Menu Close
జంతుసంపద
ఆదూరి హైమావతి
ఏనుగు
elephant-01

గజాననా గజాననా గౌరీ నందన గజాననా!- అని వినాయకుని ప్రాతః కాలంలోనే స్తుతించడం జరుగుతుంటుంది. ఏనుగు అనగానే మనకు ముందు గుర్తువచ్చేది ఏనుగు తలతో సర్వలోకాలలోని వారికంతా విఘ్నములను తొలగించే వినాయ కుడు.

వక్రతుండ మహాకాయా
సూర్యకోటి సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ
సర్వకార్యేషు సర్వదా!

వినాయకుని తొండం వలననే గజానికి అంత గౌరవం.

ఏనుగును ఆంగ్లంలో ‘ఎలిఫెంట్‘ అంటే తెలుగులో చాలానే పేర్లున్నాయి ఉదాహరణకు కొన్ని. కరి, కుంజరము, కుంభి, గజము, దంతి, మాతంగము, సారంగము, హస్తి.

కుంజరము అనగనే మనకు 'కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ -అనే సమస్య - తెనాలి రామకృష్ణ కవీ గుర్తుకు రాక మానరు!

ఏనుగుమీద చాలా సామెతలే ఉన్నాయి.

  • ఏనుగు తిన్న వెలక్కాయ.
  • ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే
  • ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరిగినట్టు
  • ఏనుగు మీద దోమ వాలి నట్లు
  • ఏనుగుల పోట్లాటకు ఎర్ర చీమ రాయబారమన్నట్టు
  • ఏనుగులా ఉండేవాడు పీనుగులా తయారయ్యాడు.

ఇవన్నీ మన తెలుగు సామెతలు. వీటి వెనుక అర్థం చాలానే ఉంది. నిజానికి ఏనుగు మీది ఒక్కో సామెతతో ఒక్కోకథ వ్రాయవచ్చు.

ఏనుగు అడవి జంతువులలో చాలా పెద్దది. పెద్ద చెవులతో, దానికి తగిన పెద్ద దేహంతో మెల్లిగా నడుస్తూ తన తొండంతో నీరు త్రాగుతూ, స్నానం చేస్తూ, తిరిగి నేలమీదకు రాగానే మట్టిని తన దేహం మీద పోసుకుంటూ' గజస్నానం' అనే నానుడిని గుర్తు చేస్తుంది.

అంత పెద్ద ఏనుగూ సింహం అరుపు వినగానే గజ గజ లాడుతుంది. ఒక సామాన్యమైన మనిషి కుంభస్థలం మీద పొడుస్తాడని మానవునికి భయపడుతుంది.

ఏనుగుకు బహుశా తనబలం తనకు తెలియక కావచ్చు. హనుమంతునిలా, ఇతరులు గుర్తు చేస్తేనే తెలుస్తుందేమో!

elephant-02ఏనుగు మానవులలాగానే  పిల్లలను కంటుంది. ఇది క్షీరదమే! ఇది 22 నెలలు గర్భం మోసి పిల్లలను కంటుంది. ఏనుగు జీవితకాలం 70 సంవత్సరాల కంటే ఎక్కువ.

ఏనుగులు రెండు రకాలు: ఆఫ్రికా ఏనుగు, ఆసియా ఏనుగు. హిందువులందరూ ఏనుగును వివిధ రకాలుగా పూజిస్తారు. ఈ విషయం ముందే చెప్పుకున్నాం కదా! ఏనుగులు పూర్తిగా శాకాహారులు, బాగా తెలివైనవికూడా.

ఆఫ్రికా ఏనుగులు ఆఫ్రికా ఖండంలో మరియు 37 దేశాలలో ఉన్నాయి. ఇవి ఆసియా ఏనుగులకంటే పెద్దవిగా ఉంటాయి. వీటి చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి. తమాషా ఏమంటే ఆఫ్రికా ఏనుగుల చెవులు ఆఫ్రికా ఖండం ఆకారంలో ఉంటాయి. ఆడ, మగ ఏనుగులు రెండూ దంతాలు కలిగి ఉంటాయి.

ఆసియా ఏనుగులు ఆఫ్రికా ఏనుగుల కంటే చిన్నవి. చెవులు కూడా కాస్త చిన్నవిగానే ఉంటాయి. మగ ఏనుగులకు మాత్రమే పెద్ద దంతాలుంటాయి.

జన్యు వ్యత్యాసాల ఆధారంగా, ఆసియా ఏనుగులను మూడు ఉపజాతులుగా విభజించారు.

