Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

బుద్ధి చపలత్వం తో ఎదురయ్యే ఇబ్బందులను ఆత్మనిగ్రహంతో తొలగించుకోవచ్చు. ఆత్మ పరిజ్ఞానంతో మనలోని బుద్ధి చాపల్యాన్ని నియంత్రించి తద్వారా ఏర్పడే అనవసరమైన ఆలోచనలను కట్టడి చేయగలిగిన నాడు మనలోని నిజమైన మానవతావాది బయటకు వస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే, నాకు, నా కుటుంబానికి భవిష్యత్తులో ఏదో అపవాదు, ఆపద వాటిల్లుతుందని ముందుగానే ఊహించుకుని, అభద్రతా భావాన్ని పెంపొందించుకొని, అనవసరమైన భయాలతో, ఆందోళనలతో అస్తమానం అవస్థపడుతూ బతకడం అనేది అన్ని విధాల శ్రేయస్కరం కాదు. విచక్షణారహితంగా ఎప్పుడో ఏదో జరుగుతుందనే భావనను ముందుగా తొలగించుకోవాలి. ఆ తరువాత, ఒకవేళ జరిగితే దానికి విరుగుడు లేక పరిష్కారం ఏవిధంగా ఉంటే బాగుంటుందనే ఆలోచనలను సృష్టించుకోవాలి అంతేకాని అపోహలను కాదు. అది కేవలం ఆత్మజ్ఞాని అయిన వానికే సాధ్యం. మనందరిలోనూ ఆ జ్ఞానం అనేది సహజంగానే ఉంటుంది. దానిని గుర్తించిన నాడు, దాని విలువ తెలుసుకొన్న నాడు మనలోని వేదాంతి బయటకు వచ్చి మన బుద్ధిని నియంత్రించే పనిలో నిమగ్నమౌతాడు.

ఒక వ్యవస్థ అభివృద్ధితో ముందుకు సాగాలంటే ఎంతో కృషి అవసరం. అయితే ఆ అభివృద్ధికి ప్రధాన అవరోధాలు, అవినీతి, సంకుచిత మనస్తత్వం. నేను, నా కుటుంబం అతి తక్కువ కాలంలో ఉన్నతస్థాయిని చేరాలనే కుంచిత మనస్తత్వంతో ఆలోచనలను మొదలుపెట్టి అందుకు తగిన వక్ర మార్గాలను ఎంచుకొని, అవినీతికి పాల్పడితే కృత్తిమమైన సౌఖ్యాలు, వ్యక్తిత్వాలు లభిస్తాయి. అవి కేవలం తాత్కాలికమే. సహజత్వానికి దూరంగా మనిషి బతకడం అలవాటుపడితే అదే వ్యసనంగా మారి మనిషి వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని కోల్పోయి అన్ని విధాల జీవితంలో నష్టాలను చవి చూస్తాడు. అంతే కాదు తనతో పాటు మొత్తం సామాజిక వ్యవస్థే నిర్వీర్యం అయిపోతుంది.

మన చుట్టూ ఉన్న సమాజం అభివృద్ధి పథంలో సాగాలంటే మన వంతు బాధ్యత ఎంతో ఉంది. ముందుగా సామాజిక చైతన్యానికి నాంది పలకాలి. అందుకు అందరినీ సంఘటితం చేసి కలుపుకొని పోవాలి. పారదర్శకంగా నీవనుకుంటున్న ఆలోచనలను పంచుకోవాలి. నీవు చెప్పే ప్రతి మాటలో ఎదుటివారికి నిజాయితీ కనపడాలి. ఆ తరువాత నీవు చెప్పిన మాటలను కార్యాచరణ రూపంలోకి మార్చి నీ దార్శనికత ను నిరూపించుకోవాలి. అందుకు ఎంతో నిబద్ధత, కృషి అవసరం అవుతాయి. నీ మీద, నీ మాటల మీద, నీ కృషి మీద ముందుగా నీకు నమ్మకం కలగాలి.  వివేకంతో నీ సామర్ధ్యాన్ని అంచనా వేసుకొని తదనుగుణంగా నీ కార్యాచరణ ఉండాలి. అపుడే నీ నేర్పు, ఓర్పు కలగలిసి నీకు మంచి ఫలితాలను ఇస్తాయి. తద్వారా నీవు పదిమందికి మంచి చేసినవాడవౌతావు.

కానీ ఈ ‘నీవు’ అనే అంశం సదా ఎప్పుడూ నీతో ఉండే అంశం. అంటే అది నీ ప్రవర్తన, నీ జన్యుకణాల నిర్మాణం, నీలోని సహజమైన శక్తి సామర్ధ్యాలు. నీ జన్యుకణాల ధర్మాలు అంత సులువుగా మారిపోవు. ఏ వ్యక్తికీ అనుకోకుండా రోగాలు సంతరించవు. అయితే నీవు ఎప్పుడు నీ సహజత్వానికి దూరంగా కృత్తిమ జీవన విధానానికి అలవాటు పడతావో అప్పుడే నీ ఆరోగ్యం కూడా ఒడిదుడుకులకు లోనౌతుంది. నీ శరీరంలోని రోగనిరోధక సాంద్రత శాతం తగ్గినప్పుడు ఎక్కడో, ఎప్పుడో నిద్రాణమై ఉన్న రుగ్మతలు బయటపడతాయి. ఆ రోగనిరోధక శక్తి పెంపొందించుకునే అవకాశం, శక్తి ‘నీకు’ మాత్రమే ఉంది, ఉంటుంది. అది భౌతికంగా, శారీరకంగా, మానసికంగా ధృడంగా చేసుకునే సంకల్పం, ఆలోచన ‘నీకు’ మాత్రమే కలగాలి. ఎందుకంటే దాని ఆవశ్యకత నీకు మాత్రమే ఉంటుంది.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in March 2021, ఆరోగ్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!