కాళ్ళు కంది కందిపోయే
తలకు భారమాయే

ఆశ ఆవిరాయే
కూలి బ్రతుకే కుప్పకూలిపోయే...
కరోనా కాటుకు
కంచంలో మెతుకే మాయమయ్యిపోయే...

తెల్లవారితే నీళ్ళు చిందిస్తూ రాళ్ళనే మోస్తూ
భవనాలు కట్టేటి బడుగుబ్రతుకేమో
ఆశ్రయ గొడుగునే లేక ఎక్కడోనున్న గుడిసే గుర్తొచ్చి
వేవేల మీటర్లు నడిరోడ్డుపై నడుచుకుంటూపాయే...

నిత్యం చేసే మా కాయకష్టపు పూతలో
పూసిన ఫలమన్నది లేదా...
ఎంత కండలు కరిగించిన మా కళ్ళల్లో
కలతనీరు పోదా...ఏ తప్పు జర…

62. అలా చూడకు

నాన్న చిట్టి తండ్రి అలా చూడకో
మేము జాలి చూపులను దానం చేసే కర్ణులమే కానీ...
మెతుకులనిచ్చి నీ కడుపులో ఎలుకలను హతమార్చే వీరులం కాదు...

మీ బ్రతుకులమీద పేలాలేరుకుని
శాలువాలు కప్పుకునే చచ్చు కవులమే కానీ...
మీకు బట్టలు దానంచేసే శిబిచక్రవర్తులం కాదు

ఇపుడంతా పేరు కొరకు పదానికి ప్రాణంపోసే వెర్రి విశ్వకర్మలే ఇక్కడ
మీకు స్థిరత్వ స్థలాలను అడుగులతో కొలిచి
విజ్ఞానాన్ని దానం చేసేవారు కాలంలో సమిదలైయ్యారు
మీ బ్రతుకులను చిత్రించి మెతుకులను దోచే దొంగలే ప్రస్తుతం ప్రమిదలైయ్యారు

నిజం చెబుతున్నా బాలకా...
నువ్వు తిరగబడితే గానీ
తిండిలేని నీ బ్రతుకు తిరగబడదు
నీ సైన్యానికి సరిపడ సత్తువను వేకువను
ఆన్నమును ఆనందమును నువ్వే సంపాదించుకో...
ఇదే నేను నికిచ్చే చైతన్య దానం
నేను కూడా ఇంతకు మించి ఏమీ ఇవ్వలేని అర్భకుడిని
అందుకు నన్ను మన్నించు...

63. చావుకొచ్చిన అభివృద్ధి

కాళ్ళు చక్రాలైతేగానీ బతుకుచక్రం కదలదాయే
నెత్తిన చుట్టాను మోయకపోతే
నా అన్న చుట్టరికం నిలువదాయే
గాజుల బుట్టను మోయకపోతే
పొట్టనిండదాయే
ఇల్లిల్లు తిరగకపోతే ఇల్లుగడవదాయే
గాజులు మణికట్టు ఎక్కలేక ఎక్కుతున్నప్పుడు
ప్రతి స్త్రీలో కనిపించే బాధాకర ఒంపులే
వారి జీవితంలో నిత్య అతిథులై తిష్టవేషాయే
రంగు రంగుల గాజులమ్ముతున్న
మా ఆశల్లో రంగులు రాకపోయే

తొమ్మిది నెలలు గర్భంలో మోసిన చాలదన్నట్టూ
తెగిన పేగును బుట్టలో నెత్తినెట్టుకుని ఊరేగినా
ఊపిరి పీల్చుకునే సంపాదన చేతికందదాయే
ఆమె కష్టాలను చూడలేక
కార్పొరేషన్ సంస్థలు ఆమెను,
ఆమె ఉనికిని మింగి ఆ రక్త మరకలతో
స్టాళ్ళల్లో గాజులై మురిసిపాయే
భారతీయ సంప్రదాయానికి జీవం పోసిన ఆ తల్లి జ్ఞాపకాలిప్పుడు
ప్రతి పల్లెను విడిచి
తల్లి భారతిలో కలిసిపాయే...

64. యాడబోయినవు కొడుకా

బ్రహ్మకేం తెలుసు బంధము విలువ
సృష్టితో ఆడుకునే అమ్మకేం తెలుసు అనుబంధము విలువ
మనిషిని ఆవేదనలో మరిగించి గుడ్డెద్దులా సాగే మాయకేమి తెలుసు మమకారము విలువ
అర్ధంతరంగా ఆయువుతీసి కాట్లో పండబెట్టె కటిక శివుడికేమి తెలుసు కన్నపేగు విలువ...
కొడుకు లేకపోతే విలవిలలాడే మనిషి మనసు విలువా...

యాడబోయినవు కొడుకా
నువ్వాడబోయినావు కొడుకా...
మమ్మిడిచి నువ్వాడబోయినావు కొడుకా...

మేం చేసిన పూజలన్ని బూదిలో నీరాయే
మేం పెట్టిన ఆసుపత్రి ఖర్చులన్ని నీ ప్రాణం నిలుపని అప్పులకుప్పాయే
మా ఆశలు అన్ని అడిఆశలపాలాయే
చెట్టంత కొడుకైన నువ్వు చలనంలేని చెట్టై పడిపోయావే...

యాడబోయినావు కొడుకా
నువ్వాడబోయినావు కొడుకా...
మమ్మిడిచి నువ్వాడబోయినావు కొడుకా...