శ్రీలంక ఏనుగు ఆసియా ఏనుగులన్నింటిలోను పెద్దది. ఇవి శ్రీలంకలో మాత్రమే ఉంటాయి. ఇవి సుమారు 5,400 కి.గ్రా. బరువుండి 3.4 మీ. ఎత్తుంటాయి.

భారతదేశపు ఏనుగు ఆసియా ఏనుగులన్నింటిలో సంఖ్యలో ఎక్కువ ఉన్నాయి ఇవి ఇంచుమించు 5,000 కి.గ్రా. బరువు ఉంటాయి.

సుమత్రా ఏనుగు ఇతర ఏనుగులన్నిటికన్నా చిన్నవిగా ఉంటాయి.

elephant-03అందరికన్నాముందుగా ప్రాచీన భారతదేశంలో మొదటిసారిగా ఏనుగులను మచ్చికచేసుకున్నారు. ఏనుగులు కష్టపడి పనిచేసే జంతువులు. అడవులలో పెద్ద పెద్దచెట్లను పడగొట్టను, జనావాసాలకు తీసుకురానూ ఏనుగులను ఉపయోగిస్తారు. వీటీకి ముఖ్యంగా ఆడ ఏనుగులనే ఉయోగించేవారు. యుద్ధాలలో ఏనుగులను భారతదేశంలోను, తర్వాత పర్షియాలోను ఉపయోగించారు. కురుక్షేత్ర యుధ్ధంలో అక్షౌహిణి బలంలో అక్షౌహిణి లోరథములు21,870, ఏనుగులు21,870, గుఱ్ఱములు65,610, కాలిబంట్లు1,09,350 ఇంతమంది చేరితేనే ఒక అక్షౌహిణి అవుతుంది ఈలెక్కన 18 అక్షౌహిణుల సేనలో 21,870x18 ఏనుగులు సుమారుగ మృతి చెంది ఉంటాయి.

యుధ్ధాలకు మగ ఏనుగులను మాత్రమే శిక్షణ నిచ్చి ఉపయోగించేవారు. నిర్ధాక్షిణ్యంగా పూర్వం  వైరి యుద్ధఖైదీలను వీటి పాదాలక్రింద తొక్కించడానికి వాడేవారు. దారుణం కదూ!

ప్రహ్లాదుని కూడా విష్ణునామాన్ని మానమంటే విననందున హిరణ్యకశిపుడు ఎనుగుల పాదాలతో తొక్కించే శిక్ష విధించిన విషయం మనకు తెల్సు.

మహారాజులు అడవులలో క్రూరమృగాలు, ముఖ్యంగా పులుల్ని వేటాడను ఏనుగులమీద వెళ్ళేవారు. చాలా దేవాలయాలలో ఊరేగింపులలో దేవుని ఉత్సవ విగ్రహాలను ఏనుగులమీద ఉంచి ఊరేగింపు జరపడం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా జంతుప్రదర్శనశాలలలో, సర్కస్ లలో ఏనుగులు ముఖ్య ఆకర్షణ.

గజారోహణం, చేయించి పూర్వం  మహారాజులు ఆనాడు గొప్ప కవులను, పండితులను సన్మానించే వారు.

elephant-04గజేండ్రుడు గొప్ప భక్తుడు. స్నానం కోసం నీటిలో దిగిన గజేంద్రుని మొసలి పట్టుకోగా తన శక్తినంతా ఉపయోగించి పోరాడి, చివరకు 'లావొక్కింతయులేదు’ అని ప్రార్ధించగానే విష్ణుమూర్తి పరుగున వచ్చి సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి గజేంద్రున్ని కాపాడుతాడు.

లక్ష్మీమాతను ఏనుగుపై గజలక్ష్మిగా అలంకరించి పూజిస్తాం. ఐరావతం అనే తెల్లని ఏనుగు, ఇంద్రుని వాహనము. ఇది అమృతంకోసం సముద్రాన్ని చిలికినపుడు లక్ష్మీ దేవితో పుట్టినదే.

ఏనుగుదంతాలతో రకరకాల నగిషీ అలంకార వస్తువులకు ఉన్న గిరాకీ కారణంగానూ వాటి చర్మాలకోసమూ నిర్ధాక్షిణ్యంగా ఏనుగులను మానవులు చంపేయడం దారుణం. ఇలా చంపుకుంటూపోతే మన వనసంపద, అడవి సంపద ఒకనాటికి మృగ్యమవడం జరుగుతుంది. మన వన సంపదను కాపాడుకోడం మనందరి బాధ్యత.

elephant-05

Posted in March 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!