నీ స్పర్శలేక నీ చొక్కా కళ తప్పింది
నీ మాట వినబడక కన్నతల్లి స్పృహ తప్పింది
నీ నవ్వు కనబడక మా బ్రతుకే గతితప్…

65. మనకు సిగ్గుంటే బాగుండు

భారతదేశంలో పేదలంటే ఎలుకలకు ఎంతో ఇష్టమట
తమ ఉనికికి ఊపిరి పోయడమే కాకుండా
తమ కడుపులో పరుగెత్తే అవకాశం ఇచ్చినందుకు..
భారతీయులుగా మనం ఎంత దయామయులమో కదా...
మన దయాగుణాన్ని తల ఎత్తుకుని గొప్పగా చెప్పుకోవాలి

సిగ్గుండాలి ఇటువంటి దృశ్యం చూసి కూడా
మెదడులో మానవత్వపు పోగేదో తెగిపోయినట్టు
ముందుకు వెళ్ళిపోయే మనుషులకు
అదేనండి మనకు, మనమే కదా ఆ మనుషులం.

66. బ్రతుకు పట్టాపొందిన మనిషి

బ్రతుకు పట్టాపొందిన మనిషి
అనుభవాలే అభినందనలు
కన్నీటి కథలే కరతాళధ్వనులు
చొక్కాయే శాలువా
చిరునవ్వే పుష్పగుచ్చం
చిరుకానుకే గుప్పెడు మెతుకులు

67. రెక్కల కథ

కొన్ని గూళ్ళలో
రెక్కలిరిగిన పక్షులు ఏడుస్తున్నాయి
రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోవడంతో

ఇంకొన్ని గూళ్ళలో
రెక్కలొచ్చిన పక్షులు ఏడుస్తున్నాయి
రెక్కలిరిగిన పక్షుల చాదస్తాన్ని దాటలేక
కన్నప్రేమను చూసుకునే సంస్కారం వీడలేక

68. మన అభివృద్ధి ఎంత గొప్పదో మరి

ఎగిరే విద్య నేర్చిన గువ్వలను
రేడియేషన్ తినేస్తున్నది
ఎదుగుటకు విద్య నేర్వని
ఈ గువ్వలను ఆకలి తినేస్తున్నది
ఇదే కదా..మన దేశ అభివృద్ధి ప్రస్థానం
భుజాలు చరుచుకుని మరి
చెప్పుకోవాలి మన గొప్పతనాన్ని ఇప్పుడు.

69. నిజమే ఈ కాలానికి ఆకలెక్కువ

నిజమే ఈ కాలానికి ఆకలెక్కువ
అన్నింటిని తినేస్తుంది
పందిలా తింటున్నావని
నిలబడి ఆకాశాన్ని చూడలేని పందిని హేళిచేస్తారే కానీ...
ఆ పందిని కూడా తినేసే కాలాన్ని ఏమి అనరు
నిందిస్తే మమ్మల్ని తినేస్తుందనే భయం కాబోలు..

నిజమే ఈ కాలానికి ఆకలెక్కువ
అన్నింటిని తినేస్తుంది
తొడపై నను కూర్చోబెట్టుకుని
మట్టినుంచి బువ్వను చిలికే
భూసార మథనం కథ చెప్పిన అవ్వను తినేసింది

నిజమే ఈ కాలానికి ఆకలెక్కువ
అన్నింటిని తినేస్తుంది
తిననని మారం చేస్తున్న నా జుట్టు పట్టుకుని
పెరుగన్నంతో పొట్టనింపి
పెరిగిన కొద్ది పెరుగులోని గుణాలు నేర్వమని చెప్పిన
మా ముసలవ్వను తినేసింది

నిజమే ఈ కాలానికి ఆకలెక్కువ
అన్నింటిని తినేస్తుంది
తూర్పమ్మ పురుడోసుకోకముందే
జొన్నరొట్టెకు వెన్నరాసి చేతికందించి
వెన్నెల చంద్రుడిలా జీవించమని దీవించిన పండిన దేహాన్ని తినేసింది
న…

70. నా పల్లెకు గ్రహణం పట్టిందమ్మ

నా పల్లెకు గ్రహణం పట్టిందమ్మ
నా పల్లెకు గ్రహణం పట్టిందయ్యా..
నా పల్లెకు పురుగులమందు గ్రహణం పట్టింది
ఈ పురుగులమందు గ్రహణపు దెబ్బకు
పల్లెకు పల్లె శ్మశానంగా మారింది

వానపాములు వాడిపోయాయి
తేనెటీగలు ప్రాణాలను త్రెంచుకున్నాయి
పేడపురుగులు జననం లేని మరణమయ్యాయి
సీతాకోకలు చితికిపోయాయి
గొంగళిపురుగులు జాడ మరిచాయి
నత్తలన్ని నలిగిపోయాయి
గాజుపురుగులు పగిలిపోయాయి
ప్రకృతింటా కంటనీళ్ళే మిగిలిపోయాయి
పురుగుమందు డబ్బాలే నవ్వుతున్నాయి

నా పల్లెకు గ్రహణం పట్టిందమ్మ
నా పల్లెకు గ్రహణం పట్టిందయ్యా..
నా పల్లెకు పురుగులమందు గ్రహణం పట్టింది
ఈ పురుగులమందు గ్రహణపు దెబ్బకు
పల్లెకు పల్లె శ్మశానంగా మారింది

ఏపుగా పంట ఉండాలంటూ...
అరువుచేసి బరువుమోసి
బస్తా బస్తా ఎరువులు తెచ్చేస్తే...
భూసారం కరిగిపోయే..
కరువులు మిగిలిపోయే..
ఆశలు అరిగిపోయే..
చివ…

... సశేషం ....

Posted in July 2021, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